మన ఆలోచనలే మనం
మన ఆలోచనలే మనం
-శృంగవరపు రచన
మనిషి ఆలోచనలకు ఉన్న శక్తిని స్పష్టం చేసే సాహిత్యాన్నే మనం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గా నేడు పేర్కొంటున్నాము. ఎన్ని వందల పుస్తకాలు ఈ అంశం మీద వచ్చినా సరే ఆలోచనల ప్రపంచం మీద పాఠకుల ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఆలోచనల శక్తి గురించి,ఆ ఆలోచనలు మనిషి శారీరక-మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో,ఆ ఆలోచనలను ఎలా మార్చుకోవచ్చో అన్న అంశం మీద ఎన్నో పుస్తకాలు రాసి,అఫర్మేషన్స్ అన్న ప్రక్రియను బలపడేలా చేసిన రచయిత్రి మరియు హీలర్ లూయిస్ ఎల్ హే. ఆమె రాసిన ‘హార్ట్ థాట్స్’ మనిషి జీవితంలో అన్ని కోణాల్లో విజయాన్ని,సంతోషాన్ని పొందడానికి ఎలా ప్రవర్తించాలో స్పష్టం చేస్తుంది.
ప్రతి మనిషి ఆలోచనలు,ఆ ఆలోచనలను అనుసరించి వచ్చే జీవితం మనిషి బాల్య మూలాల నుండే జన్మిస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డకు తాము ఏది మంచిదని భావిస్తారో అదే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మంచి జీవితం ఉండేలా చూడటం అంటే ఆర్థిక భద్రతకు మాత్రమే పరిమితమవుతూ ఉండే తల్లిదండ్రులు ఎంతోమంది. తమ తల్లిదండ్రుల నుండి తాము నేర్చుకున్నది, సమాజం ద్వారా తెలుసుకున్నదే వారు తమ పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బాల్యంలో పిల్లలకు ఆలోచనల శక్తి గురించి చెప్పే తల్లిదండ్రులు,వారి భయాలను,అభద్రతలను పట్టించుకుని,వాటి మూలాల గురించి ఆలోచించే వారు అరుదు. దానికి కారణం అలా చేయాల్సిన అవసరం ఉందని తెలియకపోవడమో,భయపడటం-అభద్రతలకు లోనవ్వడం సహజమేనని భావించడం వలన కావచ్చు. అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దలు అయ్యే క్రమంలో తమ బాల్యంలోని అనుభవాలతోనే తమ తరువాతి జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు. బాల్యంలోని భయాలు,అభద్రతలు వయసుతో పాటే పెరుగుతూ ఉంటాయి.అవి ఉండటం వల్లే కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటుందని భావించే వారు కొందరున్నారు.
గొప్ప ఆలోచనలు కలిగి ఉండటాన్ని పగటి కలలు కనడంగా భావించే సంస్కృతి వాతావరణం ఆవరణంలో బ్రతుకుతున్న ప్రజలు కొన్నాళ్ళకి ఆ ఆవరణలోని ఆలోచనలే నిజమనుకుని తమ ఆలోచనలతో మధ్యలోనే రాజీపడిపోయి,తాము గొప్పవాటికి అర్హులు కామని భావించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచనల ప్రభావాన్ని,అవి ఇచ్చే ఫలితాలను ‘హార్ట్ థాట్స్’ స్పష్టం చేస్తుంది.
మనుషుల్లో ఉండే కొన్ని భావోద్వేగాలు మనుషుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కోపం,బాధ,గిల్టీగా ఫీల్ అవ్వడం,భయం,అభద్రతా వంటి ఉద్వేగాలు మనుషుల శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ పుస్తకంలో లుయూస్ హే మనిషి కోపం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది.మనుషుల అధిక బరువు సమస్య కూడా మనుషులకు ఉండే భయం,అభద్రతల వల్ల వస్తుందని,ఎన్ని డైటింగులు చేసినా మనుషులు దానికి మూలమైన భయం,అభద్రతలను వదిలించుకోలేకపోతే ఆ సమస్య పూర్తిగా పరిష్కారం కాదని స్పష్టం చేస్తుంది. అలాగే ఈ భయాలు,అభద్రతల నుండి రక్షణగా కొవ్వును భద్రతగా సృష్టిస్తుందని కూడా లూయిస్ స్పష్టం చేస్తుంది.
