కథ మరచిన రచయిత!

                                                      కథ మరచిన రచయిత!

                                                                      -శృంగవరపు రచన

                                                  


        చరిత్రలో అమరులైన వీరులందరి గురించి కాకపోయినా ప్రధాన పాత్ర పోషించిన వారి గురించి అయినా నేడు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విప్లవ పోరాటంలో వడ్డే ఓబన్న గారి పాత్ర కూడా ప్రముఖమైనదే. ఓబన్న గారి పేరు మీద ఏర్పాటైన విగ్రహాలు ఆ తర్వాత ఆయన వంశీయులను 75 వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆహ్వానించడం, ఆయన పాత్ర ప్రముఖమైనది అన్న అంశాన్ని  నాలుగవ తరగతి ఉపవాచకంలో మన మహనీయులు లో ప్రస్తావించడం కూడా ఈ వీరుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. సమాజంలో మామూలు మనుషులకు కూడా ఓబన్న వంటి వారి గురించి అవగాహన ఏర్పడుతూ ఉంటే, చారిత్రక రచయిత యస్.డి.వి.అజీజ్ గారు రచించిన ఓబన్న క్రీస్తు శకం 1846 లో బ్రిటీష్ వారిని ఎదిరించిన ధీశాలి వడ్డే ఓబన్న గాథ పుస్తకంలో మాత్రం ఓబన్న గారి పాత్రకు అన్యాయం చేసినట్టు అనిపించక మానదు.

       ఈ పుస్తకం ఒక చారిత్రక నవల. చరిత్రలో అందరికి కొంత అవగాహన మాత్రమే ఉన్న పాత్రల గురించి పరిశోధించి ఆ వ్యక్తుల చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యక్తులు ప్రవర్తించిన తీరు, అది చరిత్రను ప్రభావితం చేసిన తీరు గురించి, ముఖ్యంగా కథ ఎవరి చుట్టూ అల్లబడిందో ఆ వ్యక్తి పూర్వ పరిస్థితులు, ఆ వ్యక్తి ప్రధాన పాత్ర పొషించే క్రమంలో ఆ వ్యక్తి ఆలోచనల్లో వచ్చిన మార్పులు, అందుకు దోహదం చేసిన స్థితిగతులు వంటివి తెలియజేయడం వ్యక్తి కేంద్రంగా రాయబడిన చారిత్రక నవలల ప్రధాన బాధ్యత. కానీ ఈ నవలలో ఆయన సాధారణ పాత్రగా మాత్రమే కనబడటం, నరసింహారెడ్డి గారి విప్లవం కథ లానే రాయబడటం, ఇందులో ఓబన్న పాత్ర నామమాత్రంగానే ఉండటం వల్ల ఓబన్న వ్యక్తిత్వం ఏర్పడిన క్రమం ఈ నవలలో ఎక్కడా ధృఢంగా కనిపించదు. కులాంతర వివాహాలు ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన, ఓ పద్యాన్ని ఓబన్న దూరం నుండి వింటూనే పెద్ద అయ్యాక ఆశువుగా చెప్పడం, నరసింహారెడ్డి కొడుకు తప్పిపోయినప్పుడు ఆ బిడ్డ కాకతాళీయంగా కనబడటంతో ఆ బిడ్డను నరసింహారెడ్డి దగ్గరకు చేర్చడం, తన మిత్రులతో కలిసి గడపటం వంటి ఘటనలకే ఓబన్న పరిమితం కావడం వల్ల ఈ నవలలో ఓబన్న పాత్ర చిత్రణలో రచయిత తగిన శ్రద్ధ తీసుకోలేదనే అనిపిస్తుంది. నవలలో ఇప్పటికే అనేక రచనల్లో వచ్చేసిన చరిత్రను చెప్పడం కూడా కొంత మూస రచనా అనే భావనను కలుగజేస్తుంది. ఓబన్న గురించి రేనాటి వీరుడులో  ఉన్న అంశాలు ఇందులో కనిపించకపోవడం, ఓబన్న గురించి, అతను పెరిగిన వాతావరణం, అతని పూర్వీకులు, వారు గ్రామ అధికారులుగా మారిన క్రమం గురించి ఏ వివరాలు ఈ రచనలో లేవు కనుక ఓబన్న పాత్ర ప్రాధాన్యత లోపించి, కేవలం చిన్న చిన్న ఘటనలకే పరిమితమైనట్టు అనిపిస్తుంది. సైన్యాధ్యక్షుడిగా ఓబన్న సైన్యాన్ని సమీకరించడం కూడా ఈ నవలలో లేదు. నరసింహారెడ్డి చుట్టూ ఉన్న నవలలానే అనిపిస్తుంది. రచయిత ఏ మాత్రం పరిశోధన చేయకుండా  కేవలం ఇప్పటికే సాహిత్యంలో వచ్చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథనే నాటకీయంగా మరలా రాసిన భావన కలుగుతుంది. అలాగే ఓబన్న నాయకత్వ లక్షణాలను బలపరిచే ఘటనల కన్నా ఆయనను కేవలం సేవకుడిగా మాత్రమే చూపించడం వల్ల పాఠకులలో ఆయన చేసిన పనులు ఏమి నవలలో కనిపించకపోవడం వల్ల కలిగే వెలితి స్పష్టంగా కనిపిస్తుంది.

       సైరా సినిమాలో ఓబన్న పాత్రను ఎలా నాటకీయంగా చూపించారో అదే నాటకీయత తప్ప ఓబన్న సైన్యాన్ని సమీకరించడానికి పడిన కష్టం, అతను బహుజనులను ఒప్పించి వారిని ఏకం చేసిన తీరు ఈ నవలలో లేదు.ప్రతి పని నరసింహారెడ్డి వల్లే జరిగింది అని చెప్పడం వల్ల ఓబన్న పేరుతో ఈ నవల రాయడానికి ఉన్న ప్రయోజనం శూన్యం అనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవ వీరుడే అయినా, ఆయన భరణ సమస్య వల్ల వ్యక్తిగతంగా మొదలైన ఈ పోరాటంలో ప్రజల పాత్ర, అనుచరులైన ఓబన్న పాత్రను చిత్రించడంలో ఏర్పడ్డ ఖాళీలు ఈ నవలకు పఠనీయతను కూడా తగ్గిస్తాయి. భవిష్యత్తులో అయినా ఓబన్న గారి గురించి మంచి పుస్తకం రావాలని కోరుకుందాము.

  *         *       *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!