ప్రేమ పుట్టిన చోట
ప్రేమ పుట్టిన చోట
భారతీయ కళాశాల ప్రేమలను నేటి పరిస్థితులకు అనుగుణంగా రాయడం పరిచయం చేసిన రచయిత చేతన్ భగత్. ఆ తర్వాత అదే కథాంశాలను ఎందరో రచయితలు అనుసరించారు. కానీ కథను మించి భావోద్వేగాలను సున్నితంగా అక్షరీకరించిన వారు మాత్రం అరుదు.అటువంటి సున్నిత ఉద్వేగాలను,అతి సున్నితంగా ‘Wish I Could Tell You’ నవల ద్వారా స్పష్టం చేసిన రచయిత దుర్జాయ్ దత్త. ఈ కథలో మనిషి మనిషిని ప్రేమించడానికి ఉండే మానసిక కోణం నుండి కథ ద్వారా రచయిత చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథ కన్నా కథ చెప్పిన విధానం పాఠకులను కదిలించక మానదు.
ఈ కథలో ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ ఏ పరిస్థితుల్లో ఆ ప్రేమ జన్మిస్తుంది అన్నదే ఈ కథకు విశిష్టతను చేకూరుస్తుంది. ఈ కథలో ముఖ్య పాత్రలు అనూష,గౌతమ్. వీరిద్దరి ప్రేమ కథ ఈ నవల. అనూషకు రచయిత్రి అవ్వాలనే కోరిక ఉంది. ‘వుయ్ డొనేట్’ సంస్థలో ఆమెకు స్క్రిప్ట్ రైటింగ్ ఉద్యోగం వస్తుంది.మొదట ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో అని చెప్పినా ఆ సంస్థ ఆమెను మెడికల్ విభాగంలో స్క్రిప్ట్ రైటర్ గా చేర్చుకుంటారు. ఈ సంస్థ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేని వారికి డబ్బులు డొనేషన్ ద్వారా స్వీకరించడం,అలాగే ఎటువంటి ప్రాజెక్ట్స్ కి అయినా సరే డబ్బులు దాతల నుండి స్వీకరించడం ముఖ్య లక్ష్యంగా పని చేస్తూ ఉంటుంది.
ఈ సంస్థలో ఇష్టం లేకపోయినా సరే అనూష ఆ మెడికల్ విభాగంలో స్క్రిప్ట్ రైటింగ్ చేస్తూ ఉంటుంది.ఆమె ఎవరితోనూ కలవదు.ఆమె ప్రపంచం మీద ద్వేషం పెంచుకుంది.దానికి కారణాలు ఎవరికి తెలియవు.ఆమెకు ఉన్నది తల్లి ఒక్కటే. పని మాత్రం ఎంతో బాగా చేస్తుంది. అలాగే కేవలం వైద్య సాయం అందించడానికి ఆమె స్క్రిప్ట్ మార్చడం,కొన్ని అబద్ధాలు కూడా రాయడం జరిగినా ఆమె డొనేషన్స్ వచ్చేలా చేయడం వల్ల ఆమె అంటే గురి ఏర్పడుతుంది సంస్థకు.
ఆమెకు ఎప్పటి నుండో దాతలు స్పందించని గౌతమ్ కేసు వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఇతను చేసిన ట్వీట్స్ వల్ల అతనికి సాయం రాకుండా పోయిందని ఆమెకు తెలుస్తుంది.ఆమె గౌతమ్ ఇంటికి వెళ్ళి అతని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. అలా గౌతమ్ ఇంటికి వెళ్తుంది.అతను బెడ్ మీద చలనం లేకుండా ప్రాణంతో ఉంటాడు. అతని గురించి తెలుసుకుంటుంది. అతనికి ఫోటోగ్రఫి అంటే ఇష్టమని అతని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆమె అతను తీసిన ఫోటోలను గమనిస్తుంది. ఆ ఫోటోలను బట్టి అతనిలో ఉన్న ప్రేమ,సానుభూతి,కరుణను అర్ధం చేసుకుంటూ ఉంటుంది.
అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కరిష్మా అతని ఫ్రెండ్ అరవింద్ కోసం అతన్ని వదిలేయడం జరుగుతుంది. అంతకు ముందు అతనికి 13 ఏళ్ళ వయసున్నప్పుడు పుట్టిన అతని చెల్లెలు అతనికి 16 ఏళ్ళ వయసున్నప్పుడు స్కూల్ నుండి వస్తూ అతని ముందే యాక్సిడెంట్ కు గురవుతుంది.ఆ సమయంలో అతను ఎవరి సాయం అడిగినా ఎవరూ ముందుకు రాకపోవడం,ఆ పాప మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా అతను మాములుగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతను తన ఫ్రెండ్స్ గురించి, సమాజంలో ఉనన్ అంశాల గురించి తనకు అనిపించింది పెట్టెయ్యడం కొందరి ఆగ్రహానికి గురవ్వడం జరిగింది. ఆ ట్వీట్స్ వల్లే అతన్ని అందరూ ద్వేషించారు. దానికి కారణం అతనికి మెదడులో ఉన్న ట్యూమర్ ఫ్రంటల్ లోబ్ తో ప్రెస్ అవ్వడం వల్ల అతని ఫీలింగ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయని దేని గురించి కూడా అతనికి సహానుభూతి లేకపోవడం వల్ల అతని ప్రవర్తన అతని మనసులో అజ్ఞాతంగా ఉన్న బాధ ఆ రూపంలో బయటికి వచ్చిందని ఆమె అర్ధం చేసుకుంటుంది.
అతన్ని ఎలా అయినా బ్రతికించాలని ఆమె నిర్ణయించుకుంటుంది.అతని ఇంట్లోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటుంది. అందరూ వద్దనుకుని వదిలేసినా తమ కొడుకు పట్ల ఆమె అంత శ్రద్ధ తీసుకోవడం గౌతమ్ తల్లిదండ్రులను కూడా కదిలిస్తుంది. తల్లిదండ్రుల సాయంతో అతని పేరును అనంత్ గా మార్పిస్తుంది. తన పేరు మోహినిగా మార్చుకుంటుంది. ఆమె అతన్ని ఎలా అయినా కాపాడటం కోసం అతనికి లవ్ ప్రపోజ్ చేస్తూ వీడియో చేసి, అతనికి సాయం చేయమని అడగటం ఎందరినో కదిలిస్తుంది. ఆ వీడియో వల్ల డబ్బులు రావడం,ఆపరేషన్ జరిగి అతను బయట పడటం జరుగుతుంది. కానీ ఆ ఆపరేషన్ కన్నా ముందే గౌతమ్ ట్వీట్స్ వల్ల తన ఉద్యోగం,గౌరవం కోల్పోయిన అమిత్ మోడి కోపంలో అనూష మీద దాడి చేయడం, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఆమె కోమాలో ఉండిపోవడం జరుగుతుంది. అలా గౌతమ్ స్పృహలోకి వచ్చేసరికి అనూష చలనం లేని జీవిగా మారిపోతుంది.
అనూష మోహినిగా,గౌతమ్ అనంత్ గా మారతారు. అనంత్ గురించి మోహిని తెలుసుకున్నట్టే అనంత్ కూడా ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తనకు ఆమె ప్రపోజ్ చేసిన వీడియో కేవలం అతన్ని బ్రతికించడానికి మాత్రమే చేసిందని మోహిని తల్లి స్పష్టం చేస్తుంది. ఆ లవ్ వీడియో వైరల్ అవ్వడంతో వారిద్దరి ప్రేమ మీద వుయ్ డొనేట్ ఓ సినిమా చేయాలనుకుంటుంది. అప్పుడే మోహిని అనూషగా ఉన్నప్పుడూ ఆమె జీవితం గురించి లోతుగా అనంత్ కూడా తెలుసుకుంటాడు.
