మానవ బలహీనతల స్వరూపం
మానవ బలహీనతల స్వరూపం
మార్పు సమగ్రంగా విస్తరించడమే ప్రగతికి మూలం. ఆ మార్పు మనుషుల్లో, ఆలోచనల్లో, అక్షరాల్లో అనేక విధాలుగా స్పష్టమవుతుంది. మార్పుతో మారే వారు మాత్రమే మారిన స్వరూపంలో తమ ఉనికిని నిలుపుకోగలరు. అటువంటి మార్పుకి తన రచనల్లో ప్రాధాన్యత ఇచ్చిన రచయిత శ్రీధరగారు.
1960 ల్లో రచనావ్యాసంగంలో అడుగు పెట్టిన ఆయన ప్రథమంగా రాసిన నవలలు నీరజ, రాగవిపంచి వంటి వాటిల్లో నాటి మనుషుల ఆలోచనలు మనస్తత్వాలు ప్రతిఫలిస్తే ఆ తర్వాత ఆయన రాసిన నేటి రచనల్లో నేటి సమాజపు గమనం అనేక కోణాల్లో కనిపిస్తుంది. ఆ మార్పుల ప్రాధాన్యతలో మనుషుల మనస్సులో దాగి ఉండే అనేక భావోద్వేగాలను కాలంతో పాటు మారిన క్రమంలో ఉన్న యాదృచ్చికతను, అలాగే కొంత శాతం ప్రణాళిక పరంగా ఉండే శైలులు మారిపోయే తీరును స్పష్టం చేసే శ్రీధర గారి కథా సంపుటి 'చినుకుల్లో చిరుమంటలు.'
ఈ కథాసంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. మొదటికథ 'లైఫ్ టైం అచీవ్ మెంట్.' ఈ కథలో మనిషి ఏది సాధిస్తే వాస్తవంగా తనకు తృప్తి కలుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏదో ఒకటి చేస్తూ జీవితాన్ని గడిపే క్రమాన్ని స్పష్టం చేసారు.పరిమళ అమెరికాలో వివాహమయ్యాక స్థిరపడింది. ఆమెకు ఓ కూతురు బేబీ. భర్త మరణించడంతో ఆమె ఉద్యోగం చేస్తూ ఆర్ధికంగా నిలదొక్కుకుంది. కానీ అమెరికన్ మనస్తత్వంతో పెరుగుతున్న కూతురు యవ్వనంలో పురుషులతో చనువుగా ఉండటం భారత దేశంలో పాతిక ఏళ్ళు పుట్టిపెరిగిన పరిమళకు నచ్చడం లేదు. తల్లిదండ్రులు మరణించినా భారతదేశంలో ఉన్న స్వంతఇల్లును అద్దెకు ఇచ్చినా త్యాగరాజు కోసం అప్పుడప్పుడు ఇండియా వచ్చేది పరిమళ. పరిమళ చదువుకునే సమయంలో జ్యోతి ఆమెకు స్నేహితురాలు. ఆమె బావ త్యాగరాజు. చదువు మీద అతనికి ఆసక్తి లేదు. జ్యోతిని ఆటపట్టించడానికి త్యాగరాజు సర్టిఫికెట్లు ఉన్న కవర్ పరిమళ దాయడంతో అతని చదువు ఆగిపోతుంది. చదువు మీద శ్రద్ధ లేని అతనితో కాకుండా వేరే వ్యక్తితో జ్యోతి వివాహం జరుగుతుంది. త్యాగరాజుకు నాటకాల మీద ఆసక్తి ఉండటంతో అతను అందులోనే ఉండిపోయినా అతనికి ఆర్ధిక నిలకడ లేదు.పరిమళను ప్రేమించిన్నా అతను బాహటంగా చెప్పకపోయినా అది ఆమె గ్రహించింది. తన వల్లనే అతని చదువు ఆగిపోయి జ్యోతితో వివాహం కాలేదని, జీవితం పాడయిపోయిందనే బాధతో ఆమె అతనికి ఓ బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసి కొంత ఆర్ధిక స్థిరత్వం ఏర్పాటు చేసింది.అతనికి ఆ తర్వాత అమెరికాలో గుర్తింపు వచ్చేలా చేసింది. బేబీ పాత బాయ్ ఫ్రెండ్ కొత్త బాయ్ ఫ్రెండ్ మీద దాడి చేయడం కేసు అవ్వడం జరిగుతుంది. ఆ సమస్యను త్యాగరాజు తీరుస్తాడు. మనిషి ఎక్కడ పుట్టినా, ఆర్ధికంగా స్థిరపడినా, పడకపోయినా ఆస్తులు ఉన్నా లేకపోయినా ఏదో కోల్పోయిన భావన మిగిలి ఉండటం సహజమని లైఫ్ టైం అచీవ్ మెంట్' అంటే ఓ అస్పష్టమైన అంశమని అనుకుంటుంది పరిమళ.
