'వ్యాపార బంధాలు' నవలా సమీక్ష

                                                అవసరాల లోకంలో!  

                                                                 -శృంగవరపు రచన


                 

         నిషి బ్రతకడానికి డబ్బు అవసరం. డబ్బు లేకుండా ఏ పని జరుగదు. కానీ మనిషి ఆ అవసరం విషయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడానికి సంకోచించడం ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. దానికి ముఖ్య కారణం డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవన్న భావన సమాజంలో ధృఢపడిపోవడం వల్ల. డబ్బు అవసరాల వరకు పరిమితమైతే దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు కానీ అది మనిషి నైతికతను,విలువలను, స్వధర్మాన్ని ప్రభావితం చేయగల సాధనంగా మారడం వల్ల డబ్బును ఏ అంశంతో ముడిపెట్టకూడదు అన్న భావజాలం ఉత్తమ మనిషిలో ఉంటుందనే నమ్మకం బలపడిపోయింది. పైకి డబ్బు గురించి చెప్పకపోయినా డబ్బు వల్ల భద్రత, అనుబంధాల సవ్యత ఉండటం కూడా గమనించవచ్చు. కానీ దానిని ఆర్థిక సంబంధంగా కాకుండా మనిషికి ఉండే స్వభావ మంచితనం వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయని అనుకోవడంలో మనిషికి తన చుట్టూ ఉన్న మనుషులు-సమాజం మీద నమ్మకం బలపడుతుంది. ఆ నమ్మకం వల్లే మనిషి తనలో ఉండే ఒంటరితనపు భయాన్ని కొంతవరకు మర్చిపోగలుగుతున్నాడు.కానీ ఆ భయం చెలరేగినప్పుడు, తానే ఆ సమాజపు నమ్మకాన్ని డబ్బుతో కొనుక్కోగలనని అనుకున్నప్పుడూ అది ప్రత్యక్ష వ్యాపార బంధంగా కనిపిస్తుంది.డబ్బు మనుషుల జీవితాన్ని వ్యాపార దృక్కోణంలో చూసేలా చేస్తుందా అన్న అంశాన్ని వివినమూర్తి గారి కొత్తగా వ్యాపార బంధాలు నవలలో స్పష్టం చేశారు. ఈ నవలలో ముఖ్య అంశం డబ్బు కేంద్రీత మానవ ఆలోచనలను, అంతకు మించి మనిషి స్వభావంలోని మంచితనం కూడా ఆ డబ్బును అధిగమించే అవకాశం ఉన్న మానవ హృదయాలను గురించి చెప్పడమే అయినా, దీనిని స్త్రీ వాద నవలగా కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ నవలా నాయకురాలు దుర్గ జీవితమే రచయిత చెప్పాలనుకున్న అంశాలకు ఊతంగా ఉంది కనుక.

        ఈ నవలలో ముఖ్య పాత్ర దుర్గ. ఆమె తండ్రి రమణయ్య,తల్లి అన్నపూర్ణ. ఆమెకు ఓ చెల్లెలు లలిత. వీరిది మధ్య తరగతి కుటుంబం. ఇంట్లో రమణయ్యతో పాటు దుర్గ కూడా టీచర్ గా పని చేస్తూ సంపాదిస్తుంది. దుర్గ మాధవరావుని ప్రేమించడం వల్ల గర్భవతి అవుతుంది. తన తండ్రికి విషయం చెప్పి మాధవరావు తండ్రితో మాట్లాడి రమ్మని పంపిస్తుంది.అప్పటి వరకు మాధవరావు మీద ఎటువంటి అనుమానం ఆమెకు కలుగలేదు. రమణయ్య మాధవరావు తండ్రి నూకరాజు ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో నూకరాజు మాధవరావు తన నుండి వచ్చే ఆస్తి,కట్నంగా వచ్చే డబ్బును వదులుకుని దుర్గను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడని, అతనికి అప్పటికే ఇంకో అమ్మాయితో వివాహం నిశ్చయమైందని,ఎవరికి దుర్గ విషయం చెప్పలేదని చెప్తాడు. నవల ఆరంభంలో నూకరాజు పాత్ర రమణయ్యతో వ్యాపార బంధాలే మానవుల మధ్య ఉన్నాయన్న భావనను స్పష్టం చేస్తాడు. నూకరాజు మాటలు రమణయ్యను కూడా ప్రభావితం చేస్తాయి. ఇంటికి వచ్చి అదే భావనను వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత మాధవరావు ఐదు వేల రూపాయలు ఇవ్వడం రమణయ్య జీర్ణించుకోలేకపోయినా, దుర్గ ఆ డబ్బు తీసుకుని, మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలే అన్న అంశాన్ని తను ఎంతగా నమ్ముతుందో స్పష్టం చేస్తుంది. అప్పటి నుండి దుర్గ దృష్టిలో ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ తన నుండి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ది పొందాలనే తనతో ఉంటున్నారన్న ఆలోచనతో తన జీవితంలోని వ్యక్తులతో వ్యవహరిస్తూ ఉంటుంది.

