ఆలోచనల కథలు

                                            ఆలోచనల కథలు
                                    -శృంగవరపు రచన


మనిషి జీవితంలో ఎన్నో సందర్భాల్లో చేయాలనుకుని చేయలేనివి,ఇతరుల జీవితాల్లో జరిగినదానికి స్పందించే శైలికి తన జీవితంలో తనను తాను సమర్ధించుకునే తీరుకు,అలాగే సాధారణంగా సమాజంతో పాటు కొట్టుకుపోయే మనుషులతో విభిన్నంగా ఆలోచించేవారు జీవితభాగస్వామి కావడంతో వారు ఆ మానసిక దూరాన్ని అనుభవించే తీరును,సమాజంలో స్త్రీ పురుషుల సంబంధాల్లో వస్తున్న మార్పులను,ఇంకా ఎన్నో ప్రతి మనిషి జీవితంలో సాధారణంగా ఉండే అంశాలకు జీవితాన్ని అనేక కోణాల్లో విశ్లేషించగల స్థాయి ఉన్న వ్యక్తిత్వంతో కథలను నిర్మించారు డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావుగారు.ఆయన ‘మనిషి మరక’ కథా సంపుటి ఇటువంటి అనేక అంశాలను వివిధ మనస్తత్వాలు గల మనుషుల ఆలోచనా స్థాయి నుండి స్పష్టం చేసే ప్రయత్నం చేస్తుంది.
మొదటి కథ ‘తారుమారు.’ నిజానికి సాధారణ వ్యక్తులు కూడా గుర్తింపు,గొప్పతనం కోరుకుంటారు. తమ జీవితం సాధారణంగా గడిచిపోయింది కనుక వారు తమ పిల్లల గొప్పతనంలో పరోక్షంగా తమ గొప్పతనాన్ని చూసుకుంటూ తమను తాము కొంత గొప్పవారుగా భావించుకుంటారు. అలాగే సమాజంలో జరుగుతున్న అన్నీ అంశాల పట్ల తమకున్న జీవితానుభవాలతో ఏదో ఒక అభిప్రాయం స్పష్టం చేస్తూ కూడా తమకు తెలుసునన్న భావనను తృప్తి పరచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ఓ తల్లి కథే ఇది.
చక్రపాణి,కాళింది భార్యాభర్తలు. వీరికి రమేశ్,రాజేశ్ పిల్లలు. రమేశ్ స్వతహాగా తెలివైనవాడు.అతను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. కాళిందికి రాజేశ్ అంటే ఇష్టం ఎక్కువ. రమేశ్ తనకు నచ్చిన పద్మను వివాహం చేసుకోవడం అది కాళిందికి నచ్చకపోవడం,పద్మకు ఆమెకు పడకపోవడం వంటివి కూడా జరగడం వంటి ఉదంతాల్లో కూడా ఆమె తన వ్యతిరేకతను వ్యక్తపరిచింది. రాజేశ్ కు మెరిట్ లో సీట్ రాకపోవడం డొనేషన్ కట్టించి ఇంజనీరింగ్ లో చేర్పించేలా చేయడం చేసింది కాళింది. దానికి ఆర్థిక సాయం చేసిన రమేశ్ ను ఏనాడూ ఆమె గుర్తించే ప్రయత్నం చేయలేదు.
