అలవాటుపడిపోయినతనం
అలవాటుపడిపోయినతనం
భారతీయ ఆంగ్ల రచయిత్రి అనితా దేశాయ్ రచనల్లో ప్రాంత వాతావరణ చిత్రీకరణ,పాత్రల మనసులను,పరిస్థితుల ప్రభావం,సమకాలీన సమాజ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అటువంటి రచనల్లో ఒకటి ‘The Village by the sea’.’ పేదరికం,కష్టాలు,తప్పించుకులేని మార్పుల మధ్య ఓ కుటుంబం మనుగడ కోసం చేసిన యుద్ధమే ఈ నవలే. బాంబేకి 14 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ భారత దేశంలో ఉన్న తుళు గ్రామంలో నివసించే ఓ కుటుంబ కథే ఈ నవల.
ఈ కుటుంబంలో పెద్ద కూతురు లైలా.ఆమె వయసు 13 సంవత్సరాలు. ఆమె తర్వాత కొడుకు హరి,పన్నెండేళ్ళ వయసు. ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు బేలా,కమల్. వారి తల్లి అనారోగ్యంతో పడకకే పరిమితమైతే, తండ్రి తాగుబోతు. ఇంటి పరిస్థితుల రీత్యా లైలా,హరి చదువు మానేస్తారు.తుళు గ్రామంలో ఎక్కువమంది జాలరులు. మిగిలిన వారు రైతులు. కానీ అటు జాలరిగాను కాకుండా,రైతుగాను కాకుండా ఉండిపోయిన కుటుంబం లైలాది. తాగుబోతు తండ్రి రోజూ తాగుతూ ఉండటం, ఇంట్లో గడవలేని పరిస్థితులు ఉండటంలో ఎలా కుటుంబం గడుస్తుందా అన్న బెంగతో ఉన్నారు లైలా,హరి.
జీవితం పెద్ద ఆశలు,జీవితం నుండి ఎక్కువ ఆశించడం వంటివి లేని కుటుంబం వారిది. ఆ సమయంలోనే ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలు కట్టే ప్రయత్నాలు మొదలవుతాయి. ఓ పక్క అక్కడ ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయన్నా ఆశలు, ఇంకో పక్కా ఆ పనులు చేయడానికి పట్టణం నుండే ఉద్యోగులను తీసుకువస్తారేమోనన్న భయం. వీటి మధ్య అభద్రతతో ఊగే జీవితాలు ఆ ఊరిలో వారివి. ఆ ఫ్యాక్టరీల కోసం అక్కడ ఉన్న భూములు తీసుకునే ప్రయత్నం జరగబోతుంది.
ఆ గ్రామంలో బాంబే లో ఉంటున్న సిల్వాస్ కుటుంబం అక్కడ హాలిడేకు వస్తూ ఉంటారు. ఆ కుటుంబం కు హరి,లైలా,వారి చెల్లెళ్ళు కావల్సిన పనులు చూస్తూ కొంత సంపాదించుకుంటూ ఉంటారు. వారు ఎప్పుడో ఓ సారి రావడం వల్ల దాని వల్ల స్థిర ఆదాయం ఉండదు. తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యం,పేదరికం మధ్య ఈ జీవితం నుండి తప్పించుకోవడానికి బాంబే వెళ్తాడు హరి. అక్కడ ఓ హోటల్ లో పని చేస్తూ,పక్కన ఉన్న గడియారాల షాపులో వాటిని బాగు చేయడం కూడా నేర్చుకుంటాడు. ఇంటికి తిరిగి వెళ్లడానికి డబ్బు దాచుకుంటూ ఉంటాడు. ఇంటికి ఉత్తరం రాస్తాడు తాను బాంబే లో ఉన్నానని.
ఇక కుటుంబం మొత్తం చూసుకోవాల్సిన భారం లైలా మీద పడుతుంది. సెల్వాస్ కుటుంబం అక్కడికి వచ్చినప్పుడు ఆ పనులు అన్నీ లైలా చెల్లెళ్లతో కలిసి చేస్తూ ఉంటుంది. వారి సాయంతో తల్లిని హాస్పటల్ లో చేర్పిస్తుంది. అప్పటి వరకు బాధ్యతారాహిత్యంగా ఉన్న తండ్రి తల్లి హాస్పటల్ లో ఉందని తెలిసినప్పుడు పూర్తిగా మారిపోతాడు. తాగుడు మానేసి,హాస్పటల్ లో ఆమెను చూసుకుంటూ ఉండిపోతాడు. సెల్వాస్ కుటుంబం తాము వెళ్లిపోయాక కూడా ఇంకొకరు అక్కడ ఉండటానికి వస్తారని,అతని బాగోగులు కూడా చూసుకొమ్మని,కొంత జీతం నెలా నెలా ఇవ్వబడుతుందని చెప్పి,ఆ ఏర్పాటు కూడా చూస్తారు. అలా లైలా తన కుటుంబాన్ని నెట్టుకురాగలుగుతుంది.
లైలా తల్లి ఆరోగ్యం బాగవ్వడం, హరి ఇంటికి తిరిగి రావడం జరుగుతుంది. ఇంటికి డబ్బుతో వచ్చిన హరి ఓ పౌల్ట్రీ ఫార్మ్ పెట్టాలని అనుకుంటాడు. అలా ఆ కుటుంబం తమకున్న పరిస్థితులతో రాజీ పడుతూ,సర్దుకుంటూ,కొంత మేరకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ఓ జీవన మార్గాన్ని ఏర్పరచుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.
అందరిలా బ్రతికే అవకాశం లేని పరిస్థితుల్లో,ఆసరా ఇచ్చే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేనప్పుడు,మార్పుకు తగ్గట్టు మారే ధైర్యం అప్పటి వరకు లేకున్నా, జీవిత గమనంలో మార్పుకు సిద్ధమయిన ఈ కుటుంబం జీవితంలో మారాల్సిన అవసరాన్ని బ్రతకలేని పరిస్థితుల్లోనే సృష్టిస్తుందని స్పష్టం చేస్తుంది. ఈ నవలలో తుళు గ్రామ వాతావరణం,ప్రజల జీవితాల్లో గ్రామ వాతావరణ నేపథ్యం చదువరులకు ఆ ప్రదేశం నుండి కథను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ నవలకు గార్డియన్ చిల్డ్రన్ ఫిక్షన్ పురస్కారం దక్కింది.
సాంకేతికత-ప్రగతి ప్రభావాలు ప్రాంత సంస్కృతి,మనుషుల అలవాట్లపై ఎలా ప్రభావం చూపిస్తాయో ఈ నవల స్పష్టం చేస్తుంది. అలవాటు పడి పోయిన జీవితం నుండి బయట పడటం జీవితంలో అన్నింటికన్నా కష్టమైన అంశం. ఈ అలవాటుపడిపోవతంలోనే మార్పును వ్యతిరేకించే స్వభావం మనిషిలో అలవడుతుంది. ఆ వ్యతిరేకతలోనే మనిషికి మనుగడ సమస్యగా మారిపోతుంది. ఆ సమస్యకు పరిష్కారం మనిషి ఎప్పటికప్పుడూ అలవాట్లను జీవిత గమనానికి తగ్గట్టు మార్చుకోవడం వల్లే సాధ్యమవుతుంది.
* * *

Comments
Post a Comment