ముస్లిం జీవితం-భిన్న సామాజిక, వ్యక్తిగత కోణాలు!

 ముస్లిం జీవితం-భిన్న సామాజిక, వ్యక్తిగత కోణాలు!

         -శృంగవరపు రచన

                                     


     ఈ ప్రపంచంలో మైనార్టీలుగా జీవించడం వాస్తవానికి నిరంతరం అభద్రతను కలిగిస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్య, మత సామరస్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో గుజరాత్ లో 1992 డిసెంబర్ 6 న జరిగిన మారణకాండ, గోద్రా అల్లర్లో బలైన జీవితాలు ఈ దేశంలో ముస్లిం జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని, వారి జీవించే హక్కు, గౌరవించబడే హక్కు హరించబడుతున్న విధానాన్ని స్పష్టం చేస్తూనే, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పైన జరిగిన సామూహిక అత్యాచారంలో శిక్ష పడిన నిందితులను ఈ సంవత్సరం స్వాతంత్రదినోత్సవం నాడు విడుదల చేయడం, ఈ తీర్పుకి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేసిన బిల్కిస్ భానో పిటిషన్ ను కోర్టు కొట్టేయ్యడం కూడా  మతం పేరిట జరిగే మారణకాండల పట్ల బాధితులకు ఇంకా భయాన్ని, అభద్రతను పెంచుతూనే ఉన్నాయి.     

       బా రహమతుల్లా గారి బహెన్ కథాసంపుటిలో ముస్లింల జీవితాన్ని విభిన్న కోణాల్లో 12 కథల్లో స్పష్టం చేశారు. గుజరాత్ ఉదంతం తర్వాత ముస్లింల మానసిక స్థితి ఎలా మారిపోయిందో వంటి సామాజిక అంశాలతో పాటు, ముస్లిం కుటుంబాల్లో ఉండే కుటుంబ అనుబంధాలను, స్త్రీల పరిస్థితులను, విద్య లేక పేదరికంతో గడిపే స్థితి గతులను, అలాగే మత నమ్మకానికి జీవిత అనుభవానికి మధ్య సమన్వయం ఉండాలని, మతం మూఢ నమ్మకం కాకూడదని చెప్పే కథలను,మతాంతర వివాహాల వల్ల తలెత్తే ఇబ్బందులను ఈ కథల్లో స్పష్టం చేశారు. ఈ 12 కథల గురించి ప్రసిద్ధ సాహితీవేత్తలు అభిప్రాయాలను వ్యక్తం చేయడం సాహితీలోకంలో ఈ కథలకున్న విశిష్టతను స్పష్టం చేస్తుంది.

    ఈ కథల్లో  కుటుంబం పరిధికి లోబడేవి, సమాజాన్ని దర్శించేవి, స్త్రీ కేంద్రీతమైనవి, సామాజిక భయం నెలకొన్న సందర్భాన్ని చెప్పేవి ఉన్నాయి. ఈ కుటుంబ పరిధిలోనే సామాజిక సమస్యలను కూడా కొన్ని కథల్లో రచయిత వ్యక్తం చేశారు. బడోంకి ఈద్ (బహెన్), మా,బా, అమ్మీజాన్ కథలు ఈ రకానికి చెందినవి. బహెన్ కథ ఓ అన్న తన చెల్లెలి గురించి చెప్పే శైలిలో సాగుతుంది. పాతికేళ్లకే మరణించిన తన చెల్లెలి గురించి కథకుడు చెప్పే తీరులో ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్లల పట్ల ఉండే ప్రేమ, మత సంప్రదాయం పేరిట వారి విద్య-వివాహం విషయాల్లో వారికి స్వేచ్చ లేకపోవడం, వారి జీవితం గురించి ఆలోచించుకునే లోపే జీవితం వారికన్నా ముందే వేగంగా పయనిస్తూ ఉండటం వంటి అంశాలను పరోక్షంగా రచయిత ఈ కథలో స్పష్టం చేశారు. గుండెలో రంధ్రం వల్ల మరణిస్తానని ఆ అమ్మాయికి చనిపోయే సంవత్సరం ముందే తెలియడం,ఆమె తన బాధను ఎవరికి చెప్పుకోలేక, పసి బిడ్డను, భర్తను ఎప్పుడో ఓ సారి వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుందన్న విషయాన్ని జీర్ణించుకుని జీవించడం, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమెను సాంప్రదాయం పేరిట నవ్వవద్దని కట్టడి చేస్తే పాతికేళ్లకే మరణించి ఇంట్లో వారికి నవ్వు లేకుండా చేసి పోయిందని అని కథకుడు తన చెల్లెలి గురించి చెప్తూ రాయడం పాఠకులను కదిలిస్తుంది. ఈ కథలో అనుబంధం ఉంది. అమాయకత్వం ఉంది. రక్త సంబంధాల్లో మంచిని చూసే మనసు ఉంది. ఆ బంధం తెగిపోయినప్పుడు ఆ బంధాన్ని మర్చిపోలేక జ్ఞాపకాల్లో ఆ బంధాన్ని పునర్నిర్మించే బాధ కూడా ఈ కథలో ఉంది.

