వాస్తవానికి మరో వైపు!
వాస్తవానికి మరో వైపు!
“ ఒక సంఘటనను వార్త కాకుండా కథగా చేసేదే శిల్పం” అన్నారు శ్రీ శీలా వీర్రాజుగారు. ఆ శిల్ప సామర్ధ్యమే రచయిత కథలు నడిచే దారిని పాఠకులకు కొంతమేరకు స్పష్టమయ్యేలా చేస్తుంది.వినూత్న అంశాల మీద కథలు రాసినా, రచయిత తన ముద్ర నిలుపుకోవడం అన్నది తన ఆలోచనలు, భావ ప్రకటన, పరోక్ష కథనం పట్ల రచయితకి,పాఠకులకు స్పష్టత రావడానికి సహకరించే అంశాలు.ఎటువంటి అంశాన్ని కథాశిల్పంగా చెక్కినా, జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా ఆస్వాదించాలో, పదార్ధ ప్రపంచ భ్రమల నుండి మనిషి ఎలా బయటపడే ప్రయత్నం చేయాలో, విజయం-పరిపూర్ణత మధ్య ఉన్న సన్నని రేఖను ఎలా గుర్తించాలో, ప్రేమ అంటే పట్టుకోవడమే కాదు-ఎప్పుడు వదలాలో తెలుసుకోవడం కూడా అన్న అంశాన్ని తల్లిదండ్రులు పిల్లల విషయంలో గ్రహించాల్సిన అవసరాన్ని, అనేక రీతుల్లో జీవన తాత్వికతను సరళరేఖలా తన కథా వెలుగుల్లో పాఠకుల మనసుల్లోకి ప్రసరింపజేస్తారు వారణాసి నాగలక్ష్మి గారు తన కథల్లో. సృజన సాహిత్యంలో సామాజిక సమస్యల పరిష్కార మార్గం గురించి రాసిన రచనలే ప్రగతి శీల రచనలనే భావం నేటికి ఉంది. కానీ మనిషి ఆలోచనలే మనిషికి శత్రువుగా మారే క్రమం పెంపకం వల్ల, సమాజ ప్రభావం వల్ల, మధ్యవయసుగా మారిన జీవితంలో మారలేని మనిషి అంతరంగ ఆవిష్కరణగా నాగలక్ష్మి గారి ‘వేకువ పాట’ కథా సంపుటిలో కనిపిస్తుంది.
మొదటి కథ ‘సరళీస్వరాలు.’ ఏ కథ రాసినా రచయితకు ఓ ఉద్దేశ్యం ఉంటుంది. మంచి కథ అయితే అదే ఉద్దేశ్యాన్ని అదే రీతిలో పాఠకులు కూడా అర్ధం చేసుకుంటారు. సంగీతంలో సరళీస్వరాల సాధన చాలా కాలం చేయిస్తారు. ఎందుకంటే సంగీతంలో తర్వాతి దశలకు అదే పునాది కనుక. మనుషుల
జీవితంలో బాల్యం కూడా అలాంటిదే. పిల్లలకు బాల్యంలో ఏమివ్వాలి? అన్న స్పష్టత నిజంగా తల్లిదండ్రులకు నేడు ఉందా? అన్న ప్రశ్నను ఈ కథలోని కథకుడైన సురేష్ ఆలోచనల ద్వారా, ఆ ప్రశ్నకు ఉన్న అనేక కోణాలను రెండు సంఘటనల ప్రధానంగా, సూటిగా రాశారు. వాకింగ్ కు పార్క్ కు వెళ్ళే సురేష్ కు అక్కడి మిత్రులైన కొందరు వాకింగ్ చేస్తూ నేటి సమాజం గురించి వార్తాపత్రికల్లో వార్తలను బట్టి, వాటి మీద తమవైన అభిప్రాయాలూ వెల్లడించుకుంటూ ఉంటారు. యవ్వనంలో ఉన్న ఓ హీరోయిన్ ఓ రెయిడ్ లో పట్టుబడటం అనే వార్త నుండి క్రమంగా యవ్వన దశలో పిల్లలు ప్రవర్తించే తీరు, ఆకర్షణలకు లోబడటం, సుఖాలు కావాలనుకోవడం, వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడటం వంటి అనేక అంశాల గురించి ఈ చర్చ సాగుతుంది. ఈ నేపథ్య ఊతంగా సురేష్ తన పిల్లల గురించి ఆలోచిస్తాడు. పదహారేళ్ళ కూతురు రమ, పదేళ్ళ కొడుకు రాజు. సౌకర్యాలు అన్ని ఉన్నా పిల్లలతో తల్లిదండ్రులుగా తాము గడిపే సమయం లేదని, వారు కూడా వారిదైన ప్రపంచంలో ఉంటున్నారని భావిస్తాడు