రెండో కథ 'అవునా...?' ఈ కథలో మనిషి యవ్వనంలో ఉన్నపుడు అనుకునే ఆలోచనలు జీవితంలో ఎలా తలక్రిందులు అవుతాయో రచయిత చెప్పే ప్రయత్నం చేసారు.ఈ కథలో రెండు ముఖ్య పాత్రలు శ్రావ్య, చంద్రిక. చంద్రిక ఓ ధనవంతుడిని పెళ్ళాడి ఆ తర్వాత అతని నుండి విడాకులు తీసుకుని అతని ఆస్తి తీసుకుంటానని శ్రావ్యతో అంటూ ఉండేది. మంచి వ్యక్తితో జీవితం చివరి వరకు ఉండాలని అనుకునేది శ్రావ్య. ఓ పార్టీలో పరిచయమైన రాజకీయ కుటుంబానికి చెందిన అర్జున్ ని ప్రేమించి వివాహం చేసుకుంటుంది చంద్రిక. చంద్రిక ఏది చెప్పినా అర్జున్ కాదనే వాడు కాదు. ఆమె చెప్పిందే జరిగిపోయేది. ఆమె పిల్లలను కనకపోయినా ఏమి అనలేదు అర్జున్. అంతా తన ఇష్ట ప్రకారమే జరగడం వల్ల విడాకుల అవసరం పడలేదు చంద్రికకు. కని అర్జున్ కి యాక్సిడెంట్ అవ్వడంతో వ్యాపారం చూసుకునే వాళ్ళు లేక నష్టాల్లో పడటం వల్ల అవిటి భర్తతో, భర్తను ప్రేమించలేని తనం గురించి చంద్రిక బాధ పడుతుంటే, వివాహం అయ్యాక శ్రావ్య భర్త చివరి దశలో ఇంకో స్త్రీ కోసం శ్రావ్యను వదిలివెయ్యడంతో ఆమె ఒంటరి జీవితం గడుపుతుంది. యవ్వనంలో ఉండే ఆలోచనలు, ఆవేశం జీవితంలో నడి వయసుకు వచ్చాక ఆచరణకు దూరంగా కనపడుతూ ఊహించని మార్పులతో జీవితం ఎలా మారిపోతుందో ఈ కథ స్పష్టం చేస్తుంది.
మూడో కథ 'ఒక చందనపు చెట్టు.'సానిటరీ వర్కర్ గా పని చేస్తున్న పోశమ్మ తన పుట్టినరోజు నాడు ఓ పుట్టిన రోజు వేడుకలో పని చేస్తూ ఉండగా ఆ పుట్టినరోజు పిల్లవాడిని ఎలా అయినా తమకు అప్పగించాలని దానికి డబ్బులు ఇస్తామని లేకపోతే ప్రాణాలు దక్కవని బెదిరిస్తే ఆమె దానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ విషయం ముందుగానే పిల్లవాడి తండ్రికి తెలియజేసి ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ముందుగానే పోలీసులకు తెలియజేసి ఆ పిల్లవాడిని ప్రమాదం లేకుండా చేస్తుంది. పోశమ్మను వారు అభినందిస్తారు. ఆ తర్వాతి రోజు ఓ లారీ ఆమెను గుద్దేయ్యడం ఆమె మరణించడం జరుగుతుంది. రచయిత ఈ కథ ముగింపులో ఆమె మరణంతో పాటు ఆ పక్కనే ఉన్న చందనం చెట్టును కూడా కొట్టి వేశారని రాసారు. దీనిని బట్టి కొన్నిసార్లు మంచి వారికి మనుగడ ఉండదన్న అంశాన్ని పరోక్షంగా స్పష్టం చేసారు.
