పాటకు ప్రాణం –ఎమ్మెస్ సుబ్బలక్ష్మి
పాటకు ప్రాణం –ఎమ్మెస్ సుబ్బలక్ష్మి
కొన్ని నెలల క్రితం నేను ‘మనోధర్మపరాగం’ అనే నవలకు సమీక్ష రాశాను. మధురాంతకం నరేంద్ర గారి ఈ నవలకు ఆటా బహుమతి లభించింది. ఈ నవల 2020 లో ప్రచురించబడింది. నా సమీక్షకు ఎందరో ఫేస్ బుక్ వేదికలో ఈ నవల ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథ అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ నవల ముందుమాటల్లో దేవదాసీల కళల మీద కేంద్రీకృతమైనట్టు,వారి జీవితం గురించి రాసినట్టే చెప్పారు తప్ప ఈ విషయం ఎక్కడా పేర్కొనలేదు. అందరి కామెంట్స్ చదివాక ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథ చదవాలనే ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి ఇన్నాళ్లకు నెరవేరింది, పల్లవి గారు రాసిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదవడంతో . ఈ పుస్తకంలోని ప్రతి సంఘటనను యధాతధంగా శైలి మార్చి, చివరిలో కొంత మార్పుతో ఆ నవలలో రాశారన్న స్పష్టత ఈ పుస్తకం చదివాక వచ్చింది. ఈ వాదన కట్టిపెడితే, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి జీవితంలో ఉన్న ఎన్నో వైవిధ్యతలు, వ్యక్తిగతంగా ఉన్న దుఃఖాలు, పాటలో తప్ప దేనిలోనూ లేని స్వేచ్చ, ఆ పాటల్లో కూడా ఏది పాడాలో నిర్ణయించుకునే అధికారం లేకపోవడం, ఆమె సంపాదన నుండి ఆమె జీవితం వరకు ఏది ఆవిడ అధీనంలో లేకుండా గడిచినా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మాత్రం పాటలోనే తనను, తన జీవితాన్ని, తన సర్వస్వాన్నిచూసుకుంటూ, దానిలోనే ముక్తి- విముక్తి పొందారు. ఆవిడ జీవితంలో కీర్తితో సమంగానే ఎన్నో సంఘర్షణలు, నిర్బంధత్వం కూడా ఉన్నాయి. కానీ వీటన్నింటిలోనూ అంకితభావం అనే స్పూర్తి సంకేతం ఆమె వ్యక్తిత్వంలో ఇమిడిపోయి, ఆ కాంతిని దేశవిదేశాలకు ప్రసరించేలా చేసింది.
మధురైలోని ఓ దేవదాసి కుటుంబంలో సుబ్బలక్ష్మి జన్మించారు. ఆ కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆవిడ పేరు తల్లిపేరు పక్కనే చేరి మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి అయ్యింది. ఇంట్లో ఆమెను కుంజమ్మ అని పిలిచేవారు. ఆమె తల్లి షణ్ముగవడివు ప్రముఖ వీణా విధ్వంసురాలు. ఆమె కొడుకు శక్తివేల్, తర్వాత సుబ్బలక్ష్మి, ఆ తర్వాత వడివాంబ. దేవదాసీ ఆచారం ప్రకారం సుబ్బలక్ష్మిని గొప్ప సంగీత విధ్వంసురాలిని చేసి, తద్వారా ఆమెకు మంచి పోషకుడిని తీసుకురావాలన్నది తల్లి అభిమతం. సుబ్బలక్ష్మి తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన న్యాయవాది. ఆయనకు ఇంకో కుటుంబం ఉంది. అప్పుడప్పుడు ఆయన తనను ముద్దుగా చూడటం సుబ్బలక్ష్మికి గుర్తే. ఆమె పదేళ్ళ వయసులో ఆయన మరణించిన వార్త తెలిసినా వారు వెళ్లలేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని చుట్టుముట్టడంతో తన పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదని చెట్టి గార్లు అయితే ఆర్థిక ఇబ్బందులు ఉండవని సుబ్బలక్ష్మి తల్లి ఆలోచన. బాల్యం నుండి తమ ఇంటికి వచ్చే మగవారిని చూసి, తమను సమాజం చూసే దృష్టిని గమనించిన సుబ్బలక్ష్మి మాత్రం పెళ్లి మాత్రమే చేసుకోవాలని నిర్ణయించుకుంది. నాలుగేళ్ల వయసునుండే తల్లితో కలిసి కచేరీలకు వెళ్ళడం సుబ్బలక్ష్మ్నికి అలవాటే. ఇంట్లో ఆమె గురువు తల్లే. రోజు సాధన చేయడం కూడా ఆమె నుండి నేర్చుకున్న అలవాటే.