సురేష్. కూతురు తండ్రి పక్కకు వచ్చేసరికి ఐ పాడ్ స్క్రీన్ మార్చడం ద్వారా పిల్లలు ఈ కాలంలో చిన్నతనం నుండే పర్సనల్ స్పేస్ కోరుకుంటున్నారని, వారి విషయాల్లో ఎవరి జోక్యం సహించలేరన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఇక కొడుకు ఓ వీడియో గేమ్ ఆడుతూ అందులో తాను టెర్రరిస్ట్ అని చెప్తాడు. బాల్యంలో పిల్లలకు మంచి,చెడు మధ్య వ్యత్యాసం తెలిసే అవకాశం,ఆలోచన ఉండవని, పట్టించుకోని వాతావరణంలో వారు త్వరగా ఆకర్షించే చెడు వైపు మరలుతారని, ఆ చర్యల ఆధారంగా తమ విలువలను రూపొందించుకుంటారని కూడా రచయిత్రి పరోక్షంగా చెప్తారు. ఈ కథలో ఉన్న ఇంకో అంశం సురేష్ మనసులో విలువలకు, ఆర్థిక విజయానికి మధ్య ఏర్పడ్డ ఘర్షణ. ఎంతో నమ్మకంగా పని చేస్తున్న సంస్థ నుండి తప్పుకుని వేరే సంస్థకు వెళ్తే రెట్టింపు జీతం వచ్చే అవకాశం ముందు ఉన్నప్పుడూ,ఆర్థికంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనా ఉన్నా తన విలువలను వదులుకోలేని సురేష్ ఉన్న ఉద్యోగంలో ఉంటూనే పిల్లలతో తల్లిదండ్రులుగా తాము గడుపుతూ, గమనించాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ మేరకు ఆచరించే దిశలో సాగాలన్న ఆశావాహ దృక్కోణంతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ సంఘటన మరియు మనస్తత్వ చిత్రణ రెండింటికి మధ్య సమన్వయం ఏర్పరిచేలా రాయబడింది. బాల్యం నుండే ఆలోచనలు చర్యలు-విలువలుగా రూపొందే క్రమంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసే కథ ఇది.
రెండో కథ ‘ఆనాటి వాన చినుకులు.’ ఈ సమాజంలో ఉద్యోగాలు చేయడానికి, డబ్బు సంపాదించడానికి నైపుణ్యాలు, ప్రతిభ పనికి వస్తాయి కానీ మానవ సంబంధాలు నిలుపుకోవడానికి కావాల్సింది అవి కాదు అని పరోక్షంగా హెచ్చరించే కథ ఇది.ఈ కథలో పాత్రల పేర్లు శిశిర, వసంత్. ఈ రెండు పేర్లు ప్రకృతి రమణీయతను స్పష్టం చేస్తూ సకల ప్రాణులను ఆహ్లాదపరిచే ఋతువులు. ఎలా అయితే కాలుష్యం మరియు వ్యాపారం వల్ల ఆ ఋతువులు వాటి సహజ సిద్ధ సౌందర్యాన్ని, ఆహ్లాదాన్ని పంచే గుణాన్ని కోల్పోతున్నాయో, అలానే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా ఆ దంపతుల మనసుల్లో అంతర్లీనంగా ఉండే అహాలు, వ్యక్తిగత ప్రాధాన్యతల వల్ల సమిష్టిగా జీవితంలో సంతోషం కూడా నశిస్తుందని అన్న సూచనను ఎంతో చక్కగా రచయిత్రి ఈ కథ ద్వారా చేశారు. ఈ కథ విడిపోయిన భార్యాభర్తల్లో, భార్య మరలా భర్తతో ఉన్నప్పుడూ ఉన్న సంతోషాన్ని అర్ధం చేసుకుని,అదే కోరుకుని భర్తకు తన భావాలు మెయిల్ ద్వారా స్పష్టం చేసే శైలిలో ఉంది. భార్యాభర్తలు చిన్న చిన్న సంతోషాలు కలిసి అనుభవించడం వల్ల వారి మధ్య బంధం బావుంటుందని, వాటిని నిర్లక్ష్యం చేస్తే డబ్బు ఆ బంధానికి ప్రత్యామ్నాయం కాలేదని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది.
