విచిత్ర మానవ ప్రకృతి

  విచిత్ర మానవ ప్రకృతి 

    -శృంగవరపు రచన
                                                   

                                                      

                                                 

 ప్రతి రచయితకు సాహిత్యంలో తనదైన ముద్రను ఏర్పరచుకోవాలనే తపన ఉంటుంది. వృత్తి రీత్యా వైద్యులుగా ఉంటూ ప్రవృత్తి రీత్యా రచయితలుగా ఎదిగిన వారు తెలుగు సాహిత్యంలో ఎందరో కనిపిస్తారు. వైద్య వృత్తి ప్రభావం, నేపథ్యం ఈ రచయితలను ప్రభావం చేయడం కూడా సహజమే. అలా వైద్యులుగా ఉంటూ వైద్య, సాంకేతిక నేపథ్యాలను తన రచనల్లో ఉండేలా చూసుకుంటూ కథను ఆసక్తికరంగా నడిపే రచయితల్లో అరుదైన రచయితల్లో డాక్టర్ చిత్తర్వు మధు ఒకరు. ఆయన ‘ఔనా ...!’ నవల రొమాంటిక్ థ్రిల్లర్ శైలిలో కొనసాగినా, ఆయన తాను రాసిన దృక్కోణం గురించి ముందు మాటలో ఈ విధంగా స్పష్టం చేశారు. దీని వల్ల రచయిత ఈ రచన రాయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని ఇంకా స్పష్టంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.

 “ నా వుద్దేశ్యంలో... 
                ప్రతి వ్యక్తికీ మూడు విధాల జీవితం ఉంటుంది. ఒకటి –కుటుంబంలో, సంఘంలో ఇతర వ్యక్తులతో , సంస్థలతో తన సంబంధాల్ని, బాధ్యతల్ని నిర్వర్తించుకుంటూ పోవడం. రెండవది-అంతర్లీనమైన మానసిక జీవితం. ఆలోచనలు, ఆశలు, కలలు ,ఆశయాలు నెరవేరినవి-నెరవేరనివీ! మూడవది-శారీరకంగా తన శరీరంలో వున్న ఆరోగ్య స్థితి. వ్యాధులుండటం లేక అవి లేకపోవటం కానీ, పరిపూర్ణ ఆరోగ్యం- ఏదైనా కావచ్చు.

          సాహిత్యంలో రచయితలు మనిషి జీవితంలోని మొదటి రెండు కారణాలనే వ్యక్తీకరించడం ఎక్కువ. నవలా సాహిత్యంలో మనకి వ్యక్తి- కుటుంబం-సంఘం- మధ్య ఉన్న బంధాల్ని చిత్రించే నవలలు ఎక్కువ కనబడతాయి. ఆ తరువాత క్రమంగా మనిషి అతని మనసులోని ఆలోచనలని చైతన్య స్రవంతి లాగా వర్ణించిన stream of consciousness నవలలు (James Joyce) రావడంతో అతని అంతర్మధనం, ఆలోచనా స్రవంతిని వర్ణిస్తూ సాహిత్యంలో కథనం సృష్టించడం జరిగింది .

 నేను డాక్టర్ని కనుక మనిషికి ఉన్న మూడవ కోణం, ఆరోగ్యం,అతని శరీరంలోని వ్యాధులు, అవయవ నిర్మాణం, వాటికి అతని జీవితం మీద ఉండే ప్రభావం-ఇవి కూడా ముఖ్యమని చాలా గట్టి నమ్మకం. అంటే ఆ పాత్రల మానసిక, సాంఘిక, ఆర్థిక పరిస్థితులనే కాకుండా శారీరక, ఆరోగ్య పరిస్థితిని కూడా వర్ణిస్తూ –వీటి మధ్య జరిగే సంఘర్షణను వర్ణిస్తూ సాహిత్యాన్ని సృష్టించాలని నా ఆశ. ఇవన్నీ శాస్త్రీయ దృక్పథంగా ఉండాలని నా ఆశయం. సాంఘిక పరిస్థితులకు కేపిటలిజం, మార్క్సిజం, గ్లోబలైజేషన్, యుద్ధం, విప్లవం లాంటి సంఘటనలు ఎలా కారణమవుతాయో,మానసిక పరిస్థితులకి వ్యక్తి జీవితంలోని బాల్యం, విద్య, అతని అనుభూతులు, ఫ్రాయిడ్ లాంటి శాస్త్రవేత్తలు వర్ణించిన ‘కాంప్లెక్స్ లు ,ఫోబియాలు’ కారణం అవుతాయని నా విశ్వాసం. వీటికి తోడుగా శారీరక ఆరోగ్య పరిస్థితులు అతని ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి అని కూడా నేను నమ్ముతాను. దీనికి అనుగుణంగానే ఈ నవలను నా మనసులో ఊహించి, కల్పించి సృష్టించడం జరిగింది.” ఇది రచయిత ముందు మాటలో చెప్పింది.

