జీవితంలో కన్నీళ్ళు

                                                 జీవితంలో కన్నీళ్ళు

                                                -శృంగవరపు రచన


ఉద్యమకారులను సామాన్యులు ఇష్టపడేది ముఖ్యంగా వారి ధైర్యాన్ని,ప్రశ్నించే తత్వాన్నే.అలా అని ఉద్యమ జీవితం ప్రతి ఒక్కరిని అలా తయారు చేస్తుందని,మనుషులను మారుస్తుందని అనుకోలేము. కొండపల్లి సీతారామయ్యగారు గొప్ప గొరిల్లా యోధుడిగా అలాగే పార్టీ కోసం పోరాడిన వ్యక్తిగా (ఆ తర్వాత పార్టీ బహిష్కరించడం,పీపుల్స్ వార్ స్థాపించడం,వెన్నుపోట్లకు గురవ్వడం జరిగింది) అందరికి తెలుసు.ఆయన భార్య కోటీశ్వరమ్మ గారు తన ఆత్మకథను ‘నిర్జన వారధి’అన్న పేరుతో రాశారు. ఈ పుస్తకం కోటీశ్వరమ్మ గారి జీవితంలో కన్నీళ్లను పాఠకులకు పరిచయం చేస్తుంది. మల్లు స్వరాజ్యం గారి కన్నా ఓ దశాబ్దం ముందు పుట్టారు కోటీశ్వరమ్మ గారు. స్వరాజ్యం గారు తెలంగాణ యోధురాలు అయితే కోటీశ్వరమ్మ ఆంధ్రా ప్రాంతం నుండి ఉద్యమానికి సహాయ సహకారాలు అందించారు.
కోటీశ్వరమ్మ గారికి నాలుగైదేళ్ళ వయసులోనే మేనమామతో బాల్య వివాహం జరగడం,ఆ తర్వాత రెండేళ్లకు భర్త మరణించడం జరిగింది.ఆమెను బాలవితంతువుగానే పరిగణించేవారు.చదువుకునే సమయంలో ఆమె నాటకాలలో నటించడంలోనూ,పాటలు రాసి పాడటంలోనూ ప్రసిద్ధి గడించారు. ఆ రోజుల్లో కుల వ్యత్యాసాలు ఎక్కువగా ఉండేవి. కోటీశ్వరమ్మ గారు నాయకురాలు కాదు సమాజంలోని సామాన్యురాలు.దేశభక్తితో నాయకులు చెప్పింది శ్రద్ధతో,ప్రమాదమని తెలిసిన ఆచరించే స్వభావం కలవారు. కోటీశ్వరమ్మ మొదటి భర్త తన ఆస్తి మొత్తం కోటీశ్వరమ్మకు రాశారు. ఒకవేళ కూతురికి మరో వివాహం చేస్తే ఆమెకు ఆ ఆస్తి వస్తుందో రాదో అన్న భయం ఓ వైపు,కూతురికి మరలా వివాహం చేస్తే ఆమె తమ్ముడికి వివాహం జరుగుతుందో లేదో అన్న భయంతోనూ ఆమె ద్వితీయ వివాహం గురించి ఆమె తల్లిదండ్రులు భయపడేవారు.కోటీశ్వరమ్మకు వచ్చే ఆస్తి వల్ల తమ్ముడికి ఎన్నో మంచి సంబంధాలు రావడం పదహారేళ్ళకు చదువు మధ్యలోనే అతనికి వివాహం జరగడం జరిగింది. కోటీశ్వరమ్మ గారు ఎనిమిదవ తరగతితోనే చదువు ఆపేశారు.