మూడో కథ ‘శుభరాత్రి.’ ఈ కథ సామాజిక అవగాహన కల్పించడానికి రాసిన కథ. ఎయిడ్స్ పట్ల అవగాహన, బాధితులు ముందే జాగ్రత్త తీసుకుంటే ఎలా అమాయకులు ఈ వ్యాధికి బలి కాకుండా ఉండవచ్చో అన్న అంశాన్ని స్పష్టం చేసే కథ ఇది. మనోజ్ఞకు పెళ్ళయిన రెండో రోజే తన భర్తకు హెచ్ ఐ వి పాజిటివ్ అని,ఆ విషయం దాచి పెట్టి తనతో వివాహం చేశారని తెలుస్తుంది. ఆ సమయంలో వెంటనే అప్రమత్తంగా ఉంటే ఈ రోగం నుండి ఎలా బయటపడవచ్చో, జాప్యం చేసే కొద్ది ఇది ఎంత ప్రమాదకరంగా మారుతుందో అన్నది విపులంగా పాఠకులకు అర్ధమయ్యేలా రాశారు రచయిత్రి. ఈ సమయంలో ఎవరికి చెప్పకుండా ఉండటం వల్ల సమస్య ముదిరిపోతుందని,ఆ భయాన్ని వీడి స్నేహితులతో చెప్పి వెంటనే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎంత మేరకు ఉందో టెస్టుల ద్వారా తెలుసుకోవాలని, కొన్ని సార్లు ఇలా వెంటనే స్పందించడం వల్ల, ఇన్ఫెక్షన్ సోకకుండా చేసే అవకాశం ఉంటుందని, ఆలస్యం అయితే రోగిగా మారక తప్పదు అని, ఈ వ్యాధి అనుకోకుండా సోకే స్త్రీలు తక్షణం స్పందించాల్సిన తీరును చక్కగా చెప్పి, ఈ వ్యాధి అనుకోకుండా సోకే స్త్రీ వర్గానికి పరిష్కారాన్ని వైద్య రూపంలో చక్కగా తెలియజేసారు.
నాలుగో కథ ‘విముక్త.’ తల్లికి బిడ్డల మీద ఉండే ప్రేమకు ఇంకో కోణాన్ని స్పష్టం చేసే కథ ఇది. దీనికి రచయిత్రి ఎన్నుకున్న వాతావరణం అభినందనీయం. ఈ కథలో ఇద్దరు తల్లులు ఉంటారు. ఒక తల్లి ఈ తరం తల్లి అయితే, ఇంకో తల్లి ముందు తరం తల్లి. ఇద్దరు పక్క పక్క ఇళ్ళల్లో ఉంటారు. ఒకరికి మాటలు కూడా రాని పసి పిల్లవాడు కొడుకు. ఇంకో తల్లి వృద్ధురాలు.ఆమెకు వైద్యుడైన కొడుకు. కొడుకు తప్పిపోతే పసిబాబు తల్లి తల్లడిల్లిపోతుంది. బాబు దొరుకుతాడని బెంగ పడవద్దని ఆ బామ్మగారు ధైర్యం చెప్తారు.తన కొడుకు కూడా అలానే తప్పిపోయి దొరికాడని చెప్తుంది ఆ బామ్మగారు. ఆ బాబు దొరుకుతాడు. కొన్ని సార్లు ఆ బామ్మ గారి కొడుకు ఆమెను విసుక్కోవడం,ఆమెకు సౌకర్యాలు సమకూరిస్తే చాలు అన్న భావనతో వ్యవహరించడం ఆ బాబు తల్లి గమనిస్తుంది. ఆ తర్వాత ఆ బామ్మగారు కొన్నాళ్ళకు మరణిస్తుంది. మరణించే ముందు ఆమె ప్రశాంతంగా ఉంటుంది. “ఎప్పుడైతే తల్లి కోసం పిల్లవాడు బెంగ పడడని ఖరారుగా తెలుస్తుందో అప్పుడు ఆ తల్లి తన బిడ్డని, తన పాశం నుండి విముక్తుడిని చెయ్యాలి. అతడినే పట్టుకు వేళ్ళాడుతూ వెనక్కి లాగకూడదు. నేను పోతే ఇతడూ ఎట్లా బతుకుతాడు అనేంతగా ఒక ఎదిగిన బిడ్డ, తల్లి పట్ల ప్రేమ కలిగి ఉంటే, అది ఆ తల్లి ఇహపరాలకు మంచిది కాదు. సంతానం తల్లి పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటే, ఇక ఆ తల్లి ముక్తిని పొందేది ఎలా?” అని ఆ మామ్మ గారి డైరీలో మాటల ద్వారా రచయిత్రి ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పెంపొందించుకోవాల్సిన దృక్కోణాన్ని, మానసిక బలాన్ని గురించి స్పష్టం చేశారు. తల్లి ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉన్నా, పిల్లలు తమ జీవితంలో ఎదుగుతూ, తమ స్పేస్ లో తమ భార్యాపిల్లలనే కుటుంబ పరిధిలో లీనమైపోవడం సహజం.దానిని ఓ సహజ పరిణామంగా భావించి, ప్రేమ లేని బంధమనే నిరాశా నిస్పృహల్లో కాకుండా, అది కూడా మానసిక బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే సాధనంగా భావిస్తే మరణంలో ఓ ప్రశాంతత ఉంటుందనే తాత్విక ధోరణి కూడా ఈ కథలో కనబడుతుంది.