     మా కథలో అమ్మ మనసు గురించి చెప్పడానికే రచయిత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే బా కథలో తండ్రి వృత్తి, పిల్లలను చూసి ఎలా మురిసిపోయేవాడో అన్న అంశాలను ఎంతో సాధారణంగా రాసినా తల్లిదండ్రులు ఎలా పిల్లలకు ప్రత్యేక లోకం అవుతారో ఈ కథల్లో స్పష్టం అయిన భావన కలుగుతుంది. అమ్మకు కొడుకు ఉద్యోగంలో స్థిరపడి డబ్బులు సంపాదిస్తున్నా డబ్బు అవసరం లేదు. అదే డబ్బు లేక ఆమె కుటుంబాన్ని నెట్టుకొచ్చే రోజుల్లో ఇబ్బందులు పడినా ఆమెకు కావాల్సింది ఆ పిల్లలకు తానో ఏదో ఒకటి చేయడంలో, వారి సంతోషాన్ని చూడటంలో ఉంటుందని ఈ కథలో రచయిత చెప్తారు. బా కథలో తండ్రి బాడుగ బండి నడిపి కుటుంబాన్ని నడిపిన తీరు, పిల్లల చర్యల్లో సంతోషాన్ని వెతుక్కోవడం వంటి సున్నిత భోవోద్వేగాలను రచయిత ఎంతో చక్కగా చిత్రీకరించారు. అమ్మీజాన్ కథలో బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించిన కొడుకు ఆమెను పెళ్లి చేసుకుని, తర్వాత కుటుంబానికి దూరంగా ఉండటం, చుట్టూ ఉన్న సమాజం కోసం అతను హిందువుగా చలామణి కావడం, అయినా మనసులో ప్రేమలు అలానే నిలిచి ఉండటం గురించి రచయిత చక్కగా రాశారు. ఈ కథల్లో ముస్లిం కుటుంబాల్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగం, మధ్యతరగతి ముస్లిం కుటుంబాల్లో ఉండే పరిస్థితులు, ఆ నేపథ్యపు వాతావరణంలో ఇమిడిపోవడం గురించి కూడా రాశారు. బుచ్చి గాని బాగోతం కథలో అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న కొడుకు గురించి, అతని అనారోగ్యం గురించి తల్లి పడే తపన, వాచ్ మెన్ ఉద్యోగంలో ఉండే కష్టానష్టాల గురించి, దేవుడు మీద నమ్మకం ఒక ఉపశమనమే తప్ప నిజమైన పరిష్కారం కాకపోవచ్చన్న సూచనతో ముగించారు.

         ముస్లిం స్త్రీల నేపథ్యంతో రాసిన కథలు కైసరున్నిసా బేగమ్’, నర్గిస్. కైసరూన్నిసా బేగమ్ కథలో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో ముస్లింల పై జరిగిన అత్యాచారాల్లో ఓ కోణం ముస్లిం స్త్రీలపై జరిగిన లైంగిక అత్యాచార కోణంలో రాసిన కథ. కైసరున్నిసా పై దుండగులు చేసిన అత్యాచారం నుండి ఆమె తేరుకున్న క్రమం, ఆమె సమాజ సేవికగా మారి, తన మనసులో ఉన్న భయాలను క్రమక్రమంగా ఆమె దూరం చేసుకుని తనకు నచ్చి తన మార్గంలో నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుందామని అనుకుంటున్న సందర్భంలో ట్రెయిన్ దాడి జరగడం ముగింపుగా సూచిస్తారు రచయిత. ముస్లింలు సామాజిక హత్యాకాండను మర్చిపోయి భయాన్ని వీడి మామూలు మనుషులు అయ్యే సరికి ఇంకో సామాజిక కల్లోలం వారి జీవితాలను అతలాకుతలం చేస్తుందన్న స్పృహ ఈ కథలో ఉంది.

