లౌక్యం లేని కుక్క

                                         లౌక్యం లేని కుక్క

                                            -శృంగవరపు రచన


అవును, రియో ఇప్పుడు మారిపోయింది!
అది సంవత్సరం క్రితం నేను చూసిన రియో కాదు.
ఇప్పుడు ఓ కొత్త రూపం సంతరించుకుంది. చూడటానికి తెల్లటి బొచ్చు తో అందంగా ఉండే లాసా ఆప్సో జాతికి చెందిన రియోను ఒక్క సారి చూస్తే ఎంత ముద్దుగా ఉందో అని అనిపించక మానదు! దాని రూపం అలానే ఉన్న దాని స్వభావం పూర్తిగా మారిపోయింది. ఏ మనిషిని చూసినా అది శత్రువులాగానే భావిస్తుంది.టిబెట్ దేశంలో టిబెటియన్ టెరియర్ జాతి కుక్క సంతతిగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన ఈ జాతి మన భారతదేశంలోనూ, అందులోని భాగ్యనగరంలోనూ కూడా దాని అభిమానులను పెంచుకుంటూనే ఉంది.
వాస్తవానికి అది నా దగ్గర పెరగాల్సిన కుక్కే! నా దగ్గర ఉంటే ఏమయ్యేదో! కానీ ఇప్పుడు మాత్రం పాప భీతి నన్నే పట్టుకుంది. ఒకవేళ నేను దానిని నా తమ్ముడికి ఇచ్చి ఉండకుండా ఉంటే అది బాగానే ఉండేదేమో! దానిని సంవత్సరం క్రితం నాకు అప్పగించిన చరణ్ ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి పట్టించుకోలేదు.దానిని వదిలించుకుంటే చాలు అని అనుకున్నాడేమో అతగాడు కూడా!
నేను దాని గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది.
ఎదురుగా చరణ్. నేను ఆశ్చర్యపోయాను.
‘ఏంటి ? ఇంత సడన్ గా?’ అని అడిగాను.
‘సరదాగా వచ్చాను. అంతే. పెద్ద పని ఏం లేదు కానీ రియో ఎలా ఉంది ఇప్పుడు?’
‘ఎలా ఉందంటే ఏం చెప్తాను...పెట్ లా లేదు...కుక్కకు ఉండే ఏ లక్షణంతోనూ లేదు. ముట్టుకున్నా మీద పడి చీల్చేసే పులిలా తయారైంది. నిజం చెప్పు...అసలు నువ్వు నిజంగా దానిని ఎందుకు ఇచ్చేయాలని అనుకున్నావు...నాకు ఇప్పుడైనా చెప్పు.’
‘నేను నీకు ఇంతకు ముందు చెప్పింది అంతా కూడా నిజమేరా. కాకపోతే ఒక్క విషయం మాత్రం దాచాను. అదేమీ పెద్ద విషయం కాదనుకో ...కానీ ...ఇప్పుడు చెప్తాను...
నాకు పెళ్ళయ్యాక సంవత్సరం అయ్యాక కూడా పిల్లలు పుట్టలేదు. అదేమీ పెద్ద టైమ్ కాదనుకో ...కాకపోతే నా భార్య స్వాతి మాత్రం చుట్టూ ప్రక్కల అపార్ట్మెంట్స్ లో ఉండే వారి దగ్గర చక్కగా బొచ్చు కుక్కలు ఉండటం, వాటిని వారు రోజూ వాకింగ్ కు తీసుకువెళ్ళడం,అవి ఎంతో ప్రేమగా యజమాని పట్ల వ్యవహరించడం చూసి ఓ కుక్క పెంచుకుందామని అడిగింది. నాకు కుక్కల గురించి పెద్దగా తెలియకపోయినా తెలిసిన వారి ద్వారా కనుక్కున్నప్పుడు వాటి ధరలు ఇరవై ముప్పై వేలు ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఓ కుక్కను కొనడానికి అంత పెట్టాలా అని అనిపించింది కూడా.
