అమెరికాలో సగటు భారతీయుడు!

                                               అమెరికాలో సగటు భారతీయుడు! 

                                                                                -శృంగవరపు రచన


                                     


 

        కొందరు రచయితలు పాఠకులకు అవగాహన లేని అంశాల పట్ల అవగాహన కల్పించడానికి, వారి మనసుల్లో ఉన్న భావాల గమనం సరైనదో కాదో తేల్చుకోలేని సమయంలో అదే దారిలో పయనిస్తున్న మనుషుల మనసులను స్పష్టం చేసే రచనలు చేస్తారు. ఈ రకం సాహిత్యం మనిషి తన లోపలి మనిషికి చూడగలిగేలా చేస్తుంది. ఇటువంటి కోవకు చెందిన రచయిత డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావు గారు. అమెరికాలో నివసించే భారతీయుల ఇబ్బందుల గురించి అనేక కోణాల్లో ఆయన నవలలు రాశారు. అవి చదువుతున్నప్పుడు అమెరికా మీద సాధారణంగానే పెంచుకునే స్వర్గమనే భ్రమలు తొలగిపోయి, మనిషికి దేశం మారినా ఉండే క్లేశాలు స్పష్టమవుతాయి. ‘నీడలు-నిజాలు’ నవలలో సగటు మధ్యతరగతి భారతీయుడి అమెరికా అనుభవాలను, భావాల రీత్యా, సంప్రదాయాల రీత్యా, మారిన కాలంతో పాటు మారని సంస్కృతి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి, ఏ దేశంలో అయినా ఉండే ఇక్కట్ల గురించి చెప్తూనే, ఇంకో పక్క అమెరికా దేశానికి చెందిన అనేక అంశాలను బహుముఖ కోణంలో ఈ నవలలో చర్చించారు. సుబ్బారావు గారి నవలల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. మనుషుల మనసులలోని ఆలోచనలను మనస్తత్వాల విరుద్ధతతో చెప్పడం ఆయన శైలికి ప్రత్యేకతను ఆపాదిస్తుంది. 

ఈ నవలలో రచయిత అనేక అంశాలను ప్రస్తావించారు. దేశాల మధ్య ఉండే ఆహారపు అలవాట్ల వ్యత్యాసం, అమెరికాలో ఉండే హంటింగ్ –గన్ కల్చర్, లైసెన్స్ లేని కార్ల వాడకం, విద్యా బోధనలో ఉండే శ్రద్ధ, భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్ళాక అక్కడ వనితలను వివాహం చేసుకుని కొత్త మిశ్రమ సంస్కృతితో భారతీయులకు దూరంగా మసిలే మనస్తత్వాలను, అవకాశం ఇచ్చినందుకు విధేయతను ప్రకటించే సగటు భారతీయుల మనస్తత్వపు లోతులను, తల్లిందండ్రుల నిర్లక్ష్యానికి గురైన వారిని పబ్లిక్ స్కూల్స్ లో చేర్పించే సంస్కృతి, వియత్నాం యుద్ధంలో అమెరికా ఓడిపోయిన ప్రభావం అందులో పాల్గొన్న సైనికులపై చూపిన ప్రభావం, డ్రగ్స్ వాడకం, స్త్రీ మనస్తత్వంలో ఉన్న విరుద్ధత ...ఇలా ఎన్నో సున్నిత అంశాలను ఓ సగటు భారతీయుడు చూసే కళ్ళతోనే రచయిత సందర్భానుసారంగా ఆవిష్కరించారు. 

కృష్ణ భారతదేశంలో ఢిల్లీలో ప్రొఫెసర్ గా పని చేసి అక్కడ తన పనికి గుర్తింపు లేదని భావించి అమెరికాలో అవకాశం వస్తే అక్కడకు వస్తాడు. అతని భార్య సరళ. వనజ, రవి అతని పిల్లలు. భారత దేశ సంస్కృతికి, సాంప్రదాయాలకు, ఆహారపు అలవాట్లకు అమెరికన్ జీవన విధానానికి ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. కృష్ణ వెజిటేరియన్. మాంసం తినడు. ఈ సందర్భంలో రచయిత ఆహారపు అలవాట్లలో ప్రాంతానికి ప్రాంతానికి మధ్య ఉండే తేడా గురించి కూడా రచయిత స్పష్టం చేశారు. 