నాలుగో కథ 'చలి చీమలు.' సమాజంలో మర్యాద నిలుపుకోవాలంటే వ్యక్తిగత ఆకర్షణల్లో పడకూడదని స్పష్టం చేసే కథ ఇది.సీతారావమ్మకు వడ్డీ వ్యాపారిగా ఏ రాజకీయావేత్తకు లేనంత గౌరవం ఉంది. అందరిని అవసరంలో ఆదుకునేది వడ్డీ గట్టిగా వసూలు చేసినా సరే.పిల్లలు అమెరికాలో స్థిరపడటం వల్ల, రమ్మన్నా వడ్డీ డబ్బుల మీద ఉన్న ప్రేమ వల్ల ఆమె వెళ్ళలేదు. అలా ఒంటరిగా మిగిలిపోయిన ఆమెకు దగ్గర అయ్యాడు యతిరాజులు. ఆమె వడ్డీ అతను వసూలు చేసేవాడు. రోజు ఆమె దగ్గరే ఉండేవాడు. అతనికి కుటుంబం ఉన్నా డబ్బు కోసం ఆమె దగ్గరే ఉండిపోయాడు. అప్పటి వరకు గౌరవించినవారు ఆమెను లెక్క చేయడం మానేశారు. పిల్లలు ఆమెను చూడటానికి వచ్చినప్పుడు ఆమెకు అవమానం జరుగుతుంది. ఆ తర్వాత యతిరాజులును రావద్దని చెప్తుంది. ఒంటరిగానే ఆమె కన్ను మూస్తుంది. ఆమెను గౌరవించిన ఒక్కరు రారు. చావులో ఒంటరి అయి అలా తన గౌరవాన్ని కోల్పోయింది ఆమె. మనిషి తన గౌరవాన్ని నిర్దేశించే నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహించాలి అని స్పష్టం చేసే కథ ఇది.
ఐదో కథ 'మూడు ప్రశ్నలు-మూడు ముళ్ళు.' వర్ధనమ్మ కొడుకు సుబ్బారావు. అతని పెళ్ళి కోసం హడావుడి పడుతుంది తల్లి. సుబ్బారావుకు ఓ సంబంధం రావడం ఆ అమ్మాయిని కలవడం ఆమెను ప్రేమించడం జరిగినా వర్ధనమ్మ కట్నం కోసం ఇంకో పెళ్ళి అనడంతో అతను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కథలో రచయిత మనుషులు తమకు ఏదైనా దొరకనప్పుడు ఎంత బాధ పడతారో అది లభిస్తుంది అని తెలియగానే దాని కన్నా మెరుగైన దాని కోసం వెంటపడతారని, అది మనిషి ప్రవృత్తిలో ఓ కోణం అని చెప్పే ప్రయత్నం చేసారు.
ఆరో కథ 'జస్ట్ లాజిక్.' హర్ష తండ్రి రఘుపతి, పట్టాభి స్నేహితులు.పట్టాభి ప్రింటింగ్ ప్రెస్ లో పని చేసి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు రఘుపతి కొడుకు హర్ష విదేశీ చదువులకు ఇస్తాడు.ఆ విషయం భార్యాపిల్లలకు కూడా చెప్పడు. హార్ట్ ఎటాక్ తో మరణిస్తాడు. ఒకవేళ మొదటిసారి ఎటాక్ వచ్చినప్పుడే వైద్య సాయం అందితే బ్రతికేవాడని తండ్రి చెప్పడంతో గిల్టీగా ఫీల్ అవుతాడు హర్ష.హర్ష అప్పటికే అమెరికాలో కోటీశ్వరురాలు అపర్ణతో కలిసి ఉంటున్నాడు. ప్రేమలో ఉన్నారు ఆ ఇద్దరు.అపర్ణ ఆ డబ్బు తాను ఇస్తానని చెప్తే, రఘుపతి పట్టాభి భార్యకు ఆ డబ్బు గురించి చెప్తే అప్పటికే భార్య లేని రఘుపతి, అప్పుడే భర్త పోయిన ఆమెకు డబ్బు ఇస్తే అది అక్రమ సంబంధంగా సమాజం భావిస్తుందని డని బదులు తన కూతురికి హర్షతో వివాహం చేస్తే తీసుకుంటానని చెప్తుంది. దాని కోసం అపర్ణను అతను వదులుకున్నా అప్పటికే పట్టాభి కూతురు ప్రేమించి ఇంకో వివాహం చేసుకుంటుంది. మనిషి ఏదో ఒక లాజిక్ తో తన వల్ల జరిగిన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేసినా అది ఎలా బెడిసి కొడుతుందో స్పష్టం చేసే కథ ఇది.