నా భార్య మాటని అలా అని తీసి వెయ్యలేను. అందుకే ఓ పదిహేను వేలు ధర బడ్జెట్ గా పెట్టుకుని ఏదైనా కుక్కను కొనాలని అనుకున్నాను. ఆ సమయంలో ఈ కుక్క కనిపించింది. నిజానికి ఆ జాతి కుక్కల ధర కూడా తక్కువ ఏం లేదు. కానీ నెల రెండు నెలలు దాటిన తర్వాత కుక్కల ధర తగ్గిపోతుంది. దీని వయసు మేము తీసుకునేటప్పటికి మూడు నెలల పైన కొన్ని రోజులు.
మేము అప్పటివరకూ ఊహించినట్టు ఆ కుక్కలో గొప్ప లక్షణాలు ఏమి కనిపించలేదు మా ఇద్దరికీ కూడా. అది ఎప్పుడూ తిండి కోసం ఎగబడేది. దానిని నేను ట్రెయిన్ చేయలేకపోయాను. ఎంత పెట్టినా తిండిని చూడగానే దాని ఆబతనం చూడగానే ఓ రకమైన తక్కువ భావం దాని పట్ల మాకు కలిగింది. అంతే కాకుండా అది భోజనం పెట్టే వేళలో మాత్రమే మా చుట్టూ తిరిగేది లేదా దానికి తినాలనిపించినప్పుడు తప్ప మేము అనుకున్నట్టు మా చుట్టూ ఎప్పుడు ప్రేమ కోసం రాలేదు.
మా అపార్టుమెంటులోని మిగిలిన వారితో కలిసి నా భార్య దానిని వాకింగ్ కు తీసుకువెళ్లినప్పుడు కూడా వారేమైనా పెడతారేమోనని వారి చుట్టూ తిరిగేది. ఓ కుక్క మా కుక్క అని గర్వంగా చెప్పుకునే ప్రవర్తన ఉంటేనే కదా దానిని పెంచుకోవాలని అనిపించేది.నేను కొన్న వాడి దగ్గర రియో మూడు నెలలు కెనల్ లో పెరిగింది. అక్కడ కుక్కలను కేవలం తిండి సమయానికే వదిలి, ముఖ్య అవసరాలకు వాకింగ్ కు తిప్పుతారు అనుకుంటా.అందుకే అది అలా ఉండేది. ఆ సమయంలోనే నా భార్య గర్భవతి అయ్యింది.
కొంత శారీరక అసౌకర్యం ఉండటం వల్ల, కొంత ఇబ్బందిగా ఉండటం వల్ల నా భార్యకు చిరాకు ఉండేది. ఆ చిరాకులో దానిని అప్పుడప్పుడూ కొట్టినా అది పట్టించుకునేది కాదు. అయినా దానికి అయ్యే ఖర్చు,దాని వల్ల ఏ గౌరవం పెరిగేలా అది ఉండకపోవడం వల్ల దానిని ఎవరికైనా అడాప్షన్ ఇచ్చేద్దామనుకుని నీకు కాల్ చేశాను. నీకే ఇచ్చేశాను. ఇదే జరిగింది. అది కెనల్ లో పెరిగిన విషయం,దానిని మేము ప్రేమించి గౌరవించలేకపోయిన విషయం తప్ప అన్నీ నీకు చెప్పాను.అయినా ఓ కుక్క గురించి అంత చెప్పుకోవడానికి ఏముంటుందని? దానిని డబ్బు పోసి కొన్నాను....ఊరికే ఇచ్చేశాను ...ఉన్నంత కాలం దాని తిండి ఖర్చే నెలకు ఐదువేలు అయ్యేది. అయినా భరించాను. ఇంకేం చేయను ...దానికి మేనర్స్ లేవు’, మొత్తం రియోదే తప్పు అన్నట్టు వాడు చెప్పాక నాకు ఇంకా ఏం చెప్పాలో తోచలేదు.
‘ఇదంతా సరే గాని ...ఇప్పుడు రియో ఎలా ఉంది ...ఏమైనా మారిందా ..’అని వాడే మళ్ళీ అడిగాడు.
‘అవును చాలా మారిపోయింది ...నీకు తెలుసు కదా ...దానిని నా తమ్ముడు పిల్లల కోసం అడిగితే ఇచ్చానని. నువ్వు నా దగ్గర వదిలినప్పుడు కాస్త ట్రెయిన్ చేస్తే బాగానే ఉంటుందనుకున్నా. నా లాంటి ఒంటరివాడి దగ్గర కన్నా కుటుంబం దగ్గర అయితే బావుంటుందని దానిని ఇచ్చాను. కానీ తర్వాత వాళ్ళు దానిని మొదట కట్టేసేవారు. ఆ తర్వాత అప్పుడప్పుడు దానిని కొట్టేవారు.అది వచ్చిన మొదటి రెండు నెలలు బాగానే ఉంది.
