ఊహా ప్రపంచం
ఊహా ప్రపంచం
-శృంగవరపు రచన
ఏ మనిషి జీవితం తాను కలలు కన్నట్టు ఉండదు. ఇంకొందరికి కలలు పక్క వారి జీవితాల్లోకి తొంగి చూస్తూ, వాటిల్లో సుఖాలు చూస్తూ ఉంటే కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి. స్వతహాగా ఓ ఆశయం కోసం పని చేసే వ్యక్తులు సైతం తమను అర్ధం చేసుకునే వారు లేకపోతే వ్యక్తిగతంగా నిరాశకు లోనవుతూ ఉంటారు. మొత్తం మీద మనుషుల జీవితాల్లో అసంతృప్తులు, నిరాశలు సహజం. కానీ వాటితో మనిషి ఎలా డీల్ చేస్తున్నాడు అన్నదే ముఖ్యం. వాటితో సరిగ్గా డీల్ చేయలేని వారు ఏదో ఒక ఊతాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ బలహీన మనస్కుల మనస్తత్వమే ఎన్నో వ్యాపారాలకు పెట్టుబడి కూడా. అమెరికాలో జరిగిన సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్కోణంలో, మనుషుల అమాయకత్వం వల్ల ఎలా సమాజంలో మూఢ నమ్మకాలు ఎలా వ్యాపార ఉత్పత్తులుగా మారిపోతాయో, నిరాశ నిస్పృహలు మనుషుల ఇంగిత జ్ఞానాన్ని ఎలా హరింపజేస్తుందో, విద్య కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనికి రాకుండా పోతుందో అన్న అంశంతో డాక్టర్ చిత్తర్వు మధు గారు రాసిన నవలే ‘సాలెగూడు www.utopia.com.’ ఈ నవల ఆంధ్రప్రభ వార పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఆ తర్వాత 2005 లో పుస్తకంగా వెలువడింది.
అరుణ్, స్వప్న భార్యాభర్తలు. వారికి ఇంటర్ చదువుతున్న కొడుకు, నవీన్. అరుణ్ ఓ డాక్టర్. క్యాన్సర్ స్పెషలిస్ట్. వృత్తి పట్ల అతనికి అంకిత భావం ఎక్కువ. తన లాంటి డాక్టర్ ను కాకుండా ఇంటిని, తనను చూసుకుంటూ తన ఆశయాలను అర్ధం చేసుకుంటూ, తనకు ప్రేమను పంచే భార్య కావాలని స్వప్నను వివాహం చేసుకున్నాడు. పెళ్ళయిన కొత్తలో ప్రాక్టీస్ తక్కువగా ఉన్న సమయంలో ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఓ కొడుకు నవీన్ జన్మించాడు. తర్వాత ప్రాక్టీస్ పెరగడంతో అరుణ్ కు దాదాపు రోజులో సమయం అంతా తన క్లినిక్ లోనే గడిచిపోయేది. అలా అది ఆ దంపతుల మధ్య దూరం పెరిగేందుకు దోహదపడింది. స్వప్న ఒంటరితనంతో బాధ పడేది. అరుణ్ నవీన్ ను డాక్టర్ చేయాలనుకున్నాడు. ఆ చదువు గురించి తల్లి పట్టించుకునేది కాదు. తరచూ ఆ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు నవీన్ కు చదువు,ఇల్లు పట్ల ఓ నిరాసక్తత కలిగేలా చేశాయి. చదువు మీద కూడా అతనికి ఆసక్తి సన్నగిల్లింది. అతని దృష్టి ఇంటర్నెట్ మీదకు మళ్ళింది. నవీన్ కు స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్ వంటి వ్యాపకాలు లేవు. రోజు కాలేజీ తరువాత ఇంటర్ నెట్ కేఫే కు వెళ్ళి అక్కడే రాత్రి వరకు సమయం గడిపే వాడు. ఇంటిలో జరిగే గొడవల వల్ల అతనికి ఇంటికి వెళ్ళాలని అనిపించేది కాదు.
