తెలిసిన అపరిచితులు

 తెలిసిన అపరిచితులు

-శృంగవరపు రచన



ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎందరో తెలియని అపరిచితులను,తెలిసిన అపరిచితులను తన జీవితంలో భాగం చేసుకుంటాడు. రూపం తెలియని వారు తెలియని అపరిచితులైతే,రోజు లేదా అప్పుడప్పుడు కొందరు మనుషులను వివిధ రకాలుగా చూస్తూ వారి గురించి తెలియకుండా ఉండటం తెలిసిన అపరిచితులు అనడానికి అర్హులు.అలాంటి తెలిసిన అపరిచితుల జీవితాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసి ఓ స్త్రీ ఎలా చిక్కుల్లో పడిందో స్పష్టం చేసే నవలే పాలా హాకిన్స్ రాసిన ‘ద గర్ల్ ఆన్ ద ట్రెయిన్.’ ఈ నవల సినిమాగా వచ్చినప్పటికి నవలలో ఉన్న పాత్రల మానసిక సంచలనాలను,వారి జీవితాల్లో ఉన్న సంఘర్షణలను,వారి మనస్తత్వాలను ఈ సినిమాలో ఈ నవల చదివిన పాఠకులు చూడలేరు. కొన్ని నవలలు చదవదగినవి. ఇటువంటి నవలల్లో కథ కన్నా కూడా పాత్రల ప్రవర్తన,దానికి కారణాలు,వారి అస్తవ్యస్త ఆలోచనలు అక్షరాల్లో స్పష్టం అయినట్టు దృశ్యాల్లో కనపడవు.
ఈ నవలలో ప్రధాన పాత్ర రేచెల్. రేచెల్ భర్త టామ్ తో విడిపోయింది. భర్త నుండి విడిపోయిన రేచెల్ ఆ తర్వాత తన స్నేహితురాలు కాతి ఇంట్లో ఉంటుంది. ఆమెకు ఉన్న తాగుడు అలవాటు వల్ల ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఆ విషయం స్నేహితురాలు దగ్గర దాచి ఆమె రోజు ఆఫీసుకు వెళ్తున్నట్టు ట్రెయిన్ లో లండన్ వెళ్తూ ఉంటుంది. ఆ ట్రెయిన్ పయనించే మార్గంలో ఆమె అంతకుముందు టామ్ తో ఉన్న ఇల్లు ఉంటుంది. దాని పక్కనే ఉన్న ఇంకో ఇంట్లో ఓ జంటను రోజు తన ప్రయాణంలో గమనిస్తూ ఉంటుంది రేచెల్. వారికి జెస్సి,జాసన్ అనే పేర్లు కూడా పెట్టుకుంటుంది.
జెస్సి,జాసన్ రోజు అన్యోన్యంగా ఉండటం ట్రెయిన్ నుండి వెళ్తున్నప్పుడు వారు బాల్కనీలో ఉండటం చూస్తూ ఉన్న రేచెల్ ఒక రోజు జెస్సి జాసన్ తో కాకుండా ఇంకో పురుషుడితో ఉండటం గమనిస్తుంది. ఆ జెస్సి పేరు మేగన్.ఆ జాసన్ పేరు స్కాట్. రేచెల్ గర్భవతి కాలేకపోవడం,ఐవిఎఫ్ విఫలమవ్వడం,ఆమె తాగుతూ ఉండటం వల్ల ఆమె మీద ఆసక్తి కోల్పోయిన ఆమె భర్త టామ్ అన్నా అనే స్త్రీతో సంబంధం పెట్టుకుని,రేచెల్ కు విడాకులు ఇచ్చి,అన్నాను వివాహం చేసుకున్నాడు.వారికి ఒక కూతురు కూడా. ఆ పాప పేరు ఎవిస్.
