జీవితమే జూదమయ్యే చోట!
జీవితమే జూదమయ్యే చోట!
ఆశలు-నిరాశలు,గత పీడలు-వర్తమాన భయాలు-భవిష్య భీభత్సాలు మనుషుల జీవితంలో ఎన్నో సార్లు సహజమే. ఆశయాలు,కోరికలు తీర్చుకునే క్రమంలోనే మనిషి ఏదో ఒక దానిని జూదంగా తనకు తెలియకుండానే మార్చుకుంటాడు. యవ్వనంలో ఉన్న స్త్రీ-పురుషుల మధ్య ఈ జూదం ఎలా ఉంటుందో స్పష్టం చేసే నవలే శ్రీధర గారి ‘ఇచ్చట జూదమాడంగరాదు.’ ఈ నవలలో ఓ చోట రచయిత జూదం అంటే మితిమీరిన నమ్మకంతో,తన దగ్గర ఉన్న దానిని పోగొట్టుకోవడం అని,అది డబ్బు,శీలం,ఆస్తులు ఏదైనా కావచ్చని రాశారు. ఈ నవలా క్రమంలో నైతిక నియమాలు,తప్పొప్పులు వంటివి కూడా మనుషుల బలహీనతల కిందో లేక మనసుల మలినంలోనో ఎలా జూద వస్తువులుగా మారిపోతాయో రచయిత స్పష్టం చేశారు. నిజానికి ఈ నవలా కథ సాధారణమైన కథ.కానీ ఈ కథలో రచయిత చొప్పించిన మానవ నైజాన్ని విభిన్నంగా చెప్పే ప్రయత్నం మాత్రం కథనంలో ఈ నవలను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది.
ఈ కథలో ముఖ్య పాత్రలు హరిత,వత్సల,అనిరుధ్,తేజ. హరిత,వత్సల తమ స్నేహితురాలైన లావణ్య పెళ్ళిలో అనిరుధ్,తేజలను కలవడం జరుగుతుంది. అనుకోకుండా కలిసిన వీరి ప్రేమకు ఈ పెళ్ళి పునాది అవుతుంది. ఆ రాత్రి అనిరుధ్ వానలో హరితను వర్కింగ్ వుమెన్ హాస్టల్ లో డ్రాప్ చేయడం, ఆమె దగ్గర తన ఫోన్ మర్చిపోవడం జరుగుతుంది. ఆ తర్వాతి రోజు ఆ ఫోన్ కోసం వెళ్ళిన అనిరుధ్ కు జ్వరంతో ఉన్న హరితను హాస్పటల్ లో చేర్పించడంతో మొదలైన ప్రేమ ఇద్దరికి అభ్యంతరం లేకుండానే స్పష్టం అవుతుంది. పెళ్ళికి ముందు స్నేహం,పరస్పర అవగాహన వరకే పరిమితమని,పెళ్ళికి ముందు నైతికతను తప్పే మనస్తత్వం తనది కాదని అనిరుధ్ కు ముందరే స్పష్టం చేస్తుంది హరిత.
అనిరుధ్ తల్లి పేరు గాయత్రి.ఆమె పేరు మీదే వారికి బంగారపు దుకాణం ఉంది. అనిరుధ్ అన్న దినకర్,తండ్రి ఈ వ్యాపారం చూసుకుంటున్నారు. తాను తన సొంత వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు అనిరుధ్. అనిరుధ్, హరిత ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. వారిద్దరూ ప్రేమించుకున్నాక హరిత తాను అనిరుధ్ తల్లిని అపరిచితురాలిలా మెప్పించి ఆమెకు దగ్గరయ్యాక,ఆమె తనను తన ఇంటి చిన్న కోడలిని చేసుకునేలా చేస్తానని చెప్తుంది. ఆ పథకం ఫలిస్తుంది కూడా.
ఇక వత్సల తేజతో ప్రేమలో పడుతుంది. వత్సలకు తల్లిదండ్రులు లేరు. తన స్నేహితురాళ్లకు ఉన్నంత భద్రత,ఆలోచించే తల్లిదండ్రులు,ఆస్తులు తనకు లేవనే న్యూనతలో ఉంటుంది ఆమె. అందుకనే తేజను ప్రేమించాక అతని ఆర్థిక నేపథ్యం గురించి కూడా తెలుసుకుంటుంది. అతను తనకన్నా ఆర్థికంగా గొప్ప స్థాయిలో ఉన్నాడని తెలుసుకున్నాక ఆమె అతన్ని ఎలా అయినా తన నుండి తిరిగిపోకుండా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో అతని ద్వారా అపార్ట్మెంటు అద్దెకు తీయించి, అతనితో కలిసి సహజీవనం చేస్తుంది. ఆ తర్వాత ఆమె మీద మోజు తీరిన అతను ఆమె వివాహం మాట ఎత్తగానే ఆమెను వదిలేస్తాడు. ఏదో భద్రత కోసం తన శీలాన్ని జూదం చేసింది వత్సల.
గాయత్రికి దగ్గర అయిన హరిత ఆ తర్వాత అనిరుద్ కు వ్యాపారంలో సాయం చేయాలనుకుంటుంది. ఒకప్పుడు హరితతో కలిసి పని చేసి ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన సుధీర్ సలహా మీద అక్కడ ప్రాజెక్ట్ ఒకటి వచ్చేలా చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ కోసం అనిరుధ్,హరిత గాయత్రి అనుమతి మీద అమెరికా వెళ్తారు. అక్కడ సుధీర్ వీరు ఉండటానికి ఏర్పాటు చేయడం కాకుండా ఆత్మీయుడిగా ఎంతో బాగా చూసుకుంటాడు. ఆ ప్రాజెక్టు అనిరుధ్ కు వస్తుంది.