అమెరికాలో వెజిటేరియన్ వంటల్లో కూడా బీఫ్ ఎసెన్స్ వేస్తారు. అది తెలియకుండా మొదట కృష్ణ తిన్నా తర్వాత విషయం తెలుసుకుని అది లేకుండా తినే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ వ్యక్తుల ఊహాలో ఉండే వెజిటేరియన్ అన్న పదానికి, ప్రాంతాల పరంగా వాడుకలో ఉన్న ఆ పదానికి మధ్య ఉన్న తేడా గురించి రచయిత రాశారు. ఇండియాలో బెంగాల్ రాష్ట్రంలో చేపలను వెజిటేరియన్ గానే పరిగణిస్తారు. ఇక్కడ కృష్ణ కుటుంబం అమెరికాకు వచ్చినా సాధారణంగానే తమ మనస్తత్వం వల్ల ఖర్చు మరియు ప్రత్యేక ఆహారపు అలవాట్ల వల్ల  బయట తినేది తక్కువ.అమెరికాలో వేగేన్స్ కూడా పెరిగిపోయారు. 

“ఏదో ఒక ప్రాణిని చంపితే గాని మాంసాహారం లభ్యమవదు. అది ‘వేగేన్స్’ కి సుతారామూ పడదు. ఇంతెందుకు ఆవులు, గేదెల పొదుగులలోంచి పాలు పిండేస్తుంటే దూడలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు పాల పదార్థాలను విసర్జించారు. పాలు వాడకుండా సోయా గింజలు వాడతారు. ఎవరి ఆలోచనలు నమ్మకాలు వాళ్ళకి రుచికరంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి చేసేడానిలో మనకేదో తప్పు కనిపిస్తే, మనం చేసే పనుల్లో వాళ్ళకి తప్పులు దర్శనమవుతాయి. ఎందుకీ విమర్శలు? బ్రతుకు, నన్ను బతకనీ అంటుంది’, అని రచయిత ఈ సందర్భంగా రాశారు. 

          ‘జింకలను చంపకపోతే  వాటి జనాభా ఎక్కువై అడవుల్లో వాటికి కావల్సినంత తిండి లభ్యమవ్వక, దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి, ఇళ్ల ప్రాంగాణాల్లోకి వచ్చి, వ్యాధులకి కారణమవుతున్నాయట.జింకల జనాభా ఎక్కువై తిండి లేక చనిపోయే కంటే, మనం వెళ్ళి వాటిలో కొన్నింటిని చంపితే మిగతావి బతికుంటాయి.అప్పుడప్పుడు ఈ వేటకు తండ్రీకోడుకులు కలిసి వెళ్తారు. ఇది వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధాన్ని పెంపొందిస్తుంది. వేటకి వెళ్ళడానికి లైసెన్స్ ఉన్న గన్ కావాలి. వేటాడటానికి పన్ను కట్టాలి. ‘ సందర్భానికి తగినట్టు రచయిత అక్కడి జీవన విధానంలోని ప్రతి అంశం గురించి మధ్య తరగతి వారి ఆలోచనలు ఎలా ఉంటాయో స్పష్టం చేశారు. 

కృష్ణ అమెరికాకు వచ్చిన  తర్వాత అతని భార్యా పిల్లలను తీసుకురావడం, అతని భార్య ప్రతి అంశానికి అతన్ని అనుమానించడం,అతను ఎంత సర్దుకుపోదామన్న ఆమె అనుమానం అతన్ని బాధిస్తూనే ఉంటుంది. అమెరికాలో డబ్బు సంపాదించి జీవిత ఆర్థిక స్థితిని మెరుగుపరచుకుందామన్న భావనతో వచ్చినా, ఖర్చులు,పన్నులు పోనూ ఆ సంపాదన గొప్పగా ఏమి ఉండదు.ఎలానో లోన్ల మీద ఇల్లు తీసుకోవడం,ఆ తర్వాత పిల్లలకు తల్లిదండ్రుల మధ్య స్పర్ధలు ఉండటం వల్ల, తల్లిదండ్రుల మధ్య అవగాహన,అర్ధం చేసుకునే మనస్తత్వం లేకపోవడం వల్ల  పిల్లలు మానసికంగా తల్లిదండ్రులకు ఎలా దూరం అయిపోతారో అన్న అంశం కృష్ణ తన పిల్లలకు మానసికంగా దూరం అవ్వడం వల్ల రచయిత స్పష్టం చేశారు. 

