భావ సంస్కరణ
భావ సంస్కరణ
“అసలు ప్రతి యింట్లోనూ వంటగది ఉన్నట్లే పుస్తకాల గదొకటి ప్రత్యేకంగా ఉండాలి.మనిషి అయినవాడికి కడుపు మేత ఒకటే చాలదు. మెదడుకు కూడా మేత కావాలి. చదవటం ఎంత అవసరమో, చదివిన దాని గురించి ఆలోచించడం కూడా అంత అవసరమే. లేకపోతే ఆ చదువు నిరర్ధకం అవుతుంది. దేశంలో వాతావరణం ఎట్లా ఉన్నా చదవటం అడుగంటాలని ఎక్కడా లేదు. మందు తాగే ఓపిక కూడా లేనంతగా రోగి క్షీణించవచ్చు. కానీ ఆ స్థితిలో మందు మరింత అవసరము. అట్లాగే ఈ స్థితిలో లోకానికి రచనలు కావాలి.బాధల్లో చికాకుల్లో సైతం ఒక నిమిషం సేపైనా చదవడమో, ఆలోచించడమో మంచిది”, అన్నారు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు. ఆలోచింపజేసే రచనకు ఎప్పటికీ సమాజంలో ఆవశ్యకత ఉన్నది. ప్రతి రచనా పాఠకులను వివిధ రకాలుగా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఆ రచన సృష్టికర్త ఏం ఆలోచింపజేశాడు అన్నదే ఆ రచనా విలువను, సమకాలీనత్వాన్ని,ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. యాభై ఏడు కవితలతో ‘మట్టి మొగ్గలు’ కవితా సంపుటిని రూపొందించిన ప్రముఖ కవి దాకరపు బాబూరావు గారు ఈ కవిత్వం ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు ?ఆయన దృక్కోణంలో కవితా ఉద్దేశ్యం మరియు ప్రయోజనం ఏమిటి? ఆ కవితాల్లోని భావోద్వేగాలు ఎవరిని స్పృశిస్తాయి? అనే ప్రశ్నలు పాఠకుల మనసుల్లో ఉదయింపజేయడమే ఈ కవి పదప్రయోగాలు,శీర్షికలు,ఎన్నుకున్న అంశాలనబడే బాహ్య కోణాలకు కొంతమేరకు ప్రయోజకత్వం అని అనిపించింది నాకు.
అనేక వర్గాలుగా విలసిలుతున్న కవిత్వంలో భావ కవిత్వంలోని ఏడు రకాల్లోని ప్రకృతి కవిత్వం,మానవతా వాద కవిత్వం,సంఘ సంస్కరణ కవిత్వం,స్మృతి కవిత్వం, (ఈ ఏడు రకాలను గురించి వెలమల సిమ్మన గారు ‘తెలుగు సాహిత్య చరిత్రలో వివరించారు.) ఈ కవిత్వంలోని వివిధ అంశాల్లో కనిపిస్తుంది. కవిత్వమనేది దృశ్యాల సౌందర్యంతో కాదని, భావ సంస్కరణతో అనుసంధానం కావాలని ‘తొలకరి అలక’ కవితలో బాబూరావు గారు ఇలా స్పష్టం చేశారు.
‘కొందరైతే ....
మేఘాల్ని ...మబ్బుల్ని
అందమైన పద చిత్రాల పల్లకీ లెక్కించి
భావకవిత్వపు పొలిమేరల్లో
కవిత్వం చేసి లోకమంతా ఊరేగించేస్తున్నారు.’
