నైతిక ఆధిపత్య చట్రం
నైతిక ఆధిపత్య చట్రం
-శృంగవరపు రచన
గొప్పగా జీవించడానికి అర్హులమని ఆలోచించే భావన ప్రతిభ ఆధారితమైనదా లేక లేమి తర్వాత కలిమి అనే ఆలోచనా శైలిపై నిర్మింపబడినదా? భయం,దుఃఖం,బాధ,కోపం ఏది వచ్చిన ప్రేమించడం తప్ప ఏమి చేయాలి? మనిషి జీవితంలో ఎలా ఉంటే బావుంటుంది అన్న ప్రశ్నకు అనుభవం సమాధానం అయితే ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కోలా ఎందుకు ఉంటాయి? భయం అభద్రత నుండి పుట్టే భావనా? ఉద్యమం,పోరాటం,మనుషులతో కలవడం వంటివి కూడా ఎందుకు వ్యక్తిగత స్థాయిలో కొన్ని సార్లు తప్పులుగా పరిగణించబడతాయి? ఇలా ఎన్నో ఆలోచనల సంఘర్షణ నుండి పుట్టిన పాత్రే నీల. కె.ఎన్.మల్లీశ్వరి గారి నీల నవలలో నీల జీవితంలోని ఆటుపోట్లతో పాటు పాఠకులు కూడా సమాజంలో ఉండే ద్వంద వైఖరి,నిస్సహాయత నుండి జన్మించే హింస, అభద్రత వల్ల కోల్పోయే జీవితానుభవాలు,చివరకు వ్యతిరేకించే వాటిని కూడా తమ అనుభవంతో మార్పుల ద్వారా అంగీకరించుకోగలగడం వంటి ఎన్నో బహుముఖ కోణాల జీవితాలతో పయనిస్తారు.
నీల జీవితంలో సంఘర్షణ ఉంది. పరిస్థితులు మారే కొద్ది అనుభవాలు మారే క్రమం ఉంది. సుఖమైన జీవితం అంటే ఏంటో బాల్యం నుండి అస్పష్టత ఉన్న ఆమె జీవితంలో తల్లిదండ్రులు ఆమెకు జీవితం గురించి చెప్పకుండా తమ ప్రభావం ద్వారా ఆమెలో పెంచిన భయాలు, అభద్రతలు ఆమెతో పాటు పెరుగుతూ, వాటి నీడలను ఆమె వైవాహిక జీవితంలోకి విస్తరించి, ఆమెను జీవితంలో నైతికత పట్ల ఓ ధృఢత్వం ఉండేలా చేసి, ఆమెను తన అనుభూతులు, ఆశయాలకు దూరం చేసాయి.
నాకు మంచి జీవితం పొందే అర్హత ఉంది అని ధైర్యంగా అనుకునేవారు చాలా తక్కువ. తమ కష్టాలు తమ కర్మ వల్ల అని సరిపెట్టుకుంటూ, స్వనింద లేదా పరనింద ద్వారా తమను తాము ఏ తప్పు లేనివారిగా భావించుకోవడం మానవ సహజం కొన్ని సార్లు. ఇకపోతే రెండో రకం వారిలో తమకు ప్రతిభ ఉంది కనుక లేదా తాము కష్టపడి పని చేసాము కనుక తమకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయని ఆశించే వర్గంలో కొందరు ఉంటారు. ఇక రెండో వర్గంలో తమ లేమి వల్ల కలిమి వస్తుందని, రావాలని లేమి అనే దానిని కలిమికి అర్హతగా భావించేవారు. ఈ కోవకు చెందిన వ్యక్తిత్వం నీలది.