ఏడో కథ విస్కీ చుక్కలు-గంధం చెక్కలు.'పిక్ పాకెటర్స్ గా ఉన్న అంజి, యాదయ్య, సుబ్బులు కథ ఇది. సుబ్బులును భర్త హింసించిడంతో ఆమె అతన్ని వదిలేసింది.అంజితో కలిసి ఉంటుంది. యాదయ్య ఆమెను అక్కలా భావిస్తాడు. ఈ ముగ్గురు పిక్ పాకేటింగ్ చేస్తారు. సుబ్బులకు అనారోగ్యం రావడం ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ స్పష్టం చేయడంతో ఆమె వైద్యం కోసం ఓ పెళ్ళి వారి నగలు, డబ్బుల సూట్ కేసు దొంగిలిస్తారు అంజి, యాదయ్య. వారి బాధను చూసిన సుబ్బులు ఆ సూట్ కేస్ వారికి తిరిగి ఇస్తుంది. ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి తాను బ్రతకాలని అనుకోవడం లేదని చెప్తుంది.ఆమె మరణిస్తుంది మనిషిలో కొన్ని విలువలు అన్నింటికీ వర్తించకపోయినా మానవ మూల స్వభావానికి వర్తిస్తాయని ఈ కథ స్పష్టం చేస్తుంది. పొట్ట కూటి కోసం దొంగతనాలు చేసిన అమ్మాయికి పెళ్ళి ఆగిపోతే వచ్చే కష్టాలు తెలిసిన సుబ్బులు అక్కడ అవసరాన్ని కాక స్వభావాన్నే అనుసరించింది.
ఎనిమిదో కథ 'గాళ్ ఫ్రెండ్.' హరిణి హాస్టల్లో ఉండి చదువే ధ్యేయంగా బ్రతుకుతుంది. బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ పెంచడంతో ఎలాగైనా విదేశాలకు వెళ్ళి సంపాదించి మేనమామకు ఇవ్వాలని ఆమె ఆశయం. ఆమెను రోజు ఒకతను వెంబడిస్తూ ఉంటాడు.హరిణికి ఒక రోజు జ్వరం రావడం తర్వాత ఆమెకు టెస్టుల్లో ఎయిడ్స్ అని తెలియడంతో అది తనకు ఎలా వచ్చిందో తెలియక ఈ విషయం బయటకు తెలిస్తే ఎలా బ్రతకాలో తెలియక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె స్నేహితురాళ్లు రోజు ఆమెను ఒకడు వెంబడించేవాడని అతని బాధ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తారు. అలా ఆమె పేరు కూడా తెలియని అతనికి ఆమె గాళ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల అతనికి శిక్ష పడుతుంది. మనిషి జీవితంలో ఎలా తను ఊహించని చిక్కుల్లో తనకున్న బలహీనతల వల్ల పడతాడో స్పష్టం చేసే కథ ఇది.
తొమ్మిదో కథ 'ట్యూషన్.' తల్లిదండ్రుల గొడవలు చదువుకునే పిల్లలపై చూపే ప్రభావాన్ని స్పష్టం చేసే కథ ఇది. తల్లిదండ్రుల మధ్య ఉన్న గొడవల వల్ల పిల్లల్లో భవిష్యత్తు పట్ల అభద్రత ఏర్పడుతుంది. దానితో పాటు తమ జీవితం ఎలా ఉంటుందో అన్న భయం ఏర్పడుతుంది. అటువంటి గొడవలతో ఉన్న భార్యాభర్తల కొడుకుకి ట్యూషన్ చెప్పడానికి వెళ్లిన మాధవి ఆ పిల్లవాడి బాధను అర్ధం చేసుకుని ఆ సమస్యను ఆ తల్లిదండ్రులకు చెప్పి ఆ సమస్యను పరిష్కరించడమే ఈ కథ.