ఐదో కథ ‘నాన్నకో ఈ మెయిల్.’ నాకు వ్యక్తిగతంగా ఎంతో నచ్చిన కథ ఇది. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉన్న అపార్ధాలు కూడా పిల్లలు పుట్టడంతో సమసిపోతాయనే భావన ఉంది.అలాగే ఆడపిల్లలు పుడితే బాధను వ్యక్తం చేసే తండ్రులు కూడా అదే పిల్లలు ఏదైనా విజయం సాధిస్తే తమ పిల్లలనే గర్వాన్ని అనుభవించడం కూడా సహజమే.బాల్యం నుండి తనను ఎంతగానో ప్రేమించి, తన పట్ల శ్రద్ధ చూపిన ఓ తండ్రి కూతురుకి వివాహమయ్యాక, తనకు ఇద్దరు కూతుళ్ళు పుట్టడంతో భర్తలో పెరిగిన విముఖత గురించి చెప్తూనే నేటి తండ్రులు ఆడపిల్లల పట్ల ప్రవర్తించే దశల గురించి రచయిత్రి వాస్తవాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించారు. ఇక్కడ భర్త నుండి తండ్రిగా మారిన మగవాడికి కూతురు పుట్టడం వల్ల కలిగే కోపం అంతా భార్య మీద ప్రదర్శించే దశ కొంతకాలం ఉంటుందని, ఆ తర్వాత ఆ పిల్లలకు కాస్త జ్ఞానం వచ్చే సమయానికి వారు ఆడబిడ్డలను కూడా స్వీకరిస్తారని,అందువల్ల ఆ పిల్లలకు తండ్రి మనసులో అప్పటి వరకు తమ మీద ఉన్న భావన తెలియకపోయినా,ఆ ప్రేమను మాత్రమే గుర్తుంచుకుని ఆ ఆడపిల్లలు తండ్రిని తమ హీరోగా భావిస్తారని, కానీ అటువంటి ఓ ఆడపిల్ల ఓ భార్యగా మారాక ఆమె కూతురి దశ నుండి భార్యగా మారే క్రమంలో ఆమె తల్లి ఆడబిడ్డను కన్నందుకు తండ్రి ప్రవర్తించిన తీరే ఆమెకు తన భర్త రూపంలో ఎదురవుతుందని ఆవేదనతో ఓ కూతురు తండ్రికి మెయిల్ పంపిస్తుంది. ఈ దశను తాను అర్ధం చేసుకున్నాను కనుక తాము పుట్టినప్పుడు తండ్రి కూడా అదే రీతిలో తల్లితో ప్రవర్తించడం గురించి అమ్మమ్మ ద్వారా తెలుసుకున్న తీరు గురించి కూడా తండ్రికి రాసి,ఓ తండ్రి తన ఆడపిల్లలను తన బిడ్డలుగా ప్రేమతో స్వీకరించే దశ వరకు,ఆ తల్లి కోల్పోయే జీవితం విలువ ఎంత అనే ప్రశ్నను కూడా ఆ కూతురు ఆ మెయిల్ లో సంధిస్తుంది.మానవ సంబంధాల్లో ఉండే హిపోక్రసీని, మనస్తత్వ కోణాలను అధ్యాయనం చేసిన రచయిత్రి నాగలక్ష్మి గారు అన్న విషయం ఈ మనస్తత్వ విశ్లేషణలోనే స్పష్టం అవుతుంది.
ఆరో కథ ‘వెన్నెల కిటికీ.’ ఈ కథలో నేటి తరం తల్లిదండ్రుల బాధలను రెండు కోణాల్లో రచయిత్రి స్పష్టం చేశారు. పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల దూరంగా ఉన్న తల్లిదండ్రులతో అనుబంధం బలపడకపోవడం ఓ వర్గం తల్లిదండ్రులను బాధిస్తుంటే, ఇంకో వర్గం తల్లిదండ్రులకు పిల్లలు దగ్గరే ఉండటం వల్ల ఆ దశలో కూడా ఆ పిల్లల పిల్లలను చూసుకునే బాధ్యతలు ఉండటం వల్ల వారి జీవితంలో వారి కోసం వారు జీవించే ఏకాంతం చిక్కడం లేదు. ఇలా ఒంటరితనం, ఏకాంతం లేని జీవితం ఇలా రెండు కోణాల్లో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కునే ఇబ్బందులను ఎంతో చక్కగా ఈ కథలో స్పష్టం చేశారు రచయిత్రి.