 కథను నడపటంలో పఠనీయత మొదటి నుండి చివరి వరకు ఉండేలా చూసుకోవడంలో, మనుషుల్లో ఉండే హిపోక్రసిని, మనిషిలోని ఆదర్శాలు ఎలా వ్యక్తిగతంగా మారిపోతూ ఉంటాయో, ప్రేమ-స్పందన వంటివి మనుషుల మనస్తత్వాలను అనుసరించి ఎలా మార్పు చెందుతూ ఉంటాయో, శారీరక లోపాలు, మనుషులను ఎలా ఉన్మాదులుగా మారుస్తుందో, లైంగిక వైపరీత్యాలు ఎలా ఉంటాయో వంటి ఎన్నో అంశాలను, నైతిక సంఘర్షణ అనే వారధిగా చేస్తూ కథను నడిపారు రచయిత.

  కథకు వస్తే వినీల, నిషాద్ ల వివాహం జరుగుతుంది. తండ్రి బాల్యంలోనే మరణించడం, తల్లి కొన్నేళ్ళ క్రితం మరణించడం, అక్క విదేశాల్లో స్థిరపడటం వల్ల ఒంటరిగా మిగిలిన నిషాద్ సినీ పరిజ్ఞానంతో భార్యా భర్తల అనుబంధం గురించి కలలు పెంచుకున్నాడు. వినీలకు జువెనైల్ డయబెటిస్ ఉన్నా, ఆ విషయాన్ని దాచి వివాహం చేస్తారు. వినీలకు మంచి స్వరం ఉంది. పెళ్ళికి ముందు విజయచంద్ర అనే కళాకారుడి దగ్గర సంగీత పాఠాలు కొన్నాళ్లు కాలేజీ చదువుతో పాటు నేర్చుకుంది. ఆ సమయంలో అతనితో ప్రేమ బంధం ఏర్పడినా, ఓ సారి ఏకాంతంలో విపరీతంగా ప్రవర్తించబోయే ప్రయత్నం చేయడంతో ఆమె అతన్ని వదిలించుకుని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. మొదటి రాత్రి నిషాద్ తన సినీ పరిజ్ఞానం ప్రకారం ప్రవర్తించడం వల్ల అతన్ని ఓల్డ్ ఫ్యాషన్ వ్యక్తిగా భావించింది వినీల. అది ఆమెకు నచ్చలేదు. ఆమె తన భర్త నవీనంగా ఉండాలని కోరుకుంది. ఆ రాత్రే అతను తనను ఓ అమ్మాయి చదువుకునే రోజుల్లో ప్రేమ పెళ్లి అని వెంటాడిన తాను పట్టించుకోలేదని చెప్తాడు. అతను ఆ విషయం తమ మధ్య నిజాయితీ ఉండాలని చెప్పినా, వినీల మాత్రం విజయ చంద్ర విషయం చెప్పలేదు. కేవలం డయబెటిస్ విషయం మాత్రం చెప్పింది. వినీలకు భర్త పట్ల నిర్లిప్తత ఏర్పడింది. అతను ఎంత  ప్రేమగా ఉన్నా సరే ఆమె మాత్రం అతనంటే పట్టనట్టుగానే ప్రవర్తించేది. అవేమీ పట్టించుకోకుండా ఆమెను ప్రేమిస్తూ ఉండేవాడు నిషాద్.

