కొత్త జీవితం అంచున!

  కొత్త జీవితం అంచున!

-శృంగవరపు రచన


మనిషికి తాను చూడని, అనుభవించని, గొప్పగా చెప్పబడే వాటి పట్ల అధిక ఆసక్తి, ఇష్టం ఉండటం సహజం. అమెరికాను భూతల స్వర్గంగా వర్ణించే తీరు దశాబ్దాల తర్వాత కూడా మారలేదు. అమెరికా పట్ల మక్కువ కలిగి ఉండటం ఓ సాధారణ అంశంగా పరిగణించబడుతుంది. తెలుగు సాహిత్యంలో అమెరికన్ జీవన విధానాన్ని, అందులో ఉన్న ఇబ్బందులను, దానిలో ఉన్న సాధారణత్వాన్ని, మనుషుల మధ్య ఉండే అనుబంధ హద్దులను, తన రచనల్లో అంశంగా ఎన్నుకుని రాసిన రచయిత డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావుగారు. అమెరికా మీద అటువంటి ఆశలు పెంచుకున్న తమ్ముడిని, అమెరికాలో ఉంటూ ఇండియా రావడం కోసం తపన పడిన అన్న ముఖ్య పాత్రలుగా, ఈ రెండు దేశాల జీవన విధానాల్లో ఉన్న సాధకబాధకాలను ఆయన ‘ఆవలి అంచు’ నవలలో స్పష్టం చేశారు. వారి రచనల్లో ఇదో విశిష్ట రచన. ఈ నవల ‘చతుర’ లో ప్రచురించబడింది.
కృష్ణారావు, రామారావు అన్నదమ్ములు. కృష్ణారావుకు అక్క వనజ, తమ్ముడు రామారావు. అతను ట్యూషన్ లో చదువుకునేటప్పుడు అతనికి లెక్కల మాస్టారి కూతురు శారద పరిచయం. కృష్ణారావు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే మనస్తత్వం కలవాడు. శారద పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్నా ఆమె తండ్రికి తన కూతురిని కలక్టర్ చదివించాలని, ఆమెకు గొప్ప సంబంధం తీసుకురావాలని, అప్పటి వరకు ప్రేమల జోలికి ఆమె పోకూడదనే అభిప్రాయాన్ని విని ఉండటంతో ఆమెకు అప్పటి నుండి దూరం అయిపోయాడు. పై చదువుల కోసం అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో కృష్ణారావు వెళ్తాడు. ఇది కొంత కుటుంబాన్ని బాధ పెట్టినా, అతను ఉద్యోగంలో స్థిర పడ్డాక, కుటుంబానికి భౌతికంగా దూరంగా ఉన్న, ఆర్థికంగా ఆసరాగా ఉండటంతో అతని పట్ల కుటుంబంలో ఉన్న అసంతృప్తి చెరిగిపోయింది.
ప్రతి విషయంలోనూ ఆచీ తూచి నిర్ణయం తీసుకునే కృష్ణారావు, ఓ పార్టీలో చూసిన రోహిణికి వెంటనే ప్రపోజ్ చేసి వివాహం చేసుకుంటాడు. ఇద్దరి ఆలోచనల మధ్య ఎంతో దూరం ఉన్నా సర్దుకుపోతూ ఉంటాడు. వివాహమైన కొన్నాళ్ళకు రోహిణికి ఇష్టం లేకపోయినా ఓ సారి తీసుకువచ్చి కుటుంబానికి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణించినప్పుడు అంత్యక్రియలకు వస్తాడు. అలా దాదాపుగా అమెరికా నివాసిగా మారిపోతాడు కృష్ణారావు. అతనికి ఇద్దరు సంతానం. ప్రకాష్, శైలజ. వారు అమెరికాలో స్థిరపడతారు. ఆ తర్వాత రోహిణి క్యాన్సర్ తో మరణిస్తుంది. ఇద్దరు మనవళ్ళు. ఉత్తమ్, వినయ్. వృద్దాప్య దశలో భారతదేశంలో స్తిరపడాలన్న కోరికతో, పొలం మధ్యలో ఇల్లు కట్టుకుని ఇండియాకు వచ్చేస్తాడు కృష్ణారావు.