మరి శారీరక,మానసిక అశాంతితో ,ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న మనిషి వీటిని ఆలోచనల ద్వారా ఎలా జయించాలి అన్న ప్రశ్నకు సమాధానం కూడా ఈ పుస్తకంలో లుయూస్ హే స్పష్టం చేస్తుంది. క్షమించడం నేర్చుకోగలగడం,పాజిటివ్ గా ఆలోచించగలగడం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక్క మాటలో చెప్పకుండా అది ఎలా చేయాలో కూడా హే స్పష్టంగా చెప్తుంది ఈ పుస్తకంలో.
ఎవరైనా ఆలోచనల్లో మార్పు వచ్చే ప్రయత్నం చేయాలంటే ముందు ఏ ఆలోచనలు ఆలోచించాలో నిర్ణయించుకోవాలి. మనిషికి ఎన్నో ఆశలు,కోరికలు ఉంటాయి.కానీ బాల్యం నుడి ఏర్పడిన నమ్మకాల వలన అవి తనకు అసాధ్యమైన విషయాలు అనుకుంటాడు. అలాగే వాటి గురించి ఆలోచించడం వాస్తవికత కాదని కూడా అనుకుంటాడు. ఈ రకమైన ఆలోచనలు సరైనవి కావని మొదట గుర్తించాలి. మనిషి ఏది సాధించాలన్నా ముందు మానసిక స్థాయి ప్రయత్నం ముఖ్యం.
ఇందులో మొదటి అడుగు అఫర్మేషన్స్ తో మొదలుపెట్టాలి. మనసులోకి ఏ రకమైన నెగెటివ్ ఆలోచనలు వచ్చినా సరే వాటిని గమనించి, వాటికి కారణాలు ఏమిటో తెలుసుకోగలగాలి. వాటిని గుర్తించాక,వాటికి ప్రత్యామ్నాయమైన పాజిటివ్ ఆలోచనలను అఫర్మేషన్స్ గా చెప్పుకోవాలి,లేదా రాసుకోవచ్చు.ఇప్పటి సాంకేతిక యుగంలో వాటిని యూట్యూబ్ లోనూ వినవచ్చు.
మనుషుల ఆలోచనల్లో ఒక రకమైన కరువు ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరికి సరిపడినంత సంపదలు,తిండి,వనరులు లేవని భావిస్తూ ఉండే ఆలోచనా సరళి ఉంటుంది. కానీ ఈ యూనివర్స్ లో లెక్కలేనన్ని సంపదలు ఉన్నాయని గుర్తించాలి. ఇది ఒక రోజులో వచ్చే మార్పు కాదు. నెలలు,సంవత్సరాలు సహనాన్ని కోరుకునే ప్రక్రియ ఇది. ఇది అందరికి ఒకే కాల పరిమితితో ఫలితాలను ఇస్తుందని చెప్పలేము. ఈ విషయంలో ఓపిక చాలా అవసరం. ప్రతి రోజు కొంత సమయం అఫర్మేషన్స్ కు కేటాయించాలి. నెగెటివ్ ఆలోచనలు వచ్చినా సరే,వాటి బదులు పాజిటివ్ ఆలోచ్నలను అఫర్మేషన్స్ గా చెప్పుకోవాలి.
సెల్ఫ్ లవ్ ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప హీలింగ్ ప్రక్రియ. మనిషి తనను తాను ప్రేమించుకోవడం అన్న విషయం పట్ల పెద్ద ఆసక్తి చూపించడు. సెల్ఫ్ లవ్ అంటే మనిషి తనను తాను ప్రేమించుకోగలగడం మరియు అన్ని విషయాల్లో తనను తాను అంగీకరించగలగడం. మనిషి గతంలో తాను చేసిన తప్పులకు కుమిలిపోవడమో లేక ఎవరైనా తన పట్ల కఠినంగా ప్రవర్తిస్తే వారి పట్ల కోపం పెంచుకోవడమో సాధారణంగా చేస్తాడు. తాను తప్పు చేస్తే తనను తాను క్షమించుకోగలగడము, ఇతరులు తప్పుగా ప్రవర్తిస్తే వారిని క్షమించగలగడము చేయగలగాలి.అప్పుడే మనిషి తన తప్పుల నుండి, ఇతరుల తప్పుల నుండి తనను తాను క్షమించుకోగలగడం చేయగలగాలి. మనిషి తన కోపాన్ని దాచుకునే ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదు. ఆ కోపాన్ని శాంతపరిచే మార్గాలు ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉంటాయి.వాటిని పాటించాలి. మనిషి తన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా,ఎలా ఉన్నా సరే తనను తాను ప్రేమించుకోవాలి. తనలోని లోపాలను లోపాలుగా భావించకూడకుండా ఉండగలగాలి. ఎప్పుడైతే వాటిని లోపాలుగా భావిస్తాడో,అదే ఆలోచనను విశ్వం కూడా ఆమోదిస్తుంది.
