దేశభక్తి

                                                 దేశభక్తి

                                                        -శృంగవరపు రచన


ఆలోచనల్లో
చర్యల్లో
ఆరాధనల్లో
అక్షర మాలికల్లో
విజయ పతాకాల్లో
సినిమాల్లో
గీత సంగీతాల్లో
ఏ రూప తత్వ స్పర్శల్లో
తారాడుతూ
ఊపిరి పోసుకుంటుందో
తెలియదు దేశభక్తి!
బంకించంద్ర చటర్జీ 'వందేమాతరం'
రవీంద్రనాథ్ ఠాగూర్ 'జనగణమణ'
మహమ్మద్ ఇక్బాల్ 'సారె జహాన్ సే అచ్చా '
పైడిమర్రి వెంకట సుబ్బారావు 'ప్రతిజ్ఞ'
శంకరంబాడి సుందరాచారి 'మా తెలుగు తల్లి' లో
శబ్ద ఉద్రేకమై పోయిందో!
పింగళి వెంకయ్య 'జాతీయ పతాకం'
మూడు రంగుల్లో
వేల జాతుల్లో
కోట్ల మనుషుల్లో
నిక్షిప్తమైపోయిందో!
'చక్ దే ఇండియా', 'ఖడ్గం'
'లగాన్' లాంటి
దృశ్యాలుగా మారిపోయిందో!
ఏ ఆర్ రహమాన్
సంగీతమైపోయిందో!
దేశభక్తికి లక్ష్యం
ఏమిటో అర్ధంకాని
అగమ్యగోచర సందోహంలో
ప్రకటనే 'దేశభక్తి' గా
రూపం మార్చుకుందేమో!
గత చరిత్ర పొగడ్తల్లోనే
తప్ప
వర్తమాన వ్యథల్లో
అగుపించదేమో!
ఆగస్టు 15న
ప్రవహించే దేశభక్తి
లక్ష్యం ప్రయోజనం
అనుభూతి ప్రధానమై
కార్య శున్యమైనా
అదే దేశభక్తికి
కొత్త నిర్వచనంగా ఏర్పడిందేమో!
ఆగస్టు 16
మామూలు రోజే!
ముందు రోజులోని
ఉప్పెన లాంటి ఉద్రేకం
మరలా వచ్చే
ఏడాదికి వాయిదా
పడుతుంది!
అప్పటికైనా
'దేశభక్తి' అంటే
నాకు
బోధపడుతుందేమో అన్న
చిన్న ఆశ!
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