పదో కథ ' బస్సు మిస్సయిన మిస్.' వృద్ధాప్యం వచ్చేవరకు వివాహం లేకుండా ఉండిపోయిన యశోదర ఓ వేడుకలో ఏ. వీ. రావు ను కలవడం అతను ఆమెతో పరిచయం పెంచుకోవడం భార్య మరణించి పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఒంటరిగా ఉన్న ఆయన యశోదర మానసికంగా దగ్గర అవ్వడమే ఈ కథ.జీవితంలో ఏది కోల్పోయినా అది దొరికితే దానిని అసంబద్ధంగా భావించి మనిషి వదిలిపెట్టకూడదని స్పష్టం చేసే కథ ఇది.
పదకొండో కథ 'గిల్టీ.' తనకు నచ్చిన ప్రదీప్ ను దక్కించుకోవడం కోసం కాంచన మొదట అతనితో చనువుగా ఉన్నట్టు ఉండి, తనకు తర్వాత వివాహం కుదిరిందని చెప్పి అతన్ని బాధపెట్టి తర్వాత ఆ పెళ్ళి చెడిపోయిందని చెప్పి అతనికి దగ్గర అయి అందరికి తెలిసిపోయేలా చేసి అతన్ని వివాహం చేసుకోవడమే ఈ కథ. అమ్మాయిలకు సహజంగా ప్రేమ కన్నా కూడా వివాహమే ప్రాధాన్యత ఉన్నప్పుడు వారు ఆ ప్రేమను పెళ్ళిగా మార్చుకునేందుకు పడే పాట్లను స్పష్టం చేసే కథ ఇది.
పన్నెండో కథ 'ఊబి.' మనుషులు మంచితనంతో ఎలా మోసం చేస్తారో స్పష్టం చేసే కథ ఇది.రైలులో పరిచయం అయిన దిలీప్ అరుణ్ ని ఆ ప్రయాణం తర్వాత తన ఇంటికి ఆహ్వానించి అతనికి అన్ని సదుపాయాలు చూసి తర్వాత అతన్ని ఉద్యోగంలో పెట్టిస్తాడు. మూడు నెలలు అయినా అతనికి జీతం రాదు. ఆ ఉద్యోగంతో పాటు ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాడు. దిలీప్ అప్పటికే తనతో కలిసి ఉద్యోగం చేస్తున్న సౌజన్యతో ప్రేమలో ఉంటాడు. ఆ సమయంలో అప్పటికే అతని భార్య అయినా కల్పన ఇంటికి వస్తుంది. ఆమె ద్వారా అతను కట్నం తీసుకున్నాక ఆమెను ఎలా వదిలించుకున్నాడో చెప్తుంది. అరుణ్ జీతం కూడా అతనే తీసుకుంటున్నాడని అరుణ్ తెలుసుకుంటాడు. తనకు ఎదురుతిరిగిన కల్పనను హత్య చేసి ఆ నేరం అరుణ పైకి నెడతాడు దిలీప్. ఈ ఊబిలో కూరుకుపోయిన అరుణ్ ను చూసి సౌజన్య మాత్రం తప్పించుకుంటుంది. మనుషుల మంచితనం వెనుక ఉండే అవసరాలలో ఉండే గూఢత్వాన్ని స్పష్టం చేసే కథ ఇది.
పదమూడో కథ 'ఇదా అసలు విషయం.' పొగడ్తల బలహీనత ఉన్న అధికారిని ఆ బలహీనత ద్వారా తన పనులు జరిపించుకుంటూ ఆఫీసులో అందరిని కూడా నియంత్రించే గుమాస్తాను ఆ ఆఫీస్ సిబ్బంది తెలివిగా బదిలీ చేసిన వైనాన్ని స్పష్టం చేసే కథ ఇది. మనిషికి ఉండే బలహీనతల వల్ల మనిషి కోల్పోయే అవకాశాలను స్పష్టం చేసే కథ.