ఆ సమయంలో కోటీశ్వరమ్మ ఇంటి పక్కకు అద్దెకు వచ్చిన వారి సాయంతో పెళ్లి మాటలు జరిగి కొండపల్లి సీతారామయ్య గారితో వివాహం నిశ్చయించబడింది. ఇద్దరు ఒకే రెడ్డి కులం అయినప్పటికి కోటీశ్వరమ్మ పామర్రు రెడ్లు అయితే సీతారామయ్య జొన్నపాడు రెడ్డి అవ్వడం వల్ల దీనిని కూడా వర్ణాంతర వివాహంగా భావించడం,దీనిని వ్యతిరేకించడంతో రహస్యంగా వీరి వివాహం జరిపించడం జరిగింది.కోటీశ్వరమ్మ బాల్యం నుండి దేనికి ఎదురు తిరిగే మనస్తత్వం లేదు.బాల్యంలో ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లినప్పుడు ఆ స్నేహితురాలి బామ్మ బ్రాహ్మణ కుటుంబీకులమవ్వడం వల్ల కోటీశ్వరమ్మను అంటరాని వ్యక్తిగా భావించినా ఆమె ప్రశ్నించలేకపోయింది. వివాహం అయిన తర్వాత అత్తగారింట్లో తక్కువ కులం వారు అయిన పనివాళ్ళను ఇంటిలోకి రానివ్వకపోవడం,ఇంట్లో పనులు వారిని చేయనీయకపోవడం వంటివి జరిగినా అత్తను ఆ మాట అడగలేకపోయింది.ఇదే తత్వం కోటీశ్వరమ్మ గారి జీవితం మొత్తంలో కనిపిస్తుంది. బహుశా ఆ మెత్తనితనమే ఆమెను ఇంకా కష్టాలకు గురి చేసింది అనుకుంటా.
అప్పట్లో పార్టీ కోసం సుందరయ్య లాంటి నాయకులు తమ ఆస్తులు ఇవ్వడంతో సీతారామయ్య కూడా తన వాటా ఆస్తిని పార్టీ కోసం ఇచ్చేశాడు.సీతారామయ్య జీవితంలో ఎక్కువకాలం రహస్య జీవితమే గడిపాడు. ఆ సమయంలో కోటీశ్వరమ్మ కూడా ఆయన మార్గంలో నడిచి అనేకమార్లు డెన్ లలో జీవితం గడిపింది. జొన్నపాడులో పార్టీ తరపున ఏర్పాటైన మహిళా సంఘంలో కోటీశ్వరమ్మ చురుగ్గా పని చేసేది. పార్టీ పట్టున్న గ్రామాలను రెడ్ విలేజెస్ అనేవారు.వాటితో అక్కడి ప్రాంతంలోని గ్రామాలకు వెళ్ళి చిన్న చిన్న సమావేశాలు పెట్టి స్త్రీల హక్కుల గురించి,ఆరోగ్యం,ప్రసూతి జాగ్రత్తల గురించి కోటీశ్వరమ్మ తన తోటి ఉద్యమకారిణిలతో కలిసి వెళ్ళి చెప్పేవారు. అప్పట్లో డాక్టర్ అచ్చమాంబ గారు ఎందరికో ఉచితంగా వైద్యం చేశారు,పార్టీకి సానుభూతిపరురాలిగా ఉన్నారు.ఆమె పార్టీతో విభేదించిన తర్వాత ఆమెను బహిష్కరించి ఆమె ముందు చేసిన సేవలను కూడా గుర్తుంచుకోకపోవడం అమానుషం అని కోటీశ్వరమ్మ తన ఆత్మకథలో రాసుకున్నారు. కోటీశ్వరమ్మ గారికి చందు,కరుణా పుట్టారు.
ముఖ్యంగా పార్టీ మీద నిషేధం పెట్టాక కామ్రేడ్స్ అందరూ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. వృద్ధులు,పిల్లలు ఉంటే అనుమానం ఉండదని వారిని తప్పక ఉండేలా చూసేవారు.ఉద్యమంలో భాగమైన సభ్యులు తల్లులు,పిల్లలు కూడా అలా ఆ డెన్స్ లో ఉండాల్సి వచ్చింది.కోటీశ్వరమ్మ తల్లి కూడా ఉద్యమకారులకు వంట చేస్తూ ఉద్యమంలో భాగం అయ్యారు. బందరు,ఏలూరు,విశాఖపట్నం,నాగ్ పూర్ ,గోందియా లాంటి ప్రాంతంలో కోటీశ్వరమ్మ రహస్య జీవితం గడిపారు. ఆ సమయంలో కోటీశ్వరమ్మ గారు ఓ సారి గర్భవతి అవ్వడం,ఉద్యమానికి అది భారం అవుతుందని భావించి నాటు మందులతో గర్భస్రావం చేయించుకోవడం,ఈ విషయం రహస్యంగా ఉంచడానికి పడిన బాధలు,ఆ సమయంలో ఉద్యమంలో ఆమెతో పాటు ఉన్నవారు అందించిన సహకారం గురించి కూడా కోటీశ్వరమ్మ గారు రాశారు.
ఐదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత బయటకు వచ్చారు.ఈ అజ్ఞాతవాస సమయంలో అటు కోటీశ్వరమ్మ తల్లిదండ్రులపై,ఇటు సీతారామయ్య తల్లిదండ్రులపై కొడుకు,కోడలు జాడ చెప్పమని ఎంతో పోలీసులు వేధించడమే కాకుండా,వారి ఆస్తులను కూడా దోచుకోవడం జరిగింది. అజ్ఞాతవాసం ముందే కోటీశ్వరమ్మ తండ్రి మరణించాడు. సీతారామయ్య ఓ విప్లవకారుడు మరణిస్తే అతని భార్యకు అనారోగ్యంగా ఉంటే ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు సీతారామయ్య.ఆమెకు ఫిట్స్. తనకు కుదిరినంతలో పిల్లలతో పాటు ఆమెను చూసుకున్నా చివరకు ఆమె వల్ల ఆ భార్యాభర్తలు విడిపోవడం జరిగింది.తాను చందును తీసుకువెళ్తానని చెప్పి కరుణను మాత్రం కోటీశ్వరమ్మ దగ్గర వదిలేశాడు భర్త.ఆ తర్వాత ఆమెతో ఉన్న సంబంధం వల్ల,ఆమెను ధనం కోసం ఉంచుకున్నారని పార్టీ వారు అనుకోవడం వల్ల మొత్తానికి అతన్ని పార్టీ బహిష్కరించడం అతను స్వంతంత్ర పార్టీ ఏర్పరచుకోవడం జరిగింది.
33,34 ఏళ్ల వయసులో భర్త వదిలేశాక తల్లితో కూతురితో ఉంటున్న కోటీశ్వరమ్మకు జీవితం దుర్భరం అయ్యింది.ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న పార్టీ ఆమె రహస్య జీవిత సమయంలో ఇచ్చిన బంగారం వెలను నిర్ణయించి ఆమెకు ఐదు వేలు ఇవ్వాలని నిర్ణయించింది.సీతారామయ్య పార్టీలో లేడు,కానీ కోటీశ్వరమ్మ పార్టీ సభ్యురాలే. సీతారామయ్య నుండి విడిపోయినా అతనికి ఇష్టం లేకపోవడం వల్ల మరలా కొడుకు జీవితం గురించి ఆలోచించి ఆ డబ్బు కోటీశ్వరమ్మ తీసుకోలేదు. పార్టీ సిపిఐ,సిపిఎం గా విడిపోవడం జరిగింది. చండ్ర రాజేశ్వరరావు గారు,సుందరయ్య గారు ఇద్దరు కోటీశ్వరమ్మకు ఆప్తులే. ఆ సమయంలో కుటుంబం కోసం ఉన్న ఇంటిలో ఓ గదిలో ఉంటూ మిగతా పోర్షన్ అద్దెకు ఇచ్చింది కోటీశ్వరమ్మ.ఆ సమయంలో సత్యమూర్తి (శివసాగర్)గారు కుటుంబంతో అద్దెకు వచ్చారు. ఆ సమయంలో కొందరు కోటీశ్వరమ్మ దగ్గరకు వచ్చి తక్కువ కులం వ్యక్తికి అద్దెకు ఇల్లు ఇవ్వడం పై ఆక్షేపించడం జరిగింది. తన ఇంటిని తనకు ఇష్టం ఇచ్చిన వారికి ఇచ్చే హక్కు తనకు ఉందని కోటీశ్వరమ్మ చెప్పలేకపోయింది.