అనూష తండ్రికి ఆమె ఒక్కర్తే కూతురు.అనూషకి తండ్రి అంటే ఎంతో ప్రేమ. కానీ ఎప్పుడైతే ఇంకో కుటుంబం ఉందని తెలుసుకుందో అప్పటి నుండి ఆమెకు అతని మీద నమ్మకమే కాదు ప్రపంచం మీదే నమ్మకం కోల్పోయింది. ప్రపంచాన్ని ఆమె చూసే దృష్టి మారిపోయింది. అందరూ మోసగాళ్ళే అనే అభిప్రాయం,మనుషులంటే ఓ రకమైన విరక్తితో ఆమె జీవించసాగింది. కానీ గౌతమ్ కేసుతో మమేకమయ్యే క్రమంలో ఆమె మారింది. గౌతమ్ కూడా ఎలా తన లానే గర్ల్ ఫ్రెండ్ ని కోల్పోవడం,చెల్లిని కోల్పోవడం,అతను ట్వీట్స్ ద్వారా ప్రపంచం మీద కోపాన్ని ప్రదర్శించడం ఆమెను అతనిలో చూసుకునేలా చేసింది.అందుకే ఆమె అతన్ని ఇష్టపడింది. అలానే అంతకుముందు అతనిలో ఉన్న ప్రేమ కూడా అతని జీవితంలో ఆమె చూడగలిగింది. అనూష తన జీవితాన్ని గౌతమ్ జీవితంలో చూసుకోవడమే కాకుండా,తన బాధల్లో ఉన్న పోలికలను కూడా అతని బాధల్లో దర్శించింది. కొంత అటువంటి భావ,మానసిక పొంతన వల్ల కూడా అతని పట్ల ఆమె ప్రేమ పెంచుకుంది.
కానీ అనంత్ గా మారిన గౌతమ్ ఆమెను ప్రేమించినా ఆమె తనను ప్రేమించిందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతాడు. ఆమె ల్యాప్ టాప్ లో ఆమె రికార్డింగ్ ఆపడం మార్చిపోయిన వీడియో ద్వారా ఆమె తనను ప్రేమించిందని తెలుసుకుంటాడు. ఇంతటితో నవల ముగుస్తుంది. కానీ కథ బావున్నప్పటికి రచయిత కథ చెప్పడంలో కాలాన్ని స్పష్టం చెయ్యడంలో కాస్త గందరగోళంగా రాయడం జరిగింది. కథ మొదట్లో అనూష,అనంత్ ఇద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నట్టు రాయడం, ఆ తర్వాత మోహినిని ఇంకో పాత్రగా చూపించడం, ఆ మేరకు ఈ ప్రేమ కథలో చివరకు అంతా అర్ధం అయినా ఇద్దరూ ఒకేసారి లేని పరిస్థితుల్లో ఇద్దరిని అదే సంస్థలో ఉద్యోగులన్నట్టు పరిచయం చేయడం చివరిలో కథతో సంబంధం లేకుండా ఉంటుంది. ఈ గందరగోళం తప్పిస్తే ఇది ఫీల్ గుడ్ నవల అని చెప్పవచ్చు.
ప్రేమ రూపం-ఉద్యోగం-భద్రతలను దాటి మనిషి తనను ఆమోదించని సమాజంలో తనకు చోటు లేదని అనుకుంటూనే అటు వంటి మనుషులను వెతుక్కునే క్రమంలో కూడా పుట్టవచ్చు. అది తన లాంటి వారిని కలుసుకోవాలనే తపనలో పుట్టవచ్చు. తన లాంటి వారు కూడా ఉన్నారు అనే ధైర్యం నుండి పుట్టవచ్చు. జీవితంలో ట్రౌమా అనుభవించిన వారి జీవితాల్లో ప్రేమ అన్నది విచిత్ర పరిస్థితుల్లో,చిత్రమైన వ్యక్తులతోనే జన్మిస్తుంది.
* *

Comments
Post a Comment