సుబ్బలక్ష్మికి ఉన్న ప్రత్యేక ప్రతిభను గమనించిన తల్లి కొంతకాలం ఆమె పెల్లిని వాయిదా వేసి ఎలా అయినా ఆమెను దేశానికి పరిచయం చేయాలని, బెంగుళూరు నాగరత్తమ్మ, ధనమ్మ వంటి వారి స్థాయిలో నిలబెట్టాలనే ఆలోచనల్లో ఉంది. అలా తల్లి ప్రోత్సాహం, చొరవ వల్లనే సుబ్బలక్ష్మి పదేళ్లకే గ్రామ్ ఫోన్ రికార్డుల్లోనూ, ఆ తర్వాత మద్రాస్ లోని ఎన్నో ప్రఖ్యాత కచేరీల్లోనూ పాడి అందరి దృష్టిలోనూ పడింది. ‘ఆనంద వికటన్’ అనే తమిళ పత్రికా కార్యాలయంలో పని చేస్తున్న సదాశివం సుబ్బలక్ష్మి ఇంటర్ వ్యూ తీసుకోవడానికి రావడంతో సుబ్బలక్ష్మి జీవితంలో సంభవించబోయే అతి పెద్ద మార్పులకు పునాది. అలా సుబ్బలక్ష్మి సదాశివం దృష్టిలో పడింది. అతను తీసుకుంటున్న చొరవ సుబ్బలక్ష్మి తల్లికి నచ్చలేదు. అవసరం మేరకు సాయం తీసుకుని, అతను ఇంకో అడుగు ముందుకు వేయకూడదని వెంటనే మద్రాసు నుండి సుబ్బలక్ష్మిని ఇంటికి తీసుకువచ్చేసింది. సదాశివం అప్పటికే వివాహితుడు. ఓ కూతురు ఉంది. ఆ సమయంలో భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లింది. ఇంటికి వచ్చాక సుబ్బలక్ష్మికి తన తల్లి తనకు పోషకుడిని ఏర్పాటు చేసిందని తెలుసుకుని, చెల్లి సాయంతో మద్రాసుకు పారిపోయింది. ఆ సమయంలో దేవదాసీలను వేశ్యలుగా భావిస్తూ యాంటీ నాచ్ ఉద్యమాలు, వారి వృత్తిని నిర్మూలించాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడైన సాంబమూర్తి ఇంటికి వెళ్లింది. దేవదాసీలను ఉద్దరిస్తామని ఊదరగొట్టిన ఆ నాయకుడు ఆమెను సదాశివం దగ్గరకు పంపాడు.
సదాశివంకు అప్పటికే మంచి రాజకీయ పలుకుబడి ఉంది. రాజాజీకి అతను సన్నిహితుడు. అలా సుబ్బలక్ష్మి అనుకోని పరిస్థితుల్లో సదాశివం ఇంటికి చేరింది. వచ్చిన అవకాశాన్ని అతను వాదులుకోదలుచుకోలేదు. ఆమెను తన ఇంట్లోనే ఉంచుకుని మరి ఆమె చేత కచేరీలు తన పలుకుబడితో ఇప్పించాడు.ఆ తర్వాత సుబ్బలక్ష్మి తల్లి కొడుకును ఆమె కోసం పంపినా వారి ప్రయత్నాలు నిలవకుండా చేశాడు. సదాశివం భార్య పుట్టిన బిడ్డతో తిరిగి వచ్చింది. ఆమెను లెక్క చేయలేదు. ఆ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లింది. కొన్నాళ్ళకు ఆత్మహత్య చేసుకుని మరణించింది.ఆ విషయం లోకానికి తెలియకుండా దాచి ఆమె ప్రమాదం వల్లే మరణించిందని చెప్పేవాడు. ఆ తర్వాత సుబ్బలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. సుబ్బలక్ష్మిని బ్రాహ్మణ యువతిగా మార్చాడు.ఆమెను వివాహం కాకముందు ఇంట్లో ఉంచుకున్నందుకు రాజాజీతో గొడవ అయితే కూడా సదాశివం లెక్క చేయలేదు. సదాశివం సోదరి ఇద్దరి పిల్లలు, సదాశివం పిల్లలైన రాధ, విజయలే సుబ్బలక్ష్మి పిల్లలు కూడా. సుబ్బలక్ష్మితో వివాహం కాగానే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు సదాశివం.