పదనాలుగో కథ 'ఆక్టోపస్.' డబ్బు మనిషిలో ప్రేమను, బాధ్యతను ఎలా హత్య చేస్తుందో, అదే డబ్బుతో మనిషి జీవితం ఇంకొకరి అధీనంలోకి ఎలా జారిపోతుందో స్పష్టం చేసే కథ ఇది. నాగమణి కట్నం ఇచ్చి భర్తకు తండ్రి ద్వారా ఉద్యోగం ఇప్పించి శ్యాంసుందర్ ను వివాహం చేసుకుంది.వారికి చిన్మయి, ప్రత్యూష, సందీప్ పిల్లలు. అనాధశ్రమంలో ఉంటున్న తల్లి సావిత్రిను కూడా చూడటానికి శ్యాంసుందర్ కు అనుమతి లేదు. శ్యాంసుందర్ కు బదిలీల వల్ల చిన్మయి సావిత్రి దగ్గరే పెరిగింది. చావు బతుకుల్లో ఉన్న సావిత్రిని చూడటానికి వెళ్ళి ఆమెకు దహన సంస్కారాలు కూడా చేసి వస్తుంది చిన్మయి. ఆమెను కూడా తల్లిలా పెంచిన నాయనమ్మ పట్ల బాధ్యతను నిర్వర్తించింది.
పదిహేనో కథ 'చినుకుల్లో చిరుమంటలు.'మనుషులకు ఉన్న నిజాయితీ వారి అవసరాలకు ఓ అవకాశం కల్పించబడినప్పుడు ఎలా మారిపోతుందో స్పష్టం చేసే కథ ఇది. ఆనందరావు ఆ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు. అతన్ని ఆ పోటీ నుండి తప్పించడానికి అతన్ని హత్య చేసే పని లింగానికి డబ్బులు ఇచ్చి అప్పగించారు కరణం, మునసబు. ఆ రోజు ఆఖరి బస్సుకు వచ్చే ఆనందరావు కోసం వరహాలు టీ స్థాల్ లో ఎదురు చూస్తూ ఉంటాడు లింగం. కొట్టులో ఉపయోగపడుతుందని అలివేలుని పెళ్ళి చేసుకుంటాడు వరహాలు.పట్నంలో పెరిగిన ఆమెకు ఇక్కడ నచ్చదు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడటంతో వరహాలు కొట్టు దగ్గరే ఆగిపోతాడు ఆనందరావు. అతను తనతో పాటు తెచ్చిన పెట్టి మీద వరహాలు కన్ను పడుతుంది. ఆ రాత్రి భోజనం చేసి అతను పడుకున్నప్పుడు అతన్ని వశపరుచుకునే పని అలివేలు చేసిన ప్రేమించిన అమ్మాయి గుర్తుకు రావడంతో ఆగిపోతాడు. వరహాలు ఆ పెట్టె తీసుకుని పారిపోతాడు. దాని కోసం అతన్ని వెంబడించిన లింగాన్ని అతను హత్య చేసి పట్నం పారిపోతాడు. ఉదయం లేచేసరికి ఆ పెట్టె లో ఎన్నికల ఫార్మ్స్ ఉన్నాయని చెప్తాడు ఆనందరావు. అలివేలుకు డబ్బు ఇచ్చి స్వేచ్చగా బ్రతకమని చెప్తాడు. ఆమె తన దారి తాను చూసుకుంటుంది.అలా ఆ రాత్రి వారందరి జీవితాలను మార్చేసింది. మనిషికి ఉండే ఆశ రూపాన్ని స్పష్టం చేసే కథ ఇది.
పదహారో కథ 'రైలు వెళ్ళిపోయింది.' అపరిచితుల్లా రైలు ప్రయాణంలో రోజు కలుసుకునే ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆమెకు తల్లి, అతనికి తండ్రి మాత్రమే ఉన్నారు. వారు ఒప్పుకోకపోవడంతో వారి కోసం కొంత కాలం ఆగుదామని నిర్ణయించుకుని అలా ఆ రైలుతో పాటే తమ ప్రయాణం సాగిస్తున్నారు. మనిషి జీవితంలో ఒక్కో దశలో ఉండే కోరికలు తీరకపోతే అవి వెళ్ళిపోయిన రైలు దాటిన స్టేషన్స్ లానే మిగిలిపోతాయని కానీ ఆ ప్రయాణమే మనిషికి ఆశ రూపంలో బలాన్ని కూడా ఇస్తుందని స్పష్టం చేసే కథ ఇది.