మొత్తానికి రాజేశ్ కు ఉద్యోగం రావడం ఆ తర్వాత అమెరికా వెళ్ళే అవకాశం రావడం,వివాహం చేసుకోవడం జరిగిపోయాక అతని ఉద్యోగ ఉన్నతితో కాళింది ఎంతో సంతోషపడేది. రమేశ్ విషయం మాత్రం పట్టనట్టు ఉండేది.ఆర్థికమాంద్యం వల్ల రాజేశ్ ఉద్యోగం పోవడం,అతను ఇంటికి తిరిగి రావడం,తన మామయ్య వల్ల జాబ్ తెచ్చుకోవడం అక్కడికి వెళ్లిపోవడంతో ఆమె దృక్కోణం రాజేశ్ విషయంలో కూడా మారిపోయింది.పిల్లల ఉన్నతిలో తమ ఉన్నతిని చూసుకునే తల్లిదండ్రులు అంటే దాని అర్ధం ఆ ఉన్నతి ప్రదర్శనకు పరిమితమని భావించే ఎందరో తల్లిదండ్రుల మనస్తత్వాలను స్పష్టం చేసే కథ ఇది. తండ్రి అయిన చక్రపాణి కాళిందికి విభిన్నమయినా ఘర్షణతో రాజీ పడి ఏం అనకుండా ఉండిపోయే వ్యక్తి.కాళింది అభిప్రాయాలను మార్చడం సాధ్యం కాదని అతను అర్ధం చేసుకున్నాక ఆ విషయంలో అతను మౌనంగా ఉండిపోయాడు. పిల్లల ఉన్నతి ప్రదర్శన కోసం వారి ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా వారిని సంపాదనకు మాత్రమే పరిమితం చేసే తల్లిదండ్రులు కూడా ఎందరో ఈ సమాజంలో. అటువంటి తల్లిదండ్రులు పిల్లలను ఆ ఉన్నతి చిహ్నాలుగా మాత్రమే భావించుకుంటూ పెంచుతారు.అటువంటి తల్లిదండ్రుల వల్ల పిల్లలు స్వేచ్చ కోల్పోయే అవకాశం కూడా ఉంది.
రెండో కథ ‘బీటలు.’వృద్దాప్యంలో ఒంటరిగా ఉంటున్నాడు రామారావు. నడివయసులో ఉన్న మీనాక్షి కూడా దాదాపు అదే దశలో ఒంటరిగా ఎదురింట్లో ఉంటుంది. మనిషికి ఒంటరితనం చాలాసార్లు శాపమే. ఏదో ఓ సందర్భంలో వీరిద్దరికి పరిచయం అవ్వడంతో వారు మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరు కలిసి టిఫిన్లు,భోజనాలు కలిసి చేసేవారు. వారిద్దరి మధ్య స్నేహం ఒంటరితనాన్ని ఆ ఇద్దరి మనసుల్లో నుండి కొంతమేరకు పారద్రోలింది.కానీ అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి.అయినా వాటిని పట్టించుకోకుండా వారు స్నేహితులుగానే కొనసాగుతున్నారు. ఓ రాత్రి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు మీనాక్షిని ఇంట్లో ఉంచి పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తాడు రామారావు.ఆ సమయంలో కొందరు దుండగులు మీనాక్షి మీద అత్యాచార ప్రయత్నం చేస్తారు.ఆ సమయంలో అక్కడికి తిరిగి వచ్చిన రామారావు వారిని అడ్డుకోబోతే అతన్ని కత్తితో పొడిచి పారిపోతారు.ఆ తర్వాత రామారావును ఆమె హాస్పటల్ లో చేర్పిస్తుంది.పోలీసులు విచారించేటప్పుడు వారిద్దరిని భార్యాభర్తలుగానే భావిస్తారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇద్దరి మధ్య కొంత దూరం ఏర్పడినా మరలా వారి స్నేహం చిగురిస్తుంది. స్త్రీ పురుషులు స్నేహితులుగా ఉండలేరనే నమ్మకంతో ఉన్న మనుషులు దానికి విరుద్ధంగా ఉండే వారు ఉన్నా వారిని ఆమోదించలేదు.దానికి కారణం వారి నమ్మకంలో వారికి ఎదుటి వారి జీవితాల ఆధారంగా తమ నైతిక ఉన్నతిని ప్రదర్శించుకునే అవకాశం ఉండటం.బహుశా మనుషుల మనసుల్లో తమ సాధారణత్వానికి కూడా అసాధారణ గొప్పతనాన్ని ఆపాదించుకోవడానికి ఇతరుల జీవితాల పట్ల కుతూహలం చూపిస్తారేమో!
మూడో కథ ‘రక్తంలో..’ సతీష్,శారద ఇండియా నుండి అమెరికా నుంచి వచ్చి స్థిరపడిన భారతీయులు. వారిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారిద్దరు అభ్యుదయ జీవితాన్ని నమ్ముతారు.వారి మధ్య కుల ప్రసక్తి ఎప్పుడు రాలేదు. కానీ ఓ రోజు టీవి లో వస్తున్న కుల ప్రస్తావన వార్తల వల్ల వారిద్దరి మధ్య అన్నాళ్లుగా రాని అంశం అప్పటికి వచ్చింది. దాని గురించి ఇద్దరు తర్వాత ఆలోచించి తమ తప్పును తెలుసుకుని భేధాలు సమసిపోయేలా చూసుకున్నారు. వాస్తవానికి మనిషి పుట్టి పెరిగిన వాతావరణంలో ఉన్న ఆలోచనలు విద్య,జీవన శైలితో మార్చుకున్నా కొన్నిసార్లు ఆ నేపథ్యం మనుషులని తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు ప్రభావితం చేస్తుందని స్పష్టం చేసే కథ ఇది.
