అనుమానించబడిన మనిషి కథ

 అనుమానించబడిన మనిషి కథ

-శృంగవరపు రచన


సగటు మనిషికి చాలా సార్లు తమ లక్షణాలే శత్రువులుగా మారతాయి. అందులో ఒకటి ధైర్యం లేకపోవడం,ఇంకొకటి ఒక సమస్య నుండి బయటపడాలనుకుని ఇంకో సమస్యలోకి దిగబడటం ముఖ్యమైనవి. వైవాహిక వ్యవస్థలో భార్యాభర్తలకు ఉండే స్వేచ్చ చాలావరకు ఆ ఇద్దరి ఆలోచనా పరిధిలో ఉన్న అర్ధం చేసుకునే తత్వం వరకే విస్తరిస్తుంది. ఓ అనుమానం కొన్ని జీవితాలను ఎలా నాశనం చేసిందో,వైవాహిక వ్యవస్థలో కొన్ని సార్లు పిరికితనం ఎలా తప్పు చేయడానికి పర్యాయ పదంగా పరిగణించబడే పరిస్థితుల్లో మనుషుల జీవితాలు ఎలా తారుమారు అయిపోతాయో,ఎలా నాశనం అవుతాయో స్పష్టం చేసే నవలే పాలకోడేటి సత్యనారాయణరావు గారి నవల ‘కొత్త తాళి.’
ఈ నవలలో ముఖ్య పాత్రలు మురళి,విజయ,సుజాత,రమణారావు. మురళి,విజయకు వివాహమవుతుంది. ఆ పెళ్లి అయ్యాక ఓ హస్తసాముద్రికుడు మురళి చెయ్యి చూసి అప్పటికే అతని జీవితంలో ఇంకో స్త్రీ ఉందని,ఒకవేళ లేకపోయినా భార్యతో ఉండే సంబంధం ఆమెతో కూడా ఉంటుందని చెప్తాడు. మనిషి ఏ విషయం ఎందుకు నమ్ముతాడో ఆ మనిషికి తప్ప ఎవరికి అర్ధం కాదు. ఒకవేళ కోటి రూపాయలు లాటరీ తగులుతుందని చెప్తే నమ్మని మనిషి ముఖ్యంగా భార్యాభర్తలు మాత్రం ఇలా ఇంకొకరు తమ భాగస్వామి ఉంది అనే ఆలోచన వస్తే దానిని బలపరిచే అంశానికి హేతువు లేకపోయినా దానినే నమ్మడానికి ఇష్టపడతారు. అలాగే విజయ ఆ హస్తసాముద్రికుడు చెప్పింది గట్టిగా నమ్మింది. అంతకు ముందు ఝాన్సీ అనే స్త్రీను మురళి ఇష్టపడిన మాట నిజమే,కానీ వారిద్దరూ స్నేహితులుగానే విడిపోయారు. ఆ విషయం అప్పటికే విజయకు చెప్పి ఉండటం వల్ల ఇప్పటికీ అతనికి ఆమెకు సంబంధం ఉందని ఆమె గట్టిగా నమ్ముతూ భర్తకు దూరంగా ఉంది. ఒకే ఇంట్లో ఆ భార్యాభర్తలు అలా దూరమయ్యారు. మురళి ఎంత చెప్పినా ఆమె నమ్మేది కాదు.
ఆ సమయంలోనే మురళి తనతో పాటు ఆఫీసులో పనే చేసే సుజాతకు దగ్గరవుతాడు.సుజాతకు అప్పటికే వివాహమైంది. ఆమె భర్త రమణారావు బ్యాంకులో పని చేసేవాడు. కానీ బ్యాంకులో కొంత డబ్బు పోవడం ఆ నేరం అతని మీద పడటంతో అతను పారిపోయాడు. అలా వెళ్ళి అప్పటికే ఆరేళ్ళు అయిపోయింది.ఇక భర్త రాడనే నిర్ణయించుకుని ఆమె మురళికి దగ్గర అయ్యింది. మురళి అవివాహితుడని ఆమె భావించింది.మురళి కూడా నిజం చెప్పలేదు. అప్పటికే భార్యతో ఉన్న ఘర్షణ వల్ల ఏదో ఆలంబనగా మురళి ఆమెకు దగ్గరయినా ఆమె గర్భవతి అవుతుంది.