ఆ తర్వాత విశాలాంధ్రలో పని చేస్తున్న రామమోహనరావు గారు ఆమెను మెట్రిక్ చదవడానికి ఆంధ్రా మహిళా సభకు వెళ్ళే ప్రయత్నంలో సాయం చేశారు. ఆ తర్వాత ఆమె అక్కడ ఉండి చదువుకోవడం,కూతురిని తల్లి దగ్గర ఉంచుకోవడం జరిగింది.ఆ సమయంలోనే కోటీశ్వరమ్మ సాహిత్యం వైపు మళ్ళారు.కథలు రాశారు. రేడియోలో నాటకాలు వంటివి ఎన్నో చేశారు.అలా కూడా ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడ్డారు. అలా రచయిత్రిగా కూడా ఎదిగారు. కరుణను డాక్టర్ చేయాలన్న ఆశయం ఉండేది కోటీశ్వరమ్మకు. ఆ సమయంలో కరుణను కూడా తాను చదివిస్తానని చెప్పారు సీతారామయ్య.అలా ఇద్దరి పిల్లల భవిష్యత్తు కోసం కోటీశ్వరమ్మ ఇద్దరు పిల్లలకు దూరం అయ్యారు. వార్డెన్ గా తర్వాత ఉద్యోగం రావడంతో రిటైర్ అయ్యే వరకు అక్కడే పని చేశారు కోటీశ్వరమ్మ.
కరుణకు రమేశ్ కు వివాహం కుదిర్చినట్టు సీతారామయ్య కబురు పంపినా పెళ్ళికి మాత్రం పిలవలేదు.అలా కన్నకూతురి వివాహానికి కూడా కోటీశ్వరమ్మ వెళ్ళలేకపోయింది. ఆ తర్వాత కరుణ,రమేశ్ ఇద్దరు వైద్యులు అవ్వడం,కరుణ వివాహమై పిల్లలు పుట్టాక కూడా పట్టుదలతో డాక్టర్ చదవడం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.రమేశ్ తెలుగు సంస్కృతి కోసం కూడా ఎంతో పాటు పడ్డాడు.కోటీశ్వరమ్మ అమ్మమ్మ అయిన తర్వాత ఆమె నుండి విడాకులు అడిగాడు సీతారామయ్య.ఇవ్వవద్దని ఎలాగూ విడిగానే ఉంటున్నారు కనుక ఆ ఇంటిపేరు వదలవద్దని దాని వల్ల అత్తామామలు,తల్లి బాధపడుతుందని కొడుకు కూడా సూచించడంతో విడాకులు ఇవ్వలేదు.కానీ వారిద్దరూ విడిపోయాక ఎప్పుడు కలిసిలేరు. ఎమెన్ లో అవకాశం రమేశ్ అక్కడకు వెళ్తున్నానని సంతోషంగా అందరికి చెప్పి బయలుదేరే సమయానికి అనారోగ్యం పాలై మరణించడం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్ళకు కరుణ కూడా స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య చేసుకుంది. రమేశ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు అతను ఉద్యమ బాట పట్టడం,అతను ఎలా మరణించాడో తెలియని పరిస్థితుల్లో కనీసం మృతదేహం కూడా దక్కని స్థితుల్లో మరణించాడు. కొన్నాళ్ళకు కోటీశ్వరమ్మ తల్లి కూడా మరణించింది. సీతారామయ్య చివరి రోజుల్లో అతన్ని ఆస్తి కోసం మిత్రులు ప్రయత్నించడం,అతనే అనుకుని అతని తల్లిని గొడ్డలితో నరకడం జరిగింది.ఆ తర్వాత సొంత పార్టీలో కూడా ద్రోహం చేయబడి ఒంటరి వాడై,మతిస్థిమితం లేని స్థితుల్లో కోటీశ్వరమ్మ దగ్గర మరణించాడు సీతారామయ్య.ఆయన చివరి రోజుల్లో కోటీశ్వరమ్మతో ఉండే ప్రయత్నం చేసినా అప్పటికే మనసు విరిగిన ఆమె ఆయనకు దూరంగానే ఉండిపోయింది.