రామారావుకి అన్న అమెరికా వెళ్ళడం, ఆ తర్వాత అతను వెళ్లలేకపోవడం వల్ల, అమెరికా అంటే ఉన్న ప్రత్యేక అభిమానం కూడా అతనిలో అమెరికా వెళ్లాలనే కోరికను బలపరుస్తుంది. కానీ అతను చదువు, వృత్తి రీత్యా అక్కడికి వెళ్ళే అవకాశం రాదు. అతని భార్య వైదేహి, భర్తకు తగ్గట్టు నడుచుకునే స్త్రీ. కొడుకు వినోద్ కు అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో, సహజంగానే తనలో మిగిలి ఉన్న అసంతృప్తిని కొడుకు ద్వారా తీర్చుకునే అవకాశం రావడంతో, ఎంతో ప్రోత్సహించి వినోద్ ను అమెరికా పంపుతాడు. వినోద్ అమెరికాలో స్థిరపడ్డాడు.
రిటైర్ అయ్యాక కొడుకు దగ్గరకు భార్యతో సహా వెళ్తాడు రామారావు. అక్కడికి వెళ్ళాక అక్కడి సాధకబాధకాలు ఆ దంపతులకు అనుభవంలోకి వస్తాయి. అక్కడ వాతావరణ వైరుధ్యం, వైద్యం విషయంలో ఎమర్జెన్సీ అయితే తప్ప వైద్యుడిని సంప్రదించలేని పరిస్థితులు, వచ్చే పెన్షన్ డాలర్ లలో ఎక్కువగా ఉండకపోవడం, కొడుకు,కోడలు ఇద్దరు రోజు పనులకు వెళ్తే ఆ దంపతులు ఇంట్లో రోజంతా గడుపుతూ ఉండటం జరుగుతుంది. కోడలు డాక్టర్, కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మనువడు టీనేజర్. అక్కడకు వచ్చాక భార్యకు మధుమేహం ఎక్కువ అవ్వడం, అలాగే రామారావుకు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పునరావృతం అవ్వడం జరుగుతుంది.
వారు బిజీగా ఉండటం, వైదేహి వారికి వంట చేయడం తప్ప వారికి ఏ విధంగానే కొడుకు,కోడలకు మానసికంగా దగ్గర అయ్యే అవకాశం ఉండదు. తమ వల్ల వారికి ఖర్చులు పెరగడం, తమ గురించి తాము ఆరోగ్యపరంగా పట్టించుకునే సౌలభ్యం అక్కడ ఉండకపోవడం, అక్కడ ఉన్నా వారికి భారంగా మారడమే అని అర్ధం చేసుకున్న ఆ దంపతులు తిరిగి భారత దేశం వచ్చేయాలని నిర్ణయించుకుంటారు. మనువడు స్వలింగ సంపర్కుడు అని తెలుసుకున్నప్పుడు, దానిని అంగీకరించలేని తనం ఆ భారతీయ మనస్తత్వాల్లో ఉండిపోతుంది.
కృష్ణారావు భారత దేశ పరిస్థితుల్లో ఇమడలేకపోతాడు. స్కూల్ , కళాశాల వంటివి బాగు చేయించే ప్రయత్నం చేసినా దానికి సరైన చిత్తశుద్ధి గల వారు లోపించడం వల్ల ఆ సంతృప్తి దక్కదు. ఆ తర్వాత అక్కడ కవిత అనే స్త్రీని కలవడం, ఆ వార్త వల్ల ఆమె ఇబ్బంది పడి దూరంగా జరిగినా, అప్పటికే భర్తను కోల్పోయినా, ఇద్దరు పిల్లలు స్థిరపడ్డాక,ఆమె లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంది. కొంత కాలం తర్వాత ఆమె కృష్ణారావుతో కలిసి అమెరికా వచ్చేస్తుంది. రామారావు భార్యతో భారత దేశం తిరిగి వస్తాడు. కృష్ణారావు తన ఇంటిని వారికి ఇచ్చేస్తాడు.
అలా ఆ ఇద్దరు అన్నదమ్ములు, పెరిగిన వాతావరణంలో ఏ పరిస్థితుల్లో అయినా జీవించే సౌలభ్యంతో పాటు ఎలా జీవించాలో అన్న స్పష్టత కూడా ఉంటుందని, కొత్త వాతావరణంలో ఆ అలవాటుపడిపోయిన తనం నుండి విడిపోవడం అంత త్వరగా జరిగే పని కాదని తెలుసుకుంటారు. మంచి అంశాన్ని, అంతే ఆసక్తికర కథనంగా, రెండు విరుద్ధ పరిస్థితుల నుండి ఎంతో చక్కటి నవలగా మలిచారు రచయిత.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