నీల తల్లి చంద్రకళ. తండ్రి పరిశి. పరిశి తాగుబోతు. ఇంటిని నడిపే బాధ్యత మొత్తం తల్లి మీదే ఉందని నీల బాల్యంలోనే గ్రహించింది. ఆమె తండ్రి తాగడం, భార్యను హింసించడం తప్ప కుటుంబం పట్ల బాధ్యత లేని వాడు. నీలకు ఓ తమ్ముడు. చంద్రకళను అక్క అంటూ పిలుస్తూ ఆత్మీయంగా ఉండే వ్యక్తి ఆరంజ్యోతి.పరిశి లాంటి ఎందరో మగవాళ్ళు అక్కడ ఉన్న జూట్ ఫ్యాక్టరీ లో పని చేస్తున్నారు. వీరిలో ఆరంజ్యోతికి పోరాడే తెగువ ఎక్కువ.ఆ ఊరి మగవాళ్ళు తాగుడికి అలవాటు పడినప్పుడు తమ్ముడు సూర్యంతో సహా గట్టిగా ఆ ఊరి ఆడవాళ్ళను కూడగట్టి మద్య దుకాణాలపై విరుచుకుపడింది. ఫ్యాక్టరీ లాకవుట్ ప్రకటించబోతున్నప్పుడు అందరిని కూడబట్టి అది జరగకుండా ఉద్యమించింది. ఆమె తమ్ముడు సూర్యం విద్యావంతుడు, విప్లవ భావాలు కలవాడు.అతను, అతనితో పాటు ఉండే ఆటో రాజు ఓ రోజు మాయమైపోతారు. ఓ నాలుగు రోజులకు ఆటో రాజు దెబ్బలతో బయట పడినా సూర్యం మాత్రం రాడు. ఆ రోజు నుండి ఆరంజ్యోతి తమ్ముడి కోసం బాధ పడుతూ ఉంటుంది. చంద్రకళకు, ఆటో రాజుకు ఉన్న సంబంధం బయటపడటంతో వారిద్దరిని తన చెల్లి, బావ సాయంతో హత్య చేస్తాడు పరిశి. వారికి శిక్ష పడటంతో, నీల తమ్ముడిని పెంచుకునేందుకు చంద్రకళ చెల్లి ముందుకు వచ్చినా, నీల అనాధ అవుతుంది.
అటు తమ్ముడు మాయమవ్వడం, ఇటు చంద్రకళ మరణించడంతో ఆరంజ్యోతి పిచ్చిది అయిపోతుంది.అనాధగా మారిన నీల తన జీవితంలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుకు కారణాలను గురించి ఆలోచించింది. తన తల్లి చేసిన పని వల్ల తమ జీవితాలు ఇలా తారుమారు అయ్యాయని అనుకుంది. అందుకనే వివాహమయ్యాక భర్తకు అంకిత భావంతో కట్టుబడాలని నిర్ణయించుకుంది. చోళ దిబ్బ లోనే ఉంటున్న పాస్టర్ కుటుంబంతో కలిసి,వారికి అన్ని పనులు చేసి పెడుతూ చదువుకుంటూ పెరిగింది. వారితో మంచిగా ఉండటం తన మనుగడ కోసం నీల చేసిన ప్రయత్నంగా పరోక్షంగా భావించవచ్చు.తనకు అంటూ తనవాళ్ళు ఉండాలన్న భావన ఆమెకు ఈ బాల్య పరిస్థితుల వల్లే సిద్ధించింది.
పాస్టర్ కుటుంబం వేరే చోటుకు వెళ్ళిపోతున్న సమయంలో ఆమెను ఇష్టపడిన ప్రసాద్ అనే వ్యక్తితో నీల వివాహం చేసి తమ బాధ్యతను దింపుకుంది. ప్రసాద్ తోనే తన జీవితం అనుకున్న నీలకు అతనికి సరళ అనే స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకున్నప్పుడు దానితో కూడా రాజీపడిపోయింది నీల. నీలకు మినో జన్మించింది. మనుషులు తమకున్న భయాల వల్ల,అభద్రతల వల్ల తప్పులతో రాజీపడిపోవడం వల్ల వచ్చే సుఖంలో జీవితముంది అనుకోవడం వల్ల తప్పు చేసేవారు ఆ తప్పును ఒప్పుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సరళకు భర్త స్నేహితుడు ప్రసాద్. భర్త మరణించాక సరళ,ప్రసాద్ దగ్గరయ్యారు. ఆ సమయంలో కాంట్రాక్ట్ పని మీద చర్చ్ కు వెళ్ళిన ప్రసాద్ నీలలో ఉన్న అమాయకత్వం,ఆమె గతం,ఆమె తల్లి నీడ ఆమె జీవితాన్ని వెంటాడటం గమనించే ఆమె తన గురించి తెలిసిన నిస్సహాయంగా ఉంటుందనే ఈ పెళ్ళి చేసుకుని ఉండవచ్చు. ఎవరు లేని నీల ప్రసాద్ తో ఎలా అయినా ఈ జీవితం ఉండిపోతే బావుండు అని అనుకుంది.కానీ సరళ ప్రసాద్ ను తన అధీనంలో ఉంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నీల భార్య కనుక ఆమె ఒద్దికగా ఉండాలని ప్రసాద్ కోరుకున్నాడు.ఆమె భార్య కనుక ఆమెలో సరళలా చనువుగా ప్రవర్తించే వ్యక్తి ఉండకూడదు అని అని అనుకున్నాడు. అందుకనే నీల భార్యగా సమాజంలో దక్కే గౌరవంతో దూరంగా ఉండిపోతే,సమాజ వ్యతిరేక సంబంధంలో ఉన్న సరళ ఆ వ్యతిరేకత మనుషుల్లో ఇచ్చే ఉత్సుకతను ఆధారంగా చేసుకుని తన బలాన్ని నిరూపించుకుంది. ఆ సమయంలోనే నీల సరళ విషయంలో వ్యతిరేకించకపోవడం వల్ల ఆమె చదువుకోవడానికి ప్రసాద్ ఒప్పుకున్నాడు. ఆ సమయంలో నీలకు పరిచయమైన వ్యక్తి వసుంధర. ఆమె ఎన్నో ఉద్యమ కార్యక్రమాల్లో చుర్రుగా ఉండే వ్యక్తి. వృత్తి రీత్యా న్యాయవాది. ఆమె ద్వారా పుస్తక ప్రపంచంలో ఎన్నో కొత్త విశేషాలను,విషయాలను తెలుసుకుంటూ తన మేధా వికాశాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ సాగింది నీల.
