చరిత్రలో విశిష్ట రాజు
చరిత్రలో విశిష్ట రాజు
భారతీయ ఆంగ్ల రచయితల్లో గంభీరమైన అంశాలతో ఎక్కువ మంది పాఠకులను ఆకర్షించిన రచయితల్లో అమిష్ త్రిపాఠి ఒకరు. ఆయన రామాచంద్రా సిరీస్,శివా ట్రయాలజీ గొప్ప ప్రేక్షకాదరణ పొందాక, చరిత్ర మర్చిపోలేని పాత్రలు దేశం కోసం పోరాడిన తీరును స్పష్టం చేస్తూ ఆయన కొత్తగా రాయడం మొదలుపెట్టిన సిరీస్ ఇమ్మోర్టల్ సిరీస్. ఇందులో వచ్చిన మొదటి పుస్తకమే ‘సుహెల్ దేవ్.’ చారిత్రక వాస్తవాల ఆధారంగా,కొంత కల్పనతో మహమ్మద్ ఘజని సమయంలో సుహేల్ దేవ్ వీరోచిత పాత్రను ఈ నవల స్పష్టం చేస్తుంది.
ఈ నవలలో కథ 1025 ఏ.డి లో ప్రారంభం అవుతుంది. ఆ సమయంలోనే మహమ్మద్ ఘజని సోమ్ నాథ్ లోని శివాలయాన్ని ధ్వంసం చేస్తాడు. దానిని అడ్డుకునే ప్రయత్నం చేసి శ్రీవాస్త రాజ్యపు రాజు పెద్ద కొడుకైన మల్లదేవుడు మరణిస్తాడు. అతని తమ్ముడే సుహేల్ దేవ్. అప్పటికే టర్క్ రాజ్యం నుండి మహమ్మద్ ఉత్తర భారత దేశంపై దండెత్తి,ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేసి,ఇక్కడ సంపదను అపహరించుకుని పోతూ ఉన్నాడు. ఉత్తర భారతదేశంలో బౌద్ధ మతాన్ని అవలంభించేవారు,అహింసను పాటించేవారు ఉండటం,రాజుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల మహమ్మద్ ఘజని ఆ ప్రాంతంలో రాజులను కూడా భయపెట్టగలిగాడు. నాటి భారత దేశంలో పూర్తి క్షత్రియులు కానీ వారు అయిన బిందుసారుడు,చంద్రగుప్తుడు,విక్రమాదిత్యుడు వంటి వారు కూడా రాజులయ్యారు. అలాంటి రాజ్య వంశమే సుహేల్ దేవుడిది కూడా. ఉత్తర భారత దేశంలో కనుజ్ రాజ్యపు రాజు అజిత్ పాల్ మహమ్మద్ ఘజనికి లొంగిపోయి,అతని కనుసన్నల్లో పాలిస్తున్నాడు.
మల్లదేవుడు మరణంతో తమ దేశపు సంస్కృతిని,నమ్మకాన్ని,ధైర్యాన్ని కూడా సంపదతో పాటు కొల్లగట్టడానికే మహమ్మద్ ఘజని తమ పవిత్ర ప్రదేశాలైన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నాడని ఎలా అయినా అతన్ని ఎదురించాలని నిర్ణయించుకుంటాడు. శ్రీవాస్తవ రాజ్యపు రాజు మరియు సుహేల్ దేవ్ తండ్రి అయిన మంగళధ్వజుడు అజిత్ పాల్ ను తనతో పాటు కలుపుకుని ఈ విదేశీ దాడులను అడ్డుకోవాలని అనుకున్నప్పటికి అప్పటికే ఘజనికి లొంగిపోవడము మరియు మంగళధ్వజుడు పూర్తి క్షత్రియుడు కాకపోవడం వల్ల అతన్ని రాజుగా కూడా ఒప్పుకోడు అజిత్ పాల్.
తన అన్నయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు భారత దేశాన్ని విదేశీ దాడుల నుండి రక్షించడానికి తండ్రి అనుమతితో రహస్య బందిపోటు వీరుడిగా మారతాడు సుహేల్ దేవ్. ఢిల్లీ రాజుగా ఉన్న మహిపాల్ తోమర్ ను హతమారుస్తాడు ఘజని. టర్కియులు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ నియమాలు పాటించరు. వారికి గెలుపు మాత్రమే ముఖ్యం. యుద్ధ నియమాలను అతిక్రమించి సూర్యాస్తమయం అయ్యాక భారతీయులు యుద్ధం చేయని సమయంలో అకస్మాత్తుగా దాడులు చేయడం, ఓడిపోయి వెనక్కి తిరిగినట్టు వెళ్ళినట్టే వెళ్ళి మరలా రహస్యంగా దాడులు చేయడం వంటివి క్రూరంగా చేయడం వారి లక్షణం.