సుబ్బలక్ష్మికి పుట్టింటితో ఉన్న బంధాన్ని తెంచేశాడు. ఆమె విద్వత్తుకు తన పలుకుబడి ఉపయోగించి ఆమెను సినీ రంగానికి కూడా పరిచయం చేశాడు. తన మాట చెప్పినట్టు వినే డంగన్ అనే దర్శకుడితోనే ఈ సినిమాలు నడిచాయి. అవి సేవాసదానం, మీరా. ఆ తర్వాత ఆమెకు ఎన్నో సినీ అవకాశాలు వచ్చినా తన జోక్యం ఉండదన్న కారణంతో ఆమెను సినిమాలు చేయనివ్వలేదు. సుబ్బలక్ష్మికి ఎన్నడూ సినిమాలు చేయాలని లేదు. ఆవిడకు నటన రాదు. మీరా సినిమాలో పాటలు,భజనలు కావడం వల్ల,ఆవిడకు సరిగ్గా సరిపోయింది ఆ సినిమా. ఆ సినిమాల నుండి వచ్చిన డబ్బుతోనే కల్కి అనే వారపత్రికను స్థాపించాడు సదాశివం. మిత్రుడైన కృష్ణమూర్తి దానిని నడిపేవాడు. కల్కి భవనం అంతా కూడా సుబ్బలక్ష్మి డబ్బుతో ఏర్పడినవే. ఇవే కాకుండా సదాశివం చెప్పిన మేరకు ఓ సినిమాలో నారదుడిగా కూడా సుబ్బలక్ష్మి నటించింది. ఈ మూడే సుబ్బలక్ష్మి నటించిన సినిమాలు. ఆమెను ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వనివ్వలేదు సదాశివం. ఆమె బదులు అన్నీ సమాధానాలు ఆయనే ఇచ్చేవాడు.
సుబ్బలక్ష్మికి పాటలు మాత్రమే లోకం,ఆమెకు ఈ లోకంలోని మిగిలిన అంశాలు ఏవి పట్టవు. సదాశివం అహంకారం, తన మాటే నెగ్గాలన్న పట్టుదల, సుబ్బలక్ష్మిని ఎప్పుడు నియంత్రించే స్వభావం కలవాడు. తమిళ భాషోద్యమం జరుగుతున్న రోజుల్లో మద్రాస్ మ్యూజిక్ ఏకడమి వారు సుబ్బలక్ష్మిని పాడమని ఆహ్వానించినా తన పట్టుదల కోసం ఆమె చేత పాడించలేదు. అంతే కాదు సుబ్బలక్ష్మి ఏ కచేరీ చేసినా ఏది పాడాలో అది నిర్ణయించేది సదాశివమే. ప్రతి దానికి లాభం తూచి పని చేసే వాడు సదాశివం. అలాగే సుబ్బలక్ష్మి గారి చేత ఎన్నో లబ్ది కచేరీలు చేయించాడు. ఆసుపత్రుల కోసం, విద్యాలయాల కోసం, దేవాలయాల కోసం ఇలా లెక్కలేనన్ని లబ్ది కచేరీలు చేసింది సుబ్బలక్ష్మి. సదాశివం ఇంటికి వచ్చే బంధు మిత్రుల సంఖ్యకు లెక్క ఉండేది కాదు. సుబ్బలక్ష్మికి ఐక్యరాజ్యసమితిలో పాడే అవకాశం వచ్చింది. అంతే కాదు అమెరికా,యూరప్ దేశాలలో కూడా ఎన్నో కచేరీలు చేశారు. విదేశాల్లో అధికంగా కచేరీలు చేసిన వ్యక్తి సుబ్బలక్ష్మి గారు మాత్రమే.
