కుహానా నైతిక వలయం
కుహానా నైతిక వలయం
-శృంగవరపు రచన
మనిషి అవసరాలకు-నైతికతకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ముఖ్యంగా నైతికత స్త్రీ విషయంలో మాత్రమే ఆమె జీవితాన్ని,ఆమెపై అభిప్రాయాన్ని,ఆమెను చూసే కోణాన్ని,ఆమెకు ఇచ్చే గౌరవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం డబ్బు-స్థాయి వల్ల కొంతమేరకు పలుచబడినా మనసు పొరల్లో మాత్రమే స్థిరంగానే ఉంటుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయిని ఈ నైతిక చట్రం ఎలా ఉక్కిరిబిక్కిరి చేసిందో స్పష్టం చేసే నవలే చల్లా సుబ్రహ్మణ్యం గారి ‘నేను పతివ్రతను కాను.’
ఈ నవలలో ముఖ్య పాత్ర సావిత్రి. ఈ కథ మొత్తం ఆమె తన కోణం నుండే చెప్తుంది. తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో తండ్రిని కాపాడుకోవడానికి తాను ఉద్యోగం చేస్తున్న డిసౌజాకు లొంగిపోయిన ఆమె తన శీలం కన్నా తండ్రి ప్రాణం ముఖ్యం అనుకుంటుంది. ఆ విషయం రహస్యంగా ఉంచినా ఆ తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. సావిత్రికి ఓ అక్క జయలక్ష్మి.ఓ అన్న. అన్న యవ్వనంలో ఉన్నప్పుడూ అమ్మాయిలతో తిరిగినా ఎలా ప్రవర్తించినా సరే,మగవాడు తిరిగినా తప్పు లేదని సమర్ధించేవాడు తండ్రి. అలాంటిది కూతురు తన కోసం చేసిన పనిని మాత్రం ఆమె వ్యక్తిత్వాన్ని పతనంగా,దిగజారుడుతనంగా భావిస్తాడు. గర్భవతి అయిన కూతురికి అబార్షన్ చేయిస్తారు ఆ తల్లిదండ్రులు. అప్పటి నుండి సావిత్రిని చూసే పద్ధతి కూడా మారిపోతుంది.
ఎలాగో ఆమెకు పెళ్లి చేసి వదిలించుకోవాలని అనుకుంటారు తల్లిదండ్రులు. ఓ పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ పెళ్లి కొడుకు సాయిరామ్. ఆ రోజు బయటకు వచ్చి ఫ్లై ఓవర్ దగ్గర ఆమె కూర్చున్న సమయంలో ఆమెను నిశాంత్ అనే ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోలు తీస్తాడు. ఆమెకు ఇష్టమైతే ఆమె మోడల్ అవ్వవచ్చని అందుకు ఫోటోలు కూడా తీస్తాడు. ఆ తర్వాత రోజు వచ్చి తీసుకోమని చెప్తాడు.సావిత్రి ఇంటికి వచ్చేసరికి పెళ్లి ఖాయం అయినట్టు తెలుస్తుంది. కానీ ఆమెకు మోడల్ అవ్వాలనే కోరిక బలపడుతుంది. మర్నాడు సాయిరామ్ ను కలిసి అతనికి పెళ్లి ఇష్టం లేదని చెప్పమని చెప్తుంది. దానికి అతను ఒప్పుకోకపోవడంతో డిసౌజా విషయం చెప్తుంది. అప్పుడు సాయిరామ్ అతను ఆమె చెప్పినట్టు వినాలంటే తనకు కూడా లొంగిపోవాలని షరతు పెడతాడు. అతన్ని అసహ్యించుకుంటుంది. సాయిరామ్ జరిగింది సావిత్రి తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి రద్దు చేస్తాడు. అలా తన కక్ష తీర్చుకుంటాడు. ఆ తర్వాత రోజు తన ఫోటోలు తెచ్చుకోవడానికి వెళ్తుంది నిశాంత్ దగ్గరకు సావిత్రి. ఆమె ఫోటోలు ఇస్తాడు. తాను బాంబే వెళ్తున్నానని, నెలలో తిరిగి వస్తానని, వచ్చేటప్పటికి ఆమెకు శుభవార్త తీసుకువస్తానని చెప్పి నిశాంత్ వెళ్తాడు. నెల దాటిన అతను తిరిగిరాడు. ఇక తప్పని పరిస్థితుల్లో వేరే ఆశ లేక తల్లిదండ్రులు తెచ్చిన వివాహం చేసుకుంటుంది సావిత్రి.