ఏడవ కథ ‘అరుణోదయం.’ నిరక్షరాస్య నేపథ్యం నుండి వచ్చిన ఓ ఆడపిల్ల చదువుకుంటే ఆమె తన జీవిత భాగస్వామికి కూడా తన విద్య ద్వారా సహకారం అందించగలదని, ఉపాధి కల్పించగలదని, విద్యావంతురాలైన ఆడపిల్లను విద్యా సంస్కారం ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తే ఆమె విద్యకు ప్రయోజకత్వం చేకూరుతుందని స్పష్టం చేసే కథ ఇది.
ఎనిమిదవ కథ ‘ పుట్టిల్లు.’ ఆడపిల్లకు పెళ్లయ్యాక పుట్టిల్లు ఉండటం అవసరమనే అంశం మీద రాసిన కథ ఇది. అవును, మనం 21వ శతాబ్దంలో ఉన్నా సరే, స్త్రీకి ఆర్థిక భద్రత మాత్రమే సరిపోదు. పిల్లల వల్లో లేక సమాజంలో ఒంటరి స్త్రీను చూసే దృక్కోణంలో మానసిక మార్పులు రాకపోవడం వల్లనో స్త్రీకి పుట్టిల్లు అనే ఆలంబన చాలా అవసరమని, అది ఆమెకు నైతిక,మానసిక బలాన్ని ఇస్తుందని, లేకపోతే సాధారణంగానే కొంత భార్యను తన అధీనంలో ఉంచుకోవాలని అనుకునే భర్తలకు లేదా వారిని శారీరకంగా హింసించే భర్తలకు ఆ పుట్టిల్లు లేకపోతే ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుందని, పురోగతి చెందుతూ ముందుకు దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా ఇటువంటి సున్నిత అంశాలకు ఉన్న ప్రాధాన్యతను ఎంతో చక్కగా ఆ పుట్టిల్లు లేక భర్తల అరాచకాలకు గురయ్యే స్త్రీల కథలతో చక్కగా స్పష్టం చేశారు నాగలక్ష్మి గారు.
తొమ్మిదవ కథ ‘నేనూ అమ్మనవుతా!’ ఇది రెండు తరాల స్త్రీలు అమ్మలుగా,అత్తలుగా,కూతుర్లుగా మారే క్రమంలో వారి మధ్య అనుబంధాల్లో వచ్చే మార్పులను స్పష్టం చేసే కథ. ముందు తరంలో స్త్రీలకు చిన్న వయసులో వివాహాలు కావడం వల్ల అత్తతో అనుబంధం గాఢంగా ఉంటే, తర్వాతి తరం స్త్రీ తమకు ఉద్యోగాలు వచ్చేవరకు తల్లితో ఉండటం వల్ల తల్లితో గాఢమైన అనుబంధం కలిగి ఉంటున్నారు. ఈ వైరుధ్యాలను అర్ధం చేసుకుని విశ్లేషించి ఆలోచించగల శక్తి ఉంటే ఈ రెండు తరాల స్త్రీలు ఎలా అటు అత్త-అమ్మ ఇద్దరితోనూ చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండే అవకాశం ఉందో స్పష్టం చేశారు. బహుశా మానవ అనుబంధాలు అన్ని ఆలోచించి అర్ధం చేసుకోగల శక్తి లేకపోవడం వల్లే క్షీణిస్తాయేమో అన్న భావన ఈ కథ చదివాక కలుగక మానదు.
పదవ కథ ‘అమ్మా నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ.’ రచయిత్రిలోని విలక్షణమైన ఆలోచనా పటిమను స్పష్టం చేసే కథ ఇది. వాస్తవానికి నేటి విద్యావిధానంలో పోటీ వల్ల ఒత్తిడి ఎక్కువవుతుందని, పిల్లలను తల్లిదండ్రులు అటు విద్యాసంస్థలు అర్ధం చేసుకోలేక వారి మరణాలకు కూడా కారణాలవుతున్నారనే అంశం బలపడిపోయింది. ఈ కోణం నుండి సహజంగానే అందరూ ఆలోచిస్తారు. తల్లిదండ్రులు తమను అందరితో చదువులో పోలుస్తారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామన్న భావన కూడా పిల్లల నుండి మనం నేడు వినవచ్చు. కానీ అదే పిల్లలు ధనవంతులైన పిల్లల జీవన విధానంతో తమను పోల్చుకుంటూ తల్లిదండ్రులను తమ కోరికలు తీర్చమని ఒత్తిడి తీసుకురావడం గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమకంటే గొప్పవారన్న తపనను కేవలం తాము సాధించని వాటిని పిల్లలు సాధించాలన్న కోరికతో మాత్రమే కాదు,ఆ పిల్లల మనసుల్లో ధనవంతుల జీవన విధానం పట్ల ఉన్న మోజు వల్ల కూడా ఆ పిల్లల కోరికలు తీర్చే సక్రమమైన మార్గంగా కూడా విద్యను ఎన్నుకునే కోణం ఉందని రచయిత్రి ఈ కథలో చెప్పడం నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది. ఎంత అవగాహన!ఎంతటి విశ్లేషణ! ఈ కథ రచయిత్రి ముద్ర స్పష్టంగా కనబడే కథ.