ఉత్తర భారత దేశంలో సూఫీయులను,బౌద్ధ ఆశ్రమాలను వేటిని వదలకుండా ఘజని నాశనం చేస్తూ,అక్కడ ఉన్నవారిని హతమారుస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ సమయంలో సుహేల్ దేవ్ రహస్యంగా అడవుల్లో తనకు నమ్మకస్థులైన వారితో బృందంగా ఏర్పడి,ఘజని సైనికులు ఇక్కడ చేసే దాడులను తిప్పికొడుతూ ఉంటాడు. అలా అతని బృందంలోకి చేరిన వ్యక్తి అస్లాన్,గోవిందరావు,అబ్దుల్. ఘజని భారత దేశం పై చేసే దాడులను ఎంతో తెలివిగా చేశాడు. యుద్ధంలో సైనికులు ధరించే ఆర్మర్స్,అలాగే యుద్ధ పరికరాల్లో తోలు ముడి వస్తువు. అందుకని తోలు పని చేసే గ్రామం మొత్తాన్ని నాశనం చేస్తాడు.ఎన్నో దాడులతో ముందుకు సాగుతున్న ఘజనిని తన శక్తి మేరకు అడ్డుకుంటూనే ఉంటాడు సుహేల్ దేవ్. ఉత్తర భారత దేశపు రాజులందరూ ఘజనికి భయపడినా,ఆ రాజ్యపు ప్రజలు మాత్రం రహస్యంగా తమ సహకారాన్ని సుహేల్ దేవ్ కు అందిస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత ఘజని మలేరియాతో ఘజని ప్రాంతంలోనే మరణిస్తాడు. అతని మరణం తర్వాత అతని కొడుకుల మధ్య రాజ్యం కోసం ప్రచ్చన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందువల్ల తాత్కాలికంగా వారు భారత దేశాన్ని విడిచి పెట్టినా మరలా వస్తారని సుహేల్ దేవ్ గ్రహిస్తాడు. ఘజని మేనల్లుడు సలార్ మసూద్ ఘజని పెద్ద కొడుకుని రాజును చేసి,చిన్న కొడుకును ఆ రాజు కోసం హత్య చేస్తాడు. ఆ రాజుకు సైన్యాధికారిగా మారి భారత దేశాన్ని దోచుకోవడానికి సలార్ మసూద్ వచ్చినప్పటికి అతని మనసులో మాత్రం భారత దేశాన్ని పరిపాలించాలని ఉంది.
మంగళధ్వజుడు క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలోనే ఉత్తర భారత దేశంలో 21 రాజ్యాలను ఈ విదేశీ దాడిని ఆపడానికి ఐక్యం చేస్తాడు. ఆ తర్వాత అతను మరణించడం,సుహేల్ దేవ్ రాజవ్వడం జరుగుతుంది. దక్షిణ భారత దేశ రాజు రాజేంద్ర చోళుడు కూడా తన సైన్యాన్ని పంపడంతో ,అందరూ ఐక్యంగా ఉండటం వల్ల సలార్ మసూద్ ను సుహేల్ దేవ్ హతమారుస్తాడు.
ఇది ముఖ్య కథ. ఇందులో ఎంతో కల్పన కూడా జోడించబడి ఉంది. సలార్ మసూద్ కు ఓ కవల తమ్ముడు ఉండటం,అతను కూడా సలార్ మసూద్ లానే చూడటానికి ఉండటం,అతను సుహేల్ దేవ్ తో కలిసి ఉండటం,అతన్ని చివరి వరకు పాఠకులు సలార్ మసూద్ గానే భావించడం జరుగుతుంది. కానీ అతను కూడా చివరకు భారత దేశాన్ని కాపాడే ప్రయత్నంలో అన్న చేతిలోనే మరణిస్తాడు.
ముస్లిం సంస్కృతిలో మరణించాక కాలిస్తే స్వర్గానికి వెల్లరనే నమ్మకం ఉంది. సుహేల్ దేవ్ ఆ యుద్ధంలో మరణించిన టర్కియులును అందరినీ కాలుస్తాడు. దాని ద్వారా ప్రపంచంలో మరలా భారత దేశాన్ని దాడి చేయాలనే ఆలోచన రాదు అని భావిస్తాడు. శత్రువు మన నమ్మకాలను మన బలహీనతలుగా మార్చి మనతో పోరాడితే మనము అదే చేయాలని భావించాడు సుహేల్ దేవ్.
అమిష్ ఈ నవలలో నాటి పరిస్థితులను,ఐక్యత లోపించటానికి ఉన్న కారణాలను,రాజుల మనస్తత్వాలను,సమానత్వం లేని సమాజంలో బలహీనపడే దేశ ఆత్మను కూడా ఎంతో చక్కగా నవలికరించారు. మొత్తానికి ఇది అమిష్ ముద్ర ఉన్న నవల కనుక చదవాల్సిందే.
* * *

Comments
Post a Comment