        “ఈ దేశంలో పురోగమించాలంటే ధైర్యం, ప్రతిభతో పాటు ఇతరుల కన్నా ఎక్కువ చొరవ ప్రదర్శించాలి. సంశయంతో జవాబిచ్చినా, అడుగులు తడబడినా అంతే”, అని కృష్ణ మొదట్లో అమెరికాకు వచ్చిన సందర్భంలో రాజేంద్ర చెప్తాడు. అమెరికన్ సంస్కృతి ఎంత వేగంగా ఉంటుందో, చొరవ ఎంత ముఖ్యమో ఈ వాక్యాలు స్పష్టం చేస్తాయి. 

       భారతీయులు అమెరికన్ వృత్తుల పట్ల విధేయతను ప్రదర్శించడానికి ఉన్న కారణాన్ని ఎంతో చక్కగా ఈ విధంగా రచయిత స్పష్టం చేశారు. “ ఆ రోజుల్లో, ఇండియా నుంచి అమెరికాకి వలస వచ్చినవాళ్ల చదువు, సగటు అమెరికన్ కి ఉన్న చదువు కంటే చాలా ఎక్కువ. ఆ వచ్చిన వాళ్ళు ఉద్యోగావకాశాలు ఉన్న చోట సులభంగా ఇరుక్కుపోయేవారు, ఇమిడిపోయేవారు. వచ్చిన అవకాశాలను అందుకునేవారు. స్థానిక నివాసుల కన్నా కంపెనీలకు, యూనివర్శిటీలకు తమ విధేయత ఎక్కువ అన్న భావ ప్రదర్శన కోసం ఆరాటం వారిలో ఉండేది. సామాన్య అమెరికన్ పౌరుడు వారంలో ఐదు రోజులు పని చేసి, శని, ఆదివారాలు కుటుంబంతో గడపడానికి ఆహ్లాదపరుచుకోవడానికి ఉపయోగిస్తాడు. పని చేసే విభాగం కాక, తన జీవితంలో ఇంకో భాగం అతనికి ఉంది. 

     అప్పట్లో అమెరికా  వలస వచ్చిన ఇండియన్లకు, కొత్తలో, చాలామందికి బైట జీవితం దాదాపు సున్నా! ఇండియాలో పెరిగిన వాతావరణం వల్ల అమెరికా ధోరణిలో వారు ఇమడలేకపోయారు. దాని వల్ల, తమ శారీరక వ్యత్యాసం రూపంలో కనిపించడం వల్ల కూడా వారిలో అభద్రతా భావం, వివరించలేని సంకోచం కలిగేవి. ఎందుకీ అనవసర ఖర్చు? ఆదా చేద్దాం అన్న ఆలోచనకి మనం తరతరాలుగా బానిసలం కదా! మన చుట్టూ మనమే గిరి గీసుకున్నాము. ఇక్కడ స్థానిక ప్రజల్లో మనం కలవలేమన్న అనుమానం పెరగ్గానే, బైట ప్రపంచం కురచనైపోయి, ఎక్కువకాలం పని మీద కేందృకృతమయ్యింది. పెసరగింజలు, బియ్యం కలిసిపోతే, వాటిలో పెసల్ని ఏరి ఒకచోట చేర్చినట్లు, దగ్గరగా ఉన్న ఇతర ఇండియన్లతో పరిచయాలు పెరిగాయి. శని,ఆదివారాళాలో ఇండియన్ రెస్టారెంట్లలో తిని, సామాన్లు తెచ్చుకుంటూ వీలుంటే దగ్గరగా ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఇండియాని ‘మిస్’ అవలేదన్న భావనని, మనసులో వెలిగించి ఉంచడం చాలామంది ఇండియన్ల జీవనంలో నడిచే తంతే! 

          ఇండియాలో నివసించినంత కాలం మాతృదేశం గురించి ఏమి అంటనట్లున్న ప్రవర్తనకి, వదిలేసి వచ్చిన ఆ గడ్డ మీద ఏదైనా జరిగితే అతిగా స్పందించడానికి కారణం ఏమిటి?స్వదేశంలో వదిలి వచ్చిన బంధువులా? ప్రాంతీయ జీవనంలో మిళితమవకుండా ఉన్న బతుకా? ఆ దేశపు వనరులను ఉపయోగించుకుని, ఆసరా చేసుకున్నాక వదిలివచ్చేశామన్న గిల్ట్ కారణమా?

