ఫతేపూర్ సిక్రీ మాయాజాలం

    ఫతేపూర్ సిక్రీ మాయాజాలం

                            -శృంగవరపు రచన

                                                        


           భారత దేశ చరిత్రలో అధికారం కోసం ఎన్నో యుద్ధాలు, అంతర్గత కలహాలు ప్రజాస్వామ్య ఆవరణ ఏర్పడేవరకు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో ఉన్న రాజకీయ, రాజ్య కుటుంబ యుద్ధ వాతావరణాన్ని భారతీయ రచయితల్లో బెంగాలుకు చెందిన ధీరేంద్రనాథ్ పాల్ గారు ‘మొగలాయి దర్బారు’ నవలలో చిత్రించారు. దీనిని తెలుగులోకి మొసలికంటి సంజీవరావు గారు అనువదించారు.ఈ  నవలను నేటి కాలం పాఠకులకు వ్యవహరిక బాషలోకి నేతి సూర్యనారాయణ శర్మ గారు అందుబాటులోకి తెచ్చారు.భారతీయ ఆంగ్ల రచయిత్రి ఇందు సుందర్శన్ గారు తాజ్ మహల్ ట్రయాలజీ రాశారు. అందులో నూర్జహాన్, ముంతాజ్ ,జహనారా కేంద్రంగా రాశారు. కానీ ‘మొగలాయి దర్బార్’ నవల మాత్రం ఖుర్రంగా ఉన్న షాజహాన్ కు ఎలా ఫతేపూర్ సిక్రీ ప్రాంతం ఎలా యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా తోడ్పడిందో స్పష్టం చేస్తుంది.   

           ఈ నవల చారిత్రక కల్పన. చరిత్రలో తెలిసిన ఉదంతాలకు, తెలిసిన చారిత్రక వ్యక్తుల జీవితాల్లో కొన్ని ఘట్టాలను ఈ సందర్భంగా ముఖ్య చరిత్రలో ఘటనలు ఎక్కడా దారి తప్పకుండా జాగ్రత్త తీసుకుని అవసరమైన మేరకు  కల్పనను జోడించడం జరిగింది. చరిత్రలో ముఖ్య ఘటనలు తెలిసినా, ఆ నేపథ్యాన్ని వేరు వేరు దృక్కోణాల్లో తెలుసుకోవడానికి ‘మొగలాయి దర్బార్’ వంటి రచనలు ఉపకరిస్తాయి. ఈ నవలలో మొగలాయిల కాలంలో  అక్బర్ తర్వాత శిథిల స్థితిలో ఉన్న ఫతేపూర్ సిక్రీలో ఇద్దరు ముగ్గురు మాత్రమే నివసిస్తూ ఉండటం, అల్ప సంఖ్యలో ఉన్న ఇక్కడ జనుల్లో ఖుర్రం పట్ల విధేయతతో వ్యవహరిస్తూ, అతని కోసం పరోక్ష యుద్ధం చేసిన తీరు, మాయా విద్యలతో అక్కడకు వచ్చిన వారిని బోల్తా కొట్టించడం వంటి అనేక ఘటనలు ఈ నవలను పాఠకులు ఉత్కంఠతో చదివేలా చేస్తాయి. 

        వ్యూహాల్లో ముఖ్య వ్యూహం సామూహిక భయాన్ని కలిగించడం కూడా. ఆ భయం ప్రజల్లో, పాలకుల్లో కూడా ఉండేలా ఫతేపూర్ సిక్రి లో ఉండే ఖుర్రం విధేయులు చేయడం, మరియం బేగమ్ మహల్ లో ఉన్న మాయలతో అక్కడి రహస్యాన్ని ఛేదించడానికి జహంగీర్  మరియు నూర్జహాన్ పంపగా వచ్చినా వారిలో కూడా భయాన్ని పుట్టించడం, చివరకు ఆ మిస్టరీని ఛేదించడం, ఈ కథనం అంతా థ్రిల్లర్ శైలిని తలపిస్తుంది. అలాగే నూర్జహాన్ దగ్గర పరిచారికగా ఉన్న జులేఖా పాత్రను కూడా ఎంతో చక్కగా చిత్రీకరించారు. వాస్తవానికి ఈ నవల చివరకు ఖుర్రం చక్రవర్తి అవ్వడంతో ముగిసినా,ఆ మధ్యలో జహంగీర్ మరియు నూర్జహాన్ పాత్రల ఔచిత్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నవలను రాసినట్టు అనిపిస్తుంది. నూర్జహాన్ ,ఖుర్రం, లాడియా,జహంగీర్ పాత్రల మధ్య నడిచే వ్యక్తిగత కథకు ఈ నవలలో ఎక్కువ ఆస్కారం లేదు. ఇందులో కేవలం తండ్రికి వ్యతిరేకమైన ఖుర్రం యువరాజు అజ్ఞాతవాసం, అతను భవిష్యత్తులో ముంతాజ్ గా మారబోతున్న లూలియాతో ప్రేమ, అందుకు సహకరించిన సలాబతు ఖాన్, జాన్ ,హామీదాలు సిక్రీలో రహస్యంగా జీవితం గడపటం, జులేఖా కూతురిగా లులియాను చెప్పినా, ఇక్కడే రచయిత లూలియా జననం మరియు కుటుంబ వివరాల గురించి స్పష్టత లేకపోవడం,భిన్న అభిప్రాయాలు వ్యక్తపరచడం గురించి కూడా రాశారు. 

      కాల్పనిక ఘటనలను రాసినా, సందర్భానుసారంగా చరిత్రలో నిజంగా జరిగిన అనేక అంశాలను కూడా ఈ నవలలో పొందు పరిచారు. చరిత్రను ఇష్టపడే వారు, చరిత్రలో ఉన్న నిగూఢ అంశాలను ఆసక్తికరంగా చదవాలని అనుకునే వారు తప్పకుండా చదవాల్సిన నవల ‘మొగలాయి దర్బార్.’ వ్యవహరిక బాషలోకి ఈ నవలను  అనుసృజించిన రచయిత నేతి సూర్యనారాయణ శర్మ గారికి ఈ సందర్భంగా అభినందనలు. 

    (‘మొగలాయి దర్బార్’ ప్రతుల కోసం రచయితను సంప్రదించాల్సిన నంబర్ : 9951748340)

    *       *       * 


Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