స్వప్న ఈ ఒంటరితనంతో ఏదో తెలియని ఉద్రేకం, నిరాశ ,నిస్పృహలతో అరుణ్ స్నేహితుడు మరియు వైద్య వృత్తిలో ఉన్న శ్రవణ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. తన కన్నా వయసులో పెద్దది అయిన స్వప్న పట్ల అతనికి ఆకర్షణ మించి ఏం లేదు. స్వప్న అతనిలో స్నేహితుడిని వెతుక్కుంటూ ఉంది. అరుణ్ తో విసిగిపోయినట్టు భావించిన స్వప్న ఆవేశంలో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నట్టు ఉత్తరం రాసి పెట్టి శ్రవణ్ కుమార్ దగ్గరకు వెళ్తుంది. అది అదనుగా అతను ఆమె మీద బలవంతపు అత్యాచార యత్నం చేయబోతాడు కారులో. అదే సమయంలో కొందరు బస్తీ వాళ్ళు అల్లరి పెట్టడంతో శ్రవణ్ కుమార్ నుండి తప్పించుకుని రోడ్ మీద నడుస్తూ స్పృహ తప్పిపోతే ఆమెను దగ్గరి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తారు. అరుణ్ వచ్చి భార్యను ఇంటికి తీసుకువెళ్తాడు. మనిషి తప్పు చేసినప్పుడు తాను దొరికిపోకుండా ఉండేందుకు ఎదుటివారి మీదకు తప్పు నెట్టే ప్రయత్నం చేస్తారు. జరిగింది భర్త నుండి దాచడమే కాకుండా జరిగిన దానికి అతనే కారణం అన్నట్టు దబాయించింది. అరుణ్ తన కుటుంబంలో మార్పు రావడానికి తనను తాను మార్చుకుంటాడు. సమయానికి ఇంటికి వచ్చేవాడు. కొడుకుకు తక్కువ మార్కులు రావడం, రోజు ఇంటర్నెట్ కేఫెకు వెళ్ళడం ఆ తల్లిదండ్రులకు అర్ధం అవుతుంది. తాను బాగా చదువుకోవాలంటే కంప్యూటర్ కావాలని తల్లిదండ్రులను ఒప్పిస్తాడు నవీన్. కొడుకు కోసం కొత్త కంప్యూటర్ కొంటాడు నవీన్. కొన్ని రోజుల తర్వాత అందులో పోర్న్ సైట్స్ లాంటివి కూడా కొడుకు చూస్తున్నాడన్న అనుమానంతో ఆ కనక్షన్ కట్ చేయిస్తాడు. ఆ రోజు నుండి ఇంటర్నెట్ కేఫెకు వెళ్తాడు నవీన్ మళ్ళీ.
ఓ రోజు శ్రవణ్ కుమార్ ఫోన్ చేసినప్పుడు స్వప్న ఇక తనను కలవద్దని చెప్పడం ఎక్స్ టెన్షన్ లైన్ లో వింటాడు అరుణ్. మరలా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది. మరలా సర్దుకుంటుంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన నవీన్ ఆ గొడవను చూసి ఇక ఇంటికి రాకూడదని అనుకుంటాడు. అతనికి ఇంటర్నెట్ లో www.utopia.com లో నిరాశ, నిస్పృహలతో ఉన్న వారికి కొత్త ఆశను కల్పించే విధంగా రెడ్ స్టార్ కామెట్ భూమిని ఢీకొనడం వల్ల భూమి నాశనం అయిపోతుందని, అందుకని గెలాక్సీ 331 నుండి వచ్చే స్పేస్ షిప్ తాము వేరే లోకానికి పయనం కావాలని ఈ వెబ్సైట్ లో భగవాన్ అవినాష్ బోధించాడు. అది తాత్కాలిక పరిష్కారంగా అనిపించిన నవీన్ ఆ ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అతనికి బయటి లోకంతో సంబంధం ఉండదు. ఇంకో రెండు రోజుల్లో ప్రయాణం అని చెప్తారు.
ఉత్తర భారతదేశంలోని ఓ పల్లెటూరిలో జన్మించిన అవినాష్ బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. దారిద్ర్యం అనుభవించాడు. అతనికి మానసిక స్థిమితం లేదు. ఓ ఆశ్రమంలో పెరిగాడు. ఎన్ కెఫ లైటీస్ అనే వైరస్ వ్యాధి అతని మెదడుకు సోకింది.దీని వల్ల అతనికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఎంతో చదువుకున్నాడు. మంచి వాగ్దాటి కలవాడు. కానీ అతనికి స్క్రిజోఫినియా ఉంది. అతనికి ఎవరో తన చెవుల్లో ఆదేశాలు ఇవ్వడం, ఇతర గ్రహాల వాసులతో సంభాషించినట్టు భావించడం ఇవన్నీ ఆ వ్యాధి లక్షణాలే. ఇతను తాను నమ్మేది నిజమే అనుకుంటాడు. ఇతనిది వాస్తవానికి, అతని నమ్మకాలకు మధ్య శాస్త్రీయత లోపించిన గుడ్డితనం. కానీ ఇతని వల్ల ఆ సంస్థ ప్రపంచం అంతా శాఖలుగా ఏర్పడి వృద్ధి చెందింది. ఎంతో మంది దాతలు ఉన్నారు. ఇకపోతే ఈ ప్రయాణం అంటే ప్రాణం పోయే మందులు వేసుకుని ఆ తర్వాత వేరే గ్రహంలోకి పోతామని నమ్మడమే. హెవెన్ గేట్ అనే కల్ట్ అమెరికాలో ఇదే పోలికలతో ఉంటుంది. ఇటువంటి కల్ట్స్ వాస్తవంగా చాలా ఉన్నాయి.