నాలుగో కథ ‘సత్తు బిళ్ళలు.’ మనిషికి ఇతరుల జీవితాల పట్ల ఆసక్తి ఎక్కువ. తమకు వారు నచ్చితే వారి గురించి ఒకలా,లేకపోతే ఇంకోలా వారి గురించి వాఖ్యానించడంలో వారు అదో రకమైన సంతృప్తిని పొందుతూ ఉంటారు. అటువంటి సమూహ మనస్తత్వం కల కొందరు మిత్రుల కథే ఇది.మూర్తి,రామం,రమేశ్ ,రఘు,సుందరం మిత్రులు. మూర్తి యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా వారు అతని ఇంట్లో కలుసుకున్నారు. మూర్తి వివాహం చేసుకోలేదు. గతంలో అతను కాదంబరిని ప్రేమించాడు.ఆమెలో ఉన్న విశిష్టత అతన్ని ఆకర్షించింది. కానీ ఏ నాడు ఆమెకు ఆ విషయం చెప్పలేదు. తర్వాత కాదంబరి తనకు వివాహమని చెప్పి వెళ్లిపోయింది.మూర్తి వివాహం చేసుకోకపోవడానికి కారణం ఆమె మీద ఉన్న ప్రేమ అని ఊహించిన మిత్రులు ఆమెను చెడ్డదానిగా భావించడంలో తృప్తి పొందారు.
ఆ రోజు మిత్రుల సంభాషణాల్లో ఎన్నో విషయాలు దొర్లాయి. అప్పటికే వారి మిత్రుల్లో ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ సమావేశమైన మిత్రుల్లో ఒకరు సంప్రదాయాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంప్రదాయం లేకపోవడం వల్ల ఓ సంబంధం తన కూతురికి చేయలేదని చెప్పాడు.సంప్రదాయం మీద వారు చర్చ సాగించారు.అమెరికాలో ఉన్న మిత్రులు మూర్తికి సన్నిహితం కనుక అతని పిల్లలకు తమ పిల్లలకు వివాహం జరిగే మార్గం చూడమని అడిగారు.అమెరికాలో జీవన విధానం గురించి వచ్చినప్పుడు ఆ సౌఖ్యాల మీద ఉన్న ఆశతో వారు ఆ సంప్రదాయాన్ని పట్టించుకోలేదు. మనిషి సంప్రదాయాన్ని తాను ఊహించని సౌక్యం వస్తుందని తెలిసినప్పుడు ఎలా విస్మరిస్తాడో ఈ వాదం స్పష్టం చేస్తుంది.ఆ తర్వాత కాదంబరి మీద చర్చ నడిచింది.ఆమె మంచిదని మూర్తి చెప్పే ప్రయత్నం చేసినా మిగిలిన వారు వినే ధోరణిలో లేరు.అక్కడ ఉన్న సుందరం కాదంబరి తన భార్య అని తాము విడిపోయినా ఆమె వివాహం ముందు ఉన్న స్నేహం గురించి తనతో చెప్పిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.మూర్తి కాదంబరి వ్యక్తిత్వం నిలబడటంతో సంతోషిస్తాడు. మనిషికి తన నైతిక ఉన్నతి కోసం ఇతరుల నైతిక పతనం ఆశించే స్వభావం ఏదో ఒక స్థాయిలో కొందరిలో ఉండే ఉంటుంది.అటువంటి మూక మనస్తత్వాలను సూచించే కథ ఇది.
