మనిషి లోపలి 'హీరో'
మనిషి లోపలి 'హీరో'
నవలా సాహిత్యంలో 1947 దాటాక ఎక్కువ మంది పాఠకులను ఆకర్షించిన అంశం ఉత్కంఠ. సస్పెన్స్ నవలా సాహిత్యం కొంతమేరకు పుస్తకపఠనం పట్ల ఆసక్తిని పెంచింది అనడం సమంజసమే. సహజంగా ఉండే జీవితాన్ని, అందులోని సంతోషాలకు-దుఃఖాలకు మాత్రమే పరిమితమై జీవించే కోట్ల మంది మనుషులకు తమకు తెలియని ఓ అసాధారణ ప్రపంచం, అందులో కొంత వాస్తవికత కూడా ఉండటం ఆసక్తిని కలిగించడమూ సహజమే. సస్పెన్స్ థ్రిల్లర్ సాహిత్యంలో కొంత కుటుంబానుబంధాన్ని కూడా చొప్పించడం కొన్నిసార్లు అసహజంగా కూడా ఉండవచ్చు. కానీ మనిషి లోపలి మనిషిని తెలియజేయకుండా కేవలం బయటి మనిషి పరిచయ దశలోనే ఆగిపోయే సాహిత్యం పాఠకుల ఆలోచనా పరిధిని విస్తరించడంలో సహకరించదు. మనిషి మోటివ్స్, మనిషిని ఓ అసాధారణ పరిధిలోకి ప్రవేశించడానికి ప్రేరేపించే పరిస్థితులు, దానికి అతని మనస్తత్వం దోహదపడే తీరును చక్కని కథనంతో ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవలలా మలిచారు సి. ఎన్. చంద్రశేఖర్ గారు తన 'అతడే... హీరో 'నవలలో. ఈ నవల చతురలో 'హీరో'పేరుతో ప్రచురించబడింది.
శశాంక్ ఒక మెడికల్ రిప్రజంటేటివ్. అతని సొంత ఊరు చిత్తూరు.కానీ ఉద్యోగరీత్యా అతను నెల్లూరులో అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటి వారు ప్రమీలమ్మ, ముకుందరావు దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్ళు సాహితి, కీర్తన. సాహితి చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక మొదటిసారి చూసినప్పుడే ఆమెను ఇష్టపడ్డాడు శశాంక్.కానీ సాహితికి అతని పట్ల సదాభిప్రాయం ఏర్పడలేదు. అదేమీ పట్టించుకోకుండా ఆ ఇంటికి ఎప్పుడు కొడుకులా అండగా ఉండేవాడు శశాంక్. శశాంక్ వృత్తి రీత్యా కలిసే డాక్టర్లలో డాక్టర్ మాధవి ఒకరు. వీరిద్దరికి మధ్య మంచి స్నేహం ఉంది. అలా ఆ పరిచయంలోనే మాధవి స్నేహితురాలు స్వప్న అని ఆమె చెన్నై లో ఉంటుందని ఓ సారి ఆమెను మాధవితో కలిసి ఉన్నప్పుడు హాస్పిటల్ లో ఉండటం ద్వారా తెలుసుకుంటాడు శశాంక్. శశాంక్ తన వృత్తి రీత్యా, మాధవి ఓ స్నేహితురాలి పెళ్ళికి చెన్నై కలిసి వెళ్తారు. అలా వెళ్ళిన సమయంలోనే స్వప్న ఆత్మహత్య చేసుకున్న విషయం మాధవికి తెలుస్తుంది. పైకి అది హార్ట్ ఎటాక్ అయినా స్వప్న మరణించే ముందు పంపిన డైరీ ద్వారా ఆమెది ఆత్మహత్య అని మాధవికి తెలుస్తుంది. ఆ డైరీని శశాంక్ స్వప్న మరణం గురించి అడిగినప్పుడు ఇస్తుంది.