ఒంటరిగా బ్రతకలేక, సమాజంతో కలువలేక మనిషి చేసే యుద్ధం ఈ కవిత్వంలో ఉంది. అలాగే అదే సమాజంలో నిర్లక్ష్యం కాబడుతున్న అనేక అంశాలు కూడా ఈ కవిత్వంలో ఉన్నాయి. ఈ కవిత్వంలో కోల్పోయిన బాల్యం ఉంది. నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న వృద్ధ తల్లిదండ్రుల వ్యథ ఉంది. లాక్ డౌన్ సమయంలో వలస కూలీల బాధలు, వ్యక్తిగా మనిషి అనుభవించిన కష్టాలు ఉన్నాయి. కవికి రైతు పట్ల ఉన్న ప్రేమ, అలాగే రైతు నేటికీ పురోగమించలేక వివిధ రూపాల్లో దగా పడుతున్న వైనం పట్ల నిస్సహాయత, కోపం, ఆ రైతు పట్ల ఉన్న కృతజ్ఞత కూడా అనేక కవితల్లో గోచరిస్తుంది. నేడు దేశ భక్తి ఎలా మారిపోయిందో, దేశం కోసం పోరాడే వీరుల ప్రాముఖ్యత ఏమిటో, అలాగే దేశం కోసమే ప్రశ్నించే వారు ఎలా ఎన్ కౌంటర్ లకు బలై పోతున్నారో కూడా చెప్పే ధైర్యం ఈ కవిత్వంలో ఉంది. మధ్యతరగతి జీవితాల దైన్యం, పోస్ట్ మాన్ అంతరంగం,ఆడపిల్ల మనసు, నాన్నమ్మ శ్రమ సౌందర్యం,విభజించబడిన సరిహద్దు రేఖలు మనుషుల మనసుల మధ్య కూడా ఎలా హద్దులు సృష్టిస్తున్నాయో స్పష్టం చేసిన అక్షరజ్వాలలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుడికి న్యాయం జరగని పరిస్థితుల నేపథ్యం కూడా ఈ కవిత్వంలో ఉంది.
‘ఆక్రందనెప్పుడూ
స్వార్ధంగానో, వివాదరాగంగానో
ఉల్లేఖిత మవుతూనే ఉంటుంది
పోరు బాటలో యుద్ధ భేరి
విరామ చిహ్నమయ్యిందంటే
యుద్ధం ముగిసినట్లు కాదు..’
అని ‘విరామమెప్పుడూ...విశ్రాంతి కాదు’ కవితలో సంస్కరణ విప్లవాలు ఎప్పటికీ అంతం కావని, ఏ పరిస్థితులకు లొంగవని అభ్యుదయ కవిత్వ లక్షణమైన సమసమాజ నిర్మాణానికి బలయ్యే విప్లవ వీరుల జీవితాన్ని వారి మనసులో చెలరేగే సంఘర్షణతో ఏకమై అక్షరీకరించారు.
‘ప్రపంచ పటంమీద ఒక ప్రాణాంతక అంటువ్యాధై
నడుస్తున్న మనిషే ఇప్పుడొక ప్రాకృతిక విపత్తు
ప్రకృతి ప్రకోపించిందంటే .....
ఆయా ప్రాంతాలకే ముప్పుగానీ...విపత్తు గానీ ...
మనిషి వైపరీత్యం విజృంభించిందంటే
చెట్టు లేదు పుట్ట లేదు
కొండ లేదు కోన లేదు
దేవుడి మాన్యమైనా సరే అన్యాక్రాంతం కావాల్సిందే ...’
అని ‘ఇప్పుడు మనిషే ...ఓ ప్రాకృతిక విపత్తు’ అనే కవితలో రాశారు. మనిషి ఆలోచనలు,చర్యలు ప్రకృతి ప్రకోపం కన్నా కూడా ఎంత భయంకరమైనవో ఆ ప్రకృతి పై మనిషి చేసే దురాక్రమణ ద్వారా స్పష్టం చేశారు. కవిత్వంలోని లోతు, కవికి ఉన్న సామాజిక అవగాహన, కవి తన కవిత ద్వారా చేసే ధ్వని తీవ్రతను అనుసరించే ఉంటుంది. ‘మట్టి మొగ్గలు’ కవితా సంపుటిలో కవిలో ఉన్న లోతైన అవగాహన, తన చుట్టూ ఉన్న అన్ని అంశాలను, నాగరిక మార్పులను, మనిషి మనసులోపల ఏర్పడే అవ్యక్తమైన స్వరూప చిత్రాన్ని, ఈ మార్పులలో బాహ్యంగా ఇమిడిపోతూ, మనసు పొరల్లో అనుభవించే వెలితి, శూన్యతలకు కవితా స్వరూపంతో ఓ మనిషి వ్యక్తిత్వ సమకాలీనత్వాన్ని స్పష్టం చేశారు.
‘నేనే
ఎన్ని నేనులుగా
విడిపోతున్నా ...పడిపోతున్నా ...ముక్కలౌతున్నా ...
పరాజిత మౌతున్నా ...
