సిద్ధాంతాలలో సూచనలు
సిద్ధాంతాలలో సూచనలు
క్రిస్టియన్ వివాదాల ఆధారంగా ఎన్నో కాన్స్ పిరసిలను కొంత కల్పనతో రాయడం ఎప్పటి నుండో ఓ ట్రెండ్ గా ఆంగ్ల సాహిత్యంలో ఉంది. డాన్ బ్రౌన్ లాంటి రచయితలతో ఈ శైలి రచనలు అన్ని వర్గాల పాఠకుల దృష్టిని ఆకర్షించాయి.ప్రపంచంలో దేవుడు మనిషి మనస్తత్వానికి తగ్గట్టు రూపాన్ని మార్చుకుంటాడు. కొందరికి అది ఓ అధికారం, ఇంకొందరికి బాధ్యత, ఇంకొందరికి మానవత్వం... ఇలా తమకు తోచిన సిద్ధాంతాలను మతానికి-దేవుడికి అన్వయించడం మనిషి నమ్మకాలకు సంబంధించిందే అయినప్పటికీ,మనుషులు తమ నమ్మకాలను సమిష్టిగా ప్రభావితం చేయగల స్థాయికి ఎదగగలిగినప్పుడు ఆ నమ్మకస్థాయి ప్రజల్ని ఉద్రేకుల్ని చేస్తుంది. జీసస్ తో ఉన్న 12 అపొస్టల్స్ కాకుండా 13వ అపొస్టల్ మనిషి జీవితంలో దేనిని సూచిస్తుందో చెప్పే ప్రయత్నం చేసిన ఆంగ్ల నవల రిచర్డ్ మరియు రెచల్ హెల్లర్ లు రాసిన
'The 13th Apostle.'
ఈ నవలలో ప్రధాన పాత్రలు గిల్, సాబి, జార్జ్, మెక్ కాలమ్, డేవిరిస్, లూడ్లో, మాకులా.13 వ శతాబ్దానికి చెందిన ఓ డైరీ ప్రొఫెసర్ లూడ్లో కి దొరుకుతుంది. దానిలో ఉన్నది తెలుసుకోవడానికి అనువాదకురాలు అయిన సాబి సాయం చేయడానికి ఉండటం, ఆమె తనతో పాటు అందులో ఉన్న కోడ్స్ లాంటివి కనుక్కోవడానికి సైబర్ సెక్యూరిటీ సంస్థ నడుపుతున్న జార్జ్ ద్వారా గిల్ ను ఈ అసైన్ మెంటులో భాగం చేయడం జరుగుతుంది.వాస్తవానికి కూడా కాపర్ కేవ్ స్క్రోల్ లో అనేక సంపదల గురించి ఉందని నిర్దారించబడింది. ఆ వాస్తవానికి కాస్త కల్పన జోడించిన నవల ఇది.
ఆ డైరీ లో అపొస్టల్ గా గుర్తింపు పొందని మైకా ఏషువాకు జరిగిన ద్రోహం గురించి రాసాడు. ఆ ద్రోహన్ని ఆ కాపర్ స్క్రోల్ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. మాకులా ముస్లిం. ఆ స్క్రోల్ లో క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉంటే దానిని వెలుగులోకి తీసుకువద్దామని,లేకపోతే వెలుగులోకి రాకుండా చేద్దామని అతని ఆలోచన. దీనికి వ్యతిరేక ఆలోచన క్రైస్తవ సంఘం నడుపుతున్న మెక్ కాలమ్ ది. వీరిద్దరూ దానితో పాటు అందులో పేర్కొన్న సంపదలు కూడా దక్కించుకోవాలన్నా ఆలోచనలో ఉన్నారు.