        ఈ నవలలో దుర్గ మనుషులు-డబ్బు పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలూ ఓ కోణమైతే, ఆమెకు తారసపడే జీవితాలు ఇంకో కోణం. ఆమెకు తారసపడిన వారెవరూ కూడా ఆమెలా ప్రత్యక్షంగా బలంగా ఈ కోణాన్ని సమర్ధించిన వారు లేరు. మధ్యతరగతి తల్లి మనస్తత్వానికి ప్రతీక అయిన అన్నపూర్ణ తన కూతురిని తమ్ముడితో వివాహం చేస్తే ఎలాగోలా ఈ సమస్య నుండి గట్టెక్కుతుందని అనుకుంటుంది. సుందర్రావు ఉద్యోగ రీత్యా ఆమె కన్నా తక్కువలో ఉండటం వల్ల అప్పటి వరకు ఆ విషయం ఆలోచించకుండా అప్పుడే అది బయటపెట్టడం,తల్లి ఈ వివాహానికి డబ్బు కూడా ఇస్తాననడంతో దుర్గ ఈ బంధాలను మరోసారి వ్యాపార బంధాలుగా తేల్చేసి, ఆ సంబంధాన్ని వదులుకుంటుంది. తర్వాత సుందర్రావు ఆమె చెల్లెలు లలితను వివాహం చేసుకుంటాడు. దుర్గ గర్భస్రావం చేయించుకుని, కుటుంబంతో సంబంధాలు తెగతెంపులు చేసుకుని విడిగా ఉంటుంది. వృత్తిలో పదోన్నతి కూడా సాధిస్తుంది.

         ఆమె జీవితంలోకి తర్వాత వచ్చిన వ్యక్తి గిరి. ఇతనికి వివాహమయ్యింది. ఇతనిది ఆదర్శ భావ లోకం. కమ్యూనిజం ఆలోచనల ద్వారా ప్రపంచాన్ని మార్చాలని, దానికి దుర్గ లాంటి వారు ఉపయోగపడతారని అతను అనుకుంటాడు. ఆమె మీద అతనికి ఆ విషయంలో పట్ల ఇంకో ఆసక్తి లేకపోయినా అతని మీద ఆశ పెంచుకున్న దుర్గ అతని వల్ల ఆ సాహిత్యం వైపు మళ్ళినా, అతనికి వివాహమయ్యిందని తెలియడం వల్ల, గిరి భార్య తండ్రి ఆమెను ఇంటికి వచ్చి అవమానించడం వల్ల ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ఆమెను కాపాడిన వ్యక్తి కృష్ణారావు. మానసిక స్వస్థతను కోల్పోయిన దుర్గ, మరలా కోలుకుని  కృష్ణారావును ఒప్పించి వివాహం చేసుకుంటుంది.

      మొదట తన కష్టంలో ఆదుకున్న వ్యక్తిగా అతన్ని నమ్మిన దుర్గ, అతని కుటుంబ వాతావరణం-అలవాట్లలో ఇమడలేకపోయినా కృష్ణారావును వదలలేక అతనితోనే ఉండిపోతుంది. అతను కార్మిక నాయకుడు. అతని సంతోషం కోసం అతని భావజాలాన్ని సమర్ధించి, తన డబ్బు వల్లే అతని ప్రేమను కొనుక్కుంటున్న భావనలో ఉంటుంది. చివరకు ఆమె గర్భవతి అయ్యి ప్రసవించే సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమె మీద నిజమైన ప్రేమతో వచ్చినా, దానిని మొదట్లో నమ్మకపోయినా తనకు బిడ్డ పుట్టాక, పుట్టిన బిడ్డ ఏం ఆశించి తనకే పుట్టాడు?తను ఏమి ఆశించి అతన్ని ప్రేమిస్తుంది? వంటి అనేక అంశాలు ఆలోచించడం వల్ల ఆమెకు మానవ సంబంధాలు ఇంకా వ్యాపారంగా మారని మానవత్వం ఇంకా నిలబడే ఉందని దుర్గ నమ్మడంతో ఈ నవల ముగుస్తుంది.