సావిత్రి భర్త పేరు చక్రవర్తి. వివాహమయ్యాక సావిత్రి మామూలు భార్యగానే మారిపోతుంది. ఓ రోజు టీవిలో నిశాంత్ ఇంటర్వ్యూ టీవీ లో చూస్తుంది సావిత్రి.సావిత్రి ఫోటో ఫ్లై ఓవర్ మీద తీసిన దానికి నిశాంత్ కు ఎంతో గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత ఈ ఇంగ్లీష్ పత్రిక ముఖ చిత్రంపై సావిత్రి ఫోటో వస్తుంది. అది చూసిన ఆమె భర్త ఆమెను దిగజారిన దానిగానే భావిస్తాడు. ఈ గొడవ నడుస్తున్న సమయంలోనే ఓ సారి ఆమెను ఆఫీసులో తప్పక ఓ పార్టీకి తీసుకువెళ్తాడు. అక్కడ తన భర్త బాస్ డిసౌజా అని సావిత్రికి తెలుస్తుంది.ఆ పలకరింపుల్లోనే తన భార్య అంతకుముందు తన బాస్ కు సెక్రటరీగా చేసిందని చక్రవర్తికి తెలుస్తుంది. దానితో అతనికి అనుమానం కలగడం,ఆ తర్వాత భరించలేక సావిత్రి ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో క్యాంపుకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి చక్రవర్తి సావిత్రి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ఆమె తన బాస్ తో సంబంధం పెట్టుకున్నట్టు చెప్తాడు. అలా చక్రవర్తి ఆమెను వదిలించుకుంటాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు తమ దగ్గరకు రావద్దని సావిత్రిని హెచ్చరిస్తారు.
ఆ తర్వాత నిశాంత్ అనుకోకుండా కలవడం,నిశాంత్ ఆమెను మోడలింగ్ లో ప్రవేశించేలా చేయడం జరుగుతుంది. మోడలింగ్ లో ఎదిగిన ఆమెను అప్పటి వరకు ఆమెను పట్టించుకొని ఆమె కుటుంబం ఆమె సంపాదించిన తర్వాత ఆమె అక్క భర్తతో కలిసి డబ్బు కోసం రావడం,ఆమె అన్న భార్యతో కలిసి ఓ స్థలం కోసం ప్రేమను నటించడం చూసిన ఆమెకు ఆత్మీయుల మీద నమ్మకం పోతుంది. నిశాంత్ ,సావిత్రీలు ఒకరినొకరు ఇష్టపడినా చెప్పుకోకపోవడం వల్ల అలా అజ్ఞాతంగానే ఉండిపోతుంది. నిశాంత్ కు లంగ్ క్యాన్సర్ ఉండటం,సావిత్రికి తన మీద ఉన్న ప్రేమ గురించి తెలియకపోవడంతో ఆమెకు దూరంగా ఆశ్రమంకు వెళ్తాడు. అతను మరణించిన తర్వాతే సావిత్రికి తెలుస్తుంది. చక్రవర్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటం అతని తల్లి డబ్బు కోసం సావిత్రి దగ్గరకు రావడం,ఆమె డబ్బు సాయం చేసినా ఆ తర్వాత చక్రవర్తికి ఉద్యోగం కూడా ఇప్పించడం జరుగుతుంది. వారంతా కేవలం తన డబ్బు కోసం మాత్రమే ప్రేమను నటిస్తున్నారని ఆమె స్పష్టం అవుతుంది. ఆమె అమెరికాలో ఒక మోడలింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని అక్కడ పని చేయడానికి వెళ్లిపోతుంది. ఎంతో సంపాదించినా ఆత్మీయులను మాత్రం సంపాదించుకోకుండానే జీవితంలో ఎదుగుతూ ఉంది సావిత్రి అనే పరోక్షంగా చెప్తూ రచయిత నవల ముగిస్తారు.
సావిత్రి పాతివ్రత్యం ఆమె మధ్యతరగతి స్త్రీగా ఉన్నంత కాలం శీలం లేని స్త్రీగా పరిగణించబడింది. ఆమెకు ఆస్తి,హోదా వచ్చిన తర్వాత ఆ ఆస్తి ఆమెకు పవిత్రతను ఆపాదించింది. ఇక్కడ సావిత్రితో అవసరం లేనంతవరకు ఆమెను నైతిక చట్రంలో ఇరికించి ఆమెను తప్పు చేసినదానిలా చూసిన కుటుంబం,ఆమె ఆస్తుల్లో ఆమెకు అప్పటివరకూ ఆపాదించిన అపవిత్రతను పవిత్రతగా మార్చేశారు.