 ఈ దంపతులు ఉంటున్న ఫ్లాట్ 403. మూడవ అంతస్తులో యాదగిరి అనే కేబుల్ ఆపరేటర్ ఉండేవాడు. ఇతనికి వాయురిజం అనే రుగ్మత ఉంది. మానవ లైంగిక ప్రవర్తనలోని కొన్ని వైపరీత్యాల్లో ‘వాయురిజం’ కూడా ఒకటి. ఇతరుల లైంగిక కార్యకలాపాలను చూసి ఆనందించడానికి అలవాటు పడే విపరీతమైన అలవాటునే ‘వాయురిజం’ అంటారు ఇంగ్లీషులో. సహజమైన శరీర వాంఛలూ తీరకపోవడం వల్లనో, ఇతర శారీరక, మానసిక రోగాల వల్లనో , ఈ వాయురిజం అనే దురలవాటు ఏర్పడుతుంది అంటారు వైద్య శాస్త్రజ్ఞులు. స్నానాలు చేసే వాళ్ళను బాత్ రూమ్ తలుపు రంద్రంలో నుంచి తొంగి చూడటం , బెడ్ రూమ్ కిటికిల్లో నుంచి తొంగి చూడటం ఇలాంటి లక్షణాలే!నిజానికి అశ్లీల సినిమాలూ, పుస్తకాలు చూడటం, చదవడం వ్యసనంగా మారడానికి కూడా ఈ విపరీత బుద్ధి కారణం కావచ్చు. యాదగిరి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్స్ లో రహస్యంగా వీడియో కెమెరాలు పెట్టి, మనుష్యుల లైంగిక జీవితాలను చూడటానికి అలవాటు పడ్డవాడు. అలా అతనికి 603 ఫ్లాట్ లో ఉంటున్న విజయ చంద్ర కు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఈ కెమెరా వల్లనే బయటపడతాయి. నిర్లిప్తంగా వినీల ఉంటున్న సమయంలో రోజు ఆమెకు ఫోన్ చేసే వాడు విజయ చంద్ర. అతని వైపు ఆకర్షితురాలు అయ్యింది.

 నిషాద్ వెంట ఒకప్పుడు ప్రేమించానని వెంటబడ్డ అతని మీద ప్రేమతో అవివాహితగానే మిగిలిపోతుంది. అతనికి దగ్గరలోనే తన క్లినిక్ పెట్టుకుంటుంది. ఇలా కథ త్రికోణపు ప్రేమ కథగా మారుతుంది. మేఘన నిషాద్ వెంటబడటం, వినీల విజయ చంద్ర వైపు ఆకర్షించబడటం, నిషాద్ వినీలనే ప్రేమిస్తూ ఉండటం. విజయచంద్రది విచిత్ర శరీరం మరియు మనస్తత్వం. అతను హెర్మా ఫ్రాడైట్. ఆడ మగ కానీ శరీరం. సన్నగా, పొడుగ్గా అవయవాలు, నాజూకుగా గొంతు, స్త్రీ పురుష లక్షణాలు మిళితమైన జననేంద్రియాలు. వీటి వల్ల అతని లిబిడో ...లైంగిక వాంఛ సహజంగా ఉన్నా, ఎలా తీర్చుకోవాలో తెలియని పరిస్థితి. దీనికి తోడు అతనికి మానసిక వ్యాధి అయిన మానియాక్ డిప్రెషన్ సైకోసిస్ కూడా ఉంది. మానియా స్థితిలో హింసాత్మకంగా మారిపోయి హత్యలు చేయగలిగే ఆవేశంతో, డిప్రెషన్ ఉన్నప్పుడూ ఆత్మహత్య చేసుకోగల నిర్వేదంతో ఉండే మనోవ్యాధి. అతని ఫ్లాట్ కు అందమైన అమ్మాయిలు వస్తూ పోతూ ఉండటం, అతను విపరీతంగా ప్రవర్తించడం, ఓ అమ్మాయిని గొంతు నులిమి చంపడం అతని ఇంట్లో అమర్చిన రహస్య వీడియో కెమెరా ద్వారా చూస్తాడు యాదగిరి. సంగీతం మాస్టారు గా విజయ చంద్ర వేరు, వ్యక్తిగా వేరు. 

 యాదగిరి శైలజను ప్రేమించాడు.కొన్నేళ్లుగా వారి మధ్య శారీరక సంబంధం కూడా ఉంది. ఆమెను వివాహం చేసుకుందామని నిశ్చయించుకుని ఆమెకు చెప్తే ఆమె ముభావంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఉద్యోగానికి కూడా వెళ్లలేదని తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి అడిగితే అప్పటికే ఆమె ఇంటికి రాక నాలుగైదు రోజులు అయ్యిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్తారు. ఆమె విజయచంద్ర దగ్గర మ్యూజిక్ క్లాసులు నేర్చుకోవడానికి వెళ్ళేదని చెప్తారు. ఆ తర్వాత ఆమె శవమై సాగర్ లో తేలుతుంది. ఆ విజయ చంద్రను గుర్తిస్తాడు యాదగిరి. శైలజది ఆత్మహత్య అని తేల్చినా విజయ చంద్ర హత్య చేసి ఉండవచ్చన్న అనుమానం అతనిలో కలుగడంతో అతన్ని రోజు వెంబడిస్తూ ఉంటాడు.