ఐదో కథ ‘మనిషి మరక.’ రావ్ ను మిత్రులు తాము కేరళ వెళ్తున్నామని రమ్మని అడిగినప్పుడు తాను రానని దానికో కారణం ఉందని చెప్తాడు. ఆరేళ్ళ క్రితం అతను కేరళ వెళ్లినప్పుడు అక్కడ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న నిర్మల తనకు పరిచయం అయ్యిందని,ఆమెతో స్నేహంగా ఉంది నలభై గంటలని చెప్తాడు. ఆ సమయంలో ఆమె భర్త విదేశాల్లో పని చేసి పంపిన డబ్బు ఆమె అన్నయ్య తన రాజకీయ ఎదుగుదలకు వాడుకున్నాడని,ఆ తర్వాత తన భర్త మరణించినప్పటి నుండి తనను పట్టించుకోలేదని అప్పటి నుండి టీచర్ గా చేస్తూ జీవితం గడుపుతున్నానని ఆమె చెప్పింది. వారు కలిసినప్పుడు వర్షం కురవడంతో ఆమె ఇంటికి అతను వెళ్ళడం,ఆ తర్వాత అతను ఉండే హోటల్ కు ఆమె రావడం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.రావ్ ఆ ప్రయాణం నుండి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత పోలీసులు ఫోన్ చేశారని,నిర్మల హోటల్ కు వెళ్ళడం తనను కలవడం గురించి తెలిసిన ఆమె అన్న ఆమెను చంపాడని,తర్వాత పోలీసులు వెంబడించడంతో తనను తాను కాల్చుకు చనిపోయాడని,ఒకవేళ నిర్మల బ్రతికి ఉంటే తాను వచ్చేవాడని ఆమె మరణించడం వల్ల తాను రానని స్పష్టం చేస్తాడు రావ్.
స్త్రీ పురుషుల స్నేహం మీద కుటుంబ గౌరవాన్ని,సమాజంలో స్థానాన్ని నిర్ణయించే సమాజ చట్రంలో తమ గొప్పతనం నిలుపుకునే మూర్ఖ శిఖామణులు చేసే దుశ్చర్యలను ఈ కథ స్పష్టం చేస్తుంది. స్త్రీ పురుషుల మధ్య లైంగిక బంధాన్ని మాత్రమే ఉందని బలపరచడం సమాజంలో పేరుకుపోయిన ఓ రుగ్మతగా కూడా రచయిత భావించినట్టు,మనుషుల మధ్య స్నేహానికి నైతికతకు లంకె పెట్టాల్సిన అవసరం లేదనే రచయిత భావన అని కూడా ఈ కథలు చదువుతుంటే పాఠకులకు అనిపించక మానదు.
ఆరో కథ ‘స్వేచ్చకు కళ్ళెం.’ ఈ కథలో మనిషికి,మనిషి మనసులో ఉన్న స్వేచ్చా భావానికి మధ్య జరిగే యుద్ధం గురించి విభిన్న పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత. ఫెలినీ సినిమా ద్వారా ఈ స్వేచ్చ గురించి రచయిత చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాకు వెళ్ళిన ఇద్దరి చర్చ ద్వారా ఈ భావన గురించి పాఠకులకు అర్ధమవుతుంది. ఇటలీలో పెరిగిన ఫెలినీ అక్కడ ఎవరు లేకపోయినా ఇటలితో ఓ మానసిక అనుబంధాన్ని పెంచుకుంటాడు.ఆ తర్వాత అమెరికా వెళ్తాడు.అక్కడ చదువుకుంటాడు.అక్కడ గ్రీస్ ధనవంతుల అమ్మాయి జార్జియాను పెళ్లి చేసుకుంటాడు. అతనికి ఇటలీ వెళ్ళి రావాలని కోరిక.అక్కడ అతనికి తెలిసిన వారు ఎవరూ లేరు.అలాంటప్పుడు అక్కడకి వెళ్ళి ఏం ప్రయోజనం అని జార్జియా వాదన.మొత్తానికి భార్య ఒప్పుకోకపోవడంతో అతను కొన్నాళ్ళ పాటు వెళ్ళలేదు. కానీ అతను తనకు నచ్చిన పని చేసే స్వేచ్చ లేదన్న భావన అతన్ని దొంగతనంగా ఇటలీ వెళ్ళే ప్రయత్నం చేసేలా చేసింది. ఈ కథ ఆధారంగా స్వేచ్చ అనేది ప్రయోజనం కోసం కాదని మనిషి తనకు నచ్చినట్టు ఉంటున్నాను అన్న భావనను బలపరచుకోవడానికి వాడుకునే ఆయుధం అని కూడా స్పష్టం అవుతుంది.