పదిహేడో కథ 'టచ్ మీ నాట్.' తన పెళ్ళికి కట్నం తీసుకుని తండ్రిని అప్పుల పాలు చేసి భర్తకు దూరంగా ఉన్న ఆమె ప్రేమ కోసం ఆ డబ్బును తిరిగి మామగారికి పంపుతాడు అతను. కట్నం కొందరు భర్తలు భార్య ప్రేమ కన్నా తక్కువే అని ఎలా భావిస్తారో అన్న అంశాన్ని స్పష్టం చేసే కథ ఇది.
పద్దెనిమిదో కథ 'కుక్క ఉన్నది జాగ్రత్త.'సబ్బులు అమ్ముకుంటున్న ఆమెను ఓ పెద్దింటి ఆమె ఆమె భర్త పరస్త్రీతో సంబంధం పెట్టుకుంటే తన హోదాను ఉపయోగించి కాపాడినా తన హోదకు తగ్గట్టు ఆమె భర్త కూడా వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నప్పుడు నిస్సహాయరాలిగా మిగిలిపోతుంది. మనుషులకుండే కష్టాలు స్థాయికి తగ్గట్టు ఉంటాయని, అవి లేకుండా అయితే ఉండవని చెప్పే కథ ఇది.
పందొమ్మిదో కథ 'రోడ్స్ హావ్ నో ఫీలింగ్స్.' చదువుకున్న అతను ఓ టెంపరరీ డ్రైవర్ గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ అతని చదువు వల్ల ఆ యజమాని కూతురు అతనికి ప్రాముఖ్యత ఇవ్వడంతో అది ఏ ప్రేమకు దారి తీస్తుందో అన్న భయంతో అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తే ఆ అమ్మాయి అతనికి మంచి ఉద్యోగం ఇప్పిస్తుంది. ప్రేమ అంటే బాధ్యత ఇతరుల సామర్ధ్యంను గుర్తించి దానిని ప్రయోజనలోకి తీసుకురావడం అని స్పష్టం చేసే కథ ఇది.
ఇరవయ్యో కథ 'ఎలక్షన్లొచ్చి.'ఎన్నికల సమయంలో ఓడించడానికి నిజాయితీ పరలైన రాజకీయ నాయకుల శీలాన్ని కూడా ఎలా భ్రష్టు పట్టిస్తారో స్పష్టం చేసే కథ ఇది. ఇరవై ఒకటో కథ 'రా... రా.. మా ఇంటి దాకా...' పట్టించుకోని తల్లిదండ్రుల బిడ్డగా ఉన్న ఆమె ఓ ఆలంబనతో వివాహం చేసుకోవడం ఆమెకు పుట్టిన కొడుకు మంచి వయోలిన్ వాయుధ్యకారుడు కావడం ఆమె తల్లి ఆ పిల్లవాడిని ఆహ్వానించినా వారి దగ్గరకు వెళ్లకపోవడం జరుగుతుంది. మనిషికి గుర్తింపు మాత్రమే ప్రేమకు అర్హతగా ఉన్న సందర్భాన్ని స్పష్టం చేసే కథ ఇది.
మనుషుల మనస్సులో ఉండే చెప్పలేని ఆశల వల్ల జనించే సాధారణ కోరికలు, నైతిక విలువల పట్ల వారికున్న సంఘర్షణ వారు నలిగిపోయే విధానం ఈ కథల్లో కనిపిస్తుంది. అలాగే మనిషి ఊహించని విధంగా జీవితం తిరిగే మలుపులు ఈ కథల్లో కనిపిస్తాయి. స్త్రీ పురుషుల సంబంధాల్లో సమకాలీనత్వం కూడా ఈ కథల్లో కనిపిస్తాయి.
* * *

Comments
Post a Comment