స్వప్న కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తూ ఉండేది. ఆ సమయంలో ఆమెకు మదన్ అనే వ్యక్తి పరిచయం అవడం, అతను ఆమెను వివాహం చేసుకుంటానని లోబర్చుకోవడం, ఇల్లు కడుతున్న మిష మీద ఆమె దగ్గర నుండి మూడు లక్షలు తీసుకోవడం,ఆ తర్వాత మొహాన్ని చాటేయ్యడం, అతన్ని ఇంకో అమ్మాయితో చూడటంతో ఆ బాధను భరించలేకపోతుంది స్వప్న.ఇద్దరు చెల్లెల్లు, తల్లికి ఆసరాగా ఉన్నా స్వప్న ఆ మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నదని శశాంక్ కు అర్ధమవుతుంది. ఎలా అయినా స్వప్న చావుకు కారణమైన మదన్ ను పట్టుకుంటే ఇంకొందరో అమ్మాయిల జీవితం కాపాడవచ్చనే సంకల్పం కలుగుతుంది అతని మనసులో.
మాధవి స్వప్న తన కుటుంబానికి ఆ విషయం తెలియకూడదని, తనది సహజ మరణం అని అనుకోవాలనే అలా చేసిందని కుదిరితే ఆమె స్నేహితుడిగా వెళ్ళి ఆ ఇంట్లో ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడమని చెప్తుంది. అలా వెళ్ళిన అతనికి ఆమె పాస్ బుక్ పై పేజీకి మరియు కవర్ కు మధ్య స్వప్న ఇంకో నవ్వుతున్న పురుషుడుతో ఉన్న ఫోటో ఉన్నప్పటికీ అతను తన మొహం కనబడకుండా దాచుకోవడం వల్ల అతనెవరో తెలియకుండా పోతుంది. కానీ అతని నవ్వు మాత్రం అతని మనసులో గట్టిగా గుర్తుండిపోతుంది.
సాహితి మేనమామ ఆమెకు సంబంధం కుదర్చడం జరిగితుంది. ఆ పెళ్ళి కొడుకు పేరు మోహన్.ఆ పెళ్ళి చూపుల సమయంలో ఎంతో సాయంగా ఉంటాడు శశాంక్. సాహితిని ఇష్టపడినా మొదట వారిద్దరి మధ్య మంచి పరిచయం లేకపోయినా తర్వాత అతని మనస్తత్వం చూసి తన అభిప్రాయం మార్చుకున్న ఆమె మీద అతను ఆశలు పెంచుకున్నప్పటికి ఆమె పెళ్ళి అతనికి ఓ మూల బాధ కలిగించిన్నా ఆమె సంతోషంగా ఉంటే చాలని అనుకుంటాడు.ఆ తర్వాత అతనికి ఆలోచిస్తే స్వప్న పక్కన ఉన్న పురుషుడి నవ్వు మోహన్ లా ఉందని అనిపిస్తుంది. అతనే మదన్ అయ్యి ఉండవచ్చని అనిపిస్తుంది.సాహితి కుటుంబం మీద ఉన్న ఆపేక్ష వల్ల సాహితి కోసం మోహన్ మదన్ ఒకరో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. మాధవికి ఈ విషయం చెప్పినప్పుడు ఆమె తనకు తెలిసి ఉదయ్ అనే అతను ఏ విధమైన సహకారం కావాలన్నా అందిస్తాడని చెప్తుంది. అతన్ని వెళ్ళి కలుసుకుంటాడు శశాంక్.