ఏడో కథ ‘దావానలం.’ సరళ,రమేశ్ భార్యాభర్తలు. ఒక్కగానొక్క కొడుకు వినయ్. ఉద్యోగంలో నిజాయితీపరుడు రమేశ్. అతని మెతకతనం వల్ల అతను ఆఫీసులో నిజాయితీపరుడిగా ఉంటూ లంచాలు తీసుకోకపోవడం వల్ల లంచాలకు అలవాటు పడిపోయిన పై అధికారితో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఉన్న ఆస్తిని అన్నకు అమ్మి కొడుకును ఇంజనీరింగ్ ఒక సంవత్సరం గట్టెక్కిస్తాడు.వినయ్ సరదాలు తీర్చలేకపోతాడు. యాక్సిడెంట్ జరిగి సరళ మరణిస్తుంది. రమేశ్ ఏదో వంట చేసుకుంటూ సర్దుకుంటున్నా వినయ్ మాత్రం బయట తింటూ మాదకద్రవ్యాల వ్యాపారంలో పావుగా మారి పట్టుబడి అరెస్ట్ అవుతాడు. రమేశ్ పై అధికారి సోదరుడు జడ్జి అవ్వడం వల్ల రమేశ్ లంచం తీసుకుని ఓ ఫైల్ కు అనుగుణంగా రిపోర్ట్ రాస్తే కొడుకును విడుదల చేయిస్తానని చెప్తాడు ఆ పై అధికారి. కొంత లొంగిపోయి ఆ పని చేస్తాడు.కానీ అన్నేళ్లుగా అతని మనసులో పేర్కొని పోయి ఉన్న అసహాయత,అన్యాయాన్ని ఖండించలేని కోపం ఒక్కసారిగా బయటకు వచ్చి అతన్ని ఎదురు తిరిగి పై అధికారిని పట్టించేలా చేస్తాయి అని పరోక్షంగా చెప్పడంతో ఈ కథ ముగుస్తుంది.మనిషి ఎంత తన భావోద్వేగాలను,కోపాలను,నిస్సహాయతలను అణచుకుని ఉన్నా సరే ఓ స్థాయి దాటాక అవి ఏదో ఒక రూపంలో ఉధృతమై బయటకు వస్తాయి అని,అది కూడా మార్పులో భాగమే అని రచయిత ఈ కథ ద్వారా స్పష్టం చేశారు.
ఎనిమిదో కథ ‘అక్కరకురాని వేళ.’కళాకారుల మనసును స్పష్టం చేసే కథ ఇది. వసంతరావు రావడంతో అతని మిత్రా బృందం అంతా చేరారు. అతను స్కెచ్ లు బాగా గీసేవాడు. అతని భార్య క్యాన్సర్ తో మరణించిందని చెప్తాడు.భార్యతో కలిసి ఓ ఆట చూడటానికి వెళ్ళినప్పుడు ప్రేరణ కలిగి అతను అప్పటికప్పుడు అక్కడ ఉన్న ఓ అమ్మాయి స్కెచ్ ను వేయడంతో భార్య దానిని అపార్ధం చేసుకోవడంతో అతను మళ్ళీ స్కెచ్ లు గీయలేదని,కానీ భార్య మరణించే సమయంలో తన స్కెచ్ గీయమని అడిగిందని,తాను గీసినా అందులో జీవం లేదని చెప్తాడు. కళాకారుడి ప్రేరణా చైతన్యం అణగదొక్కబడినప్పుడు అతను మరలా పూర్వ దశలోకి మారలేడని అలా వసంతరావులోని కళాకారుడు మరణించాడని రచయిత స్పష్టం చేశారు.