నీలలో ఉన్న మంచి గాయకురాలిని గమనించిన వసుంధర ఆమెకు ప్రజా ఉద్యమంలో పాడే అవకాశం ఇవ్వడం, ఆమె పాడటం,ఆ తర్వాత ప్రసాద్ ఈ విషయంలో గొడవ పడటం,కాపురం కోసం నీల నిర్లిప్తంగా ఉండటం జరిగింది. ప్రసాద్ సమాజంలో కుటుంబానికి ఉన్న విలువ గుర్తించినప్పుడు,సరళ ఆత్మహత్యా ప్రయత్నంతో మొత్తానికి ప్రసాద్ ను తనవాడిని చేసుకోగలిగింది. నీల బాల్యంలోనే తల్లి జీవితం నుండి నేర్చుకున్న పాఠమైన భర్తకు కట్టుబడి ఉండటాన్ని తన జీవితంలో ప్రసాద్ అలా కట్టుబడి ఉండకపోవడం వల్ల ప్రసాద్ ను వదిలేసింది. ఆ తర్వాత ఆమె కూతురు మినో ను ఆమె దగ్గర ఉండేలా చేసిన వ్యక్తి లాయర్ సదాశివ.
కూతురు మినోతో అక్కడ ఉండలేక పాస్టర్ కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన నీల పాస్టర్ మరణించాడని,పాస్టరమ్మ పని చేసుకుని బ్రతుకుతుందని తెలుసుకునిఎక్కడ,ఎలా బ్రతకాలో తెలియక తన పుట్టిన ఊరు చోళదిబ్బకు వెళ్లిపోతుంది . అక్కడ ఆరంజ్యోతి కూతురు ఆమె నగరానికి తరలి అజిత అనే స్త్రీ నడుపుతున్న ఎన్ జి ఓ లో ఉద్యోగం సంపాదిస్తూ,మొత్తానికి తన జీవితానికి ఓ స్థిరత్వం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.
ఆరంజ్యోతి కూతురు స్వరాజ్యం సాయంతో ఆమె ఇంట్లోనే అక్కడి పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటుంది నీల. అక్కడ స్వరాజ్య జీవితాన్ని అక్కడున్న పరిస్థితుల ఆధారంగా గమనించిన నీలా ఆమె నైతిక దృఢత్వం గురించి ఆలోచనలో పడింది. స్వరాజ్యం భర్త పరిణతి లేని వ్యక్తి, కానీ భార్య మీద ప్రేమ ఉంది. బాధ్యతల గురించి ఆలోచించగల మానసిక శక్తి లేదు. కొడుకు కూడా మానసికంగా ఎదగనివాడు. ఆ ఊరి మహిళల్లో నాయకురాలిగా ఎదిగి, పొదుపు సంఘాల ద్వారా వారిని ఏకం చేసినా, ఏ పరిస్థితిని అయినా తన రాబోయే రాజకీయ భవిష్యత్తుకు వాడుకోగల వ్యక్తిగా ఆమెను చూసింది నీల. స్వరాజ్యానికి స్త్రీ పురుషుల నైతికత పట్ల కన్నా కూడా తన భవిష్యత్తు మీదే గురి ఉంది.ఆ సమయంలో ఓ రీసెర్చ్ పని మీద అక్కడికి వచ్చిన పరదేశి నీలను ఇష్టపడతాడు. నీల కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఎప్పుడైతే పరదేశి తన ప్రేయసిని వదిలి తన దగ్గరకు వస్తానని అన్నాడో అప్పుడే ఆ బంధం గురించి ఆలోచనలో పడి, ప్రసాద్ వల్ల ఏర్పడిన అభద్రత మరలా ఉండకూడదని నిర్ణయించుకుని అతన్ని తిరస్కరిస్తుంది. స్వరాజ్యంలో మారిన నైతికత వల్ల అక్కడ ఉండలేక అక్కడి నుండి నగరానికి వచ్చేస్తుంది. స్వరాజ్య రాజకీయ నాయకురాలిగా ఎదిగింది.