సావిత్రి తనకు నచ్చినట్టు బ్రతకాలని భావించింది. ఒకవేళ ఆమెకు గర్భం రాకుండా ఉంటే,ఆ విషయం ఎప్పటికీ బయట పెట్టకుండా ఉంటే,సాయిరామ్ కు చెప్పకుండా ఉంటే ,ఆమె పవిత్ర ఇల్లాలులానే భావించబడేది. కానీ ఆమె నిజాయితీగా మొదటి సారి చెప్పినందుకు,రెండో సారి చక్రవర్తితో చెప్పనందుకు కూడా శిక్షను అనుభవించింది. ఆమె అవసరాలను బట్టి మారిపోయే హిపోక్రసీను ద్వేషించింది. ఆఖలితో కడుపు మాడ్చుకోవడం,కన్నీళ్లు పెట్టుకోవడం వంటి చేతకాని పనులకు పరువును ఆపాదించడం కంటే కడుపు నింపుకోవడం ముఖ్యమని చిన్నప్పుడే ఆమె కుటుంబ పరిస్థితి చూసి అనుకుంది.అలానే ఆమె జీవితంలో ఏ పాత్ర ఆ నైతికతను తమకు వర్తించుకోలేదు,కేవలం సావిత్రికి మాత్రమే ఆపాదించారు.పిరికివారు తమ కన్నా ధైర్యవంతులను చూసి భయపడతారు,న్యూనతకు గురవుతారు. ఈ కోణంలో ఆలోచిస్తే సావిత్రి ధైర్యం,నిజాయితీ ఆమె కుటుంబ సభ్యుల్లో కొంత మేరకు ఈ రెండింటిని కలిగించి ఉండటం వల్ల వారు తమ ఆదిక్యతను నిరూపించుకునే ప్రయత్నంలో ఆమెను వ్యతిరేకించడం,ఆమెకు అనైతికతను ఆపాదించడం కూడా జరిగి ఉండవచ్చు.ఆమె వ్యక్తిత్వం పట్ల అదే న్యూనతకు,భయానికి గురైన సాయిరామ్,చక్రవర్తి ఆమె మీద కోపంతో ఆమె మీద అదే నైతికతను అస్త్రంగా వినియోగించుకుని ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారు.
తనకు నచ్చినట్టు బ్రతికే హక్కు ఉన్న సావిత్రికి ఆ హక్కు స్త్రీగా పుట్టడం వల్ల లేదనే భావనను కలిగేలా చేసి,ఆమె చేసింది తప్పు అని ఆమె అనుకునేలా చేయడానికి ఇందరూ ప్రయత్నించినా ఎవరు అది నైతికత పట్ల ఉన్న గాఢమైన భక్తి వల్ల అయితే మాత్రం కాదు. తమ ఇగోలను తృప్తిపరచుకోవడానికి,తమ భయాలను,న్యూనతలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే. ఈ కుహనా నైతిక సిద్ధాంత వలయం నుండి బయటపడిన సావిత్రి ఒంటరితనం నుండి పుట్టిన నిస్పృహ వల్ల మనుషులను కొన్నిసార్లు నమ్మినా, ఆ వలయం చేధించుకునే ధైర్యాన్ని కూడా వారితో ఉన్న అనుభవాల ద్వారా ఆమె సాధించింది. అవసరంతో మారే సమాజంలో మనుషులు కూడా అదే అవసరానికి తగ్గట్టు మారిపోతే నైతికత శరీరానికి సంబంధించింది కాదని,అది ఆలోచనలకు,మనసుకు సంబంధించిందని,వ్యక్తి తనకు తాను తప్పుగా భావించని అంశాన్ని సమిష్టిగా ఆ వ్యక్తి మనసులో ఆ అపరాధ భావాన్ని జన్మించేలా చేయడానికి కొన్నిసార్లు వినియోగించే అస్త్రంగా కూడా మారిన ఈ కుహనా నైతిక వలయం నుండి బయటపడాల్సిందే ఎవరైనా సరే!
* * *

Comments
Post a Comment