తొమ్మిదో కథ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్.’ మిత్రులందరూ భార్యలతో సహా గోఖలే ఇంట్లో చేరారు.అందరూ తనను,రజనిను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటే గోఖలేకు తన వైవాహిక జీవితంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకు వస్తుంది. తన దగ్గర రీసెర్చ్ నిమిత్తం వచ్చిన రోజ్ కు డిన్నర్ ఇచ్చాడు తన ఇంట్లోనే గోఖలే. ఆమె స్నేహంగా భార్యాభర్తలతో ప్రవర్తించింది. వెళ్ళేటప్పుడు ఆ ఇద్దరితో ఫోటోలు దిగింది. బుడాపెస్ట్ లో జరిగే మీటింగ్ కు రమ్మని గోఖలే ను ఆహ్వానించింది.ఆ తర్వాత ఆ ఫోటోల గురించి అడిగితే అవి రాలేదని చెప్తుంది రజని. అలాగే బుడాపెస్ట్ మీటింగ్ రోజు రజనికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో గోఖలే ఆగిపోతాడు. అతను ఆగిపోయిన వెంటనే ఆమె ఆరోగ్యం సర్దుకోవడానికి అతనికి కారణం అర్ధమయ్యింది.తనకు నచ్చని దానిని జరగనివ్వకుండా చేసే ప్రయత్నంలో రజని చూపిన నైపుణ్యం గోఖలే కు షాక్ ను కలిగించింది.అలా బయట పడకుండా సర్దుకుపోయినంత కాలం అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటలే అన్న అంశాన్ని పరోక్షంగా స్పష్టం చేశారు.
పదో కథ ‘చేయి జారితే…” రాఘవ,రవి మిత్రులు.వారిద్దరు కలిసి రైలు ప్రయాణం చేస్తున్నారు.ఆ ప్రయాణంలో వారిద్దరూ తమ ప్రేమ కథలను గుర్తు తెచ్చుకున్నారు. రవికి మేనమామ కూతురు సౌదామిని అంటే చాలా ఇష్టం. కానీ ఆమె అతని కన్నా సంవత్సరం పెద్దది కావడం వల్ల పెద్దలకు అది సమ్మతం కాదు. సౌదామినికి కూడా రవి అంటే ఎంతో ఇష్టం.పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని డాక్టర్ చేత అబద్ధం చెప్పిస్తాడు సౌదామిని తండ్రి.దానితో పెళ్లి చేసుకోరు. కానీ మరణించే ముందు ఆ విషయం సౌదామిని తండ్రి చెప్పాడు.కానీ అప్పటికే సౌదామిని తన భర్త మరణించాడని అబద్ధం చెప్పి ఓ పిల్లాడిని దత్తత తీసుకుని పెంచుకుంటుంది. ఈ సమయంలో అతన్ని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లాడు అర్ధం చేసుకోలేడని భావించడంతో ప్రస్తుతం కూడా వారు పెళ్లి చేసుకోలేదు.
రాఘవ అమెరికాలో ఉన్నప్పుడూ రెబెక్కాను ప్రేమించాడు. రెబెక్కా అతను విద్యార్ధిగా ఉన్న సమయంలోనే అతన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తన దగ్గర ఉద్యోగంలో ఉండేలా చూసింది.తానే రైట్ అని ఇతరుల మాటలు వినే మనస్తత్వం ఉన్న మనిషి ఆమె. అతన్ని వివాహం గురించి అడిగితే ఆలోచించి చెప్తాను అన్నందుకు తాను అడగగానే ఒప్పుకోలేదని అతన్ని వదిలేసింది. ఇంకొకరిని వివాహం చేసుకుంది. అలా రాఘవ ప్రేమ విఫలం అయ్యింది.అలా ఆ ఇద్దరి స్నేహితుల ప్రేమ ప్రేమ ఉన్నా సరే ఎలా విఫలం అయ్యాయో రచయిత స్పష్టం చేశారు. ప్రేమ ప్రేమించడం అన్న భావన వరకు ఎంతో మధురంగా ఉన్నా ఆ తర్వాత వివాహం అవ్వాలంటే దాని కోసం తమ నమ్మకాలనో,తమ వ్యక్తిత్వాలనో లేక తమ భయాలనో పక్కన పెట్టే దశకు ఇంకా ప్రేమికులు ఎదగలేదనే వాస్తవాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది.