      నర్గిస్ కథలో అప్పటివరకూ ముస్లిం విశ్వాసాలతో పెరిగి, అలాగే వైవాహిక జీవితంలో ఇమిడిపోయాక, భర్త మరణిస్తే ఒక్కసారిగా తన మనస్తత్వంలో దాగున్న అనేక భయాలను వీడలేనితనంలో ఆమె ఉద్యోగ జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందులను స్పష్టం చేశారు. స్త్రీకి స్వయంగా పరిస్థితులు తారు మారైనప్పుడు నిబ్బరంగా గడిపే మనస్తత్వం సాంప్రదాయ ముస్లిం స్త్రీ జీవితంలో ఉందన్న వేధన ఈ కథలో ఉంది.

        చాంద్ కి ఈద్ ఒక భిన్నమైన కథ. ఈ కథలో ఓ కుటుంబ నేపథ్యం, సామాజిక నేపథ్యం రెండింటి ఆవరణ ఉన్నది. ఈ కథలో కథకుడికి పాత్రను రచయిత విశిష్టంగా చిత్రించారు. కథకుడికి ఇస్లాంను మతంగా చూసే దృక్కోణం లేదు. ముస్లిం సాంప్రదాయాలను తన జీవితంలో శ్రద్ధగా పాటించింది లేదు. తన కొడుక్కి మతాన్ని గుడ్డిగా మూఢత్వంగా మార్చుకునే భావజాలం అలవడకూడదని, ఆ కొడుక్కి  ఇస్లాంను పాటించడంలో  తనకంటూ వ్యక్తిగత  సామర్ధ్యం ఏర్పడాలని చేసే ప్రయత్నాలను రంజాన్ మాసంలో చేయడమే ఈ కథ ముఖ్య అంశం.రచయిత ముస్లిం వర్గానికి చెందిన ఆ నేపథ్యంలో ఉన్న విభిన్న దృక్పథాలను, పరిస్థితులను చిత్రీకరించారే తప్ప,మతాధారమైన నమ్మకాలు, వ్యక్తి స్వేచ్చకు సంబంధించిన అంశాలన్న విషయాన్ని కూడా అంతే సూటిగా ఈ కథలో స్పష్టం చేశారు. అలాగే ముస్లింలలో ఉండే పేదరికం వల్ల ఈ మాసంలో ఏర్పాటు చేసే విందులలో కడుపు నింపుకునే ఆకలి తీరని నిర్భాగ్యుల స్థితిని కూడా ఈ కథకు ఇంకో కోణంగా రచయిత చిత్రించారు.

     ప్యార్ మీర్జా మహేశ్వరికా కథలో మత విశ్వాసాలు, ఆచారాలు వ్యక్తి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయే తప్ప, సాధారణ మానవుల కష్టాలు తీర్చే శక్తి వాటికి ఉంటుందని అనుకోలేమన్న దృక్కోణాన్ని స్పష్టం చేశారు. ముస్లింలను సమాజంలోని ఇతర వర్గాల వారు సామాజికంగా వెలి వేసినట్టు ప్రవర్తించిన తీరు తలెత్తిన సందర్భాన్ని స్పష్టం చేసే కథ కిరాయి మకాన్. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముస్లింలను సమాజంలో అనుమానంగా చూడటం,వారిని దూరం పెట్టడం ఎలా వారికి ఇతర మతాల వారితో సమరస్యంగా ప్రక్కన పెడితే సాధారణ మనుషులగా మసలే అవకాశం లేకుండా చేసిందో స్పష్టం చేసే కథ ఇది. అద్దె ఇల్లు దొరకక, అక్కడ నిరసనను భరించలేక ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకున్న కథకుడికి ధైర్యాన్ని ఇవ్వడంతో కథ ముగుస్తుంది.

    బోర్డర్స్ కథలో ముస్లింలలో పెరిగిపోయిన అభద్రత,భయం వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్న తీరును,ఆ భయాలను ఎంతో స్పష్టంగా విభిన్న పద్ధతిలో అక్షరీకరించి రచయిత స్పష్టం చేశారు. అఫ్జల్ బిచారా కథలో ముస్లిం కుటుంబాల్లో ఉండే పేదరికం వల్ల కుటుంబ జీవితం ఎంత నరకం అవుతుందో,కనీస వసతులు లేక ఇబ్బందులు పడే స్థితిని ఎంతో చక్కగా సహజంగా చిత్రీకరించారు రచయిత.