లాస్ట్ సపర్ ముగిసాక ఏషువా ను అరెస్ట్ చేసాక, అతనికి ప్రియుడైన మైకా అతన్ని బ్రతికించాలని నిర్ణయించుకున్నాడు.అతన్ని కృసిఫై చేసాక అతనికి ఓ మందు ఇప్పించి, వెంటనే మరణించినట్టు ఆ మందు ప్రభావం ఉండేలా, ఆ తర్వాత దానికి విరుగుడు ఇచ్చి అతన్ని జోసెఫ్ అనే అపొస్టల్ సాయంతో బ్రతికించాలని అనుకున్నాడు. కానీ మిగిలిన అపొస్టల్స్ ఒకవేళ ఏషువా లాంటి తిరుగుబాటు దారి జీవిస్తే తమకు ప్రమాదం రావచ్చని భావించి అతన్ని తిరిగి బ్రతకనివ్వకుండా చేస్తారు. జోసెఫ్ కూడా అప్పుడే మిగిలిన వారి గురించి తెలుసుకుంటాడు.
మైకా గురించి, ఈ విషయాలన్నీ ఆ డైరీ లో రాసిన దానిని బట్టి మ్యూజియం లోపల ఈ స్క్రోల్ ను కనుగొంటారు సాబి, గిల్. అప్పటికే ఆ డైరీ కోసం లూడ్లో ని హత్య చేస్తారు. జార్జ్ కంపెనీలో పని చేసే గిల్ కు ఈ అసైన్ మెంట్ ఇప్పించింది జార్జ్. జార్జ్ సెక్యూరిటీ ని బ్రేక్ చేసి విలువైన సమాచారాన్ని అపహారిస్తూ బెదిరించి డబ్బులు సంపాదించేవాడు. అలా లూడ్లో తన దగ్గగ్రకు వచ్చినప్పుడు అతని ఈ మెయిల్ లో బ్రీచ్ పెట్టి సమాచారం సంపాదించి దానిని మెక్ కాలమ్, మలూకా లకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు.
చివరకు దాని కోసం ఒకరినొకరు చంపుకోవడం, ఒక్క గిల్ తప్ప అందరూ మరణించడం జరుగుతుంది. సాబి మిలిటరిలో పని చేసింది. ఆమె అత్యాచారానికి గురైనప్పుడు ఆమెను మిలిటరీ తొలగించింది. ఆమె తన కోపాన్ని ఆయుధంగా మలుచుకుని తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని హత్య చేసింది. ఆ హత్యకు గురైన వ్యక్తి తండ్రి సారకమి. అతను లూడ్లో దంపతులకు సాబిని పరిచయం చేయడం, వారు ఆమెను కూతురుగా భావించడం జరుగుతుంది.
సారకమి గిల్ కు ఆ స్క్రోల్స్ దొరికింది అవి పొందే అర్హత ఉన్నవారికే అని.13వ అపొస్టల్ అంటే మనిషిలో వచ్చే మార్పు అని, సాబి అత్యాచారం జరిగినప్పటి నుండి మారిపోయిందని, కానీ ఈ స్క్రోల్ వల్ల ఓ సంతృప్తి గల పనిలో భాగమై ఆ తృప్తితో మరణించిందని, మనిషిలోని బాధ అంతా ఓ మానసిక పరివర్తనకు మళ్ళించే ఆలోచనే 13 వ అపొస్టల్ అని చెప్తాడు. ఆ స్క్రోల్ లో కొందరు సంపాదల గురించి వెతుకుతారు. దానిని గుర్తించాలంటేనే మనిషి కి ఆశ కల్పించాలి కనుక పెడదారి పట్టించేలా వాటి గురించి రాసారని, చూడాలనుకున్న వారికి ఆ మార్పు కనిపిస్తుందని స్పష్టం చేస్తాడు.
రచయితలు మంచి అంశాన్నే ఎన్నుకున్నప్పటికి కూడా కాస్త గందరగోళంగా కథను నడపటం వల్ల ఇటువంటి కథలు ఇచ్చే అనుభూతి కొంతమేరకు లోపించిందనే చెప్పాలి. ఏమైనా ఓ మేరకు ఆలోచింపజేసే పుస్తకం కూడా.
* * *

Comments
Post a Comment