మన ఆలోచనలు ఏవైనా సరే వాటిలో నిజనిజాల ప్రమేయం లేకుండా వాటికి తగ్గట్టు స్పందించెదే విశ్వం.మనం చేయగలము,మన పరిస్థితులు బావున్నాయి,మన జీవితంలో వచ్చే మార్పు మన కోసమే అనే ఆశావాద ఆలోచనా శైలితో ఉంటే అదే నిజమయ్యేలా చేస్తుంది విశ్వం. అలాగే దానికి వ్యతిరేకంగా ఆలోచించినా దానిని కూడా నిజమయ్యేలా చేస్తుంది.
ఈ సృష్టిలో అన్నింటికన్నా ప్రమాదకరమైన ఆలోచనలు విమర్శ మరియు జడ్జ్మెంటల్ గా ఉండటం. మనను ఎవరు జడ్జ్ చేయకుండా,మన ఆలోచనలను,క్రియలను ఎవరు విమర్శించకుండా ఉండే వాతావరణం ఉండాలని కోరుకోకుండా ఉండని వారు అయితే ఉండరు.అటువంటి ప్రపంచాన్ని నిర్మించాలంటే అలా ఉండకుండా ఉండేలా వ్యక్తిగతంగా ఆఫర్మేషన్స్ ద్వారా,విజువలైజేషన్ ద్వారా మన ఆలోచనా స్థాయిలో సాధ్యమయ్యేలా చూసుకోవాలి. అలాగే అటువంటి విశ్వం ఉండాలని ధ్యానం చేసే సమయంలో అనుకోవడం ఎంతో మంచిది.
ఈ ప్రపంచంలో ఒకేలా ఆలోచించేవారు ఎందరో ఉంటారు.వారందరి పాజిటివ్ శక్తి కూడా సమిష్టి శక్తిగా మారి గొప్ప జీవితాన్ని వ్యక్తులకు,గొప్ప సమాజాలను ప్రపంచానికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది . ఇదంతా ఆలోచనలు ఉండటం వల్ల మాత్రమే కాదు వాటిని ఆఫర్మేషన్స్,మేడిటేషన్ ,స్విచ్ వర్డ్స్ ,విజువలైజేషన్ ఏదో ఒక ప్రక్రియ ద్వారా ఆ ఆలోచనలను ప్రతి రోజు సాధనగా బలపరచగల వ్యక్తులు ఉండాలి. ఈ సమిష్టి ఆలోచనా శక్తి ఎన్నో అద్భుతాలు సృష్టించగలదు.
చావు గురించి భయపడే ఆలోచనలను కూడా తగ్గించుకోవాలి.చావు అనేది కూడా ఓ మార్పు అని గుర్తించి దానిని కూడా సహజంగా భావించగలగాలి. ఇవన్నీ ఒక్క రోజులో,ఒక్క నెలలో సాధ్యమయ్యేవి కాదు కానీ నిరంతర సాధన వల్ల గొప్ప జీవితాన్ని వ్యక్తులు తాము కోరుకునే వాటిని తమ ఆలోచనల్లో నింపుకుని, సహనంతో-సాధనతోతమ జీవితాన్ని అద్భుతంగా అయితే మలచుకోవచ్చు.జీవితం పట్ల గొప్ప ఆసక్తిని,జీవితంలో ఏమైనా సాధించవచ్చు అన్న స్ఫూర్తిని,దానిని సాధించడానికి చేయాల్సిన పనులను సులభమైన బాషలో స్పష్టం చేసే పుస్తకం ఇది.
* * *

Comments
Post a Comment