     ముస్లింల జీవితం గురించి, వారి మనసుల్లో ఉండే భయాల గురించి, వారి సున్నిత మనసుల గురించి భారతీయ సమాజం ఇంకా తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను ఇటువంటి పుస్తకాలు స్పష్టం చేస్తాయి. వారి కోణం నుండి సమాజం కొంత వారి జీవితాలను, నేపథ్యాలను అర్ధం చేసుకునే సామాజిక ఆవరణ ఉంటేనే, మత కల్లోలాల పేరిట మనిషిని మనిషి బాధించుకునే సంస్కృతి సన్నగిల్లుతుంది. నేటి ముస్లింల స్థితిని గురించి  డిసెంబర్ 18 ‘జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం’ సందర్భంగా యం.డి. ఉస్మాన్ ఖాన్ గారు ముస్లింల పరిస్థితి దేశంలో ఎలా ఉన్నదో అన్న అంశాన్ని సామాజిక,రాజకీయ కోణాల్లో విశ్లేషిస్తూ ‘పోరాటాలతోనే మైనారిటీలకు హక్కులు’ అనే వ్యాసం రాశారు.

            “దేశ జనాభాలో సుమారు 30 కోట్ల వరకూ ముస్లిం జనాభా ఉంది. వీరిలో 60 శాతం మంది నేటికీ దారిద్ర్యరేఖ దిగువన దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం విద్యా లేమి. 2001లో ముస్లింలలో నిరక్షరాస్యత 42.5 శాతం ఉంటే అది ఇప్పుడు 42.7 శాతం ఉంది. అంటే రెండు దశాబ్దాల తరువాత కేవలం 0.2 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది. పాఠశాలకు వెళ్ళి మధ్యలో బడి మానేస్తున్న పిల్లల జాబితాలో కూడా ముస్లింల పిల్లలే అధికంగా ఉంటున్నారు. వారు తమ పిల్లలను చదివించుకోలేక పోవడానికి ఆర్థిక వెనుకబాటు మరో కారణం. ఏదో ఒక రకంగా అష్టకష్టాలు పడి ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దొరకడం అంత సులభం కాదు. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా వారికి ఉద్యోగాలు లభించవు. కొన్ని విభాగాలు అనధికారికంగా ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వరాదన్న విధానాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ల్లో మూడు శాతం, ఐఎఫ్ఎస్ల్లో 1.8 శాతం, ఐపిఎస్ల్లో నాలుగు శాతం, రైల్వేలలో 4.5 శాతం, పోలీస్ శాఖలో ఆరు శాతం, ఆరోగ్య శాఖలో నాలుగు శాతం, రవాణా శాఖలో 6.5 శాతం, న్యాయ శాఖలో 7.8 శాతం మాత్రమే ముస్లింలకు ప్రాతినిధ్యం ఉంది.ఇక రాజకీయ ప్రాతినిధ్యానికొస్తే 245 మంది రాజ్యసభ సభ్యులకు 24 మంది, 545 మంది లోక్సభ సభ్యులకు కేవలం 27 మంది మాత్రమే ముస్లిం మైనారిటీలున్నారు. దేశం మొత్తం మీద 4 వేల పైచిలుకు శాసనసభ్యులుంటే, కనీసం 4 వందల మంది కూడా ముస్లిం శాసనసభ్యులు లేరు. సుమారు పదిహేను రాష్ట్రాల శాసనసభల్లో కూడా ముస్లింల ప్రాతినిధ్యం లేదు”, అని ఆ వ్యాసంలో రచయిత పేర్కొన్నారు.

        సమాజంలో భిన్న మతాల ప్రజలు ఉన్నప్పుడూ ప్రజాస్వామ్యంలో వారి జీవితాలకు,అస్థిత్వాలకు ఒకే రకమైన భరోసా,ఆత్మస్థైర్యం,జీవించే హక్కులు నిలబడేలా చూడటం తమ కర్తవ్యంగా భావించే సమాజ సంస్కృతి వెళ్లివిరిసినప్పుడే మతసామారస్యానికి సరైన అర్ధం ఉంటుంది. ఈ సందర్భంగా తన కథల ద్వారా ముస్లిం జీవిత చిత్రాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించిన రచయిత బా రహమతుల్లా గారికి అభినందనలు.

   *               *          *     

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

చరిత్ర మరువకూడని వీరుడు!

జీవితమే అనుభూతుల విందు!