అలా తన ముందు తరం,తన తర్వాతి తరం అస్తమించిన తర్వాత వారధిగా ఉండిపోయిన తన జీవిత చరిత్రకు ‘నిర్జన వారధి’అని పేరు పెట్టుకున్నారు కోటీశ్వరమ్మగారు. ఈ పుస్తకం 2012 లో వచ్చింది. దీనికి ఎంతో ఆదరణ దక్కింది. తర్వాత సీతారామయ్య గారి మానువరాలు అనురాధ(కరుణ కూతురు)సీతారామయ్య గారి జీవితం గురించి ‘రైతు బిడ్డ గెరిల్లా’గా అన్న పుస్తకం రాశారు.
‘నిర్జన వారధి’చదువుతుంటే జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్న మనిషి ఎలా అన్నింటిని తట్టుకుని ఉందా అని ఓ పక్కన అనిపిస్తుంది,అలాగే ఇంకో పక్క ఆమె అలా ప్రతి విషయంలోనూ బాధ పడుతూ ఉండటమే తప్ప ఏనాడూ ఎదిరించే ప్రయత్నం కూడా చేయకపోవడం కొంత బాధను కలిగిస్తుంది. ఈ కథలో నా వరకు నేను ఓ స్త్రీగా తప్ప ఉద్యమవీరురాలిగా చూడలేకపోయాను.బహుశా అప్పటికే పాతుకుని ఉన్న పురుషస్వామ్యము,ఆమె భర్త ఆమె కన్నా అప్పటికే గొప్పవాడిగా పార్టీలో పేరు తెచ్చుకోవడం,పెద్దగా చదువుకోకపోవడం,సౌమ్యంగా తప్ప కఠినంగా ఉండే మనస్తత్వం లేకపోవడం వల్ల పార్టీ సభ్యురాలై ఉండి కూడా విడిపోయాక కూడా భర్త అభిష్టాన్నే పాటించింది. చివరి రోజుల్లో ఆమె అక్షరాలను సన్నిహితులుగా భావించింది. చండ్ర రాజేశ్వరరావు గారి పేరు మీద ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో చేరారు కోటీశ్వరమ్మగారు.తన పనులు తాను చేసుకోలేని స్థితిలో కూతురి పిల్లల దగ్గర కాలం గడిపారు.
విప్లవం ప్రజల మంచికే అయినా ఆ విప్లవంలో ఉన్నవారు కూడా ఇదే సామాజిక స్వరూపంలో భాగమే కనుక వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా సామాన్యులు ప్రవర్తించే తీరు కనిపిస్తుంది. బహుశా మనుషులను వారి ప్రతిభ,సేవల నుండి వ్యక్తిగత జీవితాన్ని వేరు చేసి చూడగల సాధనం ఉంటే కేవలం వీరులు మాత్రమే ఉండే సమాజం ఉండవచ్చు కానీ,వ్యక్తిగత విలువలు –ఉద్యమ విలువలు వేరైనా ఈ రెండింటి మధ్య బ్రతికే స్వరూపం మారితేనే ఆ విప్లవం ప్రభావం ప్రజలపై గాఢంగా ఉంటుంది.బాలవితంతువు వివాహం చేసుకుని,తన ఆస్తి మొత్తం పార్టీకే ఇచ్చే,ఆ పార్టీ కోసం దశాబ్దాలు అజ్ఞాతంలో గడిపిన సీతారామయ్య గారు భర్తగా చివరిగా పార్టీ సభ్యుడిగా ఎలా కింద పడిపోయారో అన్నది బాధను కూడా కలిగిస్తుంది.ఆ పతనంలో ఆయన భాగస్వామి కోటీశ్వరమ్మ గారి జీవితం ఛిద్రం అయిన స్థితి పాఠకులను కన్నీళ్ళు పెట్టించక మానదు.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