స్వప్న కాలేజ్ కి వెళ్ళినప్పుడు ఆమె స్నేహితురాలు నళినిని కలుస్తాడు. ఆమెకు ఒక్కదానికే మదన్ అనే వ్యక్తి గురించి తెలుసునని కానీ ఆమె ఎప్పుడు అతన్ని చూడలేదని ఆ కాలేజీ సెక్యూరిటీ గార్డ్ నాజర్ మాత్రమే వారిద్దరూ కలుసుకోవడానికి వారధిగా ఉన్నాడని, స్వప్న మరణించిన రెండు రోజుల తర్వాత అతను కరెంట్ షాక్ తో మరణించాడని చెప్తుంది. స్వప్నకు మదన్ కు పరిచయం అయిన కాలంలోనే నాజర్ ఆ కాలేజీకి సెక్యూరిటీ గార్డ్ గా రావడం సహజం కాదని శశాంక్ కు అనిపిస్తుంది. ఆ తర్వాత ఉదయ్ సాయంతో నాజర్ ఇంటికి వెళ్తాడు. నాజర్ భార్య హసీనా వల్ల ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. అతను చనిపోయే ముందు రోజు ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు ఇంటికి వచ్చారని, వారిని భర్త తన గదిలోకి తీసుకువెళ్ళాడని, వారి మధ్య ఘర్షణ జరిగిందని, తనను భర్త లోపలికి వెళ్లిపొమ్మన్నాడని, ఆ తర్వాత భర్తను బెల్టుతో ఉరి తీసి వారే చంపేశారని, తనకు కూడా హాని చేస్తారన్న భయంతో ఆమె భర్త షాక్ వల్ల చనిపోయాడని చెప్పానని చెప్తుంది. ఆ తర్వాత మోహన్ ను కలుసుకున్నప్పుడు పెళ్ళి చూపుల ఫోటోలు రాలేదని ఫిల్మ్ పాడయ్యిందని చెప్పడంతో అతను మోహన్ తన ఉనికి బయట పడకూడదని ఆధారాలు లేకుండా చేస్తున్నాడని అనుమానిస్తాడు.
ఆ తర్వాత సాహితి పెళ్లిచూపుల ఫోటో ఒకటి సాహితి బంధువుల్లో ఒకరి ద్వారా శశాంక్ కు చేరుతుంది. ఆ ఫోటో తీసుకుని వెళ్ళి హసీనాను అడిగితే అతనే చంపిందని చెప్తుంది. ఇక్కడితే తేలిపోయినట్టే అని అనిపిస్తుంది. కానీ తిరిగి వచ్చి మాధవికి చెప్తే ఒకవేళ హసీనాను బెదిరించి ఎవరి ఫోటో చూపించినా అతనే హంతకుడని చెప్పించి ఉండే ఆస్కారం కూడా ఉందని అనుమానం వెలిబుచ్చడంతో మరలా తన పరిశోధనలోకి దిగుతాడు శశాంక్.
మోహన్ సాహితి ఇంటికి రావడం, ఫోటోలు వచ్చాయని చెప్పడం, సాహితి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం వంటివి ఒకసారి శశాంక్ లో ఒకవేళ అనవసరంగా అనుమానిస్తానేమో అన్న భావనను కలిగించినా అతను ఆ విషయం తేల్చుకోవాలని అనుకుంటాడు.
ఆ తర్వాత స్వప్న చెల్లెళ్ళను కలిసినప్పుడు ఆ ఫొటోలో ఉన్నది తమ అన్నయ్య మోహన్ అని, అతను తమ తండ్రి సోదరుడి కొడుకని, ఆస్తి గొడవల్లో కుటుంబాల మధ్య సంబంధం లేకపోవడం వల్ల అతను మాత్రం తప్పకుండా పట్టించుకునేవాడని, తల్లిదండ్రులకు కష్టం కలిగించకూడదని ఆ విషయం తెలియకుండా ఉండాలని ఆ ఫొటోలో మొహం లేదని చెప్తారు వారు. దానితో మోహన్ అనుమానితుల లిస్టు నుంచి తొలగిపోతాడు.