పదకొండో కథ ‘ముసుగు.’ ప్రతి మనిషి తనలో తను ఇష్టపడని వాటిని ఇతరుల ముందు ప్రదర్శించకుండా ఎంతో జాగ్రత్తగా ఓ ముసుగు ధరిస్తాడని,ఆ ముసుగు మనిషిని గురించి ఇంకో మనిషి తెలుసుకోవడానికి ఉన్న అడ్డంకి అని,ఆ అడ్డంకి వల్ల మనిషిలోని అసలైన మనిషిని ఎదుటి వ్యక్తి చూడలేడని రచయిత ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం,సాయి రైలులో ప్రయాణం చేస్తుంటే వారికి కరుణ అనే తోటి ప్రయాణికురాలు పరిచయం అవుతుంది.వారి మధ్య కబుర్లు దొర్లుతున్నప్పుడు మనిషిలో ఉండే ముసుగు గురించి కరుణ మాట్లాడుతుంది.మధ్యలో రైలు ఆగినప్పుడు వారు ముగ్గురు టీ తాగడానికి వెళ్లినప్పుడు ఓ బిచ్చగాడు కుక్కను కొడుతూ ఉంటే అతన్ని తిడుతుంది కరుణ.ఆమెకు ఆ సంఘటన గతంలో జరిగింది గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది.ఆ సంఘటనను ఆ ఇద్దరితో చెప్తుంది.
కరుణ మేనకోడలు సుమిత్ర.ఆమె లా చదువుతున్న రామం ప్రేమలో పడతారు. సుమిత్ర నెల తప్పుతుంది. ఓ రోజు రామం వీధిలో వెళ్తూ ఓ కుక్కను కొట్టడం చూస్తుంది సుమిత్ర.తనతో ఉన్నప్పుడూ కుక్కలంటే ప్రాణం అని చెప్పి ఇప్పుడు కుక్కను కొట్టడం సుమిత్రకు నచ్చదు.దానితో అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పేస్తుంది.కానీ పట్టుదలతో ఆమెను అల్లరచేయబోయి ఆమెను తగులపెట్టెస్తానని బెదిరించడంతో రెండేళ్ల శిక్ష పడింది.సుమిత్ర డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటుంది అని చెప్తుంది. ఈ కథ సుమిత్రదో లేక కరుణదో చెప్పడం కష్టం.తన అసలు విషయం చెప్పుకోవడం ఇష్టం లేక సుమిత్ర అనే ముసుగు ధరించి ఉండవచ్చు. ముసుగు లేకుండా మనిషి జీవించడం కష్టం అని రచయిత చెప్పే ప్రయత్నం చేశారు.
పన్నెండో కథ ‘టై బ్రేకర్.’ వైవాహిక సంబంధం సమాజం కోసం రాజీ పడితే ఎలా ఉంటుందో,నిజాయితీగా ఉంటే అది ఎలా ఉంటుందో అన్న రెండు కోణాలను అటు భారతీయ ఇటు అమెరికన్ వైవాహిక కోణం నుండి ఈ కథలో రచయిత స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. రజనీకాంత్ ఇంట్లో స్నేహితులందరూ సమావేశమయ్యారు. రాంబాబు అమెరికాలో తనకు తెలిసిన మైక్ కథ చెప్తాడు. మైక్ మొదట రోజ్ ను ప్రేమించి వివాహం చేసుకుని ఏ భేదాలు లేకుండా ఉన్నతర్వాత ఆరేళ్ళకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెబెక్కాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఆరేళ్ళ కొడుకు ఆమె అతనికన్నా ఓ సంవత్సరం పెద్దది.వారి కాపురం పదేళ్లపాటు సజావుగా నడిచాక విడాకులకు దారితీసింది. ఆ తర్వాత మరలా ఇద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు అని చెప్తాడు. ఆ కథ విన్నాక ఇళ్లకు బయలుదేరిన ఆ మిత్రులు ఆలోచనలో పడతారు.ఒకవేళ తాము విడాకులు తీసుకుంటే రెండోసారి మొదటి భార్యనే వివాహం చేసుకుంటామా అని?నిజానికి వైవాహిక బంధం సమాజంలో మంచిగా ఉండటం కోసం,భద్రత కోసం అని అనుకుంటూ గడుపుతూ దానిలో ప్రేమ ఉందని భ్రమించే ఎందరో భార్యాభర్తలకు కనువిప్పు ఈ కథ.