అవినాష్ కు ఉన్నది మానసిక రుగ్మత అని అక్కడ అతని కింద పని చేస్తున్న జేమ్స్ కు తెలుసు. ఈ పేరుతో అవినాష్ ద్వారా వారందరూ మరణించాక వారి ఆస్తులు మరణించే ముందే ఆ సంస్థకు రాయడం వల్ల తాను ఇంకో ఉద్యోగితో కలిసి అమెరికాకు పారిపోయి ఆ డబ్బుతో కోటీశ్వరులుగా మారే యత్నంలో ఉన్నాడు జేమ్స్. ఇక్కడ అవినాష్ ది వాస్తవానికి, భ్రాంతికి మధ్య తేడా తెలుసుకోలేని తత్వం. అదే అతని అనారోగ్యం కూడా. అది ఆసరాగా చేసుకునే అతనిలో పాతుకుపోయిన పిచ్చి నమ్మకాన్ని వ్యాపార పెట్టుబడిగా మలిచాడు జేమ్స్. మొత్తానికి నవీన్ కు తాను అక్కడికి వచ్చి తప్పు చేశానని అర్ధం అవుతుంది. ఎలాగో తండ్రికి మెయిల్ పంపిస్తాడు. అప్పటికే కొడుకు గురించి తెలుసుకునే ప్రయత్నం లో ఉన్న ఆ తల్లిదండ్రులు మొత్తానికి అసలు విషయం తెలుసుకుంటారు. అరుణ్ ఆ ఆశ్రమానికి వచ్చి నవీన్ గురించి అడిగితే లేడని చెప్తారు. ఇంతలో భగవాన్ ఇంటర్ నెట్ లో రెడ్ కామెట్ భూమితో ఢీకొనే అవకాశం లేదని తెలుసుకుంటాడు. వాస్తవం అర్ధమై ఆ ప్రయత్నం ఆపాలని అనుకుంటాడు. కానీ జేమ్స్ దీని వల్ల జరిగే నష్టం ఊహించి అతన్ని హత్య చేస్తాడు. ఈ లోపు నవీన్ అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఉదయం అందరికీ చావు మందు ఇంజెక్ట్ చేయిస్తాడు జేమ్స్ . మొత్తానికి నవీన్ తల్లిదండ్రులను చేరుకుంటాడు. జేమ్స్, శాస్త్రీతో కలిసి పరారు అవుతాడు. ఈ ఆశ్రమంలో పరిచయం అయిన పూజ అవినాష్ గర్ల్ ఫ్రెండ్ అవుతుంది.మొత్తానికి ఆ ఆశ్రమంలో కొంత మందిని కాపాడగలుగుతారు. శాస్త్రి, జేమ్స్ ను ఎవరు పారిపోయారని కూడా తెలుసుకోలేకపోతారు. తర్వాత కొన్ని రోజులకు జేమ్స్ పేరుతో విదేశంలో ఇటువంటి ఇంకో వెబ్సైట్ ప్రారంభం అవ్వడం గమనిస్తారు పూజ,నవీన్. ఇటువంటి కల్ట్స్ ప్రజల్లో శాస్త్రీయ దృక్కోణం, తమపై తమకు విశ్వాసం ఏర్పడే వరకు కొనసాగుతూనే ఉంటాయని చెప్పడంతో నవల ముగుస్తుంది.
డాక్టర్ చిత్తర్వు మధు గారు కథలో ఎక్కువ పాత్రలు లేకుండా, పాఠకులు ఎటువంటి గందర గోళం లేకుండా ఎటువంటి క్లిష్టమైన అంశాన్ని అయినా నవలికరించడంలో సిద్ధహస్తులు అని ఈ నవల చదివితే స్పష్టమవుతుంది. వాస్తవికత తన సాహిత్యంలో ఉండేలా చూసుకోవడం కూడా ఈ రచయిత ప్రత్యేకత. అమెరికాలో ఉన్న ఇటువంటి కొన్ని కల్ట్స్ ,అలాగే నిజంగా ఆ పిచ్చిలో ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాన్ని కూడా ఈ నవలలో ఆయన ఉదహరించారు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో నమ్మకాల వెనుక ఉండే లోగుట్టులను, మనుషుల జీవితంలో మానసిక రుగ్మతలు వారిని ఇటువంటి చర్యలకు పురిగొల్పుతాయో, వంటి అంశాలను శాస్త్రీయ దృక్కోణంతో రాశారు. క్లిష్టమైన అంశాలను సులభతరం చేసి రాయడం వల్ల శాస్త్రీయ, స్పేస్, మెడికల్ అంశాలను కూడా పాఠకులు అర్ధం చేసుకోవడానికి వీలుంది ఈ రచనలో. పాఠకులు ఏ కాలంలో చదివినా, అనేక కోణాల్లో అవగాహనను కలిగించే నవల ఇది.
* * *

Comments
Post a Comment