వారి ఇంటికి దగ్గరలో ఉంటున్న మేగన్ ఎన్నో ఉద్యోగాలు చేస్తూ మారుతూ ఉంది.కొన్నాళ్లు వెయిట్రెస్ గా పని చేసింది. కొన్నాళ్లు గ్యాలరీలో పని చేసింది. ఇంకొన్నాళ్లు ఏ ఉద్యోగం లేక అన్నా కూతురుకు నానిగా పని చేసి మానేసింది. అలా మేగన్ అన్నా కుటుంబానికి కూడా పరిచితురాలే. మేగన్ కు ఒక సోదరుడు బెన్. అతనితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉండేది.అతను ఓ మోటార్ యాక్సిడెంట్ లో మరణించాక ఆమె తల్లిదండ్రులకు కూడా దూరంగా జరిగిపోయింది. ఆ తర్వాత ఆమె 16 ఏళ్ల వయసులో 40 ఏళ్ల వయసున్న మ్యాక్ తో సంబంధం పెట్టుకుని అతన్ని పెళ్లి చేసుకుంది. వారిద్దరూ అప్పటికే డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఆ సమయంలోనే మేగన్ గర్భవతి అవుతుంది. ఆమెకు ఆ సమయంలో ఓ కూతురు పుడుతుంది.డ్రగ్ ఎడిక్ట్ అయిన మేగన్ ఓ రోజు బాత్ రూమ్ టబ్ లో పసిపాపను అలాగే చన్నీళ్ళల్లో కొన్ని గంటలు వదిలివేయడంతో ఆ పాప మరణిస్తుంది. ఆ పాప మరణించాక వెళ్ళిపోయిన మ్యాక్ తిరిగి ఆమె జీవితంలోకి రాలేదు.
మనిషి తన జీవితంలో బాధించే సంఘటనల పట్ల ఎలా స్పందిస్తాడో అదే రకమైన పరిస్థితుల్లో ఉన్నవారిని చూసినప్పుడు కూడా అదే రకంగా ఆలోచిస్తాడు. రేచెల్ కు మేగన్,స్కాట్ లు అపరిచితులు అయినప్పటికి రోజు వారిని ట్రెయిన్ లో నుండి చూడటం వల్ల వారితో తెలియని ఓ రకమైన తెలియని సన్నిహిత భావనను ఉన్నట్టు భావిస్తుంది రేచెల్. రేచెల్ ను ఆమె భర్త టామ్ మోసం చేయడం వల్ల మేగన్ ను వేరే వ్యక్తితో చూసినప్పుడు రేచెల్ మేగన్ ను చెడ్డ వ్యక్తిగా,స్కాట్ ను మంచివాడుగా అనుకుంటుంది. అంతర్లీనంగా ఈ రకమైన రేచెల్ అభిప్రాయాన్ని గమనిస్తే రేచెల్ మేగన్ లో తన భర్త టామ్ ప్రవర్తన ఉన్నట్టు భావించి ఉండవచ్చు. స్కాట్ లో తనను తాను చూసుకుని ఉండవచ్చు. ఏ మనిషి తనను తాను చెడ్డవాడుగా అనుకోడు కనుక ఆమెకు తనకు దగ్గరగా ఉన్న స్కాట్ మంచివాడుగా,టామ్ కు ప్రవర్తనలో దగ్గరగా ఉన్న మేగన్ చెడ్డ వ్యక్తిగా అనిపించి ఉండవచ్చు.
రేచెల్ వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఆమెలోని ఒంటరితనం ఆమెను అన్నింటి పట్ల ఆసక్తి ప్రదర్శించేలా చేస్తుందని స్పష్టం అవుతుంది.ఆమె తల్లికి కూడా దూరంగా ఉండటం,స్నేహితురాలితో అన్ని పంచుకోలేకపోవడం వల్ల ఆమె తన మాజీ భర్త టామ్ కు కాల్స్ చేస్తూ ఉంటుంది.ఓ సారి రేచెల్ టామ్ ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో అన్నా నిద్రలో ఉంటుంది.పక్కనే ఉన్న పాపను రేచెల్ ఎత్తుకుని తనతో పాటు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమెను అన్నా పట్టుకుని పాపను తీసుకుంటుంది. ఆ రోజు నుండి అన్నా రేచెల్ ను తన కుటుంబానికి ఓ ప్రమాదంగా భావిస్తూ ఉంటుంది. రేచెల్ టామ్ కు తన ఒంటరితనంలో కాల్స్ చేస్తూనే ఉంటుంది.టామ్ ఓ మేరకు స్పందిస్తూనే ఉంటాడు.
మేగన్ కనిపించలేదన్న వార్త పత్రికల్లో వచ్చాక రేచెల్ కు ఈ అంశం పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఆమె ఓ సారి వేరే పురుషుడితో ఉండటం చూసిన రేచెల్ ఆమె అతనితో లేచిపోయి ఉండవచ్చని కూడా భావిస్తుంది. ఈ విషయం ఆమె భర్త స్కాట్ కు చెప్పాలని అనుకుంటుంది.మేగన్ కనిపించకుండా పోయిన రోజు రేచెల్ టామ్ ఇంటి పరిసరాల్లో ఉంటుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆమెకు గుర్తు ఉండదు. ఆ తర్వాత రోజు టామ్ చెప్పినప్పుడు కొంత అర్ధమైన పూర్తి విషయం ఆమెకు అర్ధం కాదు. ఆమె తాగి ఉన్నప్పుడూ టామ్ కారులో వెళ్తూ చూశాడని ఆమెను ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పినా ఆమె వినలేదని చెప్తాడు.