పదమూడో కథ ‘కాలం స్థంభించదు.’ మనిషి తన జీవితంలో ఎక్కువగా బాల్య స్మృతులకు ప్రాధాన్యత ఇస్తూ తాను పుట్టి పెరిగిన ప్రదేశం అక్కడి స్నేహితులకు ఎక్కువ విలువను ఆపాదిస్తూ ఉంటాడు.బాల్యంలో ఉన్నవన్నీ జీవితాంతం ఉండేవని అనుకుంటూ ఉంటాడు. కానీ అది బాల్యం మీద ఉన్న ఇష్టంతో ఏర్పరచుకున్న అభిప్రాయాలే తప్ప చాలాసార్లు అవి వాస్తవానికి దూరంగా కూడా ఉంటాయి.అటువంటి వాస్తవికతను స్పష్టం చేసే కథ ఇది. ప్రభాకరం,పద్మ భార్యాభర్తలు. ఇద్దరు పల్లెటూర్ల నుండి వచ్చినా ఢిల్లీలో స్థిరపడ్డారు.రిటైర్ అయిపోయిన ప్రభాకరంకు తన ఊరు వెళ్ళి అక్కడే స్థిరపడిపోవాలని కోరిక. పద్మకు ఢిల్లీలో సౌఖర్యాల మధ్య ఉండాలని ఉంది. ప్రభాకరం కొన్నాళ్లు భార్యను తన ఊరికి తీసుకువెళ్తాడు.అక్కడ పెద్ద మార్పులు లేవు. అతని స్నేహితులు ఉన్నా అన్నేళ్లు దూరంగా ఉండి అప్పుడు సన్నిహితంగా ఉన్నా అది పైపై మెరుగులా ఉంటుందని ప్రభాకరంకు అర్ధమవుతుంది.కాలం తన బాల్యం దగ్గరే ఆగిపోలేదని ఎన్నో మార్పులు వచ్చాయని,ఆ పల్లెటూరిలో శుభ్రత,సౌఖర్యాలు లేకపోవడం,తన చిన్ననాటి స్నేహితురాలు తనతో స్నేహంగా ఉండటాన్ని భార్య అపార్ధం చేసుకోవడం వంటివి చూశాక ఇక అలవాటు పడిన ఢిల్లీలోనే మెరుగని అనుకుంటాడు ప్రభాకరం.మనిషి కొన్ని అభిప్రాయాలు,విలువలు కాలంతో పాటు మారేవని తెలుసుకోవాలని వాటిని ఒకప్పటి అనుభూతులతో లెక్కకడితే వాటికి విలువ ఉండదని రచయిత ఈ కథ ద్వారా స్పష్టం చేశారు.
పదనాలుగో కథ ‘పొగరు పురుగు.’ అమెరికాలో ఉంటున్న మన్మధరావుకు అక్కడే ఉంటున్న అమ్మాయిలతో అతని తల్లిదండ్రులు పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తారు. కావ్య తన కెరియర్ ను అతని కోసం వదులుకోవాల్సిన అవసరం లేదని భావించి అతన్ని తిరస్కరిస్తుంది.డబ్బు సంపాదన విషయంలో దూకుడుగా లేడనిశ్రావణి అతన్ని తిరస్కరిస్తుంది. సౌందర్య అతను తల్లిదండ్రుల మాటకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి అతన్ని తిరస్కరిస్తుంది. తర్వాత అతనికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శారదతో వివాహమవుతుంది. ఓ రెస్టారెంట్ కు ఆ భార్యాభర్తలు భోజనానికి వెళ్ళిన సమయంలో అతనికి అక్కడ శ్రావణి,సౌందర్యలు కనిపించడంతో వారికి తన భార్యను పరిచయం చేస్తాడు. ఆ జంటను చూసిన ఆ ఇద్దరమ్మాయిలు తాము తమకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నామని బాధపడతారు. ఈ కథలో మనిషికి విలువ కోల్పోయినప్పుదో లేదా ఇంకొకరికి ఆ మనిషి దక్కినప్పుడో మాత్రమే అర్ధమవుతుందని రచయిత చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ కథల్లో నిజ జీవితాల్లో మనుషులు బయటకు చెప్పకుండా తమలో తాము మాత్రమే రహస్యంగా ఆలోచించే ఆలోచనలు స్వేచ్చగా ప్రవహించాయి. కొంత మనుషులు ప్రశ్నించడం నేర్చుకుంటే ఆ మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ కథలు స్పష్టం చేస్తాయి.మనిషి జీవితంలో ఉండే ఎన్నో కోణాలను మనిషి పట్టించుకోకుండా వదిలేసే ఎన్నో ఆలోచనలను రచయిత ఈ కథల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

* * * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