సమాజం-సంతానం
సమాజం-సంతానం
జీవితంలో మనిషి ఎలా బ్రతికినా సరే,అతను సమాజంలో ఒకడిగా ఉండిపోవాలి అనుకున్నప్పుడు ఎన్నో కొత్త సమస్యలు అదే సమాజం నుండి ఎదురవుతాయి.మనిషి వ్యక్తిగత జీవితానికి సమాజం వల్ల సంఘర్షణతో ఏర్పడే సమస్యల గురించి రాసిన తమిళ రచయిత పెరుమాల్ మురుగన్.ఆయన రాసిన 'చితి'నవల వివాహ వ్యవస్థ-కులం-సమాజం మధ్య ఉన్న ఘర్షణను చిత్రిస్తే,'అర్ధనారి' సంతానం లేని దంపతులు ఎదుర్కునే సమస్యలను స్పష్టం చేస్తుంది.
పొన్న, కాళీ దంపతులు. పెళ్ళయిన పన్నెండేళ్లకు కూడా సంతానం లేకపోవడం వల్ల వారిని చుట్టూ ఉన్న వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలెత్తి చూపడం, నిందించడం చేస్తున్నారు. పొన్న సంతానం కోసం వారి ఆచారాల ప్రకారం ఎన్నో పూజలు చేసింది. ఆఖరికి వారి వంశంలో ఎవరైనా ఏదైనా తప్పు చేసారేమో అని కనుక్కుని మరి పరిహారాలు చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆమె కడుపు పండలేదు. ఆమె భర్తకు రెండో పెళ్ళి చేసుకోమని ఎందరూ చెప్పినా, దానికి పొన్న తల్లిదండ్రులు ఒప్పుకున్నా సరే, పొన్న బాధ పడుతుందని తెలిసి అతను దానికి దూరంగా ఉంటాడు.
వారి పండగలోని ఆచారం ప్రకారం ఆ పండగ రోజుల్లో అందరి మగవాళ్ళల్లో దేవుడు ఉంటాడని, వారితో సంగమించడం తప్పు కాదనే భావనతో అప్పటికే ఎందరో స్త్రీలు గర్భవతులు అయ్యారు. కాళీ దీనికి ఒప్పుకోడు. కానీ అతను ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పి ఆమెను అందుకు సిద్ధం చేయడం, ఆ సమయంలో కాళికి ఆ విషయం తెలియకుండా ఉండటం కోసం పొన్న అన్న ముత్తు అతన్ని వేరే చోటుకు తీసుకువెళ్లడం, కానీ తెల్లవారక ముందే భార్య గుర్తుకు వచ్చిన కాళి ఎవరికి చెప్పకుండా అత్తారింటికి వెళ్ళడం, అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో,జరిగింది అతనికి అర్ధం కావడం, అతని మనసు విరిగిపోవడంతో నవల ముగుస్తుంది.
ఈ నవల వివాదాలకు గురయ్యింది. సంతానం భార్యాభర్తల అనుబంధానికి చిహ్నం అనే భావన ఆ దంపతులకు సంబంధించింది అయితే, ఆ దంపతులకు సమాజంలో ఓ హోదా కల్పించే సంకేతం. సంతానం లేకపోవడం ఓ లోటుగా, అటువంటి దంపతులు సమాజంలో శుభాకార్యాలకు పనికి రాని వారిగా చూడబడటం, వారి ఆస్తుల కోసం బంధువులు ప్రయత్నించడం, ఇన్ని సమస్యల మధ్య వ్యక్తిగత కోణం నుండి ఇది ఆ దంపతులకు సమాజంలో బ్రతకడమే సమస్యగా మారే పరిస్థితులకు దారి తీస్తుంది.
ఈ సమస్యను ఆ ప్రాంతపు నేపథ్యం, ఆచారాలు, వాటి వల్ల ఇబ్బంది పడే మనుషుల మనసులు, జీవితంలో సమాజం అధిక ప్రాధాన్యత సంతరించుకున్నప్పుడు వ్యక్తి స్వేచ్చను కోల్పోయే క్రమం కూడా ఈ నవల స్పష్టం చేస్తుంది.
సమాజం మనుషుల మధ్య ఓకే రకమైన ఆచారాలు, అలవాట్లు వల్ల నిర్మించబడింది. ఆ పోలికలు లేనప్పుడు ఆ సమాజపు ప్రతిస్పందనకు నిదర్శనమే ఈ నవల.
* * *

Comments
Post a Comment