మేగన్ తప్పిపోయిన రోజు అన్నా ఆ పరిసరాల్లో ఉండటం వల్ల పోలీసులు ఆమెను ప్రశ్నిస్తారు.ఆ సమయంలోనే ఆమె మేగన్ తో ఉన్న అపరిచితుడి గురించి చెప్తారు. తాగుబోతు అయిన రేచెల్ మాటలను నమ్మదగినవి కానివిగా భావిస్తారు. రేచెల్ స్కాట్ కు తనకు మేగన్ గురించి ఓ ముఖ్య విషయం చెప్పాలని మెయిల్ చేస్తుంది.స్కాట్ అంగీకారం తెలియజేశాక అతన్ని కలుస్తుంది. తనకు మేగన్ గ్యాలరీలో తెలుసని అబద్ధం చెప్తుంది రేచెల్.ఆమె ఓ పురుషుడితో సన్నిహితంగా ఉండటం తాను చూశానని చెప్తుంది. అలా ఈ విషయం ద్వారా రేచెల్,స్కాట్ సన్నిహితులు అవుతారు.
మేగన్ తన థెరపిస్ట్ తో కొంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నా అతను ఆ సంబంధం నుండి తొలగిపోతాడు. అతన్ని అనుమానించి మొదట అరెస్ట్ చేసిన ఏ సాక్ష్యాలు లేకపోవడం వల్ల అతన్ని విడుదల చేస్తారు. ఆ థెరపిస్ట్ నే రేచెల్ చూసింది కూడా.మేగన్ విషయంలో అత్యంత ఆసక్తి పెంచుకున్న రేచెల్ ఆ థెరపిస్ట్ దగ్గర రోగిగా అపాయింట్మెంట్ తీసుకుంటుంది.ఆ తర్వాత కొన్ని రోజులకు మేగన్ శవం బయట పడుతుంది.
స్కాట్ కు రేచెల్ చెప్పిన అబద్ధాల గురించి తెలుస్తుంది.ఆమె ఆ థెరపిస్ట్ దగ్గర ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్న విషయం తెలుసుకున్న స్కాట్ ఆమె తనకు వ్యతిరేకంగా ఈ హత్యలో తనను ఇరికించడానికి ఆ థెరపిస్ట్ తో పని చేస్తుందని అనుకుని ఆమెను గాయపరుస్తాడు. అలా మేగన్ విషయంలో సాయం చేద్దామనుకుని చిక్కుల్లో పడుతుంది రేచెల్.
రేచెల్ కు మేగన్ తప్పిపోయిన రోజు జరిగింది గుర్తుకు వస్తుంది. ఆ రోజు ఆ పరిసరాల్లో తాను అక్కడ ఉన్నప్పుడు టామ్ రావడం,అతనితో పాటు కారులో ఇంకో స్త్రీ ఉండటం ఆమెను అన్నా అని అనుకోవడం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఆమె ఆలోచిస్తే ఆమెకు ఆ రోజు టామ్ తో కారులో ఉన్నది అన్నా కాదని మేగన్ అని స్పష్టమవుతుంది. ఆ హత్య చేసింది టామ్ అని ఆమెకు అర్ధమవుతుంది.
ఇదే సమయంలో అన్నా టామ్ జిమ్ బ్యాగ్ లో ఓ పాత ఫోన్ ను చూస్తుంది.దానిలో మేగన్ అతనికి పంపిన వాయిస్ మెసేజీలు,కాల్ లిస్ట్ చూస్తుంది.మేగన్ తో భర్తకు సంబంధం ఉందని ఆమెకు అర్ధమవుతుంది. అదే సమయంలో రేచెల్ ఆమె ఇంటికి వస్తుంది. మేగన్ ను హత్య చేసిందని టామ్ అని ఆ రోజు అతనితో కారులో ఉంది మేగన్ అని అన్నాకు చెప్తుంది. అదే సమయంలో టామ్ ఇంటికి తిరిగి వస్తాడు. తన గురించి తెలిసిపోయిందని అర్ధమైన టామ్ కూతురిని తన దగ్గర ఉంచుకుని అన్నా తన వైపు ఉండేలా చూసుకుంటాడు. తానే మేగన్ ను హత్య చేశానని ఒప్పుకుంటాడు. ఆమెతో సరదాగా తాను సంబంధం పెట్టుకున్నా ,ఆమె తనను మరలా వేధించడంతో, ఆమెకు మొదట నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, ఆమె ఆ రోజు తాను గర్భవతి అని చెప్పడం,ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి ఇష్టపడకపోవడం,ఆమె తనతో గొడవ పడటంతో తానే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను హత్య చేసి పాతిపెట్టానని చెప్తాడు. రేచెల్ పోలీసులకు తెలియజేస్తానని చెప్పడంతో ఆమెను గాయపరుస్తాడు. మొత్తానికి అక్కడి నుండి తప్పించుకుని పోలీసులకు రేచెల్ ఫోన్ చేసే సమయంలో ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు రేచెల్ అతని మెడలో ఓ స్క్రూతో పొడుస్తుంది.టామ్ మారణించడు. అన్నా ఆ స్క్రూను ఇంకా గట్టిగా తిప్పి అతను మరణించేలా చేస్తుంది. ఆ తర్వాత పోలీసులకు రేచెల్ తనను తాను రక్షించుకునే క్రమంలో అతన్ని గాయపర్చడం,అతను మరణించడం జరిగిందని రేచెల్,అన్నా ఇద్దరు బలపరచడంతో మొత్తానికి టామ్ హత్య నుండి ఇద్దరూ బయటపడటం జరుగుతుంది.