ఆ తర్వాత నా తమ్ముడి కొడుకు ఆరేళ్ళ వాడు దానిని ఆట బొమ్మలా భావించి దానిని నలిపేస్తూ ఉండే సరికి వాడిని కరిచింది. అప్పటి నుండి దాని స్థానంలో దానిని ఉంచాలనుకుని దాని నోటికి మజిల్ కట్టేవారు,కట్టేసేవారు. మొత్తానికి ఏమైందో తెలియదు కానీ మొన్న వాళ్ళు పెళ్ళికి వెళ్తూ కింద వాచ్ మెన్ దగ్గర కట్టేసి నన్ను ఫుడ్ పెట్టమంటే దాని దగ్గరకు వెళ్ళాను. దానిని నిమరబోయాను. నేను మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాను ..అంతే జబ్బల మీద కరిచింది. అది రోజు కరుస్తుందని , మాట వినడం లేదని దానిని అడాప్షన్ కు ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ దానిని చూసి ముద్దుగా ఉందని తీసుకువెళ్లినా వారు రెండో రోజే తెచ్చి ఇంటి ముందు కట్టేసి వెళ్లిపోయేవారు. ఇది పరిస్థితి’, అన్నాను.
‘నేను చెప్పాగా....అది అలాంటి కుక్కే ...అందుకే దానిని ఎవరూ భరించలేరు....’అన్నాడు తను దానిని ఇచ్చేయ్యడంలో తప్పు ఏమి లేదన్న భావన స్పురించేలా.
‘సరేలేరా ....సాయంత్రం మన క్లబ్ కు వెళ్దాం...ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ....మస్తుగా పార్టీ చేసుకుందాం.అందుకే నిన్ను పిలుద్దామని నేను వచ్చాను. ఆలశ్యమైపోయింది సాయంత్రం కలుస్తాను’, అని వాడు వెళ్ళిపోయాడు.
రియో గురించి ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధమయ్యింది. రియో కుక్కలా ఉండలేకపోయింది. అది మనుషులను మిగిలిన కుక్కల్లా సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయింది. స్వార్ధంగా ఆలోచించే మనిషిలా మారిపోయింది. అందుకే అది మనుషులతో ఇమడలేకపోయింది. నిజానికి అది అలా మారడానికి మనుషులే కారణం. అది స్వార్ధపరులైన మనుషుల మధ్యే పెరిగింది.
తన తల్లి తనకు జన్మనిచ్చాక తనతో పుట్టిన మిగిలిన పిల్లలు ముందే వెళ్లిపోయాయి.ఆ బ్రీడర్ కు దీనికి వయసు పెరుగుతున్న కొద్ది దానికి పెట్టే తిండి ఖర్చు, దానికి తగ్గిపోయే ధరే మనసులో ఉండి ఉంటాయి.దానిని పెంచుకునే ఉద్దేశ్యం లేకపోయినా ధర తగ్గిపోతున్న ఆ కుక్క పిల్ల మీద అతనికి ప్రేమ ఎందుకు ఉంటుంది? ఆ అసహనం దాని మీద ప్రదర్శించే ఉంటాడు. కెనల్ లో ఉన్నప్పుడూ బయటకు వెళ్ళే స్వేచ్చ లేకపోవడం,రోజంతా తనకు ఆకలి వేసిన సమయానికి తిండి దొరుకుతుందో లేదో అన్న భయం దాని మనసులో తన ఆహారం తన జీవితం చుట్టూ కేంరీకరించబడేలా చేసి ఉంటాయి.తనను ఎవరూ ప్రేమించరన్న భావన అప్పుడే దాని మనసులో స్థిరపడి ఉంటుంది.