దినకర్ భార్య గంగ. ఆమెకు తన మరిదికి ఆ బంగారపు కొట్టులో వాటా వస్తుందన్న ఆలోచన నచ్చదు. అది వాటాలకు వచ్చేలోపు భర్తను రెచ్చగొట్టి కొంత బంగారం ఇంటికి చేర్చుకుంటుంది. భార్యతో విసుగెత్తిన దినకర్ షాపుకు వచ్చిన మంజుల అనే కళాకారిణి మోజులో పడతాడు. తమ్ముడు అమెరికా వెళ్ళగానే,ఇక అతను తిరిగి వచ్చాక బంగారపు దుకాణం మీద ఆప్పు తీసుకుంటారని తెలియగానే ఓ నమ్మకస్తుడైన గుమాస్తాతో కలిసి దొంగతనంలా చేసి అందులోని బంగారం అంతా మంజుల ఇంట్లో ఉంచుతాడు. అమెరికాలో ప్రాజెక్టు రావడంతో ఎంతో ఆశగా వచ్చిన అనిరుధ్ కు దొంగతనం విషయం తెలియగానే కుప్పకూలిపోతాడు. కానీ హరిత మాత్రం ధైర్యంగా ఉన్న డబ్బుతో ఆఫీసు పెడుతుంది. ఇంటర్ వ్యూలు జరిపి ఉద్యోగులను తీసుకుంటుంది. ఆ ఆఫీసులో జాయిన్ అయిన శ్రీవల్లి అనిరుధ్ కు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది.
ఇక ఆఫీసు రేపో మాపో మూతబడుతుందని అనిరుధ్ అనుకుంటాడు. అది అనిరుధ్ ది అయినప్పటికి తన సొంతది లానే కష్టపడిన హరిత ఓ నాలుగు రోజులు సమయం అడిగి ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో శ్రీవల్లికి దగ్గర అవుతాడు అనిరుధ్. అనిరుధ్ ద్వారా కంపెనీలో పార్టనర్ గా మారాలనుకుంటుంది శ్రీవల్లి. మునిగిపోయే కంపెనీలో ఏదైనా ఏముందని తన సరదా కోసం ఆమెతో గడిపి ఆమెకు సన్నిహితుడవుతాడు అనిరుధ్. నైతికత పేరుతో తనను దూరంగా ఉంచిన హరిత కన్నా శ్రీవల్లి అతనికి మెరుగ్గా కనిపిస్తుంది. హరిత కూడా కంపెనీ మూతబడపోతుందని ముందే అలా వెళ్ళిపోయిందని అనుకుంటాడు అనిరుధ్.
ఇంటికి వచ్చిన హరిత తల్లిదండ్రులను ఒప్పించి పొలం కొంత అమ్మించి రెండు కోట్లు తెచ్చి అనిరుధ్ కు ఇస్తుంది. కానీ శ్రీవల్లికి అతను దగ్గర అవ్వడం,తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా గుర్తించి డబ్బు కూడా వదిలేసుకుని ఆమె ఇంటికి వస్తుంది. ఆమె తల్లి మరణిస్తుంది.తల్లి రాసిన ఉత్తరం ద్వారా ఆమె తండ్రి తనకు కన్న తండ్రి కాడని ప్రేమించి వచ్చిన భర్త మరణించాక సమాజంలో గౌరవం కోసం భర్తగా ఉన్నా,తనను స్నేహితుడి భార్యగానే గౌరవించిన గొప్ప వ్యక్తి అని తల్లి ఆ ఉత్తరంలో స్పష్టం చేస్తుంది.
ఆ తర్వాత హరిత,వత్సల ఇద్దరూ హరితో ఊర్లో అందరికి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అందించే దిశలో ఓ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు. ఆ ట్రెయినింగ్ పెద్దదవుతుంది. వారిద్దరికి కూడా సంతృప్తి ఉంటుంది. ఆ తర్వాత సుధీర్ అమెరికా నుండి రావడం హరితకు తన ప్రేమను వ్యక్తపరచడం, వారిద్దరి వివాహమవడం,అమెరికా వెళ్ళడం,ఇక్కడ వత్సల ట్రెయినింగ్ సెంటర్ ను చూసుకోవడంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో ప్రేమకున్న స్వరూపంలో ఎలా అభద్రతల వలయంలో చిక్కుకుని మనిషి ఎన్ని రకాలుగా దానిని జూదంగా మారుస్తాడో రచయిత ఇందులోని పాత్రల ద్వారా స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. కానీ జూదంలో పెట్టేవి తిరిగి రాకపోతే దానిని పొందే మార్గం చట్టబద్ధంగా ఉండదు. అది మనుషుల వ్యక్తిగత మనస్తత్వాలకు సంబంధించినది కనుక ఏదైనా పొందవచ్చు అనే ఆలోచనతో ఈ జూదంలోభాగం అయ్యే ముందు,కోల్పోయే వాటి గురించి కూడా మనిషి ఆలోచించుకోగలగాలి.
* * *

Comments
Post a Comment