నగరానికి వచ్చిన నీల ఓ ఎన్ జి ఓ ను నడుపుతున్న అజిత దగ్గర ఉద్యోగం సాధించి తన జీవితానికి ఆర్ధిక స్థిరత్వం ఏర్పారచుకుంది.అ తర్వాత సదాశివతో సహజీవనానికి ఒప్పుకుంది. అతనితో కలిసి జీవిస్తున్న సమయంలో భద్రతను పొందింది. అంతకు ముందే స్త్రీలతో సంబంధాలు ఉండటం వల్ల అతను అందులో ఉండే విలువైనతనాన్ని గుర్తించాడు. అందుకే నీలను విలువైన వ్యక్తిగా చూసుకున్నాడు. నీల ప్రాథమికంగా కోల్పోయిన ఆర్ధిక, నైతిక భద్రతను సదాశివ ఆమెను పూర్తిగా అర్ధం చేసుకోగలగడం వల్ల ఆమెకు కావాల్సిన ఆలంబనను ఇవ్వగలిగాడు.అందుకే సహజీవనం అయినా ఆమె దానిని తప్పుగా భావించలేదు. నీల కూతురు మీనో తన గురించి పట్టించుకోవడాన్ని తన ప్రైవసీకు ఆటంకంగా భావించే దశలో ఉంటుంది. ప్రైవసీ కోసం నీల, సదాశివలకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకోవడమే కాకుండా ఓ ప్రయోగం కోసం చదువును మధ్యలో కూడా వదిలేస్తుంది.
పరదేశి అన్నేళ్ల తర్వాత మళ్ళీ కనిపించడం,మరలా అతన్ని కలవడానికి వెళ్ళడం, మరలా అనుభూతులను పొందిన నీలగా వచ్చిన ఆమె తన కొత్త కార్యదీక్షకు సిద్ధం అవ్వడంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో నీల పాత్ర నైతికతతో యుద్ధం చేస్తూ ఎదిగింది.ఆమె సదాశివతో ఉన్నాక ఆమెను చూడటానికి ప్రసాద్, సరళ వచ్చినప్పుడు ఆమె వారితో సంతోషంగానే గడిపింది. ఆమెకున్న భద్రత వల్ల ఆమె అలా ప్రవర్తించినా, అదే సుఖవంతమైన జీవితం ఆమెకు లేకపోతే వారిని చూసి బాధ పడి ఉండేదేమో. భర్తకు కట్టుబడి ఉండటమే నైతిక విలువగా భావించిన ఆమె నైతికత మనిషిని సుఖం, సంతోషాలకు దూరం చేసేది అయితే దానిని పాటించాల్సిన అవసరం లేదని అనుకుంది. మొదట పాస్టర్ కుటుంబం నీడలో, తర్వాత ప్రసాద్, సదా శివ నీడలో ఉన్న ఆమె చివరకు నీలగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంది.
నైతికతకు సహజీవనంకు, మనిషి స్వేచ్చకు ఉన్న సంబంధం మనుషుల సంబంధాలను లోతుగా అర్ధం చేసుకోలేని వ్యవస్థ నుండి జన్మించింది. మనిషి తనను తాను తెలుసుకోగలిగిన రోజు తన చుట్టూ ఉన్న పరిధులను దాటే ప్రయతం ఎలా చేస్తూ తనను తాను విస్తరించుకుంటూ తనతో తాను ఎలా ఎదిగే ప్రయత్నం చేస్తాడో నీల స్పష్టం చేస్తుంది. ఈ నవలలో కొన్ని చోట్ల ఆవరించి ఉన్న అనుభూతి ప్రధాన జీవితానికి కొంత ప్రేమ అవసరమే కానీ ఆ ప్రేమకు భద్రత ముడి వేయగానే ఆ అనుభూతిలో అభద్రత అపస్వరంగా మారుతుంది. అదే పరదేశి విషయంలో నీలను ముందడుగు వెయ్యనివ్వకుండా చేసింది. మనిషి ఆత్మబలాన్ని కోల్పోయినప్పుడు ప్రేమ, సుఖం వంటి వాటికి ఎదుటి వారి భావాలను జతపరుస్తాడు. అప్పుడే ఆ బంధం లక్ష్యాలు మారిపోతాయి. అప్పుడే ఆ బంధం పరోక్ష ఒప్పందం అయిపోతుంది. దానిని దాటితేనే మనిషి అనుభూతుల్లో, అనుభవాల్లో అసలైన సత్యాన్ని అన్వేషంచగలడు.
* * *

Comments
Post a Comment