మనకు తెలిసిన వ్యక్తుల గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో మనకు తెలిసినప్పుడు మన గురించి మనకు ఇంకా బాగా తెలుస్తుంది. రేచెల్ పాత్ర ఇందుకు ఉదాహరణ. టామ్ రేచెల్ భర్తగా ఉన్నప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆమె తాగినప్పుడు ఆమెకు జరిగింది ఆమెకు పూర్తిగా గుర్తుండదని తెలుసుకుని తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఆమెను నిందించేవాడు. అతను తన తల్లిదండ్రుల గురించి రేచెల్ కు,టామ్ కు ఇద్దరికి అసత్యాలే చెప్పాడు. టామ్ తన గురించి చెప్పిందే నిజమనుకుంది రేచెల్.అతను అదే కారణం మీద ఆమెను వదిలేసినప్పుడు కూడా ఆమె దానిని తన తప్పుగానే భావించి,తనను తాను ఓడిపోయిన వ్యక్తిగా భావించి ఆమె అదే మద్యానికి బానిసగా మారిపోయి జీవితం మీద ఆశను కోల్పోయి ఒంటరితనంలో మునిగిపోయింది.ఆ ఒంటరితనమే ఆమె తనను అవమానించి వదిలేసిన టామ్ చుట్టూ అతను వదిలేసినా సరే తిరిగేలా చేసింది. ఆ ఒంటరితనమే ఆమెను ఇతరుల జీవితాల్లో తన ప్రాధాన్యత పెంచుకోవాలనే భావనను బలపడేలా చేసింది.
మనుషులు తమ జీవితాన్ని ఇతరుల అధీనంలో వదిలివేస్తే ఆ ఇతరులు తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి వారిని బలహీనులుగా,తప్పు చేసిన వారిగా భావించేలా చేస్తారు. అలా తన జీవితం మీద ఆసక్తిని,విలువను కోల్పోయిన రేచెల్ మేగన్ తప్పిపోయిన తర్వాత ఆ అవకాశం ద్వారా తనను గౌరవించే వాతావరణం లేదా వ్యక్తి ఒకరైనా ఉండాలని కోరుకుని అబద్ధాలు చెప్పి స్కాట్ కు దగ్గర అయినా అవి తెలిసిన వెంటనే ఆమె దోషిగా మారిపోయింది స్కాట్ దృష్టిలో.
మన బలహీనతలు ఇతరులకు మనల్ని లోకువ చేసే ఆయుధాలు కాకూడదు.మనిషి తనను తాను గుర్తించుకోలేకపోతే,తనను తాను కోల్పోతే,ఎలా తన గౌరవాన్ని,తనపై తనకున్న విశ్వాసాన్ని కోల్పోయి,ఓ లక్ష్యం లేని గాలిపటంలా ఎగురుతూ ఎలా చివరకు తెగిన గాలిపటం అవుతాడో స్పష్టం చేసే పాత్ర రేచెల్ ది. ఈ కథ చివరకు వచ్చే సరికి టామ్ తనను నిందించి ఎలా తనను బలహీనురాలిని చేశాడో గుర్తిస్తుంది. ఆమె తాగుడు మానేస్తుంది.అన్నాతో సంయమనంతో మాట్లాడగలుగుతుంది. ఇవి పరోక్షంగా ఈ కథతో మానసిక స్థాయిలో జరిగే మార్పులు. తప్పక చదవాల్సిన నవల ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