ఇంట్లో ఘర్షణగా ఉండటం వల్ల సుజాత దగ్గరే దాదాపుగా ఉండిపోతూ ఇంటికి వెళ్ళడం మానేశాడు మురళి. మొదట్లోనే తనను పెళ్లి చేసుకోమని సుజాత అడిగినప్పుడు ఆమెకు విడాకులు వచ్చాక చేసుకుంటానని చెప్పి అప్పటికి ఆ పరిస్థితిని దాటవేశాడు మురళి. ఆఫీసుకు ఆర్నెల్లు సెలవు పెట్టి ఓ బాబును కంటుంది సుజాత. కానీ తన బిడ్డను ఎవరికి పరిచయం చేయలేని పరిస్థితి ఆమెది. అదే సమయంలో ఓ స్నేహితురాలి వల్ల అప్పటికే మురళికి వివాహమైందని ఆమెకు తెలుస్తుంది. కానీ అది అడిగితే మురళి పూర్తిగా దూరం అయిపోతాడని భయపడి ఆ విషయం గురించి అతన్ని అడగదు.
బ్యాంకులో దొంగతనం చేసిన దొంగ దొరకడంతో రమణారావు సుజాతకు తాను తిరిగి వస్తున్నానని ఉత్తరం రాస్తాడు. మురళికి చెప్తుంది సుజాత.అతను వచ్చాక విడాకులు అడుగుతానని అతన్ని మోసం చేయలేనని చెప్తుంది. అది జరిగితే తాను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అతను భావిస్తాడు. అప్పటికే విజయ అతని జీవితం నుండి వెళ్లిపోతున్నానని ఉత్తరం రాసి వెళ్లిపోయింది.అయినా సుజాతను పెళ్లి చేసుకోవాలంటే అతనికి భయం. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం.
ఆ రోజుకు బాబును తన దగ్గర ఉంచుకుంటానని భర్త మూడ్ ని బట్టి అతనికి చెప్పమని బాబును ముందే చూస్తే ప్రమాదమని చెప్పి బాబును తన దగ్గర ఉంచుకుంటాడు మురళి. రమణారావుకు జరిగింది చెప్పకుండా విడాకులు అడుగుతుంది సుజాత. మర్నాడు మురళి రమణారావును కలిసి సుజాత ప్రేమించిన వ్యక్తికి అప్పటికే వివాహం అయ్యిందని ఒకవేళ సుజాత అతని కోసం భర్తను వదులుకుంటే ఆమె జీవితం నాశనం అవుతుందని చెప్తాడు. ఇంటికి వచ్చాక సుజాత జరిగింది అంతా భర్తకు చెప్తుంది. బాబును తీసుకురావడానికి మురళి ఇంటికి వెళ్తారు ఆ దంపతులు. వారు రావడం గమనించిన మురళి విషం తాగుతాడు. సుజాత భర్తతో కలిసినా మురళి మరణిస్తాడు.
మురళిలో పిరికితనం, తనను ఎవరైనా గట్టిగా ఏదైనా అంటే అది అబద్ధమైనా గట్టిగా చెప్పలేని తనం, సమస్య నుండి పారిపోవడం, ఆ పారిపోతున్న క్రమంలో తనను తాను కోల్పోతూ,తన జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండానే ఏదో మార్గంలో వెళ్తూ, మార్గంలో స్పష్టత ఏర్పడుతున్న కొద్దీ ఆ మార్గం తప్పెమో అన్న భయం,ఆ తప్పును సమాజం ఎలా చూస్తుందో అన్న అనుమానం...మొత్తం మీద తనదంటూ లేని ఓ వ్యక్తిత్వం వల్ల తనను నమ్మిన ఏ స్త్రీకి నమ్మకాన్ని,ధైర్యనని ఇవ్వలేని వ్యక్తిగా మరణించాడు మురళి.
ఇదే కథను ఇంకో కోణంలో చూస్తే మనిషిని అనుమానిస్తే, మనిషి మీద నమ్మకం కోల్పోయినట్టు వ్యవహరిస్తే ఆ మనిషి ఆ అనుమానం వల్ల ఇంకా అనుమానం నిజం చేసుకోవాలనే బలహీనతకు ఆ అనుమానాన్ని బలంగా చేసుకుంటాడు.ఈ ప్రపంచంలో నమ్మకం,ప్రేమ గొప్ప భావబలాలు. అవి లోపించిన మనిషి వ్యక్తిత్వం ఎలా బలహీనపడి ఎలా ఓ వ్యక్తిత్వం లేని మనిషిగా రూపాంతారం చెందుతాడో స్పష్టం చేసే నవల.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!