పదకొండవ కథ ‘అయినవాళ్లు.’ బయటకు మంచివారుగా లేదా చెడ్డగా కనిపించేవారు వారి వ్యక్తిగత జీవితంలో అనుబంధాల్లో విరుద్ధంగా ఉండవచ్చన్న అంశాన్ని స్పష్టం చేసే కథ ఇది. రేవతి,రమ అక్కాచెల్లెళ్ళు. రేవతికి మంచి సంబంధమని వివాహం చేశారు. ఆమె అత్తగారు ఎంతో మంచి వారని బయటి వారు చెప్పుకుంటారు. కానీ ఆమె గయ్యాళితనం అనుభవించిన రేవతి,తన చెల్లెలి రమ పెళ్లి చేసుకున్న అనిల్ అమ్మ గురించి బాల్యం నుండి గయ్యాళి అని వినడం వల్ల తనలానే చెల్లి కూడా బాధ పడుతుందని భావిస్తుంది. కానీ వివాహమయ్యాక రమ అత్తయ్య రమని కూతురిలా చూసుకోవడమే కాకుండా ఆమె తల్లిదండ్రులను కూడా అంతే ఆపేక్షతో చూస్తారు. బహుశా భర్త నెమ్మదస్తుడు కావడం వల్ల ఆమె కుటుంబం కోసం గట్టిగా నిలబడటం వల్ల, ఆమె తన వారి కోసం ధైర్యంగా నిలబడే తత్వం వల్ల ఆమెకు ఆ పేరు వచ్చి ఉండవచ్చు కానీ ఆమె స్వతహాగా మంచి వ్యక్తి అని తెలియడంతో రేవతి కుదుటపడుతుంది. తాను కూడా బాధితురాలిగా మిగిలిపోకుండా మారడానికి ముందడుగు వేయాలనుకోవడంతో కథ ముగుస్తుంది. ప్రేమకు ఇంకో కోణం కొన్ని సార్లు గయ్యాళితనంగా కనిపిస్తుందని కూడా ఈ కథ చదివితే అర్ధమవుతుంది.
పన్నెండవ కథ ‘అమ్మ ఒక రూపం కాదు.’ తల్లిని బాల్యంలో పిల్లలు ఏ రూపంలో మనసులో ముద్రించుకుంటారో స్పష్టం చేసే కథ ఇది. మూడేళ్ళ వయసున్న పిల్లవాడు స్కూల్ కి వెళ్లడానికి మొదట మారాం చేసేవాడు. తర్వాత తన క్లాసుకు అమ్మ లాంటి ఓ టీచర్ వచ్చిందని, ఆమె గురించి, ఆమె మీద పెంచుకున్న అభిమానాన్ని తన బాషలో చెప్తూ ఉంటే, ఆ టీచర్ సౌందర్యంలో తనలా ఉంటుందని ఊహించుకుని వెళ్తే అక్కడ నల్లగా ఉన్న స్త్రీని చూసి షాకవుతుంది ఆ పిల్లవాడి తల్లి. పిల్లల దృష్టిలో అమ్మ అనే పదం శాంతికీ, సౌఖ్యనికీ, భద్రతకీ ప్రతీకగా కనిపిస్తుందనీ,పిల్లలు అమ్మతో ఎవరినైనా పోల్చేటప్పుడు బాహ్యరూపాన్ని కాకుండా, ఆమె సన్నిధిలో దొరికే మానసిక సౌఖ్యాన్ని, ఆత్మీయతనీ అనుభూతి చెందడం ద్వారా ఆ వ్యక్తిని అమ్మతో పోల్చుకుంటారని ఆ తల్లి గ్రహిస్తుంది. అమ్మకు బాలల దృష్టిలో ఉన్న ఔన్నత్యాన్ని స్పష్టం చేసే కథ ఇది.
పదమూడవ కథ ‘పుష్యవిలాసం.’ భార్యను ప్రేమించే భర్తకు కూడా కొన్ని సార్లు తన ఆత్మన్యూనత వల్ల తన భార్య తనకన్నా అధికుడిని ఇష్టపడుతుందేమో అన్న అనుమానం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వస్తుందని, అది ప్రేమ వల్ల జన్మించిన అభద్రత వల్ల వచ్చేదే అని,దానిని భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతతో జయించాలని స్పష్టం చేసే కథ ఇది. భార్యాభర్తల అనుబంధం ఇటువంటి ఆటంకాలను దాటితే పుష్యమాసంలా పరిమళభరితంగా ఉంటుందన్న పరోక్ష సూచన ఈ కథలో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది.
