చెరిగిపోతాడు మనిషి!

 చెరిగిపోతాడు మనిషి!

-శృంగవరపు రచన


ఎంత త్వరగా వెళ్ళిపోతాడు మనిషి
ఏమి పట్టుకుపోకుండా!
పట్టుకుపోని వాటి
కోసం కొరివిలకు
కొరివి పెట్టే
మనుషులను ఇక్కడే వదిలేసి!
ఎలా వెళ్ళిపోతాడు మనిషి
ఏం పట్టనట్టు
ఏం పట్టించుకోకుండా!
తన వాటి కోసం
ఘర్షణలతో
తన చావే రాజకీయ
రణరంగమవుతుందని తెలియక!
ఎలా వెళ్ళిపోతాడు మనిషి
తన వారి అసలు స్వరూపాలను
చూడకుండానే
చూసాననే భ్రమతో!
ఎందుకు వెళ్ళిపోతాడు మనిషి
తన చుట్టూ ఉన్నవారిని
అర్ధం చేసుకున్నాక
కూడా వారి చుట్టే భ్రమించి!
వెళ్ళిపోతూ ఏం తెలుసుకున్నాడు మనిషి
నిజం అవ్వకూడదన్న భయాలే
నిజం అవ్వాలనే ఆశీర్వచనం
తులసి తీర్ధంతో ఇస్తూ!
ఎప్పుడూ వెళ్ళిపోతాడు మనిషి
ఇంకా ఉండాలన్న ఇచ్చను
జయించలేక
జీవించి ఉన్న వారి
స్వార్ధస్వరాలను చూస్తూ
తన చేతులు దాటిన
స్థితిని తెలుసుకున్నాక!
వెళ్తూ ఆ మనిషి
అలానే చెరిగిపోతాడు
వీలునామాలో
పంపకాల్లో, గొడవల్లో
తన పోకడ ప్రభావం
లాభంతో ముడిపడుతూ
చెరిగిపోతూ
స్మృతుల్లో
ఇవ్వని వెలితిగా
కోపంగా
బాధగా
మిగిలిపోయిన వారి బ్రతుకుల్లో!
* * *

Comments

Popular posts from this blog

రహస్యపు జీవితం

మనిషిలో తాత్వికత

మరణ శిక్షలు లేని కలల లోకం!