       మధ్యతరగతి జీవితాల్లో ఒకరూ సంపాదిస్తే మిగిలిన కుటుంబ సభ్యులు దాని ఆధారంగానే జీవిస్తారు. ఇక్కడ ఆ కుటుంబ పెద్ద వారిని పోషించడం తన బాధ్యత అనుకుంటాడే తప్ప దానిని ఓ వ్యాపారంగా భావించలేడు.దానికి తన ప్రేమకు చిహ్నంగా భావిస్తాడు.అక్కడ డబ్బు అవసరాలకు సాధనంగానే భావించబడుతుంది తప్ప మనుషుల మధ్య ఉండే ప్రేమానుబంధాలకు ప్రతీకగా మాత్రం కాదు. కానీ డబ్బు లేక జీవితాలు ఉక్కిరిబిక్కిరై మనిషి తనకు కావాల్సినవి కోల్పోయినప్పుడు, మనుషుల మీద నమ్మకం కోల్పోయినప్పుడు, మనుషుల కన్నా డబ్బే ముఖ్యమైనదని భావిస్తాడు. ఆ భావన ఏర్పడినాక ఆ మనిషి దృష్టిలో మార్పు రావడం తప్పేం కాదు కూడా.ఆ డబ్బును పరోక్ష సహకారిగా వాడగలిగితేనే డబ్బు ఆధారితమైన మానవ బంధాలు కూడా నిలబడతాయి అన్న లౌక్యం లేకపోతే ఆ డబ్బు ఉన్న ప్రయోజనం కూడా శూన్యమౌతుంది అని స్పష్టం చేసే  నవల ఇది. మానవుడిలో మంచితనం అన్నది డబ్బు వల్ల ప్రభావితం కాదని స్పష్టం చేసే పాత్ర మాధవరావు తండ్రి నూకరాజుది.

      నూకరాజుకి తనదైన ఓ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని ఎవరి మీద రుద్దే స్వభావం అతనికి లేడు. వ్యక్తి తనదైన ధర్మంతో తను నడవాలని నమ్మేవాడు.తన కొడుకు మాధవరావు దుర్గ పట్ల వ్యవహరించిన తీరును అతను వ్యక్తిగతంగా సమర్ధించకపోయినా, అతను చేసింది తప్పు అని నమ్మినా తనంటే కొడుక్కి ఉన్న భయంతో ఆ తప్పును సరి చేయాలని అనుకోలేదు.మాధవరావుగా వ్యక్తిగా తన ధర్మం కలిగి ఉండాలని అనుకుని అతని జీవిత నిర్ణయ స్వేచ్చను అతనికే వదిలేశాడు. కానీ అతన్ని తన ఆస్తికి మాత్రమే వారసుడిగా భావించి, తన ధర్మానికి మాత్రం వారసుడు కాదని నమ్మి అతనితో మాట్లాడటం మానెయ్యడమే కాకుండా అతనిలో ఆ లోపించిన ధర్మానికి శిక్షగా తనకు తలకొరివి పెట్టే బాధ్యత అతనికి దక్కకుండా చేస్తాడు.

     నూకరాజు పాత్ర ద్వారా రచయిత ఇంకో కొత్త కోణాన్ని పాఠకులకు చెప్పే ప్రయత్నం చేశారు. వ్యక్తిగా ఇంకో వ్యక్తి అభిప్రాయాలను గౌరవించడం ఎంత ముఖ్యమో, అలాగే తనకు విరుద్ధంగా ఉన్న అంశాల్లో ఆ మనిషిని దూరంగా ఉంచడం కూడా అంతే ముఖ్యమైన విషయం.ఒక దాని కోసం ఇంకోదాన్ని భరించే సగటు మానవ దృక్కోణం నుండి విడిపడిన పాత్ర ఇది. నాకు వ్యక్తిగతంగా నచ్చిన పాత్ర ఇది. దుర్గను కొంత ప్రభావితం చేసి, మనుషుల మీద నమ్మకం ఏర్పరచిన పాత్ర ఇది.

        దుర్గ జీవితంలో ఉన్న మిగిలిన పాత్రలన్నీ కూడా అవసరాల కోసం డబ్బు మీద ఆధారపడ్డవే కానీ డబ్బే తమ జీవితంలోని వ్యక్తులతో బంధాలను నడుపుతున్నాయని నమ్మినవి కావు. డబ్బును మనుషులతో ముడిపెట్టకుండా, దాని స్థానాన్ని మనుషుల తర్వాత ఉంచడం కూడా జీవించడంలో మనిషి అలవర్చుకోవాల్సిన ఓ కళ అని స్పష్టం చేసే నవల ఇది. 1986 లో వచ్చిన ఈ నవల నేటికి తన సమకాలీనతను కోల్పోలేదు. మనిషి –డబ్బు ఈ సమాజం ఉన్నంత కాలం ఈ నవల సజీవంగానే ఉంటుంది. ఆలోచింపజేసే నవల రాసిన వివినమూర్తి గారికి ఈ సందర్భంగా అభినందనలు.

  *        *        *

        

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

చరిత్ర మరువకూడని వీరుడు!

జీవితమే అనుభూతుల విందు!