పదనాలుగవ కథ ‘సహజీవనం.’ పట్టణ సంస్కృతిలో పర్సనల్ స్పేస్ కు బాగా అలవాటుపడిపోయిన మనుషులు అప్పుడప్పుడు ఇంకా మానవ సంబంధాలు ధృఢంగా ఉన్న పల్లెలకు వెళ్ళాలని తద్వారా అక్కడ ఉన్న భూత దయ వల్ల, ప్రకృతితో, పశువులతో, పక్షులతో సహజీవనం చేయాల్సిన అవసరం గురించి స్పష్టం చేసే కథ ఇది. ముఖ్యంగా బాల్యదశకు ఈ అనుభూతులను పరిచయం చేయడం ద్వారా వారిలో కూడా ఇతరుల పట్ల కరుణ, బాధ్యతగా వ్యవహరించే తీరు గురించి, అలాగే తల్లిదండ్రులను మనం పట్టించుకునే పరిస్థితులు లేకపోతే అదే గమనించే మన పిల్లలు మన పట్ల అదే తీరులో వ్యవహరిస్తే అది వారి తప్పు కాదని, మన ప్రభావమేనని కూడా రచయిత్రి ఈ కథలో స్పష్టం చేస్తారు.
పదిహేనవ కథ ‘కొమ్మ కొమ్మకో సన్నాయి.’ ఈ కథలో కాపురానికే జీవితం అంకితం చేసిన స్త్రీ తన స్వావలంబన కోసం చేసే ప్రయత్నాన్ని ఈ కథలో రచయిత్రి స్పష్టం చేశారు. పెళ్ళయిన మొదట్లో ఉద్యోగం చేద్దామనుకున్న స్త్రీ తర్వాత తల్లి అయ్యి,పిల్లల బాధ్యతల్లో సహకరించని భర్త వల్ల సతమతమవుతూ, అనారోగ్యంతోనే కుటుంబాన్ని చక్కదిద్దుకున్నా, ఆమెకు ఆర్థిక స్వేచ్చ లేకపోవడం వల్ల ఆమెను కింది స్థాయి వ్యక్తిగా పరిగణించే సంస్కృతి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆ స్త్రీ తన శారీరక కష్టాలను అధిగమించి తన స్వావలంభన దిశలో అడుగులు వేయాలని నిర్ణయించుకోవడంతో కథ ముగిస్తారు రచయిత్రి. ఈ కథలో స్త్రీ ఇంట్లో చేసే పనికి గుర్తింపు లేకపోయినా కనీస సహకారం కూడా లేని పరిస్థితుల్లో,తన జీవితం గురించి కూడా ఓ కోణంలో ఆలోచించాల్సిన అవసరాన్ని రచయిత్రి గట్టిగానే చెప్పారు.
పదహారవ కథ ‘చూస్తునే ఉండాలా?’ ఈ కథ నిజానికి పాఠకులకు రచయిత్రి విసిరే ఓ ప్రశ్న వంటిదే. నేటి టీవి మరియు మీడియా యవ్వనంలో ఉన్న పిల్లల పై చూపే ప్రభావం, దాని వల్ల జరిగే అత్యాచారాలు, పిల్లలు ఆకర్షణల్లో కూరుకుపోవడం, కుటుంబానికి మానసికంగా దూరమైపోవడం, ఈ సమయంలో తల్లిదండ్రుల్లో ఉన్న భేధాభిప్రాయాల వల్ల పిల్లలు తల్లిదండ్రులను లెక్కచేయకపోవడం, ఆ సందర్భంలో ఆ పరిస్థితిని నాయనమ్మ,తాతయ్య తరం ఎలా మార్చే ప్రయత్నం చేయవచ్చో స్పష్టం చేసే కథ ఇది. మన పిల్లలు మన ముందే మారిపోతూ ఉంటే ఏమి చేయలేని నిస్సహాయతతో ఉండాల్సిందేనా? ఏదో ఒకటి చేయలేమా అన్న ఆవేదన ఈ కథ చదువుతున్నంతసేపు కలుగుతుంది. నేటి తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన కథ ఇది.
పదిహేడవ కథ ‘వారధి.’ నడి వయసులో భర్తను కోల్పోయిన రాజేశ్వరికి భర్త తప్ప వేరే ప్రపంచం లేదు. కొడుకు ఆమెకు ఇష్టం లేని వివాహం చేసుకోవడం వల్ల,కోడలికి పిల్లలు కలుగకపోతే ఓ అబ్బాయిని దత్తత తీసుకోవడం వల్ల మానసికంగా కూడా తనను తానే వారికి దూరంగా జరిగిపోయింది. భర్త పోవడంతో ఆమెలో ఒంటరితనం, కొడుకు కుటుంబంతో అయిష్టంగానే గడపవలసి రావడం, ఆ సమయంలో వారితో హృషీకేశ్ వెళ్ళిన ఆమెను రివర్ రాఫ్టింగ్ క్రీడ ఎలా జీవితం పట్ల ఉన్న భయంతో పాటు సంకుచితత్వాన్ని కోల్పోయేలా చేసిందో స్పష్టం చేసే కథ ఇది. ప్రతి వ్యక్తి క్రీడా స్పూర్తితో జీవితంలో భయాలను తొలగించుకోవచ్చనే సూచన కూడా ఈ కథలో ఉంది.