ఇకపోతే సుబ్బలక్ష్మి గారి సంగీతం శుద్ధ కర్న్తక సంగీతం కాదనే వారు ఉన్నా, దానికి కారణం సదాశివం పాడిచ్చేవి తప్ప తనకు నచ్చినవి పాడే స్వేచ్చ ఆవిడకు లేకపోవడమే. లబ్ది కచేరీల ద్వారా ఆమె చేసిన సేవకు రామన్ మెగసెసే పురస్కారం కూడా వచ్చింది. అంతకు ముందే పద్మవిభూషన్ కూడా ఆమెను వరించింది. ఇన్ని పేరు ప్రఖ్యాతులు పొందిన ఆమె తన తల్లి మరణించే పరిస్థితుల్లో ఉన్నా మరణించాక కానీ వెళ్లలేకపోయింది. అలాగే అన్న మరణించాక కూడా వెళ్లలేకపోయింది. దానికి సదాశివం అనుమతించడు కనుక. అలా తన పుట్టింటికి శాశ్వతంగా దూరమైపోయింది.
కల్కి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం,ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడంతో సదాశివం ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బు ఇచ్చేసి చిన్న ఇంటికి మారిపోయారు. ఆవిడ పరిస్తితి తెలుసుకుని ఎందరో సాయం చేసే ప్రయత్నం చేసినా సదాశివం తిరస్కరించాడు. నెహ్రూ,ఇందిరా గాంధీ, రాజాజీ,మహాత్మా గాంధీ, ఇంకా ఎందరో గొప్ప వారికి ఆతిధ్యమిచ్చి, ఆత్మీయత పొందిన ఇల్లు అలా వారి చేతుల నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎక్కడ భార్య సంపాదన మీద బ్రతుకుతున్నాడని తనను అంటారో అని సదాశివం ఇకనుండి సుబ్బలక్ష్మి డబ్బు తీసుకోకుండా లబ్ది కచేరీలు మాత్రమే చేస్తుందని ప్రకటించాడు. ఆ తర్వాత కూడా ఆమెకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఆమె చేత అన్నామచర్య కృతులు పాడించారు తిరుమల దేవస్థానం వారు. అంతకు ముందు ఆమె చేత సుప్రభాతమ్ పాడించాలనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు దాటి ఆమె చేత పాడించాడు సదాశివం. మొత్తానికి పదిహేనేళ్లు అలా గడిపాక ఇంకో ఇల్లు కొనుక్కుని వెళ్లారు సదాశివం కుటుంబం.
సదాశివం పెద్ద కూతురు రాధ సుబ్బలక్ష్మి వారసత్వాన్ని అందుకుని సహకార గాయనిగా అన్నీ కచేరీల్లోనూ ఉండిపోయింది.ఆమె అనారోగ్యం కూడా ఆ దంపతులను క్రుంగదీసింది. ఆ తర్వాత సుబ్బలక్ష్మి గారి మీద డాక్యుమెంటరీలు ఎందరో తీద్దామని ప్రయత్నించినా సదాశివం అది జరుగనివ్వలేదు. భార్య విషయంలో ఇలా ఉన్నా, తనకు ఉన్నది, తన భార్య సంపాదించింది కూడా మొత్తం దానాలకే వినియోగించేవాడు. తన తొంభై ఐదవ ఏట మరణించాడు సదాశివం. ఆ తర్వాత సుబ్బలక్ష్మి గారికి భారతరత్న ప్రకటించారు. భర్త లేకపోవడం ఆమెను బాధించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె కూడా అనారోగ్యానికి గురై మరణించారు.
సుబ్బలక్ష్మి గారు జీవితంలో తన స్వేచ్చ హక్కులు, తన స్వతంత్ర వ్యక్తిత్వం గురించి ఆలోచించలేదు. తన పాట గురించి మాత్రమే ఆలోచించారు. పుట్టిల్లు దూరమైనా,తల్లి అయ్యే భాగ్యం లేకపోయినా, ఏ విషయంలోనూ స్వేచ్చ లేకపోయినా పాట మాత్రమే ఆమెను ముందుకు నడిపే శక్తిగా నిలిచింది. 73 ఏళ్ల వయసులో కూడా సంగీతంలో కొత్త రాగాలు నేర్చుకుని పాడారు. ప్రతి రోజూ మూడు గంటలు సాధన చేసేవారు. జీవితం-సౌఖ్యం-స్వేచ్చ వంటి వాటి కన్నా గాన కళే ఆవిడలో జ్యోతిలా ప్రజ్వరిల్లింది. స్పూర్తివంతమైన చరిత్ర. వినమ్రతకు నిదర్శనం ఆవిడ జీవితం. ఈ జీవిత కథను ఎంతో చక్కగా దాదాపు అన్నీ దశలు ఉండేలా చక్కగా రాశారు పల్లవి గారు. వారికి అభినందలు.
* * *

Comments
Post a Comment