 విజయ చంద్ర దగ్గర రోజు మ్యూజిక్ క్లాసులకు వెళ్తూ ఉంటుంది వినీల. భర్త దగ్గర ఆ నిజాన్ని దాస్తుంది. వినీలకు డయబెటిస్ వల్ల సమస్య వచ్చినప్పుడల్లా అక్కడ ఉండే మేఘన దగ్గరకు వెళ్తుంది. ఓ సారి నిషాద్ ఆమెను తీసుకువస్తాడు. మరలా మేఘన మనసులో నిషాద్ పట్ల ఆశలు చిగురిస్తాయి. ఓ సారి అతని ఆరోగ్యం గురించి ఇంటికి కాల్ చేస్తే ఆమె ఏమి మాట్లాడకముందే వినీల ఆమెను విజయచంద్రగా భావించి మాట్లాడటంతో ఆమెకు అనుమానం కలిగి వినీలను వెంబడిస్తుంది. యాదగిరి ముంబై వెళ్ళి అక్కడ విజయ చంద్ర గత చరిత్ర గురించి తెలుసుకుంటాడు. సినిమాలో ప్రయత్నించడానికి అక్కడికి వచ్చిన విజయచంద్ర అది ఫలించకపోవడంతో మ్యూజిక్ స్కూల్ పెడతాడు. అతని దగ్గరకు వచ్చే ఓ అమ్మాయి చనిపోవడంతో, అతని మీద అనుమానం వచ్చినా, అతను నిర్దోషిగానే బయటపడతాడు. ఆ తర్వాత అక్కడి నుండి హైదారాబాద్ కు వచ్చినట్టు తెలుసుకుంటాడు. అప్పటికే వినీల రోజు క్లాసు తర్వాత అతనితో కలిసి రెస్టారెంట్ మరియు పార్కుకు వెళ్తూ ఉండేది. ఇది గమనించిన మేఘన నిషాద్ కు ఆ విషయం చెప్తుంది. యాదగిరి కూడా వినీలను కాపాడటానికి నిషాద్ కు అజ్ఞాత ఉత్తరం రాస్తాడు. అది నిజమేనని తెలుసుకుంటాడు నిషాద్ తన కళ్ళతో చూసిన తర్వాత కూడా.

 విజయ చంద్రకు తనకు చక్కెర వ్యాధి ఉన్నట్టు చెప్పదు వినీల. అలాగే అతని గత జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదు. తాను వివాహిత కనుక తనను ప్రేమించదటమే తన అదృష్టంగా భావిస్తుంది. అలా చెప్తే తన మీద ఆకర్షణ తగ్గిపోతుందని ఆమెకు తెలుసు. విజయచంద్ర పున్నమి రోజు తన దగ్గరకు రమ్మని వినీలకు చెప్తాడు. ఇక విజయచంద్రను వివాహం చేసుకోవాలని నిషాద్ కు మెల్లగా జరిగింది చెప్పి విడాకులు తీసుకోవాలనుకుంటుంది  వినీల. ఆ తర్వాత ఆ రాత్రి ఆమె మీద పైశాచికంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు విజయచంద్ర. యాదగిరి సాయంతో ఆమెను కాపాడగలుగుతాడు. విజయచంద్రను పోలీసులకు అప్పగిస్తారు. నిషాద్ ఆమెతో కలిసి ఉండటానికి ఇష్టపడినా దానికి ఇష్టపడదు వినీల. తాను మిగిలిన జీవితం సోషల్ వర్కర్ గా గడుపుతానని, డయాబెటిస్ పట్ల అవగాహన కలిగిస్తానని చెప్పి, విడాకులపై సంతకాలు పెట్టిస్తుంది నిషాద్ చేత. మేఘన,నిషాద్ ఆ తర్వాత ఒకటవుతారు.

 ఓ పక్క కథను థ్రిల్లింగ్ గా, ఇంకో పక్క మనుషుల మానసిక ఆరోగ్య ప్రభావం వారిని మార్చే తీరును, ఇంకో పక్క స్త్రీ పురుషుల సంబంధాల్లో ఉండే అసూయలు, వాటి వల్ల జరిగే తప్పులు, మనిషి వ్యక్తిగతంగా తప్పు ఒప్పులను తన జీవితానుభవాలను అనుసరించి మార్చే తీరును, ఇలా ఎన్నో అంశాలను ఎక్కడ బోర్ కొట్టించకుండా, అవసరమైన ప్రతి చోట శారీరక, మానసిక ఆరోగ్య స్థితులు, వాటి కారణాల గురించి కూడా స్పష్టంగా రాసి, ఆద్యంతం ఆసక్తితో పాఠకుల చేత చదివింపజేసే నవలగా రాసిన రచయితకు అభినందనలు. ఈ నవల ఆంధ్రప్రభలో సీరియల్ గా  వచ్చింది. 2006 లో పుస్తకంగా వెలువడింది. 
   *           *       *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