ఆ తర్వాత ఓ రోజు సినిమాకు వెళ్ళినప్పుడు శశాంక్ ను ఎవరో దాడి చేస్తారు. ఆ తర్వాత అతన్ని ఈ విషయం వదిలేయమని ప్రమాదకరంగా మారవచ్చని ఉదయ్ సూచించడంతో అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరేనంటాడు శశాంక్. బావ సాయంతో ఓ పోలీస్ ఆఫీసర్ కు జరిగింది చెప్తాడు. అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేసి వారి డబ్బును దోచుకునే గ్యాంగ్ ఒకటి ఉందని, అలా చేయడానికి ఓ ముఠాగా వారు పని చేస్తారని చెప్తాడు.ఒకసారి హసీనాను కలుసుకుని ఆమె బలవంతంగా చెప్పిందో లేదో తెలుసుకుందామని పోలీస్ ఆఫీసర్ తో వెళ్లేసరికి శశాంక్ ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ ఇంటి పక్కన ఉన్న ఆమెతో హసీనా గురించి అడిగితే ఒకతను బైక్ మీద ఆమెను తీసుకువెళ్ళాడని చెప్తుంది. ఆమె వస్తే తెలియజేయమని చెప్పి బయలుదేరుతున్న సమయంలో ఉదయ్ శశాంక్ కు కాల్ చేస్తాడు. అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక బాబా గుడి దగ్గర ఉన్నానని చెప్తాడు. అక్కడికి వెళ్తాడు.ఉదయ్ అక్కడికి వచ్చాక ఉదయ్ కు జరిగింది చెప్పకుండా హసీనా ఇంటికి అతనితో వెళ్తాడు. తాళం చూసి తిరిగివస్తారు.
హసీనా ఇంటి పక్కన ఉండే స్త్రీ ఆ సాయంత్రం రెండో సారి శశాంక్ తో కలిసి వచ్చిన వ్యక్తే హసీనాను బైక్ మీద తీసుకువెళ్ళాడని చెప్పడంతో ఉదయ్ ఇదంతా చేసాడని అర్ధమవుతుంది. ఆ తర్వాత స్వప్న ఇంటికి వెళ్ళినప్పుడు స్వప్న తల్లి తన భర్త ఒక్కడే అని తల్లిదండ్రులకు అని చెప్తుంది. ఆ రోజు మోహన్ వారిని బెదిరించి అలా చెప్పించాడని, ఇదంతా జరుగుతున్నప్పుడు అతను వంట గదిలోనే ఉన్నారని వారు చెప్తారు.
స్వప్న ఇంకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు మదన్ కు చెక్ రూపంలో ఇవ్వడం, ఆ అకౌంట్ మోహన్, ఉదయ్ జాయింట్ అకౌంట్ అవ్వడం వంటి విషయాలు తెలుసుకుంటాడు శశాంక్.మొత్తానికి ఆ గ్యాంగును పోలీసులు పట్టుకోవడం, హసీనా రక్షించబడటం, మోహన్ బారి నుండి సాహితి కాపాడబడటం, శశాంక్ మాధవిని వివాహం చేసుకోవడంతో నవల ముగుస్తుంది.
ఓ సాధారణ మనిషి తన ఆప్తుల జీవితాలను కష్టాల నుండి కాపాడే దిశలో ఓ సస్పెన్స్ సృష్టించడం, అనుమానం-స్పష్టత ల మధ్య దోబుచులాటగా ఈ నవలను కొంత అనుబంధ, ఇంకొంత నాటకీయతతో నడపటం ఈ నవలలో పఠనీయతను పెంచింది.
రచయిత పుట్టింది నెల్లూరులో, పెరిగింది చిత్తూరులో. మాతృబాష మరాఠీ అయినా తెలుగులో ఇంత అద్భుతంగా రాయడం అభినందనీయం. సస్పెన్స్ ను ఎమోషనల్ గా నిర్మించడంలో రచయిత చూపిన నైపుణ్యం కూడా మెచ్చుకోదగినదే.
* * *

Comments
Post a Comment