దాని మానసిక స్థితి అర్ధం చేసుకోలేని చరణ్ దంపతులు జాతి కుక్కలంటే గొప్ప కుక్కలని భావించి, వారి ఊహలకు భిన్నంగా అది ఉండేసరికి, అది తమకు తగదని నిర్ణయించుకుని వదిలించుకున్నారు. ఆ తర్వాత నా తమ్ముడు కుటుంబం వచ్చేసరికి అది తిండిని మించి తనను కట్టెయ్యడం,మజిల్ పెట్టడం వంటివి చేయడం వల్ల ఆత్మరక్షణ గురించి కూడా ఆలోచించుకుని ఉంటుంది. దాని దృష్టిలో మానవ ప్రేమకు విలువ లేదు. దానికి తెలిసింది తన మనుగడ, తన రక్షణ మాత్రమే.
నిజానికి వీళ్ళు రియోను రిజెక్ట్ చేయలేదు అదే ముందు వారిని రిజెక్ట్ చేసెసింది. ఆ రిజెక్షన్ ను అది దాని పద్ధతుల్లో స్పష్టం చేసాకే మనుషులు దానిని రిజెక్ట్ చేశారు. నాకు ‘పాతాల్ లోక్’ సిరీస్ లో త్యాగి గుర్తుకువచ్చాడు. అందులో త్యాగి పరిస్థితుల వల్ల హంతకుడు అయినా మూల స్వభావంలో మంచివాడే. కుక్కలను ప్రేమిస్తాడు. అలాగే కుక్కలను ప్రేమించే వారిని మంచివారిగా పరిగణిస్తాడు. తాను హత్య చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ వాస్తవానికి కుక్కలను ఇష్టపడకపోయినా అతని భార్య కోసం తప్పనిసరిగా త్యాగి చూసినప్పుడు మంచిగా ఉండేసరికి అతన్ని హత్య చేయలేకపోతాడు.
నిజానికి మనిషికి తన మాట వినే బానిస కావాలని అనిపిస్తుంది. మరి బానిస అయితే అనాగరికం అని ఇలా పెట్స్-పుణ్యం-ఒంటరితనం-జీవ ప్రేమ పేర్లు చెప్పుకుంటూ కుక్కలను పెంచుకుంటూ ఉంటారని నాకు అనిపిస్తుంది. అదే కుక్క తమ చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటే, కోపం వచ్చి కొట్టి విసిరినా కొట్టినా మరలా తోక ఊపుకుంటూ వారి దయ కోసం,వారు ఎక్కడికైనా వెళ్తే ఎదురు చూస్తూ ఉంటే, మనిషి అహం తృప్తి పడుతుంది అనుకుంటా. నా అధీనంలో ఉన్నది అన్న భావన మనిషి ఆహాన్ని తృప్తి పరచడమే కాకుండా విజయ గర్వాన్ని కూడా కలిగిస్తుంది. బానిసకు ఓ సొంత వ్యక్తిత్వం ఉండనట్టే కుక్కలకు ఉండకూడదు, వాటి జీవితంలో ఆ యజమాని మరియు అతని కుటుంబం తప్ప ఏం ఉండకూడదు.అప్పుడు ఆ తృప్తి వల్ల మనిషి దానికి కాస్త తిండి పెట్టి, అందరి ముందు దానిని ప్రదర్శించి, తన ఉదరతను నిరూపించుకుంటాడు.
ఎన్నో కుక్కలు నిజానికి కొట్టినా సబ్మిసివ్ గా మారిపోతాయే తప్ప ఎదురు తిరగవు. ఎందుకంటే వాటికి కుక్కల్లా ఎలా ఉండాలో తెలుసుకునే లౌక్యం ఉంది కనుక. ఆ లౌక్యం వల్లే వాటికి ఉండటానికో చోటు, తినడానికి తిండి, యజమాని ఉదారత్వం లభిస్తున్నాయి.ఇవేమీ తెలియని రియోకి ఆ లౌక్యం లేకపోవడం వల్ల మనిషిలా స్వార్ధంగా తన గురించి తానే ఆలోచించుకోవడం వల్ల, స్వతంత్ర ప్రవృత్తి ఉండటం వల్ల అది మనుషులతో ఇమడలేకపోతుంది అనుకుంటా!
రేపు ఇంకో కొత్త ఓనర్ రియోను ఆడాప్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు. ఆ యజమాని అయినా దానిలో ఆ లౌక్యాన్ని ఉండేలా పెంచితే బావుండు అనుకున్నాను.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