పద్దెనిమిదవ కథ ‘పాపాయి పుట్టిన రోజు.’ ఒకప్పుడు పిల్లలు పుట్టినప్పుడు పల్లెటూర్లలో ఉన్న ఆచారాలను చాదస్తాలుగా భావించడం వల్ల అప్పుడే పుట్టిన పాపాయిని చూడటానికి వచ్చే వారి వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం గురించి, ఆచారాల వెనుక ఉన్న ప్రయోజనాలను అర్ధం చేసుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఈ కథ ద్వారా రచయిత్రి స్పష్టం చేస్తారు.
ఈ కథాసంపుటిలో ఆఖరి కథ ‘పరిమళించే పూలు.’ జీవితాన్ని నెమ్మదిగా ఆగి ఆస్వాదిస్తూ అనుభవించడంలో సంతోషాన్ని పొందే మాలతిని బాల్యం నుండి ర్యాంకులు,పోటీ,డబ్బు మాత్రమే ధ్యేయంగా గడిపిన మాధవ్ ప్రేమిస్తే తమ కన్నా ఆర్థికంగా ఓ మెట్టు దిగువ ఉన్న ఆమెను వివాహం చేసుకోవాలని మాధవ్ తల్లి అడిగితే మాలతి తన అయిష్టాన్ని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత సౌమ్యతో అతని వివాహం జరుగుతుంది. కానీ మాధవ్ ఆ తర్వాత ఉద్యోగ ఒత్తిడి వల్ల డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతాడు. అలాగే జీవితం మీద ఉత్సాహం కోల్పోయి కొన్ని సార్లు ఉన్మాదంతో కూడా ప్రవర్తిస్తాడు. అటువంటి పరిస్థితుల గురించి కోడలు చెప్పగానే కొడుకును చూడటానికి బయల్దేరిన పద్మకు ఆ రైలు ప్రయాణంలో మాలతి తారసపడుతుంది. అక్కడ మాధవ్ స్థితి గురించి అస్పష్టంగా చెప్పి దానికి కారణం మాలతితో అతని ప్రేమ వైఫల్యమే అని ఆమె మీద నెపం వేస్తుంది. అప్పుడు మాలతి పెంపకంలో ఉన్న తప్పుల వల్ల మాధవ్ కు కళల పట్ల, జీవితాన్ని ఆస్వాదించే కోణం పట్ల అభిరుచి లేకపోవడం వల్ల తాను అతన్ని వివాహం చేసుకోలేకపోయానని చెప్తుంది. ఈ కథ ద్వారా రచయిత్రి భార్యాభర్తల మధ్య కళాత్మకత లోపిస్తే ఆ కాపురం యాంత్రికమై, వృత్తి ఒత్తిడి లేదా ఇతర ఒత్తిడులు వారి జీవితాలను పాడు చేసే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తారు.
“అభూతకల్పన కాకుండా అల్పమైన కల్పన సర్వజీవితానికి జోడించి సృష్టించిన సాహిత్యంలో వాస్తవికత ఉంటుంది. రచయిత కంటికి కనిపించిన జీవితం చిత్రించటంతో గుండె కంటికి కనిపించే జీవితం చిత్రించటంతో వాస్తవికత ద్విగుణీకృతమవుతుంది”, అన్న శ్రీ కొలకలూరి ఇనాక్ గారి మాటలకు సజీవ రూపాన్ని ఇచ్చారు నాగలక్ష్మి గారు తన కథల్లో. ఈ కథల్లో వాస్తవికత మనస్తత్వ చిత్రణ ప్రధానంగా, అల్పమైన కల్పనతో, తీసుకున్న అంశంలో ఇప్పటికే వచ్చిన కథలకు విభిన్న కోణాన్ని జోడించి, గుర్తించడానికి ఇష్టపడని లేదా గుర్తించినా,ఆలోచనా స్థాయి పెంచుకోవడానికి ఇష్టపడని వాస్తవ కోణం తప్పక గోచరిస్తుంది. ఇటువంటి విభిన్న ఆలోచనా దృక్కోణంతో అద్భుతమైన కథలను మలచిన వారణాసి నాగలక్ష్మి గారికి ఈ సందర్భంగా అభినందనలు.
* * *

Comments
Post a Comment