జీవితం విలువ
జీవితం విలువ
కుటుంబ జీవితంలో పిల్లల పాత్రే ముఖ్యమైనది అధిక శాతం కుటుంబాల్లో. పిల్లల వల్ల వృద్ధాప్యానికి ఒక భరోసా,జీవితంలో ఆధారపడే దశలో ఆధారపడటానికి ఉండేవాళ్ళగాను భావిస్తూ ఎంతోమంది తల్లిదండ్రులు వారి జీవన విధానానికి అనుగుణంగా తర్వాత మారే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భూతల స్వర్గంగా భావించబడే అమెరికాలో స్థిరపడిన తల్లిదండ్రుల కష్టాలను డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావుగారు తన ‘సంజె వెలుగు’ నవలలో స్పష్టం చేశారు.
ఈ నవలలో ముఖ్య పాత్ర చలం. చలం భార్య అనసూయతో కలిసి కొడుకైన వినోద్ దగ్గర ఉండటానికి ఆర్నెల్ల కోసం ఆమెరికా వెళ్తాడు. భారత దేశంలో స్వాతంత్ర్యంగా గడిపిన చలంకి,అనసూయకు అక్కడ ఉండటం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది.అక్కడి వాతావరణం,ఏదైనా వైద్య పరమైన సమస్య వస్తే అక్కడ అయ్యే ఖర్చులు,అలాగే అక్కడ కొడుకు తన జీవితంలో మునిగిపోయి తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం,వినోద్ భార్య సునంద కేవలం వంటపనికి అనసూయను వినియోగించుకోవడం వంటివి ఆ దంపతులను బాధ పెడతాయి.
చలం అమెరికాలో స్థిరపడిన తన మిత్రుడైన రాఘవ ఆహ్వానిస్తే అక్కడికి భార్యతో కలిసి వెళ్తాడు. రాఘవ భార్య చనిపోయిన విషయం అప్పుడే వారికి తెలుస్తుంది. రాఘవ ఆ ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి తన ఆఫీసుకే ఎప్పుడు పరిమితమవుతాడు. రాఘవ ఇంటికి వారితో పాటు కలిసి చదువుకున్న మిత్రులైన రామారావు,కిరణ్ కుమార్ లను కలుస్తాడు. కొడుకు దగ్గర ఉండిపోదామని భారత దేశంలో ఆస్తులన్నీ అమ్ముకుని వచ్చి భార్యతో సహా కొడుకు దగ్గర అమెరికాలో స్థిరపడ్డాడు రామారావు. అతనికి గ్రీన్ కార్డ్ కూడా వచ్చింది.కానీ ఇక్కడి పరిస్థితుల్లో బ్రతకలేకపోతున్నాడు.మేనేజర్ గా రిటైర్ అయిన అతను కొడుకు ఇంట్లో ఆ గౌరవం దక్కకపోవడం వల్ల,ఎవరిని ఇంటికి ఆహ్వానించే స్వేచ్చ కూడా లేకపోవడం వల్ల,తమకు ఏదైనా అనారోగ్యం వస్తే తమ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న బెంగ వల్ల అతను అక్కడ మామూలుగా ఉండలేకపోతున్నాడు.ఇకపోతే కిరణ్ కుమార్ కు ఒక్క కూతురు.ఆ కూతురు దగ్గర కొన్నాళ్లు ఉండి మరలా భారతదేశానికి తిరిగి వస్తాడు అతను. కొంతమేరకు అతనికి స్వేచ్చ ఉంది.
రాఘవ కొడుకు రాఘవ ఆఫీసులో పని చేసే కరుణను ఇష్టపడుతున్నాడు. కరుణకు భారతదేశంలో ఉన్నప్పుడూ వివాహమైంది.ఆమె భర్త ఆమెను కట్నం కోసం వేధించడం,అతని మీద ఆమె కేసు వేసి,అమెరికాలో తన ఏడేళ్ళ కూతురితో ఉద్యోగంలో స్థిరపడటం జరిగింది.ఆమె భర్త వైపు వారు ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా చివరకు ఆమె రాఘవ కొడుకును వివాహం చేసుకోవడంతో వారి కథ సుఖాంతమయింది.
చలం కూడా ఉండలేక ముందే టికెట్ మార్పించుకుని ఇండియాకు రావడంతో నవల ముగుస్తుంది. అమెరికాలో పిల్లలకు పిల్లలు పుడితే చాకిరీ చేయడానికో,ఇంట్లో పనులకో వెళ్ళే వారు దాదాపు అందరూ తల్లిదండ్రులు.ఎక్కడో కొందరు ప్రేమల వారధిగా వెళ్తారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత చలం ప్రవర్తనలో మార్పు వస్తుంది. భార్యతో సన్నిహితంగా గడపటం,తనకు సంతోషాన్ని ఇచ్చేవి చేయడం,స్నేహితులతో మెయిల్స్ ద్వారా అనుబంధం స్తిరపరచుకోవడం వంటివి కొనసాగిస్తాడు.
ప్రతి మనిషి వృద్దాప్యంలో తనకు ఎవరు ఉండరన్న భయంతో పిల్లలని నమ్మి వారికి అన్ని అప్పగించి నిస్సహాయంగా మిగిలిపోయే పరిస్థితులు ఎన్నో. మనిషి తన జీవితంలో ఆ సమయంలో డబ్బుకు ఉండే ప్రాధాన్యతను గుర్తుంచుకుని తన జీవితం మీద తనకే అధికారం ఉండేలా చూసుకోవాలి,జాగ్రత్త పడాలి.లేకపోతే డబ్బు ఉన్నా దానిని పోగొట్టుకుని చివరకు ఏది లేని వారిగా మారిపోయి జీవితాన్ని శాపంగా భావించే దశకు చేరుకుంటారు.
* * *

Comments
Post a Comment