తిరిగి లేచే ఆత్మ ప్రభోదానికి అంతఃకరణం
మళ్ళీ మళ్ళీ అంకురమై ఫలిస్తుంటే
రేపటి ఉషోదయానికి
పునరంకిత మవుతూ ఆశల తెర తీసేది
ఆ ...ఒక్క నేనే’
అని ‘ఆశల అంకురం’ కవితలో మనిషి ఎన్నిసార్లు పడిపోతున్నా ఎలా మరలా తనను తాను నిర్మించుకుంటూ ఆశలతో పైకి ఎదిగే ప్రయత్నం చేస్తాడో ,అతని మనసు ఈ క్రమంలో ఎన్ని సార్లు ముక్కలై ,అతుక్కోలేక అలానే ముందుకు సాగుతూ ఆశనే శ్వాసగా చేసుకుని మరలా ముక్కలవ్వడానికి సిద్ధపడతాడో ఆర్ద్రతతో రాశారు.
‘పూలూ ...పూల చెట్లూ
మా అపార్ట్మెంట్ గోడల్ని బిగిసిన
మా కాంక్రీట్ హృదయనేలల్ని
ఖరీదైన ప్లాస్టిక్ ఆకృతుల్లో
ఆక్రమించుకునుంటాయి...
మట్టిలోకి వేళ్ళు జొనిపి జీవించలేని
ఇసుమంతైనా ఆక్సిజన్ పంచలేని
ఆ ప్రాణం లేని మొక్కల్ని,పువ్వుల్ని
మా ఆవిడ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది
మట్టిని తాకి ఎంతకాలం అయ్యిందో!
ప్రేమ మొలకల్ని నాటుకుని ఎన్నేళ్ళయిందో?
ప్రాణవాయువు నిచ్చే జీవ మొక్కల్నుంచి
ప్రేమ పూలు కోసుకుని ఎన్నేళ్ళయిందో ...?!’
అని ‘వాల్ పేపర్ ‘కవితలో అపార్ట్మెంట్ సంస్కృతిలో మనిషి ఎలా ప్రకృతికి దూరమై, సౌందర్యం కోసం జీవం లేని ప్లాస్టిక్ పూలతో ఎలా ప్రత్యామ్నాయ జీవనానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తున్నాడో, అందమే తప్ప జీవం లేని ప్లాస్టిక్ సంస్కృతి మనుషుల జీవితాల్లో ఎలా నాగరికమైన ప్రపంచంలో తన స్థానం సుస్థిరం చేసుకుంటుందో వ్యథాభరితంగా స్పష్టం చేశారు.
ఈ కవిత్వ సంపుటిలోని ప్రతి కవితలోనూ మారిన సమాజం తీరు తెన్నులు ఓ వైపు చెపుతూనే,ఆ మారిన సమాజానికి చెందిన మనిషి కూడా నిర్లక్ష్యంగా ఎలా నాగరికత్వానికి అదే చిహ్నంగా భావిస్తూ,స్వార్ధంతో ఎలా సాగిపోతున్నాడో చెప్పి, ఇంకో వైపు ఇంకా అమాయకంగా ప్రకృతితో జీవనం ముడివేసుకున్న రైతులు, ఆకలితో వలస కూలీలుగా అయిన వ్యక్తి జీవితం, పారిశుద్ధ్య కార్మికులు,మధ్యతరగతి జీవితాలు ఈ స్వార్ధానికి ఎలా బలవుతున్నాయో కూడా స్పష్టం చేశారు.వ్యక్తి-సమాజ స్థాయిల్లో చైతన్యం రావాలంటే మనిషిలోని స్వార్ధం అంతరించాలనే ఆశ ఈ కవికి ఉన్నట్టు అనేక కవితల్లో అనిపిస్తుంది. ఏమి పట్టించుకోకుండా స్తబ్దంగా ఉన్న మనిషిలో కూడా ‘నా చుట్టూ జరిగే ఇన్ని అంశాల్లో నేను ఏ వర్గానికి చెందిన వాడిని? ఏ అనుభూతులను నేను జీవితంలో ఆస్వాదించాను?జీవితంలో నేనేం కోల్పోయాను?’ అని తనలోకి తాను చూసుకునేలా చేయగలిగే ధృఢ స్వరూపం ఉన్న కవితా సంపుటి ఇది. ఈ సందర్భంగా తన భావాలను బాషలోకి కూడా భావోద్వేగ భరితం అవుతూనే సమన్వయంగా రాసిన దాకరపు బాబూరావు గారికి అభినందనలు.
* * *

Comments
Post a Comment