     ఇండియాలో ఉదయం తొమ్మిది గంటలకి ఆఫీసుకి చేరినా, సమయానికి చేరకపోయినా సాయంకాలం ఐదు గంటలకి పని నిలుపు చేసే సంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ గంటలు, రోజులు లెక్క చేయకుండా పని చేయడానికి కారణం సింపుల్! ముఖ్యంగా స్థానికుల కంటే భేషుగ్గా పని చేస్తామని తెలియజేయడానికే! ఆఫీసుల్లో, ఇతర చోట్ల ఇండియన్లు గొడ్డు చాకిరీ చేస్తారన్న కీర్తి గడించినా, వాళ్ళకి భారతీయులంటే నిజమైన గౌరవం పెరిగిందా? అన్నది వివాదాంశమే.” అమెరికా వలస వచ్చిన ఇండియన్ మైండ్ సెట్ గురించి రచయిత ఎన్ని కోణాల్లో విశ్లేషించారో ఈ నవలలో! ఈ నవలలో కృష్ణ ఆలోచనల ద్వారా భారతీయుడి ఆలోచనలు అమెరికాలో ఎలా ఉంటాయో ఎంతో చక్కగా స్పష్టం చేశారు. 

          అలాగే ఇండియాలో లా కాకుండా అమెరికన్ సంస్కృతిలో పెరిగే పిల్లలకు తల్లిదండ్రుల ఆలోచనలు చాదస్తంగా అనిపించడం,భారత దేశంలో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడిన తల్లిదండ్రులు అక్కడి పోకడలకు అలవాటు పడ్డ పిల్లలను అర్ధం చేసుకోలేకపోవడం గురించి కూడా రచయిత స్పష్టం చేశారు. అలాగే స్త్రీలు భారతదేశంలో వివాహమైతే భర్తతో ఎన్ని బాధలు ఉన్నా ఉండాల్సిందే, కానీ అమెరికాలో స్త్రీకి ఉన్న స్వేచ్చ వల్ల స్త్రీ పురుషులు విడిపోవడాల వల్ల సమానంగా బాధ పడటం జరుగుతుందని, భారతదేశంలో దీనికి విరుద్ధంగా స్త్రీ మాత్రమే బాధ పడుతుందని, అమెరికాలో పురుషులు కెరియర్ మీద దృష్టి పెట్టాలనుకున్న భార్యలతో విభేధాల వల్ల విడిపోయే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. 

      కృష్ణ కథలో అతని పిల్లలు అమెరికన్ కల్చర్ లో ఉన్నట్టే తమకు ఇష్టమైన వివాహాలు చేసుకున్నారు. కృష్ణ భారత దేశం వెళ్లిపోవాలనుకోవడం అతని కుటుంబానికి నచ్చలేదు. అతని భార్య,పిల్లలు అమెరికాలో ఉంటే అతను ఇండియాకు వచ్చేశాడు. వారు అలవాటు పడినంతగా అతను పడలేకపోయాడు. 

       ఈ నవలలో కథ కన్నా కూడా రచయిత సగటు భారతీయుడు అమెరికాలో ఇమడలేక, అలా అని తిరిగి భారతదేశం వెళ్లలేక ఎలా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉండిపోతాడో అన్న అంశాన్ని మనస్తత్వ కోణం నుంచి ఎంతో చక్కగా కృష్ణ పాత్ర ద్వారా, అతని చుట్టూ ఉన్న జీవితం ద్వారా స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడిన్ వారి నీడలు చూస్తూ భ్రమ పడి, నిజాలు తెలుసుకోలేని స్థితిని రచయిత ఎంతో చక్కగా ఈ నవలలో వ్యక్తీకరించారు. సమస్యలు లేని మనిషి ఉండడు అని, దేశం మారినంత మాత్రాన జీవితం మారిపోదని మనిషి మనస్తత్వం మారాలని ఈ నవల స్పష్టం చేస్తుంది. పాఠకుల్లో  అవగాహన కలిగిస్తూ, ఆలోచింపజేసే ఇటువంటి మంచి నవల రాసిన రచయితకు ఈ సందర్భంగా